Thursday, June 30, 2022

నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అంటారు. మానవ జీవితంలో మాటకు అంతటి ప్రాధాన్యత ఉంది.


🌹నేటి ఆత్మ విచారం 🌹

నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అంటారు. మానవ జీవితంలో మాటకు అంతటి ప్రాధాన్యత ఉంది. వంటకు మంట ఉపయోగపడుతుంది. అదే మంట దగ్ధం చేస్తుంది కూడా.

మాటను సక్రమంగా ఉపయోగిస్తే అది అమృతంగా మారుతుంది. అక్రమంగా ఉపయోగిస్తే విషంగా పరిణమిస్తుంది. అందుకే వాక్కును సద్వినియోగం చేసుకోవడం ఒక 'తపస్సు ' అని భోదించాడు శ్రీ కృష్ణుడు.

వాచిక తపస్సు అలవడాలంటే ఏం చేయాలి... ? కరపత్రాలు పంచితే సరిపోతుందా... ? బహిరంగ సభలలో ఉత్తేజపూర్వకంగా ఉపన్యసించితే ఫలితం ఉంటుందా....? ప్రవచనాలు వింటే పరిస్కారం దొరుకుతుందా....?

వాక్కు - భావవ్యక్తీకరణకు మూలం. వాక్కే అన్నిటికి కారణం అనేది ఋషి వచనం. మధురమైన మాటలనే పలకాలని వేదశాసనం.

మాట ఎలా ఉండాలన్న విషయంపై మన సనాతన ధర్మంలో విస్తృతమైన అంశాలు చెప్పారు. మనం మాట్లాడే మాట తత్కాలానికి చక్కగా ఉండటమే కాదు, శాశ్వతమైన హితవు చేకూర్చేలా ఉండాలి.

అందుకే సత్యం, ప్రియం, హితం అనే విశేషణాలను వాక్కుకి జోడించారు మన పెద్దలు.

మన సంస్కారం, అధ్యయనం, హృదయపు లోతు మన మాట ద్వారానే తెలుస్తాయి. ఈ మాటలను సవ్యంగా వినియోగించడమే తపస్సు అని చెబుతూ భగవాన్ శ్రీ కృష్ణుడు ( భగవద్గిత - 17,15) ఇలా అంటాడు.

" ఇతరులలో ఉద్వేగాన్ని కలిగించనిది, సత్యమైనది, ప్రియమైనది, హితకరమైనది, వేదాభ్యసం - వీటిని వాచిక తపస్సు అంటారు."

'అల్పజీవినైనా, అల్పవస్తువునైనాతృణీకరభావంతో చూడకూడదు. ఒకరి పట్ల నీవు గౌరవం చూపితే వారు నీపట్ల గౌరవం చూపుతారు.

" నీ శత్రువు పరిశీలించినంతగా నిన్ను నివ్వు పరిశీలించుకో " అప్పుడు నీకంటే గొప్ప మిత్రుడు నీకు వేరెవ్వరు లేరని అర్థమవుతుంది. ఇది వాచిక తపస్సు ద్వారానే సాధ్యమవుతుంది.

తిట్టడం, అవాచ్యాలు పలకడం, కసిరి కొట్టడం, పెళుసుతనం, సూటిపోటి మాటలు...ఇవ్వన్నీ సజ్జనులకు సరికానివి. ఇవి వాచిక తపస్సును దెబ్బతీస్తాయి.

మృదువుగా మాట్లాడే వారికీ స్నేహసంపద వృద్ధి చెందుతుంది. శత్రువుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.

మాట కత్తికంటే పదునైనది. అందుకే మాట్లాడే విధానం సౌమ్యంగా, మృదువుగా, ప్రేమగా నవ్వుతు పలకరించి మాట్లాడండి. ఈ సృష్టిలో ఏ జీవికి భగవంతుడు వాక్కును ప్రసాదించలేడు. కేవలం మనుసులమైన మనకు మాత్రమే భావవ్యక్తీకరణ కొరకు భగవంతుడు ప్రసాదించిన అద్భుత వరం ఈ వాక్కు.

వాక్కును అపవిత్రం చేయకుండా మనం ముందు మారుదాం...తర్వాత ఇతరులలో కూడా మార్పు తప్పకుండ వస్తుంది. మనం పరిశుద్ధులమైతే ఈ ప్రపంచం కూడా పరిశుద్ధమౌతుంది.💥☝

సేకరణ

No comments:

Post a Comment