*శాపం నుంచి తప్పించే పారాయణ*
*శ్రీకృష్ణ పరమాత్మ మానవాళికి అందించిన దివ్య సందేశం భగవద్గీత. దానిలోని ప్రతి అక్షరం పుణ్యప్రదమైనదే. అదేవిధంగా గీతలోని నాల్గవ అధ్యాయం విశేష ఫలదాయకం భగవద్గీతలోని నాలుగవ అధ్యాయం పారాయణం వల్ల కలిగే ఫలం పద్మ పురాణంలో ఈ విధంగా ఉంది.*
*పూర్వం వారణాసిలోని విశ్వేశ్వరుని ఆలయంలో భరతుడు అనే మహనీయుడు భగవద్గీత నాలుగవ అధ్యాయం ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పారాయణం చేస్తూ ఉండేవాడు. ఆ పారాయణ ఫలంగా అతడు పవిత్రుడై సకల సుఖాలను, దుఃఖాలను, శీతోష్ణాది ద్వంద్వాలనూ, సమబుద్ధితో అనుభవిస్తూ ఉండేవాడు. ఒక మారు ఆతనికి మహాత్ములను సందర్శించాలనే కోరిక కలిగి వారున్న తావులను వెతుక్కుంటూ పర్యటనకు బయల్దేరాడు. అతను ప్రయాణం చేసే మార్గంలో ఒక చోట సంధ్యాసమయం కాగా అక్కడున్న రెండు పెద్ద రేగి చెట్ల కింద విశ్రమించి, నిత్యం తాను పారాయణ చేసే భగవద్గీత నాలుగవ అధ్యాయాన్ని ప్రతి* *రోజు మాదిరి పారాయణ చేశాడు. బయల్దేరే సమయంలో తన ముందు రాలిన రెండు రేగి పండ్లను తన సంచిలో వేసుకుని బయల్దేరాడు. అయితే ఇక్కడ ఒక చిత్రం జరిగింది. ఆ రెండు రేగి చెట్లూ ఐదు రోజుల్లో ఎండిపోయాయి. వాటిలోని జీవులు ఒక ఇంట ఇద్దరు బాలికలుగా జన్మించారు. అంతేకాదు వారికి పూర్వ జన్మ జ్ఞానం కలిగింది. ఒకమారు ఏదో పని మీద వెళుతున్న భరతుడు మరో ఊరిలో ఉన్న వారి ఇంట విడిది చేశాడు. వారు భరతునికి అర్ఘ్యపాద్యాదులిచ్చి తమ పూర్వ జన్మ వృత్తాంతం ఆయనకు ఇలా చెప్పసాగారు.*
*ఒకప్పుడు గోదావరీ తీరాన సత్యతవుడు అనే యోగిపుంగవుడు ఘోరతపస్సు చేస్తూ ఉండేవాడు. ఇంద్రుడు అతని తపస్సుకు భయపడి తనకు పదవీ భంగం కలుగుతుందేమోనన్న భయంతో ఇద్దరు అప్సరసలసు ఆ సత్యతవుని తపస్సు భంగం చేయడానికి పంపాడు. తమ ప్రభువైన ఇంద్రుని ఆజ్ఞ మేరకు వారు సత్యతవుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి చేరుకుని తపస్సుకు భంగం కలిగించేందుకు ప్రయత్నించారు. సత్యతవుడు కోపించి వారిద్దరినీ గంగా తీరంలో రేగి చెట్లు కమ్మని శపించాడు. దానితో వారిరువురూ తాము తమ ప్రభువైన ఇంద్రుని ఆజ్ఞ మేరకు అక్కడకు వచ్చామని శాప విమోచనం కలిగించమని కోరారు. దానితో ఆయన శాంతించి, భరతుడనే మహనీయుడు మీ చెట్ల నీడన కూర్చుండి భగవద్గీత నాలుగవ అధ్యాయం పారాయణ చేసినప్పుడు అది విని మీరు పూర్వ జన్మ జ్ఞానం కలిగిన బాలికలుగా జన్మిస్తారు. మీ వృత్తాంతాన్ని భరతునికి చెప్పి ప్రతి రోజూ పారాయణ చేస్తూ క్రమంగా మీరు మీ నిజ జన్మమైన దేవతా స్త్రీలుగా మారుతారని చెప్పాడు. మీరు రేగి చెట్లుగా ఉన్న మా నీడన చేరి నాలుగవ అధ్యాయం పారాయణ చేశారు. అది విన్న కొద్ది రోజులకు మేము ఆ రూపాన్ని వదలి ఇలా బాలికలుగా మారాం అని చెప్పి ఆయనకు ప్రణమిల్లారు. ఆ తర్వాత వారు నిత్యం నాలుగవ అధ్యాయం పారాయణ చేసి ఆ పుణ్యఫలంతో తిరిగి అప్సరసలుగా మారి ఇంద్ర లోకం వెళ్లిపోయారు. ఇలా భగవద్గీత నాలుగవ అధ్యాయాన్ని పఠించినవారు మానవులైనా, వృక్షాదులైనా దోష విముక్తి పొందుతారు అని పద్మ పురాణం పేర్కొంటోంది.*
*┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁📚🍁 🙏🕉️🙏 🍁📚🍁
No comments:
Post a Comment