Tuesday, June 7, 2022

అంతశ్శత్రువులు

అంతశ్శత్రువులు

ప్రకృతిలోని కాలాలు, రుతువులతో పాటు మనిషి జీవితంలోని వివిధ దశలూ మార్పునకు లోనవుతుంటాయి. ఇది ప్రకృతి సహజం, మన ప్రయత్నం లేకుండానే జరిగే ప్రక్రియ బాల్యంలో నిష్కల్మషంగా ఉండే మనిషి- వయసు పెరిగే కొద్దీ రాగద్వేషాలు, అరిషడ్వర్గాలకు బానిస అవుతాడు. కాలమాన పరిస్థితులు, సమాజ పోకడలు, ఆశాపాశాలు లాంటివి ఇందుకు దోహదం చేస్తాయి. అవి తనలో ఉన్నట్లు గమనించ లేనంతగా మనసును ఆవరించుకుని పెనవేసుకు పోతాయి. తనలో ఉన్న ఈ శత్రువులను గుర్తెరిగి, వాటి నుంచి దూరంగా రాగలిగితేనే మనిషి మనిషిగా ఎదుగుతాడు. అందుకుగాను తమలో రావలసిన మార్పుల గురించి ఎవరికి వారుగా తెలుసుకోగలగాలి. వాటినుంచి దూరం కావడానికి ప్రయత్నించాలి.

అందుకోసం ముందుగా తన జ్ఞాన రాహిత్యాన్ని నిజాయతీగా ఒప్పుకోవాలి. కోరుకున్న మార్పును పొందేందుకు ఆహరహం శ్రమించాలి. లక్ష్యం చేరుకోవడానికి దగ్గరి దారులు ఉండవు. గురువు చెప్పిన ప్రతి విషయాన్నీ శ్రద్ధగా వినాలి. ఆకళింపు చేసుకోవాలి. ఆపై నియమ బద్ధంగా అనుష్టానంలో పెట్టు కోవాలి. ఇందులో ఏ దశను అనుసరించక పోయినా ప్రయోజనం ఉండదు. తమలో తిష్ట వేసుకున్న శత్రువులను బయటకు తరమలేరు.

ఈశ్వరుడు ఇచ్చిన బుద్ధిని సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్లనే యౌవనం, ధనం, అధికారం, అవివేకం అనే నాలుగు మనిషి పతనానికి కారణాలవుతున్నాయని మహా భారతం చెబుతోంది. ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటి అంతశత్రువులు ఆవరించు కున్న దుర్యోధనుడు పాండవులను ఎన్నో కడగండ్లపాలు చేశాడు. రాజ్యాధికారం, ధనగర్వం, చెడు సహవాసం, స్వతంత్ర ఆలోచనా లేమి, సరైన సలహాలు ఇచ్చేవారు. కొరవడి- అంతశ్శత్రువులు ప్రబలడానికి, ఫలితంగా చివరికి అతడి పతనానికి కారణమయ్యాయి.

అంతర్యామి

సుఖదుఃఖాల సమన్వయం ఈ జీవితం. ఈ రెండింటినీ సమానంగా ఒకే దృక్కోణంలో చూడాలంటే మనలోనే తిష్ట వేసుకుని కూర్చున్న శత్రువులను పారదోలాలి. వాటిని గుర్తించడం చాలా కష్టం. నాది నాది అనుకునే ఈ మాయే అన్ని బందనాలకీ గుర్తు, మనలోని శత్రువుల నుంచి విముక్తికి, నీలో నువ్వే ఉండటానికి ప్రయత్నించాలి. ఈ ప్రయత్నంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. రాగ ద్వేషాలతో సతమతమయ్యే మనసు అశాంతికి లోనవుతుంది.

'మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానందమొందలేక మద మత్సర కామ లోభ మోహములకు దాసుడనై మోసపోతిని' అని త్యాగరాజు తన పంచరత్నాల్లో ఒకటైన 'దుడుకుగలనన్నే దొరకొడుకు బ్రోచురా ఎంతో కడు దుర్విషయాకృష్ణుడై గడియ గడియకు నిండారు... అనే కీర్తనలో చింతించాడు. విశ్వామిత్రుడు, పరశురాముడు, దూర్వాసుడు మొదలైన వారు మొదట అంతశ్శత్రువులైన కామక్రోధాదులకు లోబడినవారే అనంతర కాలంలో వాటిని

దూరం చేసుకుని మహర్షులుగా మారగలిగారు. ఇంద్రియాలను నియంత్రించుకోవడం వల్ల మనసు స్వాధీనంలోకి వస్తుంది. ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది. తద్వారా ప్రసన్నమైన, నిర్మలమైన మానసిక స్థితి ఏర్పడుతుంది. ఇటువంటి మానసిక స్థితి ద్వారా ఆవేశకావేషాలను నియంత్రించుకోవచ్చు. మనం ఈ ప్రపంచాన్ని చూసే దృక్కోణమూ మారుతుంది. అప్పుడే మనిషి స్థితప్రజ్ఞుడవుతాడు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment