Tuesday, June 2, 2026

 *వసుధైవ కుటుంబం*
Lakshmi Navaluru

నాగేశ్వరరావు ప్రభుత్వ కళాశాలలో  కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. తన భార్య లక్ష్మి పెద్దగా చదువుకోకపోయినా, ఉమ్మడి సంసారంలో అత్త, మామగారిని, ఆడపడుచులని గౌరవిస్తూ ఇంటిని, "కుటుంబాన్ని" చక్కదిద్దడంలో నాగేశ్వరరావుకి ఎంతో సహకరించింది. నాగేశ్వరరావు తన ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి భారాన్ని నెత్తికెత్తుకొని మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. నాగేశ్వరరావు దంపతులకు అనఘా అనే కూతురు హరికృష్ణ అనే కొడుకు కలిగారు.
వారిద్దరినీ చదివిస్తూ వారిని పెంచడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  కాలక్రమంలో నాగేశ్వరరావు తండ్రి చనిపోయాడు. తన తల్లి శ్రీదేవమ్మను తనతో పాటే ఉండమని, పల్లెటూరి నుండి పిలుచుకొని వచ్చేసాడు. అప్పుడు తన కూతురికి 12 ఏళ్ళు, కొడుక్కి 14 ఏళ్ళు. తన తండ్రి అంత్యక్రియలను, దశదిన కర్మలను శాస్త్రోక్తంగా జరిపించాడు. 
                         అప్పుడు అక్కడికి వచ్చిన మేనత్తలు తన తల్లిని హేళనగా సూటిపోటి మాటలతో బాధించడం అనఘ గమనించింది. తన తండ్రి గురించి హేళనగా మాట్లాడుతూ మాకు నాన్న, అన్న, చెప్పుకోవడానికి మాత్రమే. కానీ, మాకు ఏమీ చేయలేదు, మా పెళ్లిళ్లు మేమే చేసుకున్నాము అని వెటకారంగా అనడం వినింది. అలాగే మరికొన్ని మాటలతో లక్ష్మీ మనసును బాధ పెట్టారు. సహజంగానే శాంత స్వభావురాలైన లక్ష్మి వాళ్ళ మాటలను పట్టించుకోలేదు .ఇది అనఘకు ఇంకా ఆశ్చర్యం కలిగించింది. తన తండ్రి ఏమో మేనత్తలను ఎప్పుడూ గౌరవించమని వాళ్ళని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు. మరి వీళ్ళ ప్రవర్తన ఏంటి ఇలా ఉంది ? అని తనని తానే ప్రశ్నించుకుంది ఆ రోజు నుండి మేనత్తలు, నానమ్మ ప్రవర్తనను గమనించడం మొదలు పెట్టింది. 
                                  ***
శ్రీదేవమ్మ కోడలు లక్ష్మిని చాలా ఆప్యాయంగా చూసుకునేది. తను ఆ ఇంటికి కోడలుగా వచ్చినప్పటి సంఘటనలు, వంట చిట్కాలు, చిట్టి పొట్టి కథలు, శ్లోకాలు, ఇంట్లోని వారి రుచులు- స్వభావాలు వంటివి చెప్పేది. ఏనాడు కోడలిని తన మాటలతో ఇబ్బంది పెట్టలేదు. కానీ లక్ష్మికి తన పుట్టింటి వారు అత్తగారు అంటే పెద్ద సమస్యని, ఆమె మాట ఎప్పుడు వినకూడదని, ప్రతి విషయంలో ఆమెకు ఎదురు చెప్పమని, చెప్పి పంపించారు, అదే విషయాన్ని లక్ష్మి శ్రీదేవమ్మతో చెబుతూ మీరెందుకు అందరూ అత్తగార్లల నాతో ప్రవర్తించట్లేదత్తయ్య ?నన్ను ఎందుకు ఇంత గౌరవిస్తున్నారు ? ప్రతి విషయంలో నా అభిప్రాయం ఎందుకు తీసుకుంటున్నారు ?అని అడిగింది. 
అందుకు శ్రీదేవమ్మ నవ్వుతూ నేను కూడా ఒకప్పుడు ఈ ఇంటి కోడలినే కదమ్మా. మా అత్తగారు నన్ను పెట్టిన ఇబ్బందులు నా కోడలికి ఉండకూడదు అనుకున్నాను అంతే అంది. అత్తగారిలో మరో తల్లిని చూసింది లక్ష్మి.
                              ***
