Monday, June 27, 2022

నేటి జీవిత సత్యం. నాలుగు భయాలు ఇవి. వీటిని జయించినవాడు అసలైన యోధుడు. తనను తాను జయించుకున్న జితేంద్రియుడు….

 నేటి జీవిత సత్యం. 


ఆ రోజుల్లో కొందరు గృహస్తులు భిక్షువుల్ని చూసి, వారికి లభిస్తున్న గౌరవాన్ని చూసి, తామూ భిక్షువులుగా మారేవారు. కానీ అక్కడి క్రమశిక్షణ నియమావళి, నైతిక జీవనంలో ఇమడలేక, మోహాన్ని, రాగాన్నీ వదిలించుకోలేక తిరిగి భిక్షుజీవనాన్ని వదిలి పెట్టేవారు. ఇలాంటివారి గురించి బుద్ధుడు చెప్పిన గొప్ప సందేశం ఇది. నీటిలో దిగేవాడికి నాలుగు భయాలు ఉంటాయి. మొదటిది, తరంగ భయం. తరంగం మనిషిని వెనక్కి పడేస్తుంది.

ముందుకు పోనీయదు. అలాగే మనస్సులోని అహంకారం కూడా అలాగే వెనక్కి పడదోస్తుంది. ఇతను నాకు చెప్పేవాడు. నాకంటే వయస్సులో చిన్నవాడు. నాకంటే వెనుక వచ్చినవాడు అనే అకుశల భావన అహంకారాన్ని ప్రేరేపించి జలతరంగంలా మనిషిని వెనక్కి నెట్టేస్తుంది. అలాగే.... నీటిలో ఉండే మొసళ్ళ భయం. ఇది చాపల్యానికి చెందిన అకుశల కర్మ. నీటిలో కనిపించని మొసలి వచ్చి, వడిసి పట్టి లోనికి లాగేస్తుంది. ఈ చాపల్యం కూడా అలాగే లాగేస్తుంది. 

అంతకుముందు తిన్నది ఇప్పుడు తినకూడదు. తాగింది తాగకూడదు. కానీ ఆ రుచి చపలత మనిషిని మొసలి పట్టు పట్టి వెనక్కి లాగేస్తుంది. అందుకే ఇది మకర భయం. ఇక మూడోభయం సుడిగుండ భయం. సుడిగుండం వేగంగా తనలోకి లాక్కు పోయి, గిరగిరా తిప్పేసి ముంచేస్తుంది. అలాగే గతంలో అనుభవించిన విలాసవంతమైన జీవితం తాలూకు సౌకర్యాలన్నీ మనల్ని సుడిగుండంలా చుట్టుముడతాయి.

నాలుగో భయం సొరచేప భయం. మనిషిని పట్టి కత్తిరించి సొరచేప ఎలా మింగేస్తుందో కామం కూడా అలాగే మింగేస్తుంది. అలంకరణలు, అందచందాలను చూసి అదుపు తప్పిన భిక్షువు చివరికి ఎందుకూ కొరగాకుండా పోతాడు. ఈ కామరాగాన్ని అదుపుచేయని వ్యక్తి కూడా మింగివేయబడతాడు. అంటే పూర్తిగా ఉనికినే కోల్పోతాడు.ఆదర్శ మార్గంతో నడిచే వ్యక్తికి అపాయాన్ని కలిగిస్తాయి నాలుగు భయాలు. అందుకే ఈ నాలుగింటి పట్ల భయంతో ఉండాలి.వాటికి చిక్కుపడకుండా ఉండాలి. అందుకు జాగరూకత కలిగి ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి చిరకీర్తిని పొందుతాడు. పరిపూర్ణుడవుతాడు. చివరికంటూ ఆదర్శమూర్తిగా మిగులుతాడు.ధార్మికుడు తప్పనిసరిగా తన జీవితంలో ఊహించుకోవాల్సిన నాలుగు భయాలు ఇవి. వీటిని జయించినవాడు అసలైన యోధుడు. తనను తాను జయించుకున్న జితేంద్రియుడు….


సేకరణ. మానస సరోవరం 👏

Sunday, June 26, 2022

నీతి: క్రోధం వల్ల సాధించేదేమీ ఉండదు. కోపానికి విరుగుడు శాంతమే. శాంతం వహిస్తే, క్రోధాన్ని అవలీలగా జయించవచ్చు.

 పురానీతి!

ఒకనాటి సాయంత్రం శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వనవిహారానికి వెళ్లారు. కబుర్లాడుకుంటూ వెళుతుండటంతో కాలం తెలియలేదు. చీకటి ముసురుకునే వేళకు ముగ్గురూ ఒక కీకారణ్యంలోకి చేరుకున్నారు. ముందుకు సాగడానికైనా, వెనక్కు మళ్లడానికైనా ఏ మాత్రం అనువుకాని సమయం. ఇక చేసేదేమీ లేక ఆ రాత్రికి ఎలాగోలా కీకారణ్యంలోనే గడపాలని నిశ్చయించుకున్నారు.అడవిలో ముగ్గురూ ఒకేసారి ఆదమరచి నిద్రపోవడం క్షేమం కాదని, అందువల్ల ఇద్దరు నిద్రిస్తున్నప్పుడు మిగిలిన వారు కాపలా ఉండాలని, ఇలా వంతుల వారీగా మేలుకొని కాపలా ఉంటూ రాత్రి పొద్దుపుచ్చాలని అనుకున్నారు. ముందుగా శ్రీకృష్ణుడు, బలరాముడు ఒక చెట్టు కింద నిద్రకు ఉపక్రమించారు. సాత్యకి వారికి కాపలాగా మేలుకొని ఉన్నాడు. ఒళ్లంతా కళ్లు చేసుకుని, చుట్టూ గస్తీ తిరగసాగాడు.అంతలోనే ఒక రాక్షసుడు కృష్ణ బలరాముల వైపు వడివడిగా రావడం కనిపించింది. సాత్యకి వెంటనే ఆ రాక్షసుడిని అడ్డగించాడు. రాక్షసుడు సాత్యకిపై దాడికి దిగాడు. సాత్యకి క్రోధావేశాలతో తన గదాయుధంతో అతడిని ఎదుర్కొన్నాడు. సాత్యకిలో క్రోధం మొదలైన మరుక్షణమే రాక్షసుడి శరీరం రెట్టింపైంది. సాత్యకికి కోపం మరింత పెరిగింది. రాక్షసుడి శరీరం కూడా పెరిగింది. సాత్యకి కోపం చల్లారకపోగా, అంతకంతకూ పెరగడంతో రాక్షసుడి శరీరం విపరీతంగా పెరిగింది.రాక్షసుడి శరీరం ముందు సాత్యకి ఆటబొమ్మలా కనిపించసాగాడు. రాక్షసుడు సాత్యకిని ఎత్తిపట్టుకుని, గిరగిరా తిప్పి కింద పడేసి వెళ్లిపోయాడు. గాయాలపాలైన సాత్యకి కొద్దిసేపటికి శక్తి కూడదీసుకుని తెప్పరిల్లాడు. అదే సమయానికి మేలుకున్న బలరాముడు ఇక తాను కాపలాగా ఉంటానని చెప్పి, సాత్యకిని నిద్రపొమ్మన్నాడు.రాక్షసుడితో పోరులో అలసి సొలసిన సాత్యకి నెమ్మదిగా చెట్టు కిందకు చేరుకుని, ఆదమరచి నిద్రలోకి జారుకున్నాడు. బలరాముడు అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాయసాగాడు. సాత్యకికి ఎదురైన రాక్షసుడే బలరాముడికీ ఎదురయ్యాడు. యుద్ధానికి కవ్వించాడు. బలరాముడు అసలే ప్రథమకోపి.కట్టలు తెంచుకున్న కోపంతో తన హలాయుధాన్ని ఎత్తి రాక్షసుడిపై దాడి చేశాడు. రాక్షసుడు వికటాట్టహాసం చేస్తూ తన శరీరాన్ని పెంచాడు. బలరాముడి కోపం మరింత పెరిగింది. బలరాముడి కోపంతో పాటే రాక్షసుడి శరీరం పెరుగుతూ రాసాగింది. చివరకు భీకరాకారం దాల్చిన రాక్షసుడు బలరాముడిని కూడా మట్టికరిపించి, వెనుదిరిగాడు.ఇంతలోగా తనవంతు కాపలా కాయడానికి శ్రీకృష్ణుడు మేలుకున్నాడు. ఇంకా తెల్లారలేదు కదా, ఓ కునుకు తీయమన్నాడు బలరాముడిని. రాక్షసుడి ధాటికి ఒళ్లు హూనమైన బలరాముడు నెమ్మదిగా చెట్టుకిందకు చేరుకుని నడుం వాల్చాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. శ్రీకృష్ణుడు అటూ ఇటూ కలియదిరుగుతూ కాపలా కాయసాగాడు. కొద్దిసేపటికి సాత్యకిని, బలరాముడిని మట్టికరిపించిన రాక్షసుడు శ్రీకృష్ణుడి ఎదుటికి వచ్చాడు. యుద్ధం చేయమంటూ కవ్వించాడు.శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ సై అన్నాడు. రాక్షసుడు కృష్ణుడి మీదకు లంఘించాడు. కృష్ణుడు ఒడుపుగా తప్పించుకున్నాడు. ప్రశాంతంగా అతడి వైపు చూసి మల్లయుద్ధానికి చెయ్యి కలిపాడు. రాక్షసుడి శరీరం సగానికి సగం తగ్గిపోయింది. అతడు ఎంతగా కవ్విస్తున్నా, కృష్ణుడు చెక్కుచెదరని చిరునవ్వుతో అతడిని ఎదుర్కోసాగాడు.శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తున్న కొద్దీ రాక్షసుడి శరీరం అంతకంతకూ తగ్గిపోసాగింది. చివరకు గుప్పిట్లో పట్టేంత చిన్నగా తయారయ్యాడు ఆ రాక్షసుడు. శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడిని అరచేత పట్టుకుని, తన ఉత్తరీయం అంచుకు మూటలా కట్టేశాడు. కొద్దిసేపటికి తెల్లవారింది. అడవిలో పక్షుల కిలకిలలు మొదలయ్యాయి.సాత్యకి, బలరాముడు మేలుకున్నారు. తమ దగ్గరే ఉన్న కృష్ణుడిని చూశారు. తమ ఒంటి మీద ఉన్న గాయాలను చూసుకున్నారు. రాత్రి తమకు కనిపించిన రాక్షసుడి గురించి చెప్పారు. ‘అలాంటి రాక్షసుడు నీకు కనిపించలేదా?’ అని అడిగారు. వీడేనా ఆ రాక్షసుడు’ అంటూ తన ఉత్తరీయం అంచున కట్టిన మూటను విప్పాడు కృష్ణుడు. అందులోంచి బయటపడ్డాడు గుప్పెండంత పరిమాణంలో ఉన్న రాక్షసుడు.బలరాముడు, సాత్యకి ఆశ్చర్యపోయారు. ‘నిన్న మాకు కనిపించింది వీడే. అయితే, అప్పుడు బాగా పెద్దగా ఉన్నాడు. కోపంగా అతడితో పోరు సాగించే కొద్దీ మరింతగా పెరిగిపోసాగాడు’ అని చెప్పారు. ‘ఈ రాక్షసుడు మూర్తీభవించిన క్రోధం. క్రోధానికి విరుగుడు క్రోధం కాదు, శాంతం. మీరిద్దరూ కోపంతో రెచ్చిపోయి తలపడ్డారు. అందుకే ఇతడి చేతుల్లో పరాజితులయ్యారు’ అని చెప్పాడు కృష్ణుడు. అప్పుడు జ్ఞానోదయమైంది సాత్యకీ బలరాములకు.


నీతి: క్రోధం వల్ల సాధించేదేమీ ఉండదు. కోపానికి విరుగుడు శాంతమే. శాంతం వహిస్తే, క్రోధాన్ని అవలీలగా జయించవచ్చు.

సేకరణ:-

సేవ గొప్పతనాన్ని వివరిస్తూ స్వామి వివేకానంద ఇలా అంటారు.....

వ్యక్తికి వ్యక్తికి మధ్య సంబంధం సేవతోనే ముడివడి ఉంటుంది. సేవానిరతితోనే అనుబంధాలు బలపడతాయి. హృదయ మార్దవం చిగుళ్లు తొడుగుతుంది. సేవాగుణం వల్ల ఒంటరిగా ఉన్నామన్న భావనే కలగదు.


సేవ గొప్పతనాన్ని వివరిస్తూ స్వామి వివేకానంద ఇలా అంటారు. ‘నిర్మలంగా ఉంటూ పరులకు వీలైనంత సహాయం చేయాలన్నదే పూజలన్నింటి సారాంశం. పేదల్లోను, వ్యాధిపీడితుల్లోను ఈశ్వరుణ్ని చూసి వారికి సహాయం చేసేవాడే నిజమైన సేవకుడు. అతడే ఈశ్వరుడికి ప్రీతి పాత్రుడు. ఒక వ్యక్తి సమాజంలో ఏ హోదాలో ఉన్నప్పటికీ తోటివారి కష్టాలను తొలగించి వారికి చేయూతనివ్వాలి. అప్పుడే అతడు చిరస్మరణీయుడవుతాడు. ఎవరైతే పరులకోసం జీవిస్తారో వారే నిజంగా జీవించినట్లు, మిగతావారు జీవించి ఉన్నా మృతతుల్యులే.’


సేవ అంటే మనకున్నదంతా ఇతరులకు ఇచ్చి మనం కష్టాల పాలవడం కాదు. మనకు చేతనైనంత సహాయం ఇతరులకు చేయాలి. వారికి ఆనందం కలిగించాలి. మన విధులను నిబద్ధతతో, నిస్వార్థంతో నిర్వరిస్తూ ఆర్తులకు చేయూతనివ్వాలి.


మనకోసం చేసిన పని ఎంత గొప్పదైనా మనతోనే అంతమవుతుంది. పరుల మేలు కోసం చేసే సేవ మాత్రమే మనల్ని చిరస్మరణీయుల్ని చేస్తుంది. అందుకే తోటివారికి తోడ్పడటంలో ఉన్న ఆనందం మరి దేనిలోనూ లభించదంటారు విజ్ఞులు.


ఇతరులకు ఎలాంటి సేవ చేసినా నిష్కల్మషమైన మనసుతో చేయాలి. అదే మాధవసేవ. ఆ సేవే భగవంతుడికి ప్రీతికరమైనది. దానికి మెచ్చిన మాధవుడు మన హృదయంలోనే కొలువై ఉంటాడు...

హిందూత్వాన్ని ప్రాణం ప్రదంగా ఆచరించే ప్రపంచ ప్రముఖులు.

 హిందూత్వాన్ని ప్రాణం ప్రదంగా ఆచరించే ప్రపంచ ప్రముఖులు.                                               1.స్టీవ్ జాబ్స్ : అమెరికా లోని ఆపిల్ అనే ప్రముఖ సెల్ ఫోన్స్ తయారి సంస్థ ప్రతినిధి. ఈయన ప్రతి ఆదివారం శ్రీకృష్ణ దేవాలయానికి 7 కి.మీ. నడిచి వెళ్లి అన్నప్రసాద వరుసలో నుంచొని మరి ఆ భోజనం చేసి తరువాతనే తన పనులు చూసుకుంటాడు.

