థాంక్యూ నాన్న...
🙏🌹🙏🌹🙏🌹
నాన్నగా ఎదగడం... నాన్న అనిపించుకోవడం జీవితంలో గాఢమైన అనుభూతిని కలిగిస్తాయి. కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద తల్లి పెట్టుకునే ఆశలు బాహాటంగా కనిపిస్తాయి. కానీ, పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు ఎలా ఉండాలి, అలా ఉండటానికి తానేం చేయాలి, అనే దార్శనికత నాన్నలో అంతర్లీనంగా సాగుతుంది. అందుకేనేమో ఆయన అమ్మలాగా ముద్దుచేయలేడు. కానీ, మౌనంగా ప్రేమనిచ్చెనలు కట్టగలడు. నాన్న- సముద్రమంత గంభీరంగానూ, అకాశమంత నిర్మలంగానూ, విలుప్త అగ్నిపర్వతం మాదిరి గుండె నిబ్బరం తోనూ జీవించగలడు. ప్రసవ వేదనతో అలసిపోయి అమ్మ నిద్రపోతున్నప్పుడు.. పురిటికందు పచ్చివాసనను పీల్చి తన జీవాన్ని, సారాన్ని, తన ప్రతిరూపాన్ని మొదటిసారిగా చూసుకుని మురిసిపోయేది నాన్నే. ఉమ్మనీటి చెమరింపు ఆరకముందే ముద్దాడి లేలేత పసిప్రాయపు చెక్కిలి స్పర్శని అందుకుని జీవితాంతం ఆ తొడిమ తాలూకు పచ్చితనాన్ని దాచుకునే అల్పసంతోషి నాన్న మాత్రమే.
చిటికెనవేలు పట్టుకుని నడుస్తున్న పాపాయి.. చూసిన ప్రతీదాన్ని వింతగా అడుగుతుంటే బదులివ్వడానికి మరో భాషను వెతుక్కుంటాడు నాన్న. ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేస్తున్న నాన్నతనపు తొలి అడుగులు తనకు మధురంగా తోస్తాయి. నాన్నగా బిడ్డకు ఏం ఇవ్వగలనో అనుకుంటూ.. తన జీవితానికొక అర్థాన్ని వెతుక్కుంటూ.. తన బాల్యాన్ని తిరిగి బిడ్డలో చూసుకుంటూ.. దూకుడుగా దుబారాగా ఉండటం మాని తనదైన ప్రపంచాన్ని సృష్టించుకుంటూ.. పసిదాని కోసం ప్రాపంచిక విషయాలన్నీ విడిచిపెట్టి జీవితాన్ని ప్రేమించడం, జీవించడం నేర్చుకున్న వ్యక్తిగా నాన్న పరిపూర్ణ మూర్తిమత్వం అప్పుడే ద్యోతకమవుతుంది.
నాన్నప్రేమను అంచనా వేయడం ఎవరికైనా కష్టమే. సంసార నౌకను సాఫీగా సాగించగల సరళత్వమూ, సంక్షోభిత సమయాల్లో నిలకడగా నడిపించగల సామర్థ్యం నాన్న నుంచే ఎవరికైనా అలవడేది. ఎదుగుతున్న పిల్లల భవితవ్యానికి దిగులుదుప్పటిని చుట్టుకుని నిరంతరం తపించిపోతూ తనలోతాను కుమిలిపోతాడు తప్ప ఆశ్రయం కోసం ఎవరినీ యాచించడాయన.
కష్టాల కడలిలో నిరంతరం ఈదుతూనే ఉండే నాన్న, బిడ్డలు కష్టపడితే నాన్న చూడలేడు. కంటనీరెడితే అసలు తట్టుకోలేడు. తన రెక్కలు చల్లగా ఉన్నంత కాలం.. నరాల బిగువు సడలనంత కాలం బిడ్డలను సాకాలి. తన కళ్ల ముందరే అందరూ ఆడుతూ పాడుతూ ఉంటే చూడాలనుకునే నాన్నకి చివరికి కన్నీళ్లూ... కాసిని త్యాగాలు మాత్రమే మిగులుతాయి. పక్కింటి కుర్రాడి ఆటవస్తువు ఏదో ఎత్తుకొచ్చాడనీ తెలిసి గుడ్లురిమి చూసే నాన్న.. బడికెళ్లనని మొండికేసినప్పుడు ఒక్క గద్దింపుతో కర్కశంగా కనిపించే నాన్న... ఏడ్చి ఏడ్చి కన్నీటి చారలు కట్టిన చెంపలను అందరూ నిద్రపోయాక ఆప్యాయంగా ముద్దాడే నాన్న గుండె వెనక ఎంత ఆర్ద్రత ఉంటుందో చిన్నతనంలో ఎవరికీ అర్థం కాదు. మనమూ నాన్నతనానికి చేరువయ్యాక, నాన్నలోని కమనీయతని ఆరారగా రుచి చూస్తున్నాక.. ఆనాటి నాన్న కాఠిన్యం వెనక దాగిన కారుణ్యం కంటి మీద కదలబారుతుంది. నాన్నగా మనకి మనం ఆవిష్కరించుకున్నాక.. కనిపించని ఆ ప్రేమలోని గాఢత లోతెంతో తెలిశాక గుండె బరువెక్కిపోతుంది. అప్రయత్నంగా మనసు నాన్న తాలూకూ జ్ఞాపకాలవైపు ఒరిగిపోతుంది. నాన్న అనే అనుభూతి ఎంత విశాలమైందో మాటల్లో చెప్పలేం.ఆ పదం విస్తృతి అనంతం.
