Tuesday, June 2, 2026

 మహాభారతంలో శ్రీకృష్ణుడు చేసిన వ్యూహాలు “ధర్మార్ధం” న్యాయమైనవా? ఉపాయాలు ఉపయోగించి న్యాయం సాధించడం సమంజసమా?
భారతం *ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని * కీర్తిస్తారని వ్యాసమహర్షి, నన్నయభట్టూ చెప్పారు.

శ్రీ కృష్ణుడైతే ధార్తరాష్ట్రులు వాళ్ళు చేసిన పాపిష్టిపనులకు *వారెల్లరు సర్వులకు వధ్యులు* అని స్పష్టంగా చెప్పాడు.

ఇళ్ళకు నిప్పంటించడం, సర్వస్వహరణమూ, అందరికీ స్పష్టంగా తెలిసిన సత్యం — 23 సంవత్సరాలు ఏలిన రాజ్యం ఒప్పందం నెరవేర్చివచ్చినపుడు తిరిగి ఇచ్చివేయకపోవడం , పెద్దల హితైషుల మాట పెడచెవినిబెట్టడం— ఇన్ని దోషాలున్నవాళ్లను బాధితుడు తన హక్కుగా దండించడమే స్వధర్మం ఔతుంది. యుద్ధంచేసి చంపనవసరం లేదు అని కృష్ణుడి అభిప్రాయం.

కపటజూదంలో ఓడగొట్టి అడవులపాలు చేసిన కొద్దిరోజులకే శ్రీకృష్ణుడు అడవులకు వచ్చి " ఇపుడే నేను దాడిచేసి ధర్మజుణ్ణి యథాస్థానంలో నిలుపుతాను"— అని కౌరవులపై మండిపడ్తాడు. అర్జునుడు" అయినది అయినది. ఈ 13 ఏళ్ళ గడువు తర్వాత అట్లే చేద్దువులే " అంటాడు.

13 ఏళ్ళ గడువు తీరగానే పిలిచి వాళ్ళరాజ్యం ఇచ్చివేయడం రాజు బాధ్యత. *నీతిపథంబునన్ బ్రతుకనేర్చుట ఉత్తమభంగి * అని విదురుడు చెప్తూనే ఉన్నాడు. అది చెవికెక్కడం లేదు ఆ రాజుగారికి.

ఐనా, సామ దాన భేద ఉపాయాలు విఫలమయిన తర్వాతే దండం పట్టించాడు కృష్ణుడు.

పాశుపతం సంపాదించిన అర్జునుడున్నా "ఐదూళ్ళైనా ఇచ్చి మమ్మల్ని 'రాజులు' గా బతికిపోనీయండి" — అని బంధుక్షేమం కోరి, దీనదశపట్టి ధర్మరాజు దిగివచ్చినా అది అలుసైపోయింది కౌరవులకు.

" ఈ కృష్ణుణ్ణి కట్టేస్తే పనైపోతుంది. పాండవులు రెక్కలు విరిగిన పక్షులైపోతారు" —అని కుతంత్రాలే కడవరకూ చేస్తున్నవాళ్లను చంపడానికి ధర్మశాస్త్రం చూడబనిలేదు— అని కృష్ణుడి అభిప్రాయం .

ఐనా, రణరంగంలో కురుక్షేత్రంలో వీరులుగా పోతే వాళ్లకూ వీరస్వర్గం లభిస్తుంది— అని దయదలచాడు.

తమ పక్షంలో విధిలేక ఉంటూఉన్న భీష్మ బాహ్లిక సోమదత్తాది కులబంధువులనూ తమ అన్యాయపు ఆశకు బలిపెడుతూన్న కౌరవులను ధర్మం తప్పకుండా వధించాలి అని అనుకోవడమే అధర్మం ఔతుంది..

తనను నమ్మిన వాళ్లను , ఆశ్రయించినవాళ్లను సర్వవిధాలా కాపాడడం తన విధి —అని ఆర్తరక్షాదీక్షితుడైన కృష్ణుడు భావించాడు.