2.అల్ఫ్రెడ్ ఫోర్డ్ : వీరు అమెరికాలోని ఫోర్డ్ అనే ప్రముఖ కార్ల తయారిసంస్థ ప్రతినిధి. హిందూ ధర్మంలోని మూల విషయాలని గ్రహించి 1974లో హిందూ ధర్మం స్వీకరించి తన పేరును అంబరీష్ దాస్ గా మార్చుకున్నాడు. భారతీయ స్త్రీని వివాహం చేసుకొని హిందూ ధర్మ ఉద్దరణ కోసం నిత్యం పాటు పడే అమెరికా లోని ప్రముఖ వ్యక్తి. 

3.డేవిడ్ ఫ్రాలే : అమెరికా లోని ప్రముఖ రచయిత, ఖగోళ శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, హిందూమత ఉద్దరణ కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి.మన దేశ యోగ, ధ్యానం, ఆయుర్వేదాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వివరించి వాటిపై అనేక పుస్తకాలను రాసిన వ్యక్తి.

4.రాంబో (సిల్వెస్టర్ స్టాలోన్) : తన నట జీవితానికి ముగింపు పలుకుతున్న సమయంలో హిందూ ధర్మం వైపు ఆకర్షితుడు అయ్యాడు. తన కుమారుడు మరణానంతరం అతని అస్తికలను హరిద్వార్ లోని గంగా నదిలో కలిపి మన దేశంలో ప్రముఖ ఆలయాలు దర్శించి ఎక్కువగా హిందూ ఆద్యాత్మిక జీవితం గడుపుతున్న వ్యక్తి.

5. విల్ స్మిత్ : ప్రముఖ హాలివుడ్ నటుడు. హాలివుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే వ్యక్తి. తన నటనా జీవిత మధ్య భాగంలో హిందూ ధర్మం వైపు ఆకర్షితుడై తరచూ మన దేశానికి వస్తూ మన ఆలయాలు సందర్శిస్తూ గంగా నదికి ఇచ్చే హారతిలో కచ్చితంగా పాల్గొంటాడు.

6.జూలియా రాబర్ట్స్ : అమెరికాకు చెందినా ప్రముఖ ఆస్కార్ అవార్డ్ నటి. సినిమాల్లో నటిస్తూ క్రమంగా హిందూ ధర్మంపై ఆకర్షితురాలై తాను పూర్తి హిందూ స్త్రీగా ప్రకటించింది. తను పెంచే పిల్లలకు హిందూ దేవుళ్ళ పేర్లు పెట్టి యోగా, ధ్యానం లను సాధన చేస్తూ మన ధర్మంపై పరిశోధన చేస్తున్నది.

7.హ్యుగ్ జాక్మాన్ : ప్రముఖ హాలివుడ్ నటుడు. X మాన్ సినిమాల నటుడు. హిందూ ధర్మం పై అభిమానం పెంచుకొని మన ఉపనిషత్తులు, భగవద్గీత, ఇతర హిందూధర్మ గ్రంధాలను అధ్యయనం చేస్తున్న వ్యక్తి.

8.జెర్రి గార్సియా : అమెరికాకు చెందినా ప్రముఖ గాయకుడు, గిటారిస్ట్, తన ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా అనేక వేదికలపై ప్రదర్సనలు ఇచ్చాడు. వీరు కుడా మన ధర్మాన్ని ఆచరిస్తూ వీరి మరణం తరువాత అస్తికల బూడిదను మన గంగా నదిలో కలపమని కోరుకున్నారు. 

9.నివేదిత : ప్రముఖ ఐరిష్ మహిళ, హిందూ ధర్మం పై ఆసక్తి పెంచుకొని స్వామీ వివేక నంద శిష్యురాలుగా చేరి తన జీవితం అంతా మన ధర్మప్రచారం కోసం మన దేశ పౌరసత్వం స్వీకరించి మరణించే వరకు వివిధ కార్యక్రమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసింది.

10. రిచర్డ్ ఎల్.ధామ్సన్ : అమెరికాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, తత్వవేత్త, గణితశాస్త్ర ప్రముఖుడు. వీరు కుడా మన హిందూ ధర్మం స్వీకరించి  తన పేరును సదాపుత్ర దాసు అని మార్చుకున్నాడు. యోగ ధ్యానం, భగవద్గీత లను సాధన చేసి ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నాడు.


---సేకరణ 

Saturday, June 25, 2022

రమణ బోధ

రమణ బోధ


నీవు తత్వజ్ఞుడవై ప్రాపంచిక వ్యవహారాలలో, గతించిన వస్తువులపట్ల, వ్యక్తులపట్ల ఉదాసీనంగా వుండు.

ప్రాప్తమైన వాటిని సేవించు.
ఎంత వ్యవహారంలో వున్నా ఇష్టాయిష్టాలు లేకుండా ప్రసన్నంగా ఉండు.

నీ మనసుకెపుడు ఇంద్రియ విషయలు రుచించవో నీవు సంసార సాగరాన్ని దాటినవాడవవుతావు.

సంకల్పరహితుడవై ప్రాప్తించిన వ్యవహారాలు నడుపుతూ ఉండు.

సంకల్పాలు ( మనస్సు ) నశిస్తే మోక్షమే, అనందమే, ప్రశాంతతే.

సంకల్పాలూ తప్ప మరొక సంసార దుఃఖమేమిలేదు.

నేనేమి సంకల్పించను అను సంకల్పంతో మనస్సును జయించు.

చూడు ఏమిజరుగుతుందో.

ఆ భగవంతుని చేతిలో ఒక ఇంస్ట్రుమెంటుగా మారు. నీ బాగోగులు అన్ని ఆ భగవంతుడే చూస్తాడు.

సేకరణ

చేసిన పూజలకు పారాయణాలకు జపాలకు వచ్చే పుణ్యం ఏ రూపంలో ప్రకటించ బడుతుంది.

ॐశ్రీ నరసింహయ నమః
💝 చేసిన పూజలకు పారాయణాలకు జపాలకు వచ్చే పుణ్యం ఏ రూపంలో ప్రకటించ బడుతుంది.
💖 భగవంతుడు మంచి నైపుణ్యం గల వ్యవసాయదారుడు.
❤️ మన మనస్సు అనే నేలను సాధన అనే నాగలితో దున్ని ఆ తరువాత పుణ్యం అనే విత్తును నాటుతాడు ఆయన. తద్వారా తన కటాక్షవీక్షణాలనే ఫలాలను అందిస్తాడు.
💕 పుణ్యం అనేది ఫలం కాదు. పుణ్యం అనేది సత్ఫలానికి కారకం.
💞 పుణ్యం అనేది విత్తనమైతే
💕 మనసులో కలుగుతున్న మంచి మార్పు ఎదుగుతున్న వృక్షం లాంటిది.అలా మారిన మనసు అందుకునే భగవంతుడి వాత్సల్యానుభూతియే వృక్షానికి పండిన ఫలం.
💓 మనం చేసిన ధర్మకార్యం ఫలించిందాలేదా అనే సందేహాన్ని మన మనస్సే నివృత్తి చేస్తుంది.
❤️ సన్మార్గం దిశగా ప్రయాణిస్తున్న మన మనస్సే చెబుతుంది మనం గెలిచామని.
💝 ఈ మంచి మార్పే క్రమేపీ సాధకుడిని మహనీయుడిగా మారుస్తుంది.
💖 పూజలు , పారాయణాలు, దీక్షలు, జపాది ఇత్యాదులు సిద్ధించుకున్న సాధకుడిలో అప్రయత్నంగానే "క్షమా, సహనం , సామరస్యం, భూతదయ, ప్రేమ, దైవిక జ్ఞానం ఇలాంటి సుగుణాలు పెంపొందించబడతాయి.
❤️ ఇదియే నిజమయిన సాధన.
💝 కోటి పూజలు చేసినా, లక్ష పారాయణాలు చేసినా, వేల జపాలు చేసినా గోరంత కూడా మనలో మంచి మార్పు రాలేదంటే, ఆ సాధన బండరాయి మీద నాటిన విత్తనం లాంటిదే అని మనం గమనించాలి
💖 పుణ్యానికి మన మనస్సే గమ్యస్థానం. మనసులో వచ్చే మార్పే జీవితాన్ని మారుస్తుంది.
❤️ మట్టి బెడ్డలోనుండి వచ్చే సువాసనకు వర్షపు చినుకు కారణమైనట్లు , మన మనస్సులోని సుగుణాల వెలికితీతకు చేసిన ధర్మకార్యాల పుణ్యమే కారణం.
❤️ రాజు యొక్క రాకను తెలియపరిచి సభలోని వారిని క్రమశిక్షణలో పెట్టిన బంటు మాదిరి , భగవదనుగ్రహం వచ్చేముందు ఆవశ్యకమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణను మనసుకు అలవాటు చేసేదే పుణ్యం.
💓 అందుకే మనం చేసిన పూజలకు పారాయణాలకు జపాలకు వచ్చే పుణ్యం సాధకుడి మనసును సారవంతం చేసి తనను తాను ప్రకటించుకుంటుంది.
💝 కొబ్బరికాయలు కొట్టి, కాయకొక కోరికచొప్పున "కోరికల దండకాలు" చదివే బదులు ఫలాపేక్ష లేకుండా పరంధాముడిని ధ్యానిస్తే /పూజిస్తే పుణ్యాన్ని ప్రసాదించి మన మనస్సునే వైకుంఠంగా చేసుకుంటాడు భగవంతుడు.

సేకరణ

అశాంతికి మన మనసే కారణం.

🕉 శ్రీ గురుభ్యోనమః


నీవు ఇతరుల మీద ఆధారపడకుండా, నీ కృషి ఏదో నీవు చేసుకుంటూ వ్యవహారంలో, ఆహారంలో, నిద్రలో తగుమాత్రంగా ఉంటూ నన్ను ఎరుకలోనికి తెచ్చుకోవటానికి ప్రయత్నం చెయ్యి అని భగవంతుడు చెపుతున్నాడు. మన ఇంట్లో వారి వలన, బయట పరిస్థితుల వలన మనకు కొంత అశాంతి రావచ్చు కానీ అవి స్వల్ప విషయాలు. అవి రూపాయికి 5 పైసలు మాత్రమే! మిగతా 95 పైసల అశాంతికి మన మనసే కారణం. దుఃఖం శరీరంలో లేదు. మనస్సులో ఉంది. మనం ఒక ప్రక్క మనోనాశనానికి కృషి చేస్తూ, రెండో ప్రక్క తత్త్వ జ్ఞానం పొందటానికి కృషి చేస్తూ ఉంటే అప్పుడు తరిస్తాము. భగవంతుని యొక్క నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే నీ మనస్సు శోధింపబడుతుంది. అప్పుడు మనస్సులో ఉన్న మలిన వాసనలు పోతాయి.

🙏 సద్గురు శ్రీ రమణ మహర్షి 🙏

సేకరణ

🙏🌺శాశ్వతమైన సంపద🌺🙏

🙏🌺శాశ్వతమైన సంపద🌺🙏

🌺ఆరోగ్యం గా బతికినా ,అనారోగ్యంతో బతికినా , ధనికుడిగా భోగాలు అనుభవించినా, దరిద్రంతో బాధలు పడినా ఎలా బతికినా ఒక నాటికి మనిషి మరణించక తప్పదు ఇది సృష్టి ధర్మం , కాసేపటికి విరిగిపోయే పాలల్లో పాడవ్వని నైయ్యి ని దాచాడు భగవంతుడు.. కర్మతో కర్మ భూమిలో జన్మించిన ప్రాణంలో శాశ్వతమైన ఆత్మ ఉంది, ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం చేసే సాధన పేరు అంతర్యాగం...ఎంత సంపాధించిన అది కుటుంబం కోసం, దాచిన ధనం దొరలు పాలు లేదా దోంగల పాలు దోచుకోలేనిది విద్య అయితే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద.. అది ఎన్ని జన్మలు అయినా నీవెంట వస్తుంది. నిత్య కర్మలు ఆచరిస్తూ మీ బాధ్యతలు కర్తవ్యం నిర్వహిస్తూ ధర్మ బద్దమైన జీవితం గడుపుతూ దైవ స్మరణ విడువ కుండా సాధన మార్గంలో సాగిపోవాలి.. ఏ ఉపాసనా చేయకున్న నీ రోజు పూర్తి అవుతుంది ,ఉపాసన చేస్తూ చేస్తే నీ రోజు సారవంతంగా పూర్తి అవుతుంది.. నీ కుటుంబ కోసం నువ్వు పాటు పడక తప్పదు అదేదో భగవంతుడు ని స్మరిస్తూ చేస్తే నువ్వు చేసేది ఉపాసన అవుతుంది మరింత ఫలితాన్ని ఇస్తుంది.🌺

🌺ఇద్దరు వ్యక్తులు రోజు కూలి పనులకు వెళ్తున్నారు రోజు కూలి తెస్తే కానీ వారి ఇల్లు గడవని పరిస్థితి.. అయితే ఒక అతను నేను కూలి చేస్తే కానీ నా ఇల్లు గడవటం లేదు ఇందులో దేవుడు చేసింది ఏముంది నా కష్టం నాకు తప్పడం లేదు కదా అని దేవున్ని తలవను కూడా తలవడు ఇంకో వ్యక్తి దేవుడు దయ ఉండబట్టే ఈ పని అయినా దొరికి నా కుటుంబాన్ని పోషించుకోగలుగు తున్నాను ఆ దేవుడికి నేను కృతజ్ఞతతో ఉండాలి, నేను ఎలాగో రోజంతా కష్టపడి పని చేయక తప్పదు ఆ సమయంలో నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని నిద్ర లేచిన దగ్గర నుండి నారాయణ స్మరణ చేస్తూ కష్టం చేసుకునే వాడు.. పొద్దు పోయి సరికి అతనికి రావాల్సిన కూలి డబ్బుతో పాటు కొన్ని వేల సార్లు నామ జపం చేసిన పుణ్యం కూడా అతని ఖాతాలో పడేది.. ఆ నామ స్మరణ వల్ల అతనిలో ఆత్మ వివేకం కలిగింది ఉన్నతంగా ఆలోచించడం ప్రశాంతంగా ఉండటం ధ్యానం చేయడం అలవాటు అయ్యింది. ఇంకో వ్యక్తి ఆ చాకిరి తలుచుకుటూ గాడిద చాకిరీ అని ఎప్పుడూ గాడిదను తలుచుకుంటూ కుటుంబం లో వారిని తిడుతూ పని చేయించిన యజమాణిని తిట్టుకుంటూ రోజు ముగిసి పోయేది చివరికి ఇద్దరి జీవితం ముగిశాఖ దైవభక్తి గల వ్యక్తి తను సంపాదించిన దైవ స్మరణ అనే నిధితో ధనికుడి అయిన ఆశామి ఇంట్లో పుట్టాడు.. ఎప్పుడూ తిట్టుకుంటూ ఒకరిని దూషిస్తూ ఆ పాపం అకౌంట్ లో వేసుకున్న వ్యక్తి గాడిదగా చాకలి వాళ్ళ ఇంట్లో గాడిదకు పుట్టాడు ఇప్పుడు గాడిద చాకిరి తప్పదు.🌺

🌺చేసే పని ఎలాగో తప్పదు అదేదో ఎవరిని దూషించ కుండా దైవ స్మరణతో చేస్తే స్వామి కార్యం స్వకార్యం రెండు దక్కుతుంది.. ఉండే బాధలు పనులు ఎప్పుడూ ఉంటుంది అది తప్పదు ఎంత నెత్తిన పెట్టుకొని చూసిన ఒక వయసుకి ఎవరి దారి వాళ్ళు చూసుకోకుండా ఉండరు.. ఎంత అందంగా అలంకరించిన దేహానికి అయినా వృధ్యాప్యం రాక తప్పదు సంపాదన పిల్లలు పంచుకుంటారు కానీ అనారోగ్యాన్ని ఎవ్వరు తీసుకునే వీలు ఉండదు అది అనుభవించాల్సిందే అందుకే మీకంటూ మిగిలే సంపద మీవెంట వచ్చే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద మటుకే ఇది మరువకండి ఈ మార్గం విడువకండి.. జీవితం అనే పాలలో, భక్తి నే పెరుగుని బాధ్యత అనే కవ్వంతో చిలికి కష్టం అనే వేడి పైన కాచి నైయ్యి అనే ఆత్మ సాక్షాత్కారం మే మనసుతో చేసే అంతర్యాగ సాధన మనసు లగ్నం చేసి చేసే ఉపాసన.🌺

సేకరణ

🍁దుర్గుణాలు🍁

🍁దుర్గుణాలు🍁

✍️ మురళీ మోహన్

🌹గులాబీ మొక్కకి పువ్వుల కంటే ముళ్లే ఎక్కువ ఉంటాయి.మామిడి చెట్టుకి పళ్ళ కంటే ఆకులు ఎక్కువ ఉంటాయి.కానీ మనం ముళ్ళని చూసి మూళ్ళ చెట్టు అనడంలేదు.ఆకులు చూసి ఆకుల చెట్టు అనడంలేదు...

