Tuesday, June 2, 2026

 రచన: లక్ష్మి చివుకుల 

కథ పేరు! *పనిమనిషి* 

బాల్కనీలో అంట్లు వేసి వాటిలో నీళ్లు పోసి  వుంచింది భారతి. ఈరోజు గిన్నెలు చాలా వున్నాయి. పనిమనిషి ఎప్పుడూ వస్తుందో ? అసలు వస్తుందో ? రాదో ? రాకపోతే నా పని వుంటుంది ఎంత నీరసంగా వున్నా ఈ గిన్నెలు తోముకోక తప్పదు. అయినా రోజూ ఇన్ని గిన్నెలు వుండవు. ఏదో బంధువులు భోజనానికి వచ్చారు కాబట్టి ఈరోజు గిన్నెలు ఎక్కువ పడ్డాయి.

పనిమనిషి ఏమంటుందో ? ఏమైనా గొడవ చేస్తుందా ? మొన్ననే కదా తనకి చీర కొని ఇచ్చాను. ఆ చీర చూసి ముఖం చాటంత అయింది. అంతగా ఏమైనా అంటే ఒక 50 రూపాయలు ఆయనకు తెలియకుండా ఇవ్వచ్చులే. మనసులోనే ఆలోచిస్తూ పనిమనిషి రాక కోసం ఎదురు చూస్తూ వుంది భారతి.

*దేముడు వరమందిస్తే నేనూ నిన్నే కోరుకుంటానూ* అని చిన్నగా పాడుకుంటోంది భారతి.
 
"నన్నేనా కోరుకునేది" అప్పుడే బయట నుంచి వచ్చిన గుర్నాధం అన్నాడు.

"మిమ్మల్ని కాదు పనిమనిషిని" నవ్వుతూ సమాధానం చెప్పింది భర్తకి.

చాలా అన్యాయం భారతీ ఉడుక్కుంటూ అన్నాడు గుర్నాధం. 

*ప్రస్తుతానికైతే పనిమనిషే*

భారతీ! బాల్కనీ అంతా అంట్ల గిన్నెలు పరిచేసావు. పనిమనిషి అలా చూసింది అంటే కళ్లు తిరిగి పడిపోతుంది. రేపటి నుంచి జీతం పెంచమని అడిగినా అడుగుతుంది. గిన్నెలు అన్నీ ఒకదానిలో ఒకటి వేయొచ్చు కదా ! చూడగానే తక్కువగా కనిపిస్తాయి. గిన్నెలో గిన్నెలు గ్లాసులో గ్లాసులు ప్లేట్ లో ప్లేటులు పెట్టి వేస్తే అంతగా కనిపించవు మనం కూడా చిన్న చిన్న టెక్నిక్ లు నేర్చుకోవాలి అంటూ భార్యకు క్లాస్ లాగి ఆ పనే తనే చేసాడు గుర్నాధం. చూడగానే అంట్లు తక్కువగా కనిపించేలా సర్ది పెట్టాడు.

భారతి అదృష్టం బావుండి ఆరోజు పనిమనిషి వచ్చి తోమిన గిన్నెలు అన్నీ నాలుగు టబ్ ల నిండా గిన్నెలు నింపి ఒకదాని మీద ఒకటి  ముందుగా పెద్ద గిన్నె బోర్లించి దాని మీద ఇంకో గిన్నె బోర్లించి, గిన్నెలో గిన్నె వేయకుండా, అలా నాలుగు టబ్ ల నిండా తోమిన సామాను నింపేసి తెచ్చింది.

గిన్నెలో గిన్నె వేసి అంట్లు తక్కువ వున్నాయని గుర్నాధం నిరూపిస్తే, గిన్నె పైన గిన్నె బోర్లించి పెట్టి  గిన్నెలు ఎక్కువ వున్నాయని పనిమనిషి నిరూపించింది. ఎవరూ తక్కువ తినలేదు. మనకంటే పనిమనిషి నాలుగాకులు ఎక్కువే చదివింది.

తాటిని తన్నేవాడు ఒకడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు వుంటాడు అని సామెత గుర్తుకు వచ్చి నవ్వుకుంది భారతి. 

ఒక ఇల్లాలికి అమ్మవారు ప్రత్యక్షం అయి ఏమైనా వరం కోరుకో అన్నారుట. పనిమనిషి నాగాలు పెట్టకుండా రోజూ పనికి రావాలి అని కోరుకుందిట ఆ ఇల్లాలు. సరేనని వరం ఇచ్చి (పాపం పిచ్చిది  తన కోసం ఏమీ వరం కోరుకోలేదు అని జాలిపడి) ఇంకో వరం కోరుకో మన్నారుట. పనిమనిషికి ఇచ్చిన గిన్నెలు తిరిగి తెచ్చి ఇస్తూ వుండాలి అని కోరుకుందిట ఆ ఇల్లాలు. 
🤣🤣

గరికపాటి నరసింహారావు గారి ప్రసంగంలో విన్నాను. 

                    ##----------##

No comments:

Post a Comment