భగవాన్ రమణ మహర్షి నిత్య పారాయణం
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
అధ్యాయము 6
ఈశ్వరుని పిలుపు
భగవాన్ ఆత్మానుభూతి పొందిన తరువాత వారిలో మార్పు వచ్చి వారి జీవితమే మారిపోయినది . ఒకసారి భగవాన్ ఇంగ్లీషు వ్యాకరణము చదవకపోవుట వల్ల వారి ఉపాధ్యాయులు శిక్షగా ఆ వ్యాకరణమును మూడుసార్లు చూచి వ్రాయమని ఆజ్ఞాపించగా భగవాన్ రెండుసార్లు రాసి ఒక్కసారిగా వారి చేతిలోనున్న పుస్తకాలను విసిరివేసి ఎందుకూ పనికిరాదని భావించి ధ్యాన నిమగ్నములో ఉండిపోయినారు . ఈ విధముగా భగవాన్లో ఒక్కొక్కటి దూరము అవుతూ తత్వములో మునిగిపోతున్న భగవానుని ప్రవర్తనము వారి అన్నగారు గమనించి “ జ్ఞానిలా ధ్యానములో కూర్చుని ఉన్నవారికి చదువెందుకు ? ఎక్కడికైనా పోరాదా ? " అని మందలించగా అన్నగారి కోపతాపాలే ఈశ్వరుని పిలుపుగా భావించి అరుణాచలమునకు పయనమవుటకు నిశ్చయించుకున్నారు . పాఠశాలలో క్లాసు ఉన్నదని చెప్పి ఆగష్టు 29 వ తేదీ 1896 వ సం || న శనివారం మధ్యాహ్నం 12 గం || లకు ఇల్లు వదిలి వెళ్ళుటకు సిద్ధపడినారు . ఆ విషయము తెలియని భగవాన్ గారి అన్నగారు 5 రూ || లు ఇచ్చి అతని కాలేజీ ఫీజు కట్టమని భగవాను ఆదేశించినారు . భగవాన్ ఒక పాత అట్లాస్ పుస్తకము తీసుకుని తిరువణ్ణమలై ( అరుణాచలం ) వెళ్ళడానికి దారి కనుక్కుని వారి ప్రయాణమునకు 3 రూ॥లు చాలునని మిగిలిన 2 రూ॥లు వారి అన్నగారి పెట్టెలో పెట్టి ఒక జాబు వ్రాసి వెళ్ళిపోయినారు .
భగవాన్ వ్రాసిన ఉత్తరములోని ముఖ్యాంశములివి -
1. “ నేను నా తండ్రిని వెతుకుచూ నా తండ్రి ఆజ్ఞానుసారము బయలుదేరితిని . ”
భగవాన్ సాక్షాత్తు కుమార స్వామి అవతారమని ముందు చెప్పబడినది . కుమారస్వామి తండ్రి పరమశివుడు తిరువణామలైలో ఉన్నది ఆ అరుణాచలేశ్వరుడే . కావున తన తండ్రి ఆజ్ఞా ప్రకారము భగవాన్ బయలుదేరినారనే భావన 2 . “ ఇది సత్కార్యమునకే బయలుదేరుచున్నది . ”
సామాన్యముగా నేను సత్కార్యమునకే బయలుదేరుచున్నాను అని వ్రాసెదరు . కాని భగవాన్ ' నేను'కు బదులుగా ' ఇది ' అని అన్నారు . ఇక్కడ ' ఇది ' అంటే దేహము కాదు ఆత్మమాత్రమే . భగవాను ఆత్మ సాక్షాత్కారము కలిగిన పిదప ' నేను ' అని సంభోదించుటయే మానివేసినారు . వారు శరీరమని మరచి పోయినారు . వారు ఆత్మగా భావించినారు . కావుననే ' ఇది ' అని వ్రాసినారు . “ సత్కార్యమునకే బయలుదేరుచున్నది " ఇందులో కూడా ' బయలు దేరుచున్నాను ' అనుటకు బదులు ' బయలుదేరుచున్నది ' అనుటకు వారు ఆత్మ కావుననే ' బయలు దేరుచున్నది ' ( అనగా ఆత్మ బయలుదేరుచున్నదని ) సంభోదించినారు . భగవాన్ ' నేను ' అనే పదమును ఎక్కడ వాడలేదు . అయితే మొదటి దానిలో నేను నా తండ్రిని వెతుకుచూ అని వ్రాశారు కదా ! అని ప్రశ్నిస్తే వారి తండ్రి ఈశ్వరుడు ప్రతి జీవిలో ఆత్మరూపేణ కొలువున్నవాడే ఈశ్వరుడు . భగవాన్లో వున్నది ఆ ఈశ్వరుడే . " నేను నా తండ్రిని వెతుకుచు " అనగా ఆత్మను ఇంకా అన్వేషించుటకని భావం .
దీనిని వెతుకుటకు ఏ మాత్రమును ద్రవ్యమును ఖర్చు పెట్టనక్కరలేదు .
ఇక్కడ కూడా “ నన్ను వెతుకుటకు ” బదులుగా దీనిని అనగా ఆత్మను వెతుకుటకు డబ్బు ఖర్చు పెట్టనక్కర లేదని ఆత్మకు డబ్బుతో ఏమి పని ? అదే నన్ను వెతుకుటకు అని సంభోదించినా రమణుడనే శరీరము అనే అర్ధము వచ్చును .
భగవాన్ వ్రాసిన లేఖలో అతి ముఖ్యమైనది చివరిగా ఇట్లు అనుచోట వారి పేరుగాని సంతకముగాని లేదు . కేవలము ఒక ------ ( గీత ) పెట్టినారు . దీనిని బట్టి భగవాను ఆత్మభోద కల్గిన పిదప వారు తానొక శరీరమని వారికి నామరూపములు కలవని భావింపక వారొక ఆత్మ అని ' నేను ' అంటే శరీరము కాదని లోనున్న ఆత్మయే నేనని భావించినారు .
ఆత్మజ్ఞానము గురించి తెలిసికొనవలెనని జిజ్ఞాస కలవారందరు భగవాన్ మార్గము నెన్నుకొని భగవాన్ ప్రవర్తనను వారి చర్యలను ఆదేశానుసారముగా తీసికొని ఆత్మజ్ఞానిగా మారవలెను . అందుకు భగవాను శరణు వేడాలి . అటువంటి ఫలాపేక్ష లేని మనస్సుతో మనస్సు సైతం అనన్య శరణాగతి చెంది భగవాను శరణువేడుదాం . రమణుడే శరణాగతి .
అరుణాచల శివ.
No comments:
Post a Comment