ఒకదానితో అందం చూశాం,అందుకే రోజా మొక్క అంటున్నాం...మరొకదానితో తియ్యదనాన్ని చూశాం,అందుకే మామిడి చెట్టు అంటున్నాం...

సంవత్సరం అంతా ఆకులతో కొమ్మలతో నిండిపోయి కేవలం 2మాసాలు మాత్రమే పళ్ళని ఇచ్చే చెట్టుకి ఎంతో విలువనిచ్చి కాపాడుతున్నాం.

అలాగే ప్రతి వ్యక్తిలో ఎన్నో దుర్గుణాలు ఉండవచ్చు.కానీ ఆ వ్యక్తిలో ఏవో మంచి లక్షణాలు ఉండక మానవు. గుర్తించండి...చెడ్డ లక్షణాలను ఖండించండి...మనిషిని కాదు...

ఏవో దుర్గుణాలు ఉన్నాయని మనిషినే ఖండిస్తూ పోతే ఏకాకిగానే ఉండాల్సి వస్తుంది.

సేకరణ

స్వేఛ్ఛ,సంతోషం మన ఎంపికే

🍁 స్వేఛ్ఛ,సంతోషం మన ఎంపికే🍁

✍️మురళీ మోహన్

👌ఒక రోజు ఆది శంకరాచార్యులు
శిష్యులతో కలిసి వెళ్తుంటే, ఒక వ్యక్తి ఆవును తాడుతో లాగటం తారసపడింది.

శంకరులు తన శిష్యులతో, ‘ఆవు ఆ మనిషికి కట్టుబడి ఉందా.
లేదంటే, మనిషి ఆవుకు కట్టుబడి ఉన్నాడా?’ అని అడిగారు.
.
శిష్యులు ఏమాత్రం సంకోచించకుండా ‘గురువర్యా! తప్పకుండా ఆవే మనిషికి కట్టుబడి ఉంది.
మనిషి తాడు పట్టుకొని ఉన్నాడు.
ఆవు ఎక్కడికి వెళ్లినా అతణ్ని అనుసరించాలి.
మనిషి యజమాని, ఆవు బానిస’ అని చెప్పారు.

ఇప్పుడు చూడండి’ అని శంకరాచార్యులు ఆ తాడును కత్తిరించారు. వెంటనే ఆవు పారిపోయింది.
యజమాని దాని వెంట పరుగుపెట్టాడు.

అప్పుడు శంకరులు ‘శిష్యులారా! ఆవుకు తన యజమాని పట్ల అస్సలు ఆసక్తి లేదు. నిజానికీ ఆవు ఆ మనిషి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తోంది.

మన మనసు విషయంలో కూడా అదే జరుగుతుంది. మనసు దానంతట అదే చెడు ఆలోచనల మీద ఆసక్తి చూపదు.
మనమే చెడు ఆలోచనలతో దాన్ని నింపుతున్నాం.
వాటికి బదులు మంచి ఆలోచనలకి మనసులో స్థానం ఇవ్వాలి.
అప్పుడు చెడు ఆలోచనలు ఆ ఆవులాగే వెళ్లిపోతాయి. స్వేచ్ఛ, సంతోషం మన ఎంపికే’ అని బోధించారు శంకరులు.🤘

సేకరణ

భక్తితో పూజలు చేయటం వల్ల కోరికలు ఫలిస్తాయా ?

💖💖💖
💖💖 "260" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼

"భక్తితో పూజలు చేయటం వల్ల కోరికలు ఫలిస్తాయా ?"


"ఎవరికైనా అనుకున్నవన్నీ జరగవు. ఒకవేళ జరిగినా అవి అనుకున్న సమయంలో జరగవు. కాబట్టి నెరవేరిన వాటినే అనుకుంటే సరిపోతుంది. నాకేం ఫర్వాలేదన్న నిశ్చింతను ఇచ్చేదే నిజమైన భక్తి. చింతను మిగిల్చేది భక్తి కాదు. అది స్వార్థం అవుతుంది. ఏ దేవతార్చనైనా మనని ఈ విశ్వచైతన్యంలో లయం చేసుకొని ఆ ఆనందాన్ని మనకి అందించేందుకే ! పారమార్థిక విషయాన్ని మరిచిపోయి, మన పూజ కేవలం లౌకిక కోర్కెలకే పరిమితమైతే అది ఫలవంతం కాదు. దీనివల్ల మనం పూజించే దైవాన్ని, గురువును కూడా ఏదోకరోజు మన కోరికలు నెరవేరటం లేదని నిందించే దుస్థితి మనకి కల్పిస్తుంది. అందుకే ఏ దైవాన్ని, గురువును ఆశ్రయించినా మనం నిశ్చింతగా ఉండే స్థితి రావాలి. మన అజ్ఞానంతో చింతించే దుస్థితి రాకూడదు !"

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
🌼💖🌼💖🌼
🌼🕉🌼


సేకరణ

శ్రీ రమణ మహర్షి ఉపదేశసారము

 🌼 *శ్రీ రమణ మహర్షి ఉపదేశసారము*:🌼



🌼1.      దైవశాసనము బట్టి కర్మఫలము లభిస్తుంది. కర్మదైవమా? కానేకాదు కర్మ జడపదార్థం.

🌼2.      కర్మఫలం అనిత్యమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు హేతువగుచున్నది. అందుచే పరమగతిని అది నిరోధిస్తుంది.

🌼3.      ఈశ్వరార్పణ బుద్దితో ఆచరించిన నిష్కామ కర్మలు మనస్సును పరిశుద్ధి కావించి ముక్తికి సాధక మవుతాయి.         

🌼4.      పూజ శరీరం చేత, జపం వాక్కు చేత, ధ్యానం మనస్సు చేత చేయబడుతున్నాయి. పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం ఉత్తమమైనది.

🌼5.      బ్రహ్మ భావనతో చేయు మానవ సేవయే అష్టమూర్తులు గల భగవానుని పూజ యగుచున్నది.

🌼6.      భగవత్ స్తుతి కంటే వాచక జపము, వాచకజపము కంటే మౌనజపము, మౌనజపము కంటే ధ్యానము ఉత్తమములు.

🌼7.      నదీ ప్రవాహంలా, నేతి ధారలా, నిరాఘాటంగా సాగే సరళధ్యానం ఆటంకంతో కూడిన విరళచింతనం కన్నా మిన్న.

🌼8.      పరమాత్మా వేరు, నేను వేరు అనే భేద జ్ఞానము కన్నా అతడే నేను అనే అభేద జ్ఞానమే పావనమైనది.         

🌼9.      ద్వైత భావమును దాటి ‘ఆ పరమాత్మే నేను’ నీలోను నాలోను అన్నిటా ఆ అంతర్యామి నిండి ఉన్నాడు అనే భావనా బలిమిచే కలిగే సద్భావస్థితిని ఉత్తమమైన భక్తి అంటారు.

🌼10.  మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ,భక్తీ,జ్ఞాన యోగ మార్గాల ఉపదేశసారం.

🌼11.  వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ప్రాణాయామము చేత మనస్సు కుదుటపడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము.

🌼12.  ఈస్వరశక్తి యనెడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమనునవి రెండు శాఖల వంటివి.

🌼13.  లయము, వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనసు తిరిగి జనించును. నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు.

🌼14.  ప్రాణసంధానముచే లయించిన మనస్సు ఆత్మ యనెడి ఒకేఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది.

🌼15.  మనసు నశించిన పరమయోగికి చేయదగిన కర్మ అంటూ ఏముంటుంది?

🌼16.  దృశ్యవస్తువుల నుండి చిత్తమును వెనుకకు మరల్చి చిత్స్వరూపమును ఎరుగుటయే తత్త్వ దర్శనము.

🌼17.  మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసేలేదని రూడి అవుతుంది. అదే సరైనదారి.

🌼18.  వృత్తులన్నీ అహం (అంటే నేను) వృత్తిపై ఆధారపడి యున్నవి. ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు.

🌼19.  నేను అనేది ఎక్కడనుంచి పుడుతోంది? అని అన్వేషిస్తే ఆ నేను పతనమౌతుంది. ఇదే ఆత్మవిచారము.

🌼20.  ఎప్పుడైతే ఈ నేను నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది, పరిపూర్ణమైనది, సత్ స్వరూపమైనది నగు ‘అహం అహం’ అను ఆత్మయే ప్రకాశించును.

🌼21.  అహం వ్రుత్తి లయించినపుడు సదా సత్పదార్థము భాసించుటచే అదే నేను అను పదమును లక్ష్యార్ధమైయున్నది. 

🌼22.  దేహము, ఇంద్రియములు ప్రాణము,బుద్ధి,అవిద్య నేను కాను. అవి జడములు. ఏకసద్రూపమే నేను.

🌼23.  సత్తు ను తెల్పుటకు చిత్తు వేరుగా యున్నదా? సత్తుయే చిత్తూ, చిట్టుయే నేను?

🌼24.  శరీరాది ఉపాదులవలన జీవేశ్వరులలో భేదము కనుపించు నప్పటికీ ఇద్దరు సత్స్వ రూపులు అవడంవల్ల ఒకే వస్తువై యున్నారు. 

🌼25.  ఉపాధులను తొలగించినచో జీవుడు ఈశతత్వమును దర్శిస్తాడు. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారము జరుగుతుంది.

🌼26.  ఆత్మ అద్వితీయము కనుక ఆత్మగా నుండుటయే ఆత్మను తెలుసుకొనుట యగును.

🌼27.  జ్ఞానము – అజ్ఞానము రెండింటిని దాటిన జ్ఞానమే నిజమైన జ్ఞానము.సమస్తమునకు అతీతమై, సర్వాత్మకమై వెలయు జ్ఞానమును తెలుసుకొనుటకు వేరువస్తువు ఏమున్నది.

🌼28.  తన నిజస్వరూపము ఎప్పుడైతే దర్శించబడిందో, అప్పుడు తనే ఆద్యంతములు లేని పూర్ణ చిదానందమని తెలుసుకొనును.

🌼29.  తన్ను తాను తెలుసుకొనెడి ఈ అత్మానుభావమును పొందిన దైవికుడు జ్ఞాని బంధము గాని ముక్తిగాని లేని పరమ సుఖస్థితిని పొందుతాడు.

🌼30.  నేను అనునదిలేని స్వస్వరూపానుభవమే ఉన్నతమైన తపస్సుయని రమణుని దివ్యవాణి పల్కుచున్నది.

దేహము ఘటము వాలే జడమైనది. దీనికి నే నను తలపు లేనందునను, దేహము లేని నిద్రయందు గూడ దినమును మనముండుట చేతను, దేహము నేను కాదు; నేను ఎవరిని? ఎక్కడనించి వచ్చాను? అని సూక్ష్మ బుద్ధి చేత వెదికిచూచి, తన యందు నిలకడ జెందినవారల హ్రుదయాంతరంగమందు పరిపూర్ణుడైన అరుణాచల శివుడు ‘అహం’ స్పురణరూపుడై స్వయంగా భాసిల్లుతున్నాడు.


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

🌹నేటి ఆత్మ విచారం. 🌹 మానవత్వం నుంచి దివ్యత్వానికి చేరుకోవడమే ఆధ్యాత్మికమన్నారు విజ్ఞులు.

🙏🏻🙌లక్ష్మీ శ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞానపీఠం....తిరుపతి...చరవాణి. 9390216263..9550804092.. శ్రీనివాసరావు.ప్రధాన నిర్వహకులు . 🙏🏻🙌🙊🙌🙉🙌🙈🙌🙏🏻
:
🌸💥🌸💥🌸💥🌸💥🌸

🌹నేటి ఆత్మ విచారం. 🌹

మానవత్వం నుంచి దివ్యత్వానికి చేరుకోవడమే ఆధ్యాత్మికమన్నారు విజ్ఞులు. అది మానవ హృదయాన్ని వికసింపజేస్తుంది.
సచ్చిదానందాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మికత అంటే పూజలు, జపాలు, తీర్థయాత్రలు అనే భావన కొంతమందిలో ఉంది. నిజానికి అవన్నీ ఆ జీవనానికి సోపానాలు మాత్రమే. మనసును నిగ్రహించుకొని, దృష్టిని అంతర్ముఖం చేయాలి. అప్పుడే మనిషి ఆత్మజ్ఞాన సంపన్నుడిగా మారతాడు. ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. భక్తులు నవ విధ మార్గాల ద్వారా భగవంతుణ్ని ఆరాధిస్తారు. ప్రసన్నం చేసుకుంటారు. జ్ఞానులు నిరంతరం దైవాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ముక్తిమార్గం కోసం అన్వేషిస్తుంటారు.

కోరికలతో నిండిన మనసే దుఃఖానికి కారణం. అజ్ఞానానికి అదే మూలం. దాని నుంచి బయటపడి మనిషి ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. అప్పుడే కోరికలు నశిస్తాయని రుగ్వేదం బోధిస్తోంది. ‘నశించే శరీరం కోసం నశించే భోగాల్ని ఆహ్వానిస్తున్నాడు మనిషి. అతడు ఆత్మకన్నా శరీరానికే ఎక్కువ ప్రాముఖ్యమివ్వడం అజ్ఞానం.

ఆత్మ అసాధారణమైనది. అది వెలకట్టలేని జ్ఞానరాసులతో నిండి ఉంటుంది’ అనేవారు శంకరాచార్యులు.

మనిషి అంటే శరీరం కాదు, ఆత్మ అని తెలియజేసేదే ఆధ్యాత్మిక విజ్ఞానం. ఆ మార్గంలో ప్రయాణించే మనసు మబ్బుల్లేని ఆకాశంలా నిర్మలంగా ఉంటుంది. మనిషిలోని దుర్గుణాలు, చెడు అలవాట్లు పూర్తిగా దూరమవుతాయి. క్షమ, సేవాగుణం, ధర్మం వంటి దైవీ గుణాలు సాధకుడిలో ప్రవేశిస్తాయి. అతడి మనసు ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగుతుంది. భగవంతుడి నివాసంగా రూపొందుతుంది. సాధారణంగా లౌకిక అవసరాలకు ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఆధారపడుతుంటాం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటప్పుడు, గురువును ఆశ్రయించడానికి సందేహిస్తుంటాం. అది తగదు. లక్ష్యసాధనకు సద్గురువును ఆశ్రయించాల్సిందే. అక్షర జ్ఞానానికే కాదు- ఆత్మ సాక్షాత్కారానికీ గురువుల ఉపదేశం తప్పనిసరి.

