Saturday, June 18, 2022

శ‌ఠ‌గోపం వెన‌క దాగివున్న ర‌హ‌స్యం?

శఠగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు. గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తారు. 


ఆలయ పూజారి శఠారిని తీసుకువచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహ బుద్ధులు నశిస్తాయని చెబుతారు. అంతే కాదు శఠగోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా వినిపించ‌నంతగా కోరికను తలుచుకోవాలని పండితులు చెబుతారు.


భ‌గ‌వంతుడి పాదాల చెంత మ‌న కోరిక‌లు..

శఠగోపాన్ని కొన్ని ప్రాంతాలవారు శఠగోపం, శడగోప్యం అని అంటారు. భక్తులు దేవాలయంలో ప్రదక్షిణలు చేసి దర్శనమ‌య్యాక  తీర్థం, శఠగోపం తీసుకుంటారు. 


శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైనవాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది. వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి. ఇది తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచుతారు. 


శఠగోపం పెట్టినప్పుడు మ‌న కోరిక‌ల‌ను తల‌చుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్ల‌వుతుంది. శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా అర్ధం. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది అంద‌రి భావ‌న‌. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు.


సైన్స్ ప‌రంగా ఎన్నో ఫ‌లితాలు?

శఠగోపం తలమీద పెట్టించుకోవడం వలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా ఎన్నో ఫలితాలు కలుగుతాయి. శఠగోప్యమును తలమీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌.., దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బ‌య‌ట‌కెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళన‌, ఆవేశం తగ్గుతాయి. 


శఠగోపం మీద  స్వామి / అమ్మవారి పాదాలుంటాయి. అంటే మనం కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే శఠగోప్యము. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది.


 దేవాలయంలో దర్శనమ‌య్యాక తీర్థం, శఠగోప్యం తప్పక తీసుకోవాలి. చాలమంది దేవుడి దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చకచకా వెళ్ళి ఏకాంత ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి శఠగోప్యం పెట్టించుకుంటారు.


 మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుంచి దూరంగా ఉంటామని తల‌స్తూ తలవంచి తీసుకోవటం మరో అర్థం.


 సహజంగా చిల్లర లేకపోవటం వల్ల చాలామంది శఠగోపం పెట్టించుకోకుండా వేదిలేస్తుంటారు. అలా చేయ‌కుండా శ‌ఠ‌గోపం పెట్టించుకొని భ‌గ‌వంతుని పాదాల‌వ‌ద్ద మ‌న కోరిక‌ను మ‌న‌సులో చెప్పుకోవాల‌ని పండితులు సూచిస్తున్నారు. ఇక‌నుంచి మీరు కూడా ఎప్పుడైనా దేవాల‌యానికి వెళ్లిన‌ప్పుడు శ‌ఠ‌గోపం క‌చ్చితంగా పెట్టించుకోండి.

సేకరణ

No comments:

Post a Comment