ద్వి తత్వాలు
(మృతత్వం, అమృతత్వం)
మనిషికి రెండు రకాల కోరికలుంటాయి. ‘నాకు కావాలి’ అనుకునే కోరికలు ఒక రకమైతే, ‘నాకు వద్దు’ అనుకునే కోరికలు రెండవ రకం.
‘కావాలి’ అనుకునే కోరికలు
కొందరు ఆస్తులు కావాలి అని కోరుకుంటారు, కొందరు పిల్లలు కావాలి అని కోరుకుంటారు. కొందరు అధికారం కావాలి అని కోరుకుంటారు. కానీ ప్రపంచంలో ప్రతి వాడు నాకు కావాలి అని కోరుకునే కోరిక ఒకటుంది. అది ‘ఆనందం’
‘వద్దు’ అనుకునే కోరికలు
కొందరు పెళ్లి వద్దనుకుంటారు.కొందరు పిల్లలు వద్దు అనుకుంటారు. కొందరు విలసాలు వద్దు అనుకుంటారు.
కానీ విశ్వంలో అందరూ వద్దు అని కోరుకునే కోరిక ఒకటుంది . ఆది ‘మరణం’
మరణాన్ని తప్పించు కోవడానికి, వయస్సును వాయిదా వెయ్యిడానికి కొన్ని వేల కోట్ల డాలర్లను రీసెర్చ్ రూపంలో ప్రతి ఏడాది ఖర్చు పెడుతున్నారు. మరణించిన తరువాత మళ్ళీ తిరిగి రావడానికి, అటువంటి విజ్ఞానం మున్ముందు అందుబాటులోకి వస్తుందనే ఆశతో, తమ శవాలను భద్ర పరచమని బ్రతికుండగానే లక్షల డాలర్ల ఫీజు చెల్లించి మరీ మరణిస్తున్నారు. వందేళ్లు బ్రతికిన వాడు కూడా, తన మరణాన్ని ఒక్క రోజూ వాయిదా వేయడానికి వేల డాలర్లను డాక్టర్లకు చెల్లిస్తున్నారు.
మరణమంటే మనకు ఎందుకు ఇంత భయ పడతాం? మరణాన్ని భయంకరమయిన శత్రువుగా మనం ఎందుకు భావిస్తాం?
ఒక వేళ భూమిపై భౌతిక జీవితం శాశ్వతమైతే, మరణం మనిషికి లేకుండా పొతే ఏమీ జరుగుతుందో ఒక సారి ఉహిస్తే మరణం మానవునికి విశ్వమ్ ఇచ్చిన వరంగా అంగీకరిస్తాం.
ఈ భూమి పైన బ్రతికి ఉన్న వారి సంఖ్య కంటే మరణించిన వారి సంఖ్య ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. మరణించిన వారందరూ మరణించకుండా జీవిస్తూ, యిప్పుడు బ్రతికి ఉన్న వాళ్ళు మరణ రహిత జీవితం కొనసాగిస్తూ, కొత్తగా పుట్టే వాళ్ళందరితో జన సంఖ్య ఈ పుడమి పైన పెరుగుతూ ఉంటే ఏంజరుగుతుంది?
పెరగని ఈ భూమిపై జన సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పృథ్వి పై పెరగని వనరులు పెరిగే జనాలకు సరి పోవు. పంచుకోవడానికి ఆహారం సరిపోదు, ఆహారం కోసం మనం ఒకరినొకరు గాయపరుచుకుంటూ, పోరాడి ఆహారాన్ని దక్కించుకుంటాం. అందరికీ నీరు సరిపోదు, నీళ్ల కోసం ఎదుటి వారిని ఏడిపించి వారి కన్నీళ్లతో మన దాహం తీర్చుకునే పరిస్థితిని తెచ్చుకుంటాం. వయసు భారం మీదపడి, వ్యాధుల బారిన పడి, ‘చావు’ లేక బ్రతుకుతూ ఉంటాం. చావు వస్తే బాగుండును అనుకుంటాం .
ఉన్నదానికి ఎప్పుడూ విలువ తక్కువ. లేని దానికి విలువ ఎక్కువ . మరణం ఇప్పుడు ఉన్నది కాబట్టి దాని విలువ మనకి అర్థం కాదు..మరణం లేనప్పుడు మరణం విలువ అర్ధం అవుతుంది. అందుకనే విశ్వమ్ మరణాన్ని సృష్టించింది.
అయితే నీవు నిజంగా మరణించకుండా ఉండాలి అంటే విశ్వమ్ ఒక చక్కని మార్గాన్ని చూపించింది. ఆ రకంగా మనం మరణాన్ని జయిస్తే పైన వివరించిన
భవుతికమయిన బాధలు లేకుండా పోతాయి.
విశ్వం ఒకే వ్యక్తి రెండు విధాలుగా జీవించడానికి అవకాశం కల్పించింది. ఒకటి శారీరక చైతన్య జీవనం; మరియొకటి ఆత్మ చైతన్య జీవనం. శరీర చైతన్యంతో జీవించేవాడు, మరణిస్తాడు. ఆత్మ చైతన్యంతో జీవించేవాడు, ఎల్లప్పుడూ జీవిస్తాడు. ప్రకృతి నియమాలకు పట్టుబడి, దైవం మరణ సహిత జీవనాన్ని సృష్టించింది. ఆత్మ నియమాలకు కట్టుబడి, విశ్వమ్ మరణ రహిత జీవితాన్ని సృష్టించింది.
ఈ రీతిగా ఒకే మనిషిలో రెండు జీవితాలను విశ్వమ్ నిక్షిప్తం చేసింది. ఒకటి మరణిస్తుంది, మరొకటి మరణం లేకుండా శాశ్వతంగా జీవిస్తుంది.ఒకటి మృతతత్వాన్ని కలిగి ఉంటుంది.మరియొకటి అమృతత్వాన్ని కలిగి యంటుంది. ఈ ద్వితత్వాలలో నీవు ఏ తత్త్వంతో జీవిస్తావో అదే నీవవుతావు.
శరీర తత్త్వంతో జీవిస్తే నీవు శరీరానివి.ఆత్మ తత్త్వంతో జీవిస్తే నీవు ఆత్మవి. శరీరం మృతం.ఆత్మ అమృతం
ఆత్మ తత్వ జీవన యాత్రకి ఆది పాదం ‘ధ్యానం’.
ఆచార్య డా అనిల్ ప్రసాద్
No comments:
Post a Comment