బ్రహ్మజ్ఞాన సాధనకు అజ్ఞానమే ప్రతిబంధకం. దాన్ని గురువే తొలగించగలడని వేదాలు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆయన హృదయపూర్వక సమర్పణను ఆకాంక్షిస్తాడు. శిష్యులను జ్ఞానమార్గం వైపు నడిపిస్తాడు. అందుకే గురువుల ఉపదేశాల్ని వినమ్రతతో స్వీకరించాలి.

తత్వచింతన నిండిన శ్రీరామకృష్ణ పరమహంస సంతకమైనా చేయలేరు. రమణ మహర్షి- తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయారు. అయినా వారు మహనీయులు. సమస్త జీవరాశుల్ని సమదృష్టితో చూసినవారు. అందరికీ ప్రేమను పంచిన ధన్యులు. నిష్కల్మషమైన జీవితం గడపడం వల్ల వారు లోకంలో ఎందరెందరికో ఆదర్శప్రాయులయ్యారు.
అటువంటి గురువుల మహోపదేశంతో సాధకుడికి సృష్టి మొత్తం ఓ అద్భుతంగా గోచరిస్తుంది. ‘ఇందుగలడందు లేడని...’ పోతన భాగవతంలో చెప్పినట్లు, వారికి అంతటా భగవంతుడి రూపం సాక్షాత్కరిస్తుంది. స్థితప్రజ్ఞులుగా మారతారు. అన్నింటిలో, అందరిలో భగవంతుణ్ని దర్శిస్తారు.

మనిషిని మనీషిగా, భోగిని యోగిపుంగవుడిగా, సామాన్యుడిని మహాత్ముడిగా మార్చి అలౌకిక ఆనందాన్ని అందించేది ఆధ్యాత్మికమే. దాని ప్రభావంతో గాఢమైన ప్రాపంచిక ఆకర్షణలన్నీ సాధకుడి అంతరంగం నుంచి తొలగిపోతాయి. అతడిలోని రాగద్వేషాలు, అహంకారాలు అంతరిస్తాయి. అందరూ ఆత్మీయులేనన్న భావన కలుగుతుంది. మనిషి మాధవుడిగా మారడమంటే ఇదే!💥☝

✡సర్వేజనాః సుఖినోభవంతు.👏

☸శుభమ్ భూయాత్ 💥

🌹జై యోగేశ్వర్ 🙏.
సే.శ్రీమతి.శ్రీ విజయలక్ష్మి.. శివకూమార్.. గోగాడ. రాజమండ్రి
🌺💥🌸💥🌺💥🌸💥🌺

నేటి జీవిత సత్యం. 🛕కోరికలు. వరాలు..!

నేటి జీవిత సత్యం. 🛕కోరికలు. వరాలు..!

పుత్రభిక్ష వరం. ఆ పుత్రుడు ప్రయోజకుడు కావాలని చేసే ప్రార్థన కోరిక. ప్రపంచంలో కోరికలు కోరే భక్తులే ఎక్కువ. వరాలు అంత సులభంగా లభించవు. ముందు అర్హత సంపాదించాలి. అది తపస్సు లాంటిదై ఉండాలి.

తపస్సుకు అనేక పరీక్షలుంటాయి. ప్రలోభాల వలలు ఉంటాయి. మనం ఏ రంగంలో ఎలాంటి కృషి చేసినా అది తపస్సుతో పోల్చదగినదై ఉండాలి.

విద్యార్థులు చదువును తపస్సుగా భావిస్తే.. ఆ కృషి తీవ్రత వేరు. అందుకు లభించే ఫలితాలు కూడా అమోఘంగా ఉంటాయి. అవి వరాలంత ఘనంగా ఉంటాయి. అవి అత్యున్నత స్థాయిలో, అత్యధిక జీతంతో వరించే ఉద్యోగాలు కావచ్చు.

సాధారణ స్థాయిలో ఆకతాయిగా ఆడుతూ పాడుతూ చదివే విద్యార్థి అత్తెసరు మార్కులతో సరిపెట్టుకోక తప్పదు. వారికి దక్కే ఉద్యోగమూ అంతే .

ఉద్యోగులు తమ పనిలో అంకితభావంతో, సంస్థ అభివృద్ధినే లక్ష్యంగా ఏకదీక్షగా కృషి చేసినప్పుడు, అది యజమాని గుర్తింపు, మెప్పును పొందుతుంది. ఉద్యోగి పదోన్నతికది పునాది అవుతుంది.

క్రీడాకారుడు తన దేహశక్తిని ద్విగుణీకృతం చేసుకుంటూ, మెలకువలు మెరుగు పరచుకుంటూ చేసే నిత్య అభ్యాసం సత్ఫలితాలు నిస్తుంది.

సాధకుడు ఆడంబరాల జోలికి పోకుండా ఆత్మానుభవం కోసం తపిస్తే, ఆత్మజ్ఞాని అవుతాడు. ఇలా అన్ని రంగాల్లో కృషి ఫలాలు కమనీయంగా ఉంటాయి.

రాయిలా పడి ఉండే సోమరికి ఎలాంటి ప్రగతీ లభించదు. రాయి కూడా తనకు తానుగా శిల్పంగా మారదు. ఉలిని నైపుణ్యంగా ఉపయోగించగల చేతులు కావాలి. ఆ చేతులు ఆ శిల మీద కదలాడాలి. అలాగే శరీరం మనసు, బుద్ధి అనే కరద్వయం కృషిలో నిమగ్నం కావాలి. అది తపోదీక్షలా ఉండాలి.

తపస్సు అనగానే కాషాయ వస్త్రాలతో, కారడవుల్లో ముక్కు మూసుకుని చేసేదిగా అనుకోనవసరం లేదు. తపస్సు మనసుకు సంబంధించింది. శరీరం కేవలం ఉపకరణం మాత్రమే. ఏ స్థితిలో ఉన్నా మనసు లక్ష్యం మీదనే లగ్నమై ఉండాలి.

మన లక్ష్యం ఉన్నతంగా, ఉదాత్తంగా ఉండాలి...!

మనం సరిగ్గా గమనించం కానీ, కృషికి పూనుకొన్నాక మనలో నిద్రాణంగా ఉన్న అమోఘ శక్తులు ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతాయి. శాస్త్రజ్ఞుల పరిశోధనలన్నీ దీర్ఘ తపస్సులే. ఫలితాలన్నీ అంతర్యామి వరాలే..!

ప్రాపంచిక పరిధుల్ని దాటి, మనసు జ్ఞానభూమిలోకి ప్రవేశించగానే అనేక అద్భుత సత్యాలు పలకరిస్తాయి. అవి ఎప్పటి నుంచో అక్కడే ఉన్నాయి. వాటిని శోధించడంలోనే ఆలస్యం జరిగింది. ఇంకా ఎన్నో అద్భుత సత్యాలు ఆకాశంలోని నక్షత్రాల్లా, సంజీవనీ మూలికల్లాగా కాంతులీనుతూ ఉంటాయి. అవన్నీ జ్ఞాన సంపదలు. ఎంతో తపనతో గానీ లభ్యం కావు. అసలు తపస్సు అంటేనే అనంతమైన తపన.

తపన పరమాత్మ కోసమే అయినప్పుడు ఆయన వరాలివ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మనం ఏమి కోరాలి...?ఆయన అనంతుడు. అన్నీ అనంత పరిమాణంలో ఉంటాయి. నచికేతుడు యమధర్మరాజును ‘ఆత్మజ్ఞానం’ వరంగా అడిగినప్పుడు, అనేక ప్రలోభాలతో మోహితుణ్ని చేయాలని ప్రయత్నిస్తాడు. చివరకు నచికేతుడే గెలుస్తాడు.

కుంతీదేవి… శ్రీకృష్ణ పరమాత్ముడి మాయనుంచి రక్షణను, అనన్య భక్తిని వరంగా కోరుతుంది. ఇలాంటి వరాలు కోరేవారు ఎంతో ధన్యులు. ఈ వరాలు ఎంత గొప్పవో అర్థం చేసుకుంటే, మనం కూడా అవే కోరతాం. ఎందుకంటే, అవి కోరినాక ఇక కోరదగిన వరాలు ఏమీ ఉండవు.

సేకరణ. మానస సరోవరం 👏

💦ఆనందమే ఆదర్శం

💦ఆనందమే ఆదర్శం

ఈలోకంలో ప్రతీది నాకు ఆదర్శమే...!

పడగొట్టిన వాడి పైన పగ పట్టకుండా దారం దారం పోగేసుకొని మరో గూడు కట్టుకొనే సాలెపురుగు నాకు ఆదర్శం...!

ఎన్ని సార్లు పడినా పౌరుషంతో మళ్ళీ లేచే అలలు నాకు ఆదర్శం...!

మొలకెత్తడం కోసం భూమిని సైతం చీల్చుకొనివచ్చే మొక్క నాకు ఆదర్శం..!

ఎదురుగా ఏఅడ్డంకులున్నా లక్ష్యం వైపే దూసుకెళ్లే బాణం నాకు ఆదర్శం...!

ప్రత్యర్ధి పెద్దదైనా సరే సూర్యుడిని సైతం కప్పి ఉంచే మేఘాలు నాకు ఆదర్శం...!

అసాధ్యం అని తెలిసినా ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే గాలిపటం నాకు ఆదర్శం...!

బురదలో పుట్టినా తానున్న పరిసరాల చుట్టూ పరిమళాలు నింపే కమల పువ్వు నాకు ఆదర్శం...!

ఎంతటి వేడిని అయినా తాను భరిస్తూ మనకు మటుకు చల్లని నీడనిచ్చే చెట్టు నాకు ఆదర్శం...!

తన మూలంగా లోకం చీకటి అవకూడదు అని రోజంతా వెలుగునిచ్చే సూర్యుడు నాకు ఆదర్శం...!
తను ఎంత చిన్నదైనా తన వంతు భూదాహాన్ని తీర్చే చినుకు నాకు ఆదర్శం...!

చుట్టూ చీకటే ఉన్నా చల్లని వెన్నెల పంచే చంద్రుడు నాకు ఆదర్శం...!

ఒక్క సారి అన్నం పెడితే జన్మంతా విశ్వాసంగా ఉండే శునకం నాకు ఆదర్శం..!

జీవించేది కొంత కాలమైనా అనుక్షణం ఆనందంగా ఉండే సీతాకోకచిలుక నాకు ఆదర్శం...!

ప్రతి దానిలో మంచిని మాత్రమే గ్రహించాలని చెప్తూ పాలనీటి మిశ్రమంలో పాలను మాత్రమే తాగే హంస నాకు ఆదర్శం...!!!

ధర్మం తప్పక నడుచుకుంటే మనం ఈ లోకానికి ఆదర్శం....!

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

సేకరణ. మానస సరోవరం 👏

💖ప్రేమించబడాలి అంటే ఏమి చేయాలి

నేటి మంచిమాట.

💖ప్రేమించబడాలి అంటే ఏమి చేయాలి
అడిగారు ఎవరో.. దానికేముంది సింపుల్ ! ప్రేమిస్తూ పోవటమే అన్నారు మరొకరు.

అదేగా చేసింది ..కానీ ఫలితంలేదే?
అదేమరి! అందరూ ఆగిపోయేది ఇక్కడే...ఆ ఉన్న కాస్తప్రేమా ఆవిరైపొయేది ఇందుకే.

# మరేం చేయాలయితే?

ప్రేమిస్తూ పో..రాయినో, రప్పనో; పిట్టనో, పెట్ నో; మానునో, మనిషినో; వీలైనంత ప్రేమించు. అంతే అందంగా దాన్ని వ్యక్తికరించు.

ప్రేమలోని అద్భుతం అంతా..వున్నది నిజానికి ప్రేమలోకాదు. దాన్ని అంతే
అద్భుతంగా కళాత్మకంగా వ్యక్తికరించటంలో .

అలా చెప్పటానికి నీదైన స్వేచ్ఛ నీకుంది.
ఎందుకంటే నీవు ప్రేమించేది నీకోసమే అచ్చంగా నీ కోసమే..నీ ఆనందం కోసమే..

తరచుగా ప్రేమ ఫెయిల్ అయ్యేది ఇందుకే..
ఎదుటివారి ఆనందం కోసం ప్రేమిస్తున్నానని నీవు అనుకుంటే; లేదా వారితో అదే అంటే;

నీ ప్రేమ ఎదుటివారికి కూడా ఆనందమా,
కాదా, అని నీవు వెతకడం మొదలు పెడితే;
నీలాగే వారూ నిన్ను ప్రేమిస్తున్నారా లేదా,
అని టెస్ట్ చేద్దామని పూనుకుంటే;
నీ ప్రేమ పెటాకులౌతుంది!

ఎందుకంటే నీ ప్రేమకి నీవు అధికారివి. కానీ నీవు ప్రేమించిన వారికి మాత్రం, నీవు అధికారివి కాదు. కనుక ప్రేమలో తప్పక గుర్తువుండాల్సింది ఇదే.

ప్రేమ దాదాపు ఓ మానసిక అవసరం.
కానీ శారీరక అవసరంతో కలిపిచూడటం
మొదలయ్యాకనే దానిలోని అద్భుతం
అంతర్ధానం అవుతోంది.

ప్రేమించడం or ప్రేమించబడటం ఏది గొప్ప ? ఏది మికిష్టం ? అంటే.. అందరూ
టక్కున చెప్పేది దాదాపు రెండవదే. నిజానికి ఎపుడైతే ప్రేమిస్తూ.. నీవూ ప్రేమించబడాలి అనుకున్నావో..తక్షణం కిందస్థాయికి జారిపోతుంది.

అది న్యాయమే కదా సహజం
కూడా కదా.. అనుకుంటాం. కానీ కాదు...మనిషికి తప్ప అలాంటి
ఆకాంక్ష సృష్టిలో మరిదేనికి వుండదు. సర్వ జీవులూ వాటివిధిని అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి.

నిర్జీవ పదార్థాలలోని ఆకర్షణ, జీవ
ప్రపంచంలో ప్రేమాకర్షణగా వుంది కావచ్చు. గ్రహాలన్ని సౌర ఆకర్షణలో ఉన్నాయి. కాలానుగుణంగా వెన్నెల, ఎండ, వానలు కురిసి వెళతాయి.
చెట్లు ఆహారాన్ని తయారు చేసి జీవులకి
అందించి అంతరిస్తాయి. కానీ లక్షలాది
జీవజాతుల్లో సంభవించే ఇవన్నీ ఆటోమాటిక్ గా జరిగిపోతుంటాయి.

ఆకర్షణో, ప్రేమో.. దానియొక్క
ప్రాథమికరూపం వాటిఅన్నింటిలోనూ ఉంది. ఐనా వాటిమధ్యా ఏది ఏక్కడా ఎపుడూ కండిషనల్ కాదు. కాలేదు. ఒక్క మనిషి దిక్కుమాలిన ప్రేమల్లో తప్ప!