భీష్ముడు , ద్రోణుడు తనకు ఉపకారం చేసేవాళ్ళు కాదు అనీ, వాళ్ళు అనుకొంటే పాండవులను చంపివేయగలరు అనీ దుర్యోధనుడి అభిప్రాయం.

భీష్ముడేమో" అర్జునుడు విలువిద్యలలో నా కంటే మేటి." పాండవులను చంపడానికి నాకు చెయ్యి రాదు. వాళ్ళూ నా పట్ల అట్లే ఉంటారు— అని సభామధ్యంలోనే వ్యక్తం చేశాడు.

భీముడు దుర్యోధనుణ్ణి వధించిన ఘట్టంలో శ్రీ కృష్ణుడు అక్కడే ఉండి ధర్మరాజును " గెలిస్తే మూర్ధాభిషిక్తుడు కాదగిన ఇతణ్ణి శిరస్తాడనం చేశాడు భీముడు. ఏ శిక్ష విధిస్తావు? "—అని గూడా అడిగాడు." ప్రథమదోషం గాబట్టి క్షమించాను " అని ధర్మరాజు సమాధానం.

అధర్మంగా లభించే ఇంద్రపదవైనా ధర్మరాజు కోరడు అంటారు కౌరవుల కులపెద్దలు .

వాళ్ల శాపాల అధార్మిక కర్మల ప్రాబల్యం వాళ్లను చంపింది. మంచికి మంచి వచ్చినట్లే చెడుకు చెడూ వెన్నంటి ఉంటుంది.

పాండవుల ధర్మబుద్ధికి సంతోషించి వాళ్ళే తమను తప్పించే ఉపాయాలు చెప్పి తప్పుకొని ధర్మరక్షణకు తామూ సహకరించామనే సంతృప్తి చెందారు.

ధర్మరాజు గూడా చివరి యుద్ధంలోనూ తమ ఐదుమందిలో నీకిష్టమైన ఒక్కడిని ఎన్నుకొని యుద్ధం చేయడం సముచితం అని చెప్పినవాడు . ధర్మం తప్పి అధికారం కైవసం చేసుకోదలచినవాడు కాదు.

ధృతరాష్ట్రుడి సందేహానికి సమాధానంగా కృష్ణుడు " అంతా ధర్మబద్ధంగా జరిగింది.. నీ వాళ్ళకు అందరికీ సద్గతి కలిగింది అని చెప్పాడు కృష్ణుడు.

అది ద్వాపరయుగాంతం. పాపభారం అధికం ధర్మవేత్తలైన భీష్మ ద్రోణ కృపులూ ఉప్పుతిన్న పాపానికి ధర్మవిరోధియైన పక్షం అవలంబింపవలసిన విపరీతపరిస్థితి.

భీష్ముడి పరాక్రమం అసమానం.. తాత, పెంచినవాడు అని తెగవేయను చేయాడని స్థితిలో అర్జునుడు .

రథిని సారథి, సారథిని రథికుడు పరస్పరం రక్షించుకొంటూ ముందుకు సాగడం యుద్ధ ధర్మం. అందుచేత అర్జునుడిలో ఆవేశం కలిగించడం కోసం కృష్ణుడు చక్రం పట్టాడు. ఇది వీరులెవరూ ఆక్షేపించలేదు. పాండవులే తాతగారిని " నిన్ను రణరంగం నుండి తప్పించే ఉపాయం చెప్పు " అని వేడుకొన్నారు. యతో ధర్మః తతో జయః అని కన్నకొడుకుతోనే అన్నది తల్లి గాంధారి. అదే జరిగింది గదా —అని అనునయించారు వేదవ్యాసుడూ శ్రీ కృష్ణుడూ.

పెద్దవాళ్లు ఆచరించినదే ఉత్తమ ధర్మం. ధర్మం ఎప్పుడూ దేశ కాలాలను బట్టి అన్వయించుకోవలసినది. పెద్దల నడకే ఎప్పుడూ శిరోధార్యమైన ధర్మం .

No comments:

Post a Comment