Friday, May 6, 2022

బుద్ధుని మార్గం "విపాసన" ✍️రచన: ఓషో - విపాసన అంటే సాక్షిసాధన.

☘️🌷☘️🌷🍀🌷🍀

💫📚 అవేర్నెస్💫

✍️రచన: ఓషో

భాగం-94(a)

విపాసన

బుద్ధుని మార్గం "విపాసన" - విపాసన అంటే సాక్షిసాధన. అతను వున్న చాలా గొప్ప ఉపాయాలలో ఒకదానిని కనుక్కున్నాడు. అది మీ శ్వాసని మీరు గమనించడం అనే ఉపాయం - కేవలం మీ శ్వాసని గమనించడం - శ్వాస అనేది ఎంతో సామాన్యమైన, స్వాభావికమైన దృగ్విషయం అంటే - అది రోజులో 24 గంటలూ వుంటుంది.మీరు ఎలాంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఓ మంత్రాన్ని జపిస్తే అప్పుడు మీరు ఒక ప్రయత్నాన్ని చేయాలి. మిమ్మల్ని మీరు నిర్బంధించుకోవాలి. ఒకవేళ మీరు “రామ్... రామ్... రామ్" అని అనాలంటే, మిమ్మల్ని మీరు నిరంతరంగా ప్రయాసపెట్టుకోవాలి. మీరు అనేకసార్లు అలా జపించడం మరిచిపోయి తీరతారు. ఇంకా మీదు మిక్కిలి "రామ్” అనే పదం మళ్ళీ మనస్సుకి సంబంధించినదేదో అవుతుంది. మనస్సుకి సంబంధించింది ఏది అయినా మిమ్మల్ని మనస్సుకి ఆవలివైపుకు తీసుకుని వెళ్ళలేదు.

బుద్ధుడు పూర్తిగా వేరే కోణంలో విషయాన్ని కనుక్కున్నాడు. కేవలం మీ శ్వాసని గమనించండి. శ్వాస లోపలికి వెళ్తుంది. మళ్ళీ బయటకు వస్తోంది. దాన్ని పరిశీలించండి.

ఇక్కడ నాలుగు సంగతులు గమనించాలి. నిశ్శబ్దంగా కూర్చుని కేవలం ఊపిరిని చూడండి. అనుభూతి పొందండి. లోపలికి వెళ్ళే ఊపిరి, మొదటి సంగతి. అప్పుడు ఓ క్షణం శ్వాస లోపల ఉన్నప్పుడు - అది ఆగుతుంది. ఒక చిన్న క్షణం సెకనులో సగం అది లోపల ఆగుతుంది. అది గమనించడానికి రెండవ సంగతి. మళ్ళీ ఊపిరి మరలి బయటకు వెళ్తుంది. ఇది గమనించడానికి మూడవ సంగతి. అప్పుడు మళ్ళీ శ్వాస పూర్తిగా బయటకు వెళ్ళినప్పుడు ఒక సెకనులో సగం ఆగుతుంది. ఇది గమనించడానికి నాల్గవ సంగతి. అప్పుడు శ్వాస మళ్ళీ లోపలికి రావడం

మొదలవుతుంది. ఇదీ శ్వాస యొక్క చక్రం. ఒకవేళ మీరు ఈ నాలుగు సంగతులన్నీ గమనించగలిగితే మీరు ఆ సామాన్య పద్ధతి అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. విస్మయపడతారు. ఎందుకంటే మనస్సు అప్పుడు పనిచేయదు.

గమనిక అన్నది మనస్సు యొక్క లక్షణం కాదు. గమనిక ఆత్మ యొక్క, చైతన్యం యొక్క ధర్మం. జాగరూకత అసలు ఏ మాత్రమూ మానసిక కార్యం కాదు. మీరు గమనించినప్పుడు మనస్సు ఆగుతుంది. ఉండటానికి స్వస్తి చెప్తుంది. అవును, మొదట్లో చాలాసార్లు మీరు శ్వాసని గమనించడం మరిచిపోతూ వుంటారు. మనస్సు మధ్యలో వచ్చి దాని పాత ఆటల్ని ఆడటం మొదలు పెడుతుంది. కానీ ఎప్పుడెప్పుడు మీకు శ్వాసని గమనించడం మరిచిపోయారని గుర్తుకువస్తే, అప్పుడు పశ్చాత్తాప పడాల్సిన అవసరం లేదు. తప్పు చేసామని అనుకోనక్కర్లేదు. కేవలం వెనక్కి వెళ్ళి మళ్ళీ గమనించండి. మళ్ళీ, మళ్ళీ శ్వాసని గమనించడానికి వెనక్కి వెళ్ళండి. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా మనస్సు జోక్యం చేసుకోవడం తగ్గుతూ తగ్గుతూ వుంటుంది.
(సశేషం)
🌸🌹🌸🌹🌸🌹🌸🌹

సేకరణ

No comments:

Post a Comment