కాలక్రమంలో అనఘ, హరికృష్ణ పెద్దవాళ్లయ్యారు. అనఘ సైకాలజీలో పీజీ చేస్తుంది. హరికృష్ణ పీజీ పూర్తి చేసి కో-ఆపరేటివ్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఒకరోజు తన పెద్ద మేనత్త, తల్లి నాన్నమ్మ, హాల్లో కూర్చుని మాట్లాడుకోవడం చూసి, వాళ్ళ పక్కన కూర్చుంది. తన మేనత్త ఏం వదిన ఈడొచ్చిన పిల్లలకు ఇంకా పెళ్లి చేయకుండా నీ కొంగెనకే తిప్పుకుంటావా ఏంటి ? అంది. లక్ష్మి ఏదో చెప్పేలోపల చివరికి మాకు పట్టిన గతే పడుతుందేమో చూసుకో అని వెటకారంగా అంది.
దాంతో అనఘ కొంచెం కోపంతో నీకే గతి పట్టింది అత్తయ్య మా అమ్మేమీ తన కొంగెనక మమ్మల్ని తిప్పుకోవట్లేదు అని కొంచెం గట్టిగానే సమాధానం 
చెప్పింది. దాంతో తన మేనత్త దొంగ ఏడుపు ఏడుస్తూ చూడొదినా నేనేదో మాటవరస కంటే ఎలా అరుస్తుందో, అయినా మా నాన్న, మీ నాన్న, ఆస్తులు మేమేం దోచుకుపోలేదమ్మ. అయినా మా అన్న మాకు ఏం చేశాడని ? అని ఏడుపందుకుంది. 
                              ***
అను, అలా పెద్ద వాళ్లతో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను అత్త ఎంత బాధపడిందో అని లక్ష్మి అనఘతో అంది. దానికి అనఘ ఏం మాట్లాడలేదు. ఆరోజు నాగేశ్వరరావు హరికృష్ణకు ఒక సంబంధం తీసుకు వచ్చాడు, ఆ సంబంధం గురించి లక్ష్మితో చెప్తూ  అమ్మాయి పేరు వసుమతి మా కాలేజ్ మ్యాచ్ లెక్చరర్ నరసింహారావు కూతురు, "లా" చదివింది, అని చెప్పాడు. పెళ్లి చూపులయ్యాక, ఒకరినొకరు ఇష్టపడ్డాక, నరసింహారావు కట్న కానుకల గురించి ఒక మాట అనుకుంటే అన్నాడు. దానికి లక్ష్మి ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి. మీ అమ్మాయి బరువు (వెయిట్) ఎంత ? అని అడిగింది. దానికి నరసింహారావు ఉజ్జాయింపుగా 65 కేజీలు దాకా అని అన్నాడు. 
వెంటనే లక్ష్మి 65 కేజీల బంగారమైన వసుమతినిస్తున్నారు ఇంకేం కావాలండి, ఇంకో మాట పెళ్లి ఖర్చులు కూడా చెరి సగం భరిద్దాం ఎందుకంటే రెండుపక్కల వాళ్ళకి బాధ్యత ఉంది కదండీ అంది. తన భార్యవంక మురిపెంగా చూశాడు నాగేశ్వరరావు, తల్లివంక గర్వంగా చూశాడు హరికృష్ణ. వారి అభినందనలు తన కళ్ళతోనే స్వీకరించింది లక్ష్మి. కూతురిని చక్కని కుటుంబంలోకి పంపుతున్నామని ధైర్యంగా ఊపిరి పీల్చుకున్నాడు నరసింహారావు. 
                                    ***
హరికృష్ణ, వసుమతుల పెళ్లి చాలా బాగా జరిగింది. అనఘ ఎంతో హడావిడి చేసింది అన్న పెళ్లికి. పెళ్లిలో అందరూ ఆనందంగా ఉంటే, ఆముదం తాగినట్టు దీనంగా ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ మరెవరో కాదు నాగేశ్వరరావు సొంత చెల్లెళ్లు. కొత్త పెళ్లికూతురు గృహప్రవేశం చేసి కొత్త కోడలు" అయింది. మనవడి పెళ్లి చూసిన శ్రీదేవమ్మా ఎంతో పొంగిపోయింది. అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు అప్పుడు నాగేశ్వరరావు చెల్లెలు ఇద్దరు వసుమతి దగ్గరికి వెళ్లి "నువ్వు బాగా చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు మీ అత్త గురించి తెలుసుకోలేదా ? అని ఎగాదిగా చూస్తూ వెటకారంగా అడిగారు. దానికి వసుమతి ఏమి మాట్లాడకుండా "మీరెవరు ?" అని అడిగింది. "నీకు పిన్నమ్మ వరస లేమ్మా మీ అత్తతో జాగ్రత్త అన్నిటికీ గొడవ చేస్తుంది, నీ మరదలు ఉందే అది చాలా పెద్ద..." అని ఏదో చెప్పబోతుంటే, "నాకు తెలుసులెండి" అని ఒక చూపు ఉరిమి చూసింది, దాంతో  ఇద్దరూ నోరు మూసుకొని వచ్చిన పని చూసుకుని వెళ్లారు. కానీ వసుమతికేమో అత్తగారు అనఘ అలాంటివాళ్లు కారేమో అనిపిస్తుంది, కానీ వాళ్ళ మాటలు కూడా ఆలోచనలోకి వస్తున్నాయి. 