ఏదైనా ఎక్కడైనా ప్రేమించటంలో సొగసు వుంది. కానీ ప్రేమించబడాలి అనుకోవటంలో తిరకాసు వుంది. ప్రేమించటంలో నీది ప్రేమని ఇచ్చే స్టేటస్.
కానీ ప్రేమించబడాలి అనుకోవటంలోనే ప్రేమని పుచ్చుకునే స్టేటస్!

అందుకే తల్లి ప్రేమలో, తాత్వికుని ప్రేమలో
వ్యక్తం అయ్యేది అన్ కండిషనల్, నాన్
రెసిప్రాకల్, వారు ప్రేమిస్తూ పోతారు తప్ప
తిరిగి వారూ ప్రేమించబడాలి అని అస్సలు ఎదురు చూడరు. అచ్చం ప్రకృతిలాగే !

బుద్దుడు అందర్నీ ప్రేమించాడు. ఐతే ఎవరి ప్రేమకోసమూ ఎదురుచూసి కాదు. ఐనా వేలాదిమంది ఆయన్ని ప్రేమించారు. ఇంకా ఇప్పటికి ప్రేమిస్తూనే ఉన్నారు.

చేతనైతే నీవు ప్రేమిస్తూపో or లేదా ప్రేమజోలికే పోకు. ప్రేమించటమే అసలైన
ప్రేమ. ప్రేమించబడాలి.. అని ఎదురుచూడటం కాదు.

ప్రేమ ప్రేమగానే ఎంతో అందమైనది.
అద్భుతమైనది. అదిచ్చే కిక్ ఆనందం.
అందుకోసమే, అక్షరాలా మనకోసమే మనం ప్రేమిస్తూన్నాం.. ఏదైనా ఎవరినైనా!

ఉషోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

Friday, June 24, 2022

అది సాధ్యం కాకపోవటంతో దుఃఖపడుతుంది. అవసరాలు, కోరికలు ఇవి రెండూ కర్మలకు కారణంగా భావించవచ్చా ?

"శ్రీరమణీయం"

"అవసరాలు, కోరికలు ఇవి రెండూ కర్మలకు కారణంగా భావించవచ్చా ?"

మనం ఉదయం లేచింది మొదలు దినచర్య అంతా అనేక కర్మలతో ముడిపడివుంది. అవి ఎవరికైనా తప్పేవికావు. ప్రతిపనికి విధిగా జ్ఞాపకం అవసరం. జ్ఞాపకాలు, పనుల కలయికే జీవనం. మనకి రెండు రకాల జ్ఞాపకాలున్నాయి. అవి దేహపరమైనవి, మానసిక పరమైనవి. దేహపరమైన జ్ఞాపకాలు అంటే జీవన అవసరాలు. మానసిక జ్ఞాపకాలు అంటే సుఖ, దుఃఖ భావనలు. ఈ మనో జ్ఞాపకాలే మనని అశాంతికి గురిచేసేవి. ప్రతిపని మనం సుఖసంతోషాలతోనే ముగియాలని కోరుకుంటున్నాం. ఇదే ఒక జ్ఞాపకంగా ఉంది. జ్ఞాపకంలో అనుభవించిన సుఖసంతోషాలతో పోల్చుకొని ప్రస్తుతం కలిగిన సంతోషాన్ని పొందలేక పోతున్నాం. అందువల్లే కలిగిన సంతోషాన్ని అనుభవించలేక పోతున్నాం. అంటే మనసు సుఖసంతోషాలతోపాటు అవే రకమైన గత అనుభవాలు కూడా కోరుకుంటుంది. అది సాధ్యం కాకపోవటంతో దుఃఖపడుతుంది. మామిడి చెట్టు నాటిన ఐదేండ్ల తర్వాత ఫలాలను ఇస్తుంది. ఇక్కడ చైతన్యశక్తి చేసుకున్న ఏర్పాటులోనే ఫలం ఉంది. ఫలం కోసం మరో కొత్త ఏర్పాటురాదు. ఇది గుర్తించలేకే అశాంతి. జీవనంలో 'ఇది అవసరం' అని ప్రత్యేకంగా చెప్పే అంశం ఏదీలేదు ! ఎందుకంటే అవసరం దోషం కాదు. 'అతి'యే దోషం !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}

సేకరణ

అవమానం

అవమానం

అవమానమనేది మోయలేని భారం.
మనసును దహించి వేస్తుంది.అన్నపానీయాలను ముట్టనీయదు.
నిత్యాగ్ని గుండంగా జ్వలిస్తుంది మనసు.
ఆ మహోష్ణతాపానికి తాను మాడిపోవడమో, ఎదుటివారు మసికావడమో జరుగుతుంటుంది. సహన గుణం పూర్తిగా క్షీణించి కోపతాపాలకు, ప్రతీకార వాంఛలకు గురవుతుంది మనసు. జీవితాలు అల్లకల్లోలం అవుతాయి. ఎవరైనా సన్మానాలను, పొగడ్తలను మరచిపోతారేమోగానీ- అవమానాలను మరచిపోలేరు ఇది మానవ సహజ గుణం.

వీటిని అధిగమిస్తేనే ప్రగతి! రారాజు మయసభలో పొందిన అవమానం కురుక్షేత్ర మహా సంగ్రామానికి దారితీసింది.

పసిబిడ్డ పోషణార్థం మిత్రుడైన ద్రుపదరాజును గోవులు అడిగాడు ద్రోణాచార్యుడు.
అవమానించాడు ద్రుపదుడు.
తలొంచుకున్నాడు ద్రోణుడు. పొందిన అవమానభారం ద్రోణుడి హృదయాన్ని కల్లోలపరచింది. అర్జునుని ధనుర్విద్యా విశారదుడిగా చేసి మహాస్త్రంగా ప్రయోగించాడు. పాండవ మధ్యముడు ద్రుపదుణ్ని ఓడించి, రథానికి కట్టివేసి గురువు పాదాల ముందుంచాడు. అప్పటికి కాని శాంతించలేదు ద్రోణుడి హృదయం!

అవమాన భారంతో రగిలిపోయిన చాణక్యుడు నందవంశాన్ని నిర్మూలించాడు.

పురాణాల్లో, చరిత్రల్లో కోకొల్లలుగా దర్శనమిస్తాయి ఇటువంటి ఉదాహరణలు.
అవమానానికి పగలు ప్రతీకారాలు జ్వలింపజేసుకుంటూపోతే సహన గుణానికున్న ఔన్నత్యం ఉనికిని కోల్పోతుంది.

మనలోని సహన గుణం ఎదుటివారిలోనూ పరివర్తన తెస్తుంది. కారణాలేవైనా అవమానాలను కూడా భరిస్తూ, సహిస్తూ సాగిపోవడమే ఉత్తమమైన విధానం!

ప్రకృతి అందచందాలకు నిలయం.కార్చిచ్చు దహిస్తుంది జలవిలయం తుడిచిపెడుతుంది. కానీ తిరిగి చిగురేయడం, పచ్చదనంతో కళకళలాడటం వృక్ష నైజం.

బంగారాన్ని అందించే పుడమితల్లి కంపనాలకు గురవుతూనే ఉంటుంది.

గౌరవ మర్యాదలకు ఆనందించే మనసు అవమానాల్ని తట్టుకోగలగాలి. తిరిగి స్వీయ వైభవాన్ని పొందాలి. అదే సమస్థితి.

కొండమీది చిన్న గుడిలో ధ్యానం చేసుకుంటూ శిష్యుడితోపాటు నివసిస్తున్నాడు ఓ సాధువు. కొండ దిగువున పల్లెవాసులందరికీ ఆయనంటే గురి.

నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా ఏదో ఒక ఆకో, ఫలమో ఇవ్వమనేవారు. వైద్యుడి దగ్గరకు వెళ్ళమని చెప్పినా వినేవారు కాదు…!
అగ్నిగుండం నుంచి ఓ చిటికెడు బూడిద ఇచ్చేవాడు. కాలగమనంలో వ్యాధులు తగ్గిపోయేవి. క్రమంగా జనంతాకిడి పెరిగింది.
ఆ సాధువును భగవత్ స్వరూపంగా భావించేవారు. ఆయన అనుగ్రహ భాషణం చాలు, సకలమూ చక్కబడుతుందన్న నమ్మకం పెరిగిపోయింది.

ఇలా ఉండగా ఓసారి తీవ్రమైన కరవు ఏర్పడింది పొలాలన్నీ బీళ్ళుగా మారాయి. చుక్క నీరు లేదు. పసిపిల్లలకు పాలు కూడా కరవయ్యాయి. పశువులు బక్కచిక్కాయి. పల్లెవాసులకు వలస మార్గమే దిక్కైంది ఈ కరవుకు కొండపై ఉన్న సాధువే కారణమన్న వదంతులు వ్యాపించాయి.

రోజులు గడిచేకొద్దీ ఈ భావం ప్రజల్లో బలంగా నాటుకొంది.
సాధువును అనరాని మాటలంటూ, ఛీత్కరిస్తూ, రాళ్ళతో కొడుతూ తరిమేశారు. సాధువు కాషాయంబరాలు పీలికలయ్యాయి. రాళ్ళదెబ్బలకు రక్తం కారసాగింది దుర్భర స్థితి!

దూరంగా మరో ప్రాంతానికి వెళ్ళి తిరిగి ధ్యానం చేసుకోసాగాడు. సాధువు వెంటే ఉన్న శిష్యుడు- 'స్వామీ ఏమిటీ దారుణం? ఇంత అవమానం పొంది కూడా అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారు?' అని అడిగాడు.

సాధువు నవ్వి- 'చూడు నాయనా! పల్లెవాసులు నన్ను మహాపురుషుడిలా గౌరవించినప్పుడు పొంగిపోనూ లేదు. ఛీత్కరిస్తూ తరిమేసినప్పుడు బాధపడనూ లేదు. రెండింటినీ ఒకే చిత్తంతో స్వీకరించాను. కాలమే వారికి జ్ఞానోదయం గావిస్తుంది. ఏదో జరిగిందని వ్యాకుల చిత్తంతో నేను బాధపడాల్సిన అవసరమే లేదు... అంటూ ధ్యానముద్ర వహించాడు- నిశ్చలచిత్తంతో.!

ఒక లక్ష్యసాధనకై శ్రమిస్తున్నప్పుడు ఫలితాలు అనుకూలంగా లేవని, దానినొక అవమానంగా భావిస్తూ కుంగిపోవడం అవివేకమే.!

నేడు మనం చూస్తున్న వివిధ రంగాల్లోని చాలామంది ప్రముఖులు ప్రతికూల పవనాలను అధిగమించి విజయకేతనాలు ఎగరేసినవారే. ఉన్నత స్థితికి చేరినవారే.

స్థిరచిత్తంతో అవమానాలను సైతం ఎదుర్కొంటూ లక్ష్యసాధనలో సాగిపోయేవారే ఉన్నతులు. వారే జీవితంలో విజేతలు.

సేకరణ

ధ్యానం వలన ఏకాగ్రత కుదురుతుంది ! ఏకాగ్రతతో శాంతి వస్తుందా ?

💖💖 "259" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖


"ధ్యానం వలన ఏకాగ్రత కుదురుతుంది ! ఏకాగ్రతతో శాంతి వస్తుందా ?"


"కేవలం ఏకాగ్రత కోసమే అయితే దేన్నైనా ధ్యానించవచ్చు కదా ! మనం అనేక ఆలోచనల్లో ఉన్నందువల్ల అశాంతి వస్తుంది. కాబట్టి ఒకే ఆలోచనలో మనసును నిలిపి శాంతిని పొందాలని ఆరాటపడుతున్నాం. మన బాహ్య జీవనమంతా అనేక ఆలోచనలతోనే ఉంటుంది. అందువల్ల దుఃఖం తప్పటంలేదు. అంతర్ ప్రయాణంలో ఆలోచనలు తగ్గుతాయి. కాబట్టే దాన్ని ఇష్టపడుతున్నాం. అయితే ధ్యానానికి కొలతలు నిర్ణయిస్తే అది లౌకిక విషయంతో సమానమై అశాంతినే ఫలంగా ఇస్తుంది ! మనం జపించే నామం పవిత్రమైనదై ఉండాలి. అప్పుడు ఆ స్మరణవల్ల మన మనసు పవిత్రతను పొందుతుంది. ధ్యానించే రూపం సద్గుణాలను గుర్తుకు తెచ్చేదిగా ఉండాలి. అది ఉత్తమ సందేశాన్ని మనసుకు స్ఫురింపజేసేదై ఉండాలి. మన పూర్వికులు అందించిన దేవతామూర్తులంతా అలాంటి వారే "!

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}


సేకరణ

Thursday, June 23, 2022

✍🏿శ్రీ' నరసింహారావుగారు-వారి కొన్నిహాస్యోక్తులు.

 🔻కాంతం కబుర్లు .🔻

✍🏿శ్రీ' నరసింహారావుగారు-వారి కొన్నిహాస్యోక్తులు.

🚩నవరసాలలో హాస్యానికి ఒక ప్రత్యేకం మరియు విభిన్న స్థానం వుంది ఎందుకంటే, ఒక పాలు తక్కువ అయితే పండదు, ఒక పాలు ఎక్కువైతే అపహాస్యం పాలవుతుంది.

బందరు వెళ్ళినప్పుడు గుర్తు కొచ్చేది, మొదట మునిమాణిక్యం వారే! సంసార జీవితం ఎంత రసమయంగా వుంటుందో, ఉంచుకోవాలో తెలియాలంటే వారు వ్రాసిన అన్ని గ్రంధాలు చదవవలసినదే!

నరసింహారావు గారు బందరులో ఉపాధ్యాయుడిగా వుండేవారు.

🚩ఆ రోజుల్లో బందరు ఒక సాహితీ కేంద్రం. పూర్వం ఉబ్బసానికి గాడిద పాలు నాటు మందుగా వాడే వారు. నరసింహారావు గారి అబ్బాయికి ఉబ్బస వ్యాధి వుండేది. ఒక రోజు, ఆయన స్కూల్ కి వెళ్ళుతూ, భార్యతో 'ఏమోయ్! స్కూల్ నుంచి ప్యూనును పంపుతాను, వాడు గాడిద పాలు తెస్తాడు, ఒక చెంచా పిల్లవాడికి ఇవ్వు' అని అన్నారు.సాయంత్రము, స్కూల్ నుంచి రాగానే, ఏమోయ్ పిల్లవాడికి గాడిద పాలు ఇచ్చావా? అని అడిగారు.

అప్పుడామె,'ఆ సంగతే మరచి పోయానండి, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే గుర్తుకు వచ్చింది' అని వంటింట్లోకి వెళ్లి పోయింది.

ఇందులో ఇమిడిన హాస్యోక్తికి, భార్య సరస సంభాషణకు ఆయన ఎంతగా మురిసిపోయారో!!

🚩ఇది మనసులో వుంచుకొని, నరసింహారావు గారు, భార్యకు మంచి సరసమైన బాణం విసరటం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన, కొంతకాలం కర్నూల్ లో కూడా ఉద్యోగము చేశారు. కర్నూల్ వచ్చిన కొత్తలలో, ఒక రోజు భార్యను పిలిచి, 'ఏమోయ్! కర్నూల్ ఎలా వుంది?' అని అడిగారు. అందుకు ఆమె.'ఏమి కర్నూల్ అండి బాబు! ఎక్కడ చూసినా గాడిదలే! హాస్పిటల్ కు వెళ్ళితే అక్కడ గాడిదలు, మార్కెట్ కు వెళ్ళితే అక్కడ గాడిదలు, ఇలా ఎక్కడ బట్టినా గాడిదలే!' అని ఆవిడ సమాధానం చెప్పింది. వెంటనే శ్రీ వారు ఏమన్నారంటే'అన్నట్లు! గాడిదలంటే గుర్తుకొచ్చింది! ఈ రోజు మీ అన్నయ్య వాళ్ళు ఫోన్ చేశారు' అని మంచి బాణం విసిరారు. ఆ సంభాషణకు భార్యాభర్తలిదారు మనసార నవ్వుకున్నారు. సంసార జీవితం ఎంత రసమయమో ఆయన రచనల ద్వారా తెలుసుకోవచ్చు.