ఆయనో నిస్వార్థజీవి
తన చేతుల్లో తయారవుతున్న కుండ కుదురుగా రావాలి. తన కనుసన్నల్లో ఎదుగుతున్న బిడ్డ బతకనేర్చాలి. బతికేయడమంటే ఏదోలా బతికేయడం కాదు బతుకులో రుచి తెలియాలి. ఆ బతుకునీడలో పదిమంది జీవితాలు తెరిపినపడాలని అనుకుంటాడు కాబోలు నాన్న. అందుకేనేమో చిరిగిన నాన్న చొక్కాజేబు వెనక ఆదర్శాలూ, ఆశయాలూ, దగాపడిన మంచితనాలూ, దివాలాతీసిన అమాయకత్వాలూ అన్నీ కనిపిస్తాయి.
నాన్న అంటే అంతే మరి! హుందాతనం, నిజాయతీ, నలుగురికీ మంచి చేయాలనే తపన, కుటుంబ విలువలను వల్లెవాటుగా వేసుకుని మంచిగంధం లాంటి చల్లని పలకరింపుతో గుండె నిండుగా నవ్వగల తెగువ.. నాన్నద్వారా పొందగలిగే అరుదైన ఆస్తిపాస్తులివి. నాన్నలందరూ ఇలాంటి వారసత్వాన్ని ఇవ్వాలనే కోరుకుంటారు. కానీ, అడ్డాలనాడు మమకారాన్ని పంచిన నాన్నని అవసానంలో మాగాణులు పంచివ్వమని వేధించే బిడ్డలున్న కాలమిది. నాన్న నాకేమిచ్చాడు! అంటూ తండ్రి మీద అలిగిన కొడుకులెందరో నేటి సమాజంలో
నాన్నే ఓ పాఠశాల
అమ్మ స్పర్శతోనో, ఆమె పొదిగిలిలో పొందిన లాలనతోనో బాల్యపు పొరలు మృదువుగా ఉంటాయి. నాన్న ఒడిలోకి చేరాక, నాన్న తిప్పే కథల దీవులలోకి అడుగుపెట్టాక, అనుభవాల బడి ఆవరణలోకి పోయి పుస్తకం తెరిచాక.. అప్పుడా బాల్యానికి, రెక్కలు కట్టుకుని ఎగరగలిగే సత్తువ సమకూరుతుంది. బాల్యపు తొలి అడుగులు అమ్మ ఆసరాతో నడిచినా.. ఆ తర్వాతి ప్రయాణం నాన్నతోనే. ఎంతటి సుదీర్ఘయాత్ర అయినా నాన్న తోడుంటే ఆ దూరతీరాలని అవలీలగా ఈదేయవచ్చు. నాన్నంటే నడక నేర్పించడమే కాదు ప్రపంచాన్ని చూపించేవాడుకూడా...
కడుపు కట్టుకుని.. బంధాలంటూ కాళ్లకు చుట్టుకుని.. ఒళ్లంతా పొలంలో ఎండబెట్టుకుని ఇంటికొచ్చే నాన్న పిల్లలతో కళకళలాడుతున్న ఇంటిని చూసి తృప్తినిండిన కళ్లతో జీవితాన్ని జయించిన వీరుడి నిష్క్రమణలా పడమటి కొండలవైపుగా ముఖంపెట్టి పడుకుంటాడు, ఇంతకంటే మనిషికి పెద్ద పెద్ద కోరికలవసరం లేదనుకొనే నాన్నను ఏ దేవుడి పక్కన నిలబడితే ఏ దేవుడు సరితూగుతాడు నాన్న స్థాయికి.
తరతరాల జ్ఞానవాహినిగా ఆ జ్ఞాపకాల స్ఫూర్తిని ప్రవహింపజేయడం కోసం నాన్నతనంలోకి మనం ఎప్పటికైనా ఆవాహన చెందాల్సిందే! నా జీవం నా సారం చీల్చిచూసుకుంటే.. నాన్నే నాలో జీవిస్తున్నాడనే దృఢకాంక్షతో ముందు నాళ్లను మరింత ఉత్సాహంగా ఎదురీదాల్సిందే! ఎందుకంటే అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని గుండెలో నింపేందుకు అందరిలోనూ నాన్న ఉన్నాడు. ఉజ్జ్వలమైన దీపశిఖలా లోలోన వెలుగుతుంటాడు.
🙏🌹🙏🌹🙏🌹
No comments:
Post a Comment