                     ‌                   ***
వసుమతికి ఇంటి వాతావరణం ఒక్క వారంలోనే అర్థమయింది. అత్తగారు, అనఘ, అత్తగారికి అత్తగారు శ్రీదేవమ్మ, అందరూ చాలా ఆప్యాయంగా ఉంటున్నారు. వసుమతి అనఘతో చాలా తొందరగా కలిసి పోయింది కూడా. అత్తగారు ప్రతి విషయం ఓపికగా చెప్తూ కూతురిలాగే చూసుకుంటుంది. 
ఒకరోజు ఉండబట్ట లేక గృహప్రవేశం రోజు జరిగినదంతా చెప్పి మీరు ఎందుకు వాళ్ళని భరిస్తున్నారు అత్తయ్య ? అని వాళ్ళ ముందే అడిగింది. దానికి నాగేశ్వరరావు చెల్లెలు ఇద్దరు ఎంతో అరిచి గొడవ చేశారు, తర్వాత అనఘ కూడా ఎందుకమ్మా వాళ్ళని భరిస్తున్నావు ? వాళ్ళ మాటలు ఎందుకమ్మా పడుతున్నావు ? అని అడగడంతో ఒకరోజు మా అత్తగారు
అయం నిజః పరోవేెత్తి గణనా లఘు చేత సాం
ఉదార చరితనాంతు వసుధైవ కుటుంబకం
అనే శ్లోకాన్ని చెప్పి వీడు నా వాడు, వీడు నా వాడు కాదు అని మనసు లేనివాళ్ళు అనుకుంటారు, కానీ అందరూ నా వాళ్లే అని "విశాల హృదయం" ఉన్నవాడు అనుకుంటాడు అని చెప్పారు. నాది విశాల హృదయం అనట్లేదు వాళ్ల మాటల్ని నేను తీసుకోలేదు కాబట్టి అవి వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కాబట్టి నా మనసు ప్రశాంతంగా ఉందమ్మా. ఎవరో ఏదో అన్నారని మనం కూడా అంటే, మన సంస్కారం ఏమైనట్లు ? వాళ్ళ మాటలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండాలమ్మా అంతే". అత్తగారిలో ఒక తత్వవేత్తను చూసింది వసుమతి, తల్లిలో ఒక మానసికవేత్తను చూసింది అనఘ, వదినలో ఒక మహా మనిషిని చూశారు నాగేశ్వరరావు చెల్లెలు ఇద్దరు. 
                                      *** 
ఇప్పుడు వాళ్ళింట్లో  అనురాగాలు - ఆప్యాయతలు తప్ప అవమానాలు- అవహేళనలు లేవు. లక్ష్మి తన మనవడితో  "ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అని పలికిస్తోంటే, శ్రీదేవమ్మ మనసులోనే దేవునికి నమస్కరించింది "బంగారం లాంటి కోడలు దొరికినందుకు", వసుమతి మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది తల్లి లాంటి అత్తగారిని ఇచ్చినందుకు."
                                    ***
బంధాలు, బంధుత్వాలు తెంచుకుంటే తెగిపోతాయి, కానీ వాటిని నిలుపుకోవడమే కష్టం. ఒకరికి మనపట్ల విరక్తి పుట్టేంతవరకు, వారిని ఇబ్బంది పెట్టడం మనకు తీరని లోటుని కలిగిస్తుంది. వారిని అర్థం చేసుకోండి. ప్రతి మాటకు శక్తి ఉంటుంది, అలాగని ప్రతి మాటను మనసుకు తీసుకోకండి అది అన్నిటికంటే ప్రమాదకరం. 

అంకితం : భూమికంటే గొప్ప తల్లి, ఆ తల్లిని కన్న తల్లికి ( అమ్మమ్మకు) 

                                                        మీ 
                                                     చక్రవర్తి

No comments:

Post a Comment