🚩వారు చుట్టలు ఎక్కువగా త్రాగే వారు. ఒక సారి విందు భోజనములో, భోజనాలు అయిన తర్వాత విందు ఇచ్చిన వారు ఒక పళ్ళెములో చుట్టలు, సిగరెట్లు తీసుకొని అతిధులందరి వద్దకి వచ్చారు. శ్రీ వారు చుట్టలు, సిగరెట్లు రెండూ తీసుకొన్నారు. తెచ్చిన ఆయన విస్తుపోయి,' పంతులు గారు మీరు సిగరెట్లు త్రాగటం ఎప్పడినుంచి మొదలెట్టారు?' అని అడిగారు. అందుకు ఆయన వెంటనే, తడుముకోకుండా ఏమన్నారంటే 'నేను ఉభయ భాషా ప్రవీణుడను' అని. చుట్టలు త్రాగటం వదిలి వెయ్యండి, అది మంచి అలవాటు కాదు అని చాలా మంది ఆయనకు చెప్పేవారు.

అందుకు ఆయన, మా కుల గురువు గురజాడ వారు 'పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్' అని ఎప్పుడో చెప్పారు. నాకు దున్నపోతు కావటము ఇష్టము లేదు, అని చెప్పటమే కాకుండా, మనం పూజించే దేవతలంతా కూడా చుట్టలు త్రాగేవారు. ఇదిగో చూడండి, వచన భాగవతం, అందులో ఏముందో చదివితే మీరే హ ..హ .. హ.. అంటారు. అందులో యేముందంటే. 'ఆది శేషుడు చుట్ట చుట్టుకొని పడుకొండెను' అని. అంటే దాని అర్ధం, రేపటి కోసం ఈ రోజే చుట్ట చుట్టుకొని పడుకొనే ఆదిశేషుడు నాకు ఆరాధ్యుడు'.

కురుసభలో శ్రీ కృష్ణుడు' నాకు చుట్టలైన, పరులైనా ఒక్కటే' అనటం మనం వినలేదా !! అంటే శ్రీ కృష్ణుల వారికి చుట్టలైన, సిగరెట్లు అయినా ఒకటే అని అర్ధమని, పండితులైన మీకు నేను వేరే మనవి చేయనవసరం లేదనుకొంటాను' అని చమత్కారంగా చెప్పారు. ఆయనకు నాటకాలు చూడటమంటే భలే పిచ్చి.

🚩ఆ రోజుల్లో, బందరులో డి.వి.సుబ్బారావు గారని ప్రఖ్యాత నటులుండేవారు. ఆయన ప్రతాపరుద్రీయం, హరిశ్చంద్ర మున్నగు నాటకాలు ఎక్కువగా ఆడేవారు. పంతులు గారు ఆయన నాటకాలు ఎప్పుడూ మిస్ కాలేదు. నాటకాలు చూసి చూసి, ఆయనకు ఏదో ఒక నాటకంలో ఏదో ఒక పాత్ర వెయ్యాలని కోరిక కలిగింది. జిలపుట్టినప్పుడు గోక్కోవాలి కదా! అదే విషయాన్ని సుబ్బారావు గారికి తెలియ చేశారు. అన్ని వేషాలకు అందరూ బుక్ అయిపోయారు. ఏమి చేద్దామబ్బా! అని ఆలోచిస్తున్నారు. కళా కండూతితో బాధ పడుతున్న పంతులు గారే ఒక సలహా ఇచ్చారు. నాకు రంగస్థలం మీద మొదట కన పడితే చాలు అది ఏ వేషమైనా చాలు అది నౌకరైనా లేక పిచ్చివాడైనా పర్వాలేదు. కథతో సంబంధం లేకపోయినా పర్వాలేదు అని సలహా ఇచ్చారు. సుబ్బారావుగారు కాసేపు దీర్ఘంగా ఆలోచించి సరే ఒక పని చేద్దాం,

ఒక ఆడ పాత్ర వుంది, కథతో ఏ మాత్రం సంబంధం లేని పాత్ర అది. మీరు మీసాలు తీయించుకొని మంచి పట్టు చీర కట్టుకొని makeup పూర్తి అయిన తర్వాత stage ప్రక్కనే పడ కుర్చీలో పడుకోండి మీ పాత్ర వచ్చే టైంకు మిమ్మల్ని contractor నిద్ర లేపుతాడు అని చెప్పారు. పంతులు గారు తన కళాకండూతి తీరుతున్నందుకు బాగా సంబరపడి పోయారు. నాటకం వేసే రోజు వచ్చింది. శుభ్రంగా మీసాలు తీయుంచుకొని పట్టుచీర కట్టుకొని makeup చేసుకొని ఆప్రక్కనే ఉన్న పడకుర్చీలో నిద్ర పోతున్నారు. కాంట్రాక్టర్ నిద్ర లేపుతాడుగా! సుష్టుగా భోజనం చేశారేమో బాగా నిద్ర పట్టింది. కథతో సంబంధం లేని పాత్ర కదా! కాంట్రాక్టర్ నిద్ర లేపడం మరచిపోయాడు. మధ్యలో లఘుశంకకు పోయే నిమిత్తం వీరికి మెళుకువ వచ్చింది. మంచి నిద్ర పోవటం చేత చీర నలిగి, విగ్ చిందర వందరగా అయి, పిచ్చిదాని లాగా వున్నారు. వళ్ళుమండే అంత కోపం వచ్చింది. కథతో సంబంధం లేదు కదా అని ఒక మంచి రసవత్తర ఘట్టం జరుగుతుండగా శ్రీవారు స్టేజి పైకి వెళ్లి యేవో రెండు dialogues చెప్పారు. శ్రీ సుబ్బారావు గారు వెంటనే ఎవరక్కడ! ఈ పిచ్చిదాన్ని అవతలికి తీసుకొని పోండి అని చెప్పగానే ఇద్దరు భటులు వచ్చి పంతులుగారిని పెడరెక్కలు పట్టుకొని ఈడ్చుకెళ్ళారు. నాటకం ఏ మాత్రం రసాభాస కాలేదు పంతులుగారి కళాకండూతి కూడా తీరింది! పంతులుగారు తన వేషం కన్నా, శ్రీ సుబ్బారావుగారి సమయస్పూర్తికి యెంతో సంబరపడిపోయారు. ఈ సందర్భంలో మహానటులు సుబ్బారావు గారిని కూడా స్మరించుకోవటం మన అదృష్టం.

ఇలా ఆయనను గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు వినే వాడుంటే!


      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

అసలు సామెత : " *ఇల్లు ఇరు కవాటం - ఆలి మరు కవాటం*. "

స్నేహితుడి నుండి స్వీకరించబడింది
----------------------------
మనకి తెలిసిన, మనం చెప్పుకొనే సామెత :-
ఇల్లు ఇరకాటం - ఆలి మర్కటం.
అంటే ఇల్లు ఇరుకుగా ఉండాలి. భార్య కోతిలా ఉండాలి.
ఇల్లు ఇరుకుగా ఉంటే ఎవరూ మన ఇంటికీవచ్చి, ఎక్కువ రోజులు తిష్ట వెయ్యరు. భార్య కోతిలా ఉంటే ఆమెని ఎవరూ పట్టించుకోరు.
అని ఎవరో చేతకాని వాళ్ళు అసలు సామెతకి చేతబడి చేసేసారు.
కానీ అసలు ఈ సామెత వెనకాల మన సంస్కృతీ సంప్రదాయలు నిబిడీకృతమై ఉన్నాయని ఎంత మందికి తెలుసు????

అసలు సామెత :
"
ఇల్లు ఇరు కవాటం - ఆలి మరు కవాటం*. "
అనగా " ఇంటికి ముందు, వెనుక రెండు(ద్వారాలు)తలుపులుండాలి.- భార్య తలుపు చాటుగా ఉండాలి. " అని దాని అర్థం.
ఇరు = రెండు.
మరు = చాటు, వెనుక.
కవాటం = తలుపు.
'వాస్తు రీత్యా కానీ, భద్రతా రీత్యా కానీ ప్రతీ ఇంటికీ ముందు వైపు, వెనుక వైపు కూడా ద్వారం ఉండాలి.'
ఇంటికి అతిథి కానీ, వేెరెవరైనా కానీ వచ్చినపుడు 'ఇల్లాలు ఎపుడూ కూడా తలుపు వెనుక నుండే సంభాషించాలి.'
ఇంత అర్థ వంతమైన సామెత. దీనిని మనం ఎంత వికృతమైన అర్థం లో వాడుతున్నామో కదా! హతోస్మి.🤭🙂



సేకరణ

నేటి చిట్టి కథ, సిరిసంపదలు & ఆరోగ్యం

✍️........... 🌻 నేటి చిట్టి కథ 🌻

🥀కృష్ణాపురం లో భాగ్యరాజు,సోమరాజు మిత్రులు ఉండేవారు.ఇద్దరూ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు.

🥀తిరుగు ప్రయాణంలో వారు ఒక అడవి మార్గాన వస్తూంటే వారికి ఒక గుట్ట మీద దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఒక యోగి కనిపిస్తాడు.

🥀ఇద్దరూ వెళ్లిఆ యోగికి సాష్టాంగ దండ ప్రణామం చేశారు. ఆ యోగి ఏ కళనున్నాడో ఆ ఇద్దరకు మేలు చేయదలిచాడు."భక్తులారా! ఈ గుట్టకు ఉత్తర దిక్కుగాఉన్న సరస్సులో స్నానం చేస్తే మీకు మీ కుటుంబానికి సిరిసంపదలు కలుగుతాయి. తూర్పుదిక్కుగా ఉన్న సరస్సులో స్నానం చేస్తే ఆరోగ్యం సమకూరుతుంది.

🥀స్నానం చేసే ముందు రెండు నియమాలు పాటిస్తామని మనసులో ప్రమాణంచేసుకోవాలి.

🥀ఒకటో నియమం ఒక సరస్సులోమాత్రమే స్నానం చేయాలి. దురాశతో రెండు సరస్సుల్లో స్నానం చేస్తే ఏ ఫలితమూ దక్కదు.

🥀రెండో నియమం - ఇక్కడ నేనున్నానన్న విషయంఎవరితో చెప్పకూడదు. ఒకవేళ చెప్పేరా ఈ వర ఫలితం దక్కదు అని చెప్పి తపస్సులో మునిగిపోతాడు యోగి.

🥀అనుకోకుండా వచ్చిన అదృష్టానికి ఇద్దరు మిత్రులు ఆనందించారు. అంతా భగవంతుని లీల అనుకుంటూ గుట్ట దిగారు. భాగ్యరాజు " ఐశ్వర్యం కలిగితే అన్నీ సమకూర్చుకోవచ్చు. ఉత్తర దిక్కు నున్న సరస్సు లో మునుగుదాం రా"అని సోమరాజు తో అన్నాడు.

🥀సోమరాజు అప్పుడు " ఆరోగ్యమే మహాభాగ్యం.దానిని మించిన భాగ్యం లేదని నా విశ్వాసం. తూర్పు దిక్కుకే పోదాం రా" అంటాడు ఇద్దరూ ఒక మాటకు రాలేకపోయారు.

🥀భాగ్యరాజు ఉత్తర సరస్సులోను సోమరాజు తూర్పు సరస్సులోను స్నానం చేసి ఇంటికి బయలుదేరారు.

🥀నగరం చేరాక భాగ్యరాజు ఏ పని చేసినాఅదృష్టం వరించేది.వ్యాపారంలో లాభాలు వచ్చిపడుతున్నాయి.
అంతా యోగి మహిమని యోగికి మనస్సులో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

🥀ఇక సోమరాజు విషయానికి వస్తే ఎప్పుడూ మంచం పట్టి మూలుగుతూ వుండే అతడి భార్య ఆరోగ్యంతో కళ కళ లాడి కనిపించింది. పిల్లలు పుష్టిగ తయారయ్యారు. సోమరాజుకు అపుడపుడువచ్చే అనారోగ్యం మాయమయింది.

🥀వైద్యులువద్దకు వెళ్ళే అవసరం రాలేదు. సోమరాజు యోగిని కృతజ్ఞతతో తలచుకున్నాడు.కొంత కాలంగడిచింది. ఒకరోజు అంగడిలో ఇద్దరు మిత్రులు కలుసుకున్నారు. భాగ్యరాజు దిగులుగా కనిపించాడు.

🥀ఏమలా ఉన్నావని అడిగాడు సోమరాజు. అప్పుడు భాగ్యరాజు యోగి ఇచ్చిన వరం ఎంచుకోవడంలో నేను పొరబడ్డాను.ఆరోగ్యంలేనప్పుడు ధనమెంత ఉన్నా ప్రయోజనం లేదు.రెండు ముద్దలు తిని అరిగించు కోలేకపోతున్నాను.జిహ్వచాపల్యాన్ని బలవంతంగా అణచుకుంటున్నాను.ఇంట్లో ఎవరికో ఒకరికిఅనారోగ్యం ఉంటూనే ఉంది. సంపాదనంతావైద్యానికే సరిపోతుంది. సుఖశాంతులు లేవు.ఈ పరిస్థితుల్లో ఉత్సాహం ఎలా వుంటుంది మిత్రమా? " అని బాధపడ్డాడు.

🥀సోమరాజును పట్టుకుని ఏడ్చాడు. సోమరాజు అప్పుడు "సంతోషమే సగం బలం. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. దిగులు పడితే ప్రయోజనం లేదు."అని మిత్రుడిని ఓదార్చాడు.

వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖం ।
ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం ॥

🥀వ్యాయామము వలన ఆరోగ్యము చేకూరును. దీర్ఘాయుష్షు, బలము, సుఖము కలుగును. ఆరోగ్యమే మహా భాగ్యం. స్వాస్థ్యము సర్వార్థాలకి సాధనము.


☘️☘️🌼🌼🌼🥀🌼🌼🌼☘️☘️

సేకరణ

ఒక్కోచోట ఒక్కో దేవుడు మహిమాన్వితుడుగా ప్రచారం జరుగుతోంది, అలా దేవుళ్ళను మారుస్తూ ఆరాధించటం మంచిదేనా ?

"శ్రీ"
"258" "శ్రీరమణీయం"

"ఒక్కోచోట ఒక్కో దేవుడు మహిమాన్వితుడుగా ప్రచారం జరుగుతోంది, అలా దేవుళ్ళను మారుస్తూ ఆరాధించటం మంచిదేనా ?"


