Wednesday, June 22, 2022

సద్గతి అనగా నేమి?

సద్గతి అనగా నేమి?

🪷🪷🪷🪷🪷

సర్వం ఖల్విదం బ్రహ్మ సర్వమూ బ్రహ్మయే అయినప్పుడు అందరూ ఆత్మస్వరూపులే అయితే
ప్రత్యేకించి ఆలయాలకు వెళ్లడం ఎందుకు ?
ఉపవాసాలు ఎందుకు ? నియమనిష్టలెందుకు ?
ధ్యానమెందుకు ?
శాస్త్రపఠనమెందుకు ?
సత్సంగాలేందుకు ?

పై ప్రశ్నలన్నీ ఓ తెలిసిన అమ్మాయి అడిగింది . ఆ క్షణంలో తనలో ఏళ్ల క్రితం
నన్ను నేను చూసుకున్నట్లుంది.
ఈనాడు ఈ అమ్మాయి ధైర్యంగా అడిగినట్లుగా ఆనాడు నేను ఎవరిని అడగలేదు అయితేనేం భగవంతుని అనుగ్రహం వలన సద్గురువుమీద గురితో , కాలక్రమేణా పుస్తక పఠనం ద్వారా సందేహాలు తీర్చుకున్నాను.

మనది పరోక్ష జ్ఞానం అంటే ఋషులూ మహర్షులూ గురువులూ చెప్పింది పఠన శ్రవణముల ద్వారా తెలుసుకున్నది. దానినే ప్రత్యక్ష జ్ఞానం ద్వారా తెలుసుకొని ముక్తిత్వం పొందడానికే పై సాధనాలన్నీ.
దీపం గురించి తెలిసినంత మాత్రాన చీకటి పోతుందా ? అన్నం గురించి మాట్లాడితే ఆకలి , నీటి గురించి మాట్లాడితే దాహం తీరుతుందా ? అలాగే వినడం వలన తెలుసుకోవడం వలన ప్రయోజనంలేదు.
భావనమాయాప్రజ్ఞ ( స్వానుభవములో తెలుసుకోవడం ) అన్నిటికన్నా చాలాముఖ్యం

మనసుని జయించడం మనసుకు అతీతులవడం చెడుగుణాలు తొలగడం మనలోపల ప్రక్షాళన జరగడం సంపూర్ణాంగా జీవించడం ఆనందంగా శాంతియుతంగా జీవించడం
పరమ గమ్యాన్ని చేరడం మానవజన్మకు సార్థకత చేకూరడం.
ఇత్యాదులన్నీ పై సాధనాల వల్లనే సాధ్యమవుతుంది.

వ్యవసాయకుడు తన పొలమునందున్న కలుపు మొక్కలని తొలగించి దుక్కి దున్ని పైరు బీజాలను ఎట్లుజల్లునో , అలాగే సాధకుడు తన హృదయాంతరాళమున ఉన్న దుఃఖమయ రాక్షసగుణాలన్నిటిని
సంపూర్తిగా తొలగించి అందులో భక్తి అనే బీజాలను జల్లి పెంచి పోషించినచో దైవత్వమనే పంట పండి తీరును.
ఎండాకాలంలో కలుపు ఏమియు కనపడకపోయినను బీజరూపమున దాగియుండి వర్షం కురవగానే ఎట్లు మొలకెత్తునో

అలాగే అజ్ఞానంవలన అనేక జన్మవాసనలు మనయందు దాగియుండి సమయం వచ్చినప్పుడు అంకురించి మొలకెత్తుచుండును వాటిని సాధన ద్వారా సాధకుడు పట్టుదలతో కృషిచేసి పెరికివేసినచో తప్పక విజయుడై విశుద్ధ హృదయుడై దైవత్వమును పొందగలడు గీతలో దైవాసుర సంపత్విభాగయోగమందు శ్రీకృష్ణుడు
చెప్పినట్లుగా సాధకులెల్లరు తమయందు దైవభాగమెంతగలదో , అసురభాగమెంతగలదో పరిశోధించి తక్షణమే అసురగుణ నిర్ములనకునూ దైవగుణ ప్రతిష్ట కొరకునూ ప్రయత్న శీలురై యుండవలెను.

అంతా బాగానే ఉంది, అయితే మరి ధ్యానాది సాధనలు చూసినవారంతా ఎందుకు మహర్షులు కాలేకపోతున్నారు ? ముక్తులు కాలేక పోతున్నారు ? అనేసందేహంరావొచ్చు
ఎందుకంటే
మినః స్నానపరః ఫణి
పవన భుజ్మే మెషోస్తి పర్ణశానః
నిరాశి ఖలు చాతకః ప్రతిదినం
శైలే బిలే మూశికః
భస్మోధూళిత విగ్రహస్తు
శునకో ధ్యానాదిరుడో బకః
యేషాం ఫలమస్తి కిం నహి నహీ జ్ఞానం పరం కారణం

గంగయందే పుట్టిపెరిగిన జలచరాలన్నియు నిత్యమూ గంగా స్నానము చేసియు , అందే నివసించియున్నను ,
సర్పము వాయుభక్షణమును
చేసినను , మేక ఆకులనుఁ తినినను ఎలుకలు సదా కొండగుహలలో ఉన్నను కుక్క బూడిద పూసుకున్నాను కొంగ మౌనన్గా ఒంటికాలుమీద జపం చేసినను , వీటన్నిటికీ ఎలాంటి విశేషఫలము ఉండదు.

అలాగే కాసేపు ధ్యానం ఉపవాసాలు ప్రార్థనలు , శాస్త్రపఠనాలు ప్రవచనాలు వినడం ఇత్యాది సాధనలు బాహ్యంగా ఆచరించినంత మాత్రాన ఫలితముండదు.
అంతఃకరణశుద్ధి అంతరంగనిష్ఠ ఉండాలి .
సాధకునికి శ్రద్ధ భక్తివిశ్వాశం ఉండాలి.
ఎటువంటి అవరోధాలు కలిగినను పట్టుదలతో అనన్య భక్తితో సాగిపోవాలి ఆత్మసాక్షాత్కారం ముక్తి లాంటి అత్యున్నత స్థితులను చేరుకోవాలంటే హృదయ పరిశుద్ధత ఎంతో అత్యవసరం.
అందుకు ఎంతో సాధనబలం అవసరం.

మన మతి ఎలా ఉంటుందో మన గతి కూడా అలాగే ఉంటుంది.
సమ్మతితో ఉండాలి సద్గతిని పొందాలి.

సేకరణ

No comments:

Post a Comment