పూజించే దేవుడ్ని మార్చటంలో దైవం అంటే ఏమిటో తెలియని అజ్ఞానం దాగివుంది. అందులో మన స్వార్థం వ్యక్తమవుతుంది. దైవాన్ని కూడా మనలాంటి సంకుచిత భావాలతోనే ఊహిస్తున్నాం. అలా ఆలోచించినా ఏదోక రోజు తనని ఇలాగే వదిలివేస్తారని మనం పట్టుకున్న కొత్త దేవుడికి మాత్రం తెలియదా ! ధర్మాన్ని ఆచరిస్తే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం దైవంగా మనతో ఉండి మన కోర్కెలు తీరుస్తుంది. ఈ సత్యాన్ని గుర్తించలేకనే దేవుని విషయంలో కూడా అనేక రూపాలు, తలపులు మారుస్తున్నాం ! నిజానికి ధ్యానం అంటే బయటి నుండి దేన్నీ ఆశించకపోవటం. ఈ సృష్టికి ఆధారభూతంగా ఉన్న దైవం మనలోనూ 'ఆత్మగా' ఉన్నాడన్న సత్యం అనుభవంలోకి రావటం ధ్యానం. అంతేగాని కోరికలు తీరటంలేదని, పూజించే దేవతా మూర్తులను మారుస్తూ, కళ్ళు మూసుకోవటం భక్తి అనిపించుకోదు !!

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
🌼💖🌼💖🌼
🌼🕉🌼


సేకరణ

Wednesday, June 22, 2022

నిత్యశాంతి

నిత్యశాంతి

‘నేనెక్కడ ఉన్నాను అని కాకుండా ‘నాలో ఏముంది అనే విషయాన్ని వివేకంతో ఆలోచించగల వారే సాధకులు. ‘నాకుముంది అని కాకుండా ‘నేనెలా ఉన్నాను అని తమను తాము చూసుకోగల సాధకులే ఏనాడైనా ప్రగతిని సాధిస్తారు. మనకు ఆనందం కావాలి కాని, దుఃఖం కోసం శ్రమిస్తున్నాం. మనకు మోక్షం కావాలి కాని, బంధం వైపు నడుస్తున్నాం. ఆనందాన్ని, మోక్షాన్ని, పొందే శక్తి మనకు ఉంది. ఇది దైవశక్తి. దుఃఖాన్ని, బంధాన్ని పెంచుకునే శక్తి కూడా మనకు ఉంది. ఇది అసురశక్తి. ఈ రెండూ మనలోనే ఉన్నాయి. వీటి మధ్యే ఘర్షణ. నిప్పు అగ్నిని బాధించదు, నీళ్లను బాధిస్తుంది. కారణం, నిప్పు స్వభావం నీళ్ల స్వభావానికి విరుద్ధమైనది. నిప్పు మీద నీళ్లు కళపెళలాడుతాయి. పొయ్యి మీద నుండి దించిన కొంతసేపటికి నీళ్లు యధాస్థితికి చేరుకుంటాయి. చల్లదనం నీటి సహజ స్వభావం. కాని దుఃఖము, అశాంతి-వాటిని కల్పించే రాగద్వేషాలు మనిషి స్వభావం కాదు. అందుకే నిరంతరం దుఃఖం నుండి విడిపడి శాంతిని పొందాలి అని మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆకలిదప్పులు దేహానికే కాదు, మనసుకూ ఉన్నాయి.

ఆశలు, ఆవేశాలు, ఆవేదనలు, ఆందోళనలు, మానసికమైన ఆకలిదప్పులు. ఆకలిదప్పులను భరించలేనట్లే కొందరు ఆవేశాలను, ఆవేదనలను కూడా భరించలేరు. యోగః చిత్తవృత్తి నిరోధః యోగం ద్వారా చిత్తవృత్తులను నిరోధించి శాంతిని పొందవచ్చునని కొందరి అభిప్రాయం. మాట వినని పిల్లవాడిని కొడితే ఏమి ఉపయోగం? తాత్కాలికంగా అల్లరి ఆపి ఆ తరువాత మళ్లీ మొదలుపెడతాడు. అలాగే మనసులోని కోరికల్ని అణగద్రొక్కితే ఏం ప్రయోజనం? అవి బీజరూపంలో అడుగున ఉండి, అను కూల వాతావరణంలో అంకురిస్తాయి. కోరికల్ని లేకుండా చేయడం యోగానికి సాధ్యపడదు. నీళ్లను అగ్నిమీద పెడితే కాగి, ఆవిరై, పాత్ర ఖాళీ అవ్ఞతుంది. జ్ఞానాగ్నిలో మనసు తప్తమైతే కోరికలు నిర్వీర్యమై అదృశ్యమవ్ఞతాయి. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీం కర్మయోగి కర్మఫలాలను త్యజించి పరమశాంతిని పొందుతున్నాడు. యుక్తః అంటే యోగయుక్తుడు. రాగద్వేషాల వల్ల అశాంతి ఆవరించింది కనుక రాగద్వేషాల నుండి విడిపడగానే హృదయంలో శాంతి నిండుతూ ఉంది. రాగద్వేషాల నుండి విడిపడిన కర్మయోగికి కర్మలతో సంబంధం లేదు.

కర్మఫలాలతో సంగత్వం లేదు. రాగద్వేషాలు ఉన్నపుడే కర్మలలో మంచి, చెడు అనే భేదం కనిపిస్తూ ఉంది. రాగద్వేషాలు ఉన్నపుడే అనుకూలం ఫలం, ప్రతికూల ఫలం అనే భావన కలుగుతూ ఉంది. రాగద్వేషాలు తటస్థపడిన కర్మయోగికి ఏ ఫలమైన నిష్ఫలమే. ఎందుకని? అతనికి కావలసింది మోక్షఫలం. మోక్షం కర్మఫలం కాదు. రాగద్వేషాల నుండి విడిపడి కర్మఫలాల యందు సంగత్వం లేనపుడే సంఘర్షణ దూరమై మనసులో శాంతి కలుగుతూ ఉంది. ధ్యానాత్కర్మ ఫలత్యాగః త్యాగాచ్ఛాంతి రనంతరమ్‌ ధ్యానము కంటే కర్మ ఫలత్యాగం ఉన్నతం. కర్మ ఫలత్యాగం వల్ల శాంతి కలుగుతూ ఉంది. ధ్యానం మనిషి ఎంత కాలమని చేయగలడు? ధ్యానం ఆగగానే మళ్లీ అశాంతి మొదలవ్ఞతుంది. కర్మఫలత్యాగం వల్ల కలిగే శాంతి దేశకాలపరిస్థితులపై ఆధారపడి ఉన్నది కాదు. అది సహజమైన స్వతస్సిద్ధమైన శాంతి. నీటికి చల్లదనం లాగ శాంతి మనిషి సహజస్థితి.

సేకరణ

సద్గతి అనగా నేమి?

సద్గతి అనగా నేమి?

🪷🪷🪷🪷🪷

సర్వం ఖల్విదం బ్రహ్మ సర్వమూ బ్రహ్మయే అయినప్పుడు అందరూ ఆత్మస్వరూపులే అయితే
ప్రత్యేకించి ఆలయాలకు వెళ్లడం ఎందుకు ?
ఉపవాసాలు ఎందుకు ? నియమనిష్టలెందుకు ?
ధ్యానమెందుకు ?
శాస్త్రపఠనమెందుకు ?
సత్సంగాలేందుకు ?

పై ప్రశ్నలన్నీ ఓ తెలిసిన అమ్మాయి అడిగింది . ఆ క్షణంలో తనలో ఏళ్ల క్రితం
నన్ను నేను చూసుకున్నట్లుంది.
ఈనాడు ఈ అమ్మాయి ధైర్యంగా అడిగినట్లుగా ఆనాడు నేను ఎవరిని అడగలేదు అయితేనేం భగవంతుని అనుగ్రహం వలన సద్గురువుమీద గురితో , కాలక్రమేణా పుస్తక పఠనం ద్వారా సందేహాలు తీర్చుకున్నాను.

మనది పరోక్ష జ్ఞానం అంటే ఋషులూ మహర్షులూ గురువులూ చెప్పింది పఠన శ్రవణముల ద్వారా తెలుసుకున్నది. దానినే ప్రత్యక్ష జ్ఞానం ద్వారా తెలుసుకొని ముక్తిత్వం పొందడానికే పై సాధనాలన్నీ.
దీపం గురించి తెలిసినంత మాత్రాన చీకటి పోతుందా ? అన్నం గురించి మాట్లాడితే ఆకలి , నీటి గురించి మాట్లాడితే దాహం తీరుతుందా ? అలాగే వినడం వలన తెలుసుకోవడం వలన ప్రయోజనంలేదు.
భావనమాయాప్రజ్ఞ ( స్వానుభవములో తెలుసుకోవడం ) అన్నిటికన్నా చాలాముఖ్యం

మనసుని జయించడం మనసుకు అతీతులవడం చెడుగుణాలు తొలగడం మనలోపల ప్రక్షాళన జరగడం సంపూర్ణాంగా జీవించడం ఆనందంగా శాంతియుతంగా జీవించడం
పరమ గమ్యాన్ని చేరడం మానవజన్మకు సార్థకత చేకూరడం.
ఇత్యాదులన్నీ పై సాధనాల వల్లనే సాధ్యమవుతుంది.

వ్యవసాయకుడు తన పొలమునందున్న కలుపు మొక్కలని తొలగించి దుక్కి దున్ని పైరు బీజాలను ఎట్లుజల్లునో , అలాగే సాధకుడు తన హృదయాంతరాళమున ఉన్న దుఃఖమయ రాక్షసగుణాలన్నిటిని
సంపూర్తిగా తొలగించి అందులో భక్తి అనే బీజాలను జల్లి పెంచి పోషించినచో దైవత్వమనే పంట పండి తీరును.
ఎండాకాలంలో కలుపు ఏమియు కనపడకపోయినను బీజరూపమున దాగియుండి వర్షం కురవగానే ఎట్లు మొలకెత్తునో

అలాగే అజ్ఞానంవలన అనేక జన్మవాసనలు మనయందు దాగియుండి సమయం వచ్చినప్పుడు అంకురించి మొలకెత్తుచుండును వాటిని సాధన ద్వారా సాధకుడు పట్టుదలతో కృషిచేసి పెరికివేసినచో తప్పక విజయుడై విశుద్ధ హృదయుడై దైవత్వమును పొందగలడు గీతలో దైవాసుర సంపత్విభాగయోగమందు శ్రీకృష్ణుడు
చెప్పినట్లుగా సాధకులెల్లరు తమయందు దైవభాగమెంతగలదో , అసురభాగమెంతగలదో పరిశోధించి తక్షణమే అసురగుణ నిర్ములనకునూ దైవగుణ ప్రతిష్ట కొరకునూ ప్రయత్న శీలురై యుండవలెను.

అంతా బాగానే ఉంది, అయితే మరి ధ్యానాది సాధనలు చూసినవారంతా ఎందుకు మహర్షులు కాలేకపోతున్నారు ? ముక్తులు కాలేక పోతున్నారు ? అనేసందేహంరావొచ్చు
ఎందుకంటే
మినః స్నానపరః ఫణి
పవన భుజ్మే మెషోస్తి పర్ణశానః
నిరాశి ఖలు చాతకః ప్రతిదినం
శైలే బిలే మూశికః
భస్మోధూళిత విగ్రహస్తు
శునకో ధ్యానాదిరుడో బకః
యేషాం ఫలమస్తి కిం నహి నహీ జ్ఞానం పరం కారణం

గంగయందే పుట్టిపెరిగిన జలచరాలన్నియు నిత్యమూ గంగా స్నానము చేసియు , అందే నివసించియున్నను ,
సర్పము వాయుభక్షణమును
చేసినను , మేక ఆకులనుఁ తినినను ఎలుకలు సదా కొండగుహలలో ఉన్నను కుక్క బూడిద పూసుకున్నాను కొంగ మౌనన్గా ఒంటికాలుమీద జపం చేసినను , వీటన్నిటికీ ఎలాంటి విశేషఫలము ఉండదు.

అలాగే కాసేపు ధ్యానం ఉపవాసాలు ప్రార్థనలు , శాస్త్రపఠనాలు ప్రవచనాలు వినడం ఇత్యాది సాధనలు బాహ్యంగా ఆచరించినంత మాత్రాన ఫలితముండదు.
అంతఃకరణశుద్ధి అంతరంగనిష్ఠ ఉండాలి .
సాధకునికి శ్రద్ధ భక్తివిశ్వాశం ఉండాలి.
ఎటువంటి అవరోధాలు కలిగినను పట్టుదలతో అనన్య భక్తితో సాగిపోవాలి ఆత్మసాక్షాత్కారం ముక్తి లాంటి అత్యున్నత స్థితులను చేరుకోవాలంటే హృదయ పరిశుద్ధత ఎంతో అత్యవసరం.
అందుకు ఎంతో సాధనబలం అవసరం.

మన మతి ఎలా ఉంటుందో మన గతి కూడా అలాగే ఉంటుంది.
సమ్మతితో ఉండాలి సద్గతిని పొందాలి.

సేకరణ

నేటి మంచిమాట. ఏడుపు

 నేటి మంచిమాట. 


ఎదగడానికి వేయాల్సిన ప్రశ్నల కంటే ఎదిగిన వారిని చూసి వేసే పిచ్చి ప్రశ్నలే ఎక్కువయ్యాయి. దీన్నే ఏడుపు అంటారు. వాళ్ళు తమ సొంత తెలివిలో నానా ఇబ్బందులు పడి, ఎన్నో కష్టాలకి ఓర్చి నిలబడ్డారు. వారిని చూసి ఏడవడం దేనికి? ఎలా ఎదిగారు! అనే దాని మీద దృష్టి పెట్టండి. ప్రశ్నలు వేసుకుంటూ కూర్చుంటే నువ్వక్కడే ఉంటావ్. వేసే ప్రశ్న కూడా జీవితాలని చక్కదిద్దేలా ఉండాలి. ఇది కూడా ఒక కళ. లేదంటే కలల దగ్గరే ఆగిపోతుంది జీవితం.


ఉషోదయం చెప్తూ మానస 👏

మార్పు

 మార్పు


అంతర్గతంగా వచ్చే మార్పే జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. అందరితో కలిసిపోయి, ఆడుతూ పాడుతూ చిన్నపిల్లల్లా జీవితం గడపాలని చాలామంది జీవితానుభవం కలిగినవారికి ఉంటుంది. అది మనసు వరకే. ఆలోచనల్లోనే. ప్రవర్తనలోకి రాదు.


కొద్ది కొద్ది మార్పులు కూడా ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. మనకే అనిపిస్తూ ఉంటుంది. మనం ఇంకొంచెం మెరుగ్గా వాళ్లతో ప్రవర్తించి ఉండాల్సిందని. కాని ఎందుకో అంతకు మించి సాగలేకపోయాం. అదేమంత కష్టం కాదు. అయినా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే లాగా ఉండిపోయాం.


ఎన్నో పుస్తకాలు చదువుతాం. వీలైతే పెద్దవాళ్ల మాటలు సభల్లో వింటాం. గొప్ప గొప్ప చలనచిత్రాలు చూస్తాం. ఇంట్లోనే అనుకోని ఒక సందర్భం ఎదురుపడినప్పుడు పదేళ్ల క్రితం ఎలా ప్రవర్తించామో ఇప్పుడూ అలానే ప్రవర్తిస్తుంటాం. శరీరంలో మార్పులు కనిపిస్తుంటాయి. కాని, మనసులో పెద్దగా మార్పులు రావు.

మనసులో మార్పు ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. అంతర్గతంగా వచ్చే మార్పే జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది.


మారకుండా ఉండే ఏ పరిస్థితీ మానవ జీవితంలో లేదు. అసలు ప్రకృతిలోనే లేదు. మార్పు నిత్యసత్యం. ఈ సత్యం తెలుసుకున్న మనిషి అందరికీ అనుకూలంగా ఉంటాడు. ఒకరిద్దరికి మించి, మన ప్రవర్తనలో మార్పు ఉండాలి అన్నారంటే, మనల్ని మనం పరిశీలించుకోవాలి.    అద్దం ముందు పెట్టుకుని మన శరీరాన్నే కాదు, మనసును సైతం అన్ని కోణాల్లోంచీ శోధించాలి.


మన ప్రవర్తన సరిగ్గా లేనప్పుడే, ఎదుటివాళ్లను ఎవరిని చూసినా ఏదో వంక పెట్టాలని అనిపిస్తుంది. వాళ్లెవరూ సరిగ్గాలేరని అనిపిస్తుంది. ఒక్కక్షణం చాలు. మనం మారితే... ప్రపంచం మారిపోతుంది!


ధర్మరాజు దృష్టి కోణంలో అందరూ మంచివారే. దుర్యోధనుడి దృష్టి కోణంలో అందరూ చెడ్డవారే. చూపు మార్చుకుని, ప్రవర్తనలో ఆ మంచి విషయాలను అభ్యాసం చెయ్యాలి.


మారిన మనిషిని చూస్తే, ప్రతి ఒక్కరికీ విస్మయమే. ఎందుకంటే మార్పు కష్టం. మార్పును అంగీకరించి తన ప్రవర్తన మార్చుకుని ఎదుటివాళ్లకు అనుకూలంగా ఉండాలంటే, అతడెంతో సంయమనంతో ఉండాలి. పాత అలవాట్లను అధిగమించాలి. ముఖ్యంగా జీవితాన్ని యథాతథంగా స్వీకరించాలి.


శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ సందర్భంగా అర్జునుడిలో పెను మార్పులు తీసుకొచ్చాడు. లోకకల్యాణ కారకమైన భగవద్గీతనే  అందించాడు. దైవం తలచుకుంటే మార్పును ఇవ్వడమే కాదు, కొత్త జన్మనే ప్రసాదించగలడు.


ముఖ్యంగా మన ప్రవర్తనను అద్భుతంగా నియంత్రించగలిగేది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత రవ్వంత కూడా తెలియని మనుషులూ మంచివారుగా మెలగవచ్ఛు మంచివారుగా ఉండాలంటే వారు హృదయంతో జీవించాలి. ఆ హృదయంలో ఆత్మ ఆసీనురాలై ఉంది. ఆత్మను స్పృశిస్తే ఆధ్యాత్మికత పెల్లుబుకుతుంది.

‘అన్ని వైపుల నుంచి దివ్యమైన ఆలోచనలు రావాలి’ అని రుగ్వేదం చెబుతోంది.


సహజంగా మన లోపల పుట్టే ఆలోచనలన్నీ సానుకూలంగా ఉండవు సరికదా- మంచిగానూ ఉండవు. కొన్ని మనసులు ఆలోచించినట్లు శత్రువులైనా ఆలోచించరు. అందుకే మనకు దివ్యమైన భావాలు కావాలి.


ఎక్కడ అగ్ని ఉందో, అక్కడే నీటిని చల్లాలి. పుట్టే చెడ్డ ఆలోచనలను వెనువెంటనే మంచి ఆలోచనలతో ఖండించాలి. మాటలో, ప్రవర్తనలో సైతం గొప్పదనాన్ని, దివ్యత్వాన్ని ప్రకటించాలి. త్వరగా మనలో రావాల్సినంత మార్పు రాకపోతే అంత నష్టం జరిగిపోయినట్లే. కాలం తిరిగి రాదు. చింతించి లాభం లేదు. సమస్యను గుర్తించిన మరుక్షణమే మనసును మార్చుకొని ముందుకెళ్లాలి.


వాళ్లవాళ్ల ప్రవర్తనలో మార్పుల వల్లనే సంఘ సంస్కర్తలు, దేశభక్తులు, శాస్త్రవేత్తలు, యోగులు, జ్ఞానులు... చరిత్రలో నిలిచిపోయారు. వేల సంవత్సరాల నుంచి భూమిలో నిక్షిప్తమై పడిఉన్న బొగ్గుముక్కే ఒక రోజు వజ్రంగా సాక్షాత్కరిస్తుంది. ఇది శాస్త్రీయ పద్ధతిలో కనిపించే ఒక సత్యం. మనం మారదాం.. మన కోసం, అందరి కోసం!


సేకరణ. మానస సరోవరం 👏

🎪చుట్టరికం

  🎪చుట్టరికం  

    💦🌹🌈⛳  

          

  🍁గతంలో  

  నాలుగు జతల బట్టలు సర్దుకొని  

  నాలుగు రోజులు చుట్టరికం చేసి రావడం  

  ఒక గొప్ప మధురానుభూతి  !


  ఊరి పొలిమేరలనుండి   స్వాగతం పలికే  

  ఉమ్మడి బంధువుల చిరునవ్వు  

  మనసును ఎంతగానో   మురిపించేది !  


  పలకరింపులు పూర్తయ్యేక  

  మా యోగక్షేమాలడిగి   ఆనందించేవారు !  


  పూటపూటకో కొత్త వంట రుచి   చూపించి  

  మాటమాటకో కొత్త విషయాన్ని   

  చెవిలో వేసేవారు !  


  మా ఊరి విషయాల మూటలు  

  నేను ఒక్కొక్కటిగా   విప్పుతుంటే  

  బంధువుల హృదయాలు   పులకించిపోయేవి !  


  సాయంత్రం వేళల్లో టూరింగ్   టాకీసులో  

  సినిమాలు చూపించి   సంబరపడిపోయేవారు !  


  రాత్రిపూట కబుర్ల దుప్పటి కప్పి  

  వెచ్చని మమతలు   మిగిల్చేవారు !  


  మా ఇంటికి చుట్టాలొచ్చినా  

  అదే కథ యథాతథం !  


  బంధాలు బలపడటం   చుట్టరికం ప్రత్యేకత.  

  వివాహ బంధాలు   ముడివడటం  

  చుట్టరికాల ఘనత.  

  పరస్పరం భరోసా   కల్పించుకోవడం  

  చుట్టరికాల్లో గొప్ప విశిష్టత !  


  ఆధునీకరణ, నగరీకరణ,  

  ఆర్ధిక సంబంధీకరణ కారణంగా  

  నేడు కనుమరుగైపోయిన  

  చుట్టరికాల వ్యవస్థను   

  ప్రభుత్వాలు చట్టరికం చేస్తే  

  విచ్చిన్నమైపోతున్న ఉమ్మడి   కుటుంబాలు  

  మరల ఊపిరి   పోసుకుంటాయి !  

  మానవ సంబంధాలు  

  మరింత పటిష్టంగా   పెనవేసుకుంటాయి  !


  ఉండండి  

  మరలా  నిత్యనూతనంగా  

  నాలుగు రోజులు చుట్టరికం   చేయడానికి  

  నాలుగు జతల బట్టలు సర్దుకొని మీ వద్దకు వస్తాను !  ఓకేనా 


శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏


శాంతి, సుఖం, సంతోషం దూరం కావటానికి ప్రధాన కారణాలు ఏమిటి ?

💖💖 "257" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖


"శాంతి, సుఖం, సంతోషం దూరం కావటానికి ప్రధాన కారణాలు ఏమిటి ?"


"మనో ప్రవృత్తే కారణం. ఆలోచనాశక్తి అనేక విషయాలతో చిందరవందర కావటమే మనోవిక్షేపం. ఈ విక్షేపం వల్లనే శాంతి, సుఖం, సంతోషం దూరమవుతున్నాయి. మనలో ప్రేమ లోపించటమే ఈ దుస్థితికి కారణం. మనసు ప్రవృత్తే మన ఆలోచనలకు కారణం. ప్రవృత్తి అంటే మనసు పోకడలు. మన జీవన విధానమే ఇందుకు కారణం. దాన్ని మార్చుకోవటం ద్వారా ఈ యుద్ధంలో జయించవచ్చు. అప్పుడే దూరం అవుతున్న సుఖశాంతులు పొందగలుగుతాం. ప్రేమ అంటే ఒక వస్తువుపై ఇష్టం కాదు. సత్యాన్ని స్వీకరించటమే నిజమైన ప్రేమ. మనం తలపెట్టుకున్న పనులు కావటంలేదని నిత్యం అశాంతికి లోనవుతున్నాం. అసలు ఆ తలపులే (ఆలోచనలు) తగ్గించుకుంటే శాంతి ఎల్లప్పుడూ మనతోనే ఉంటుందని తెలుసుకోలేక పోతున్నాం. మనకి ఎన్ని ఆలోచనలు ఉంటే అంత దుఃఖం తప్పదు "!

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
🌼💖🌼💖🌼

సేకరణ

Tuesday, June 21, 2022

ఈ భగవద్ వాక్యమును ఎప్పుడూ గుర్తుంచుకుని ఆ సర్వేశ్వరుని యెడల అనన్య భక్తి భావమును పెంపొందించు కోవాలి.

🙏🏻🙌లక్ష్మీ శ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞానపీఠం....తిరుపతి...చరవాణి. 9390216263..9550804092.. శ్రీనివాసరావు.ప్రధాన నిర్వహకులు . 🙏🏻🙌🙊🙌🙉🙌🙈🙌

🌹నేటి ఆత్మ విచారం.🌹

-పరమపూజ్య పాండురంగ శాస్త్రి. "దాదాజీ " గారి ప్రేరణతో...💥👏

సాధారణంగా మనం ప్రతిరోజు దేవునికి పూజ చేస్తూ ఉంటాం. దేవుడిని అందంగా అలంకరించుకొని ఆనందిస్తూ ఉంటాం. దేవుని కొరకు రకరకాల పదార్ధాలు తయారు చేసి నివేదిస్తూ ఉంటాం. కాని మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగక పోతే దేవుడు నన్ను కరుణించలేదు. నాపై దేవునికి దయ కలుగలేదు అని బాధ పడుతూ ఉంటాం.

ఇలా మన కోరికల కోసం చేసే పూజల వలన ప్రయోజనం ఉండదు. చిత్తశుద్ధి లేని పూజ, దైవ భక్తి లేని ప్రసాదం అంటే దేవుడికి కూడా ఇష్టం ఉండదు. మన మనస్సును ఆయనపై లగ్నం చేసినప్పుడు మాత్రమే ఉత్తమ ఫలితం లభిస్తుంది. అది ఎలాగో చూద్దాం....

పూర్వం ఒక గ్రామంలో విష్ణుభక్తుడు ఒకడు ఉండేవాడు. నిరంతరం హరినామ స్మరణ చేస్తూ ధార్మిక జీవనం సాగించేవాడు.

ఎంత పేదరికంలో ఉన్నా భగవంతుడిపై అపారమైన నమ్మకం కలిగి ఉండేవాడు. అతడి భక్తికి మెచ్చి ఒకనాడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు.

స్వామి దివ్యమంగళ స్వరూపం చూసి తన్మయత్వంతో స్తోత్రాలు చేసాడు. స్వామికి ఏదైనా నివేదించాలి అనుకున్నాడు. ఇల్లంతా వెతకగా ఒక అరటిపండు కన్పించింది.

దానిని స్వామికి నివేదించాలని అరటి పండు ఒలిచి పండు పడవేసి భక్తి పారవశ్యం లో తొక్కను స్వామి నోటికి అందించాడు. భక్తవత్సలుడు అయిన విష్ణుమూర్తి తొక్కను స్వీకరించి అంతర్థానమయ్యాడు.

తర్వాత తేరుకొని చూసి తన తప్పును తెలుసుకొని భక్తుడు ఎంతో చింతించాడు. స్వామి పట్ల అపరాధం చేసాను అని కుమిలి పోయాడు. మళ్లీ స్వామి తనకు ప్రత్యక్ష మైనప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు.

కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బులతో ప్రతి రోజూ ఒక డజను అరటి పండ్లు తెచ్చి స్వామి విగ్రహానికి తొక్క వలిచి పండు మాత్రమే నివేదిస్తూ వచ్చాడు.

ఎన్ని రోజులైనా విష్ణుమూర్తి ప్రత్యక్షం కాలేదు... దాంతో భక్తుడు బాధతో... ‘తండ్రీ అపరాధి అయిన ఈ భక్తుడుని కరుణించి దర్శనం ఇవ్వమని’ వేడుకున్నాడు.

దయార్ద్ర హృదయుడైన స్వామి భక్తుడు కోరిన విధంగా మరలా ప్రత్యక్షమయ్యాడు. సంతోషంతో ఆ భక్తుడు స్వామికి అరటి పండ్లు నివేదించాడు. గతంలో చేసిన పొరపాటు మరల జరగకుండా తొక్క పడవేసి పండు స్వామికి అందించాడు. కాని విష్ణుమూర్తి పండు తినటానికి ఇష్టపడలేదు. ఎంత బతిమాలిన ఫలితం లేదు.

అప్పుడు ఆ భక్తుడు ఆవేదనతో... “స్వామీ ! నా భక్తిలో ఏదైనా లోపం వుందా !? గతంలో తొక్క పెట్టినా తిన్నారు కదా! ఇప్పుడు ఇలా కినుక వహించారు ఏమిటి ?” అని ప్రశ్నంచాడు.

విష్ణుమూర్తి చిన్నగా నవ్వి... “నాయనా ఇంతకుముందు వచ్చినప్పుడు నీ మనస్సు నాపై లగ్నం చేసి తొక్క నివేదించి నందున స్వీకరించాను. ఇప్పుడు నీ మనస్సు అరటిపండుపై లగ్నమై ఉంది. వస్తువు మంచిదైనా భక్తి రసహీనం కావడం వలన అది విషతుల్యంగా మారింది. అందుకే పండు స్వీకరించలేకపోతున్నాను” అని సమాధానం ఇచ్చాడు.

స్వామి మాటలకు భక్తుడికి జ్ఞానోదయం అయ్యింది. భక్తి కలిగినప్పుడే కదా దేనికైనా విలువ అనుకొని నిండు మనస్సుతో ఆరాధించి తిరిగి స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు.

దేవుడు తనకు నైవేద్యంగా ఏం పెట్టారో ఆయా పదార్థాల విశిష్టతను చూడడు. ఎంత భక్తితో సమర్పించారు అనేదే చూస్తాడు. కాబట్టి మనం చేసే పూజ, ప్రార్థనాదులందు భక్తికి ప్రాధాన్య నిచ్చి, మనస్సును ఏకాగ్రతతో నిలపడాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలి.

“అణ్యప్యుపాహృతం భక్త్యా
ప్రేమ్ణాభూర్యేన మే భవేత్ ।
భూర్యప్యభక్తోపహృతం న
మే తోషాయ కల్పతే ॥”

కొంచమైనా భక్తితో, ప్రేమతో పెట్టినది కొండంత కాగలదు.

కొండంత సమర్పించినా భక్తితో కూడియుండనిచో అది నాకు సంతుష్టిని కలుగజేయ జాలదు.

అను ఈ భగవద్ వాక్యమును ఎప్పుడూ గుర్తుంచుకుని ఆ సర్వేశ్వరుని యెడల అనన్య భక్తి భావమును పెంపొందించు కోవాలి.☝

సర్వేజనః సుఖినోభన్తు :💥👏
జై యోగేశ్వర్.💥🙏 సేకరణ. శ్రీమతి.శ్రీ విజయలక్ష్మీ. శివకుమార్.. గోగాడ.. మేనేజింగ్ డైరెక్టర్... హైదరాబాద్..🙏🏻🙏🏻🙏🏻

🌺💥🌺💥🌺💥🌺💥🌺

సేకరణ