Saturday, December 24, 2022

శ్రీ రమణ మహర్షి అభేదభావం

 *🧘‍♂️81 - శ్రీ రమణ మార్గం 

*🧘‍♂️శ్రీ రమణ మహర్షి సందేశం🧘‍♀️*
*అభేదభావం*

హెచ్చు తగ్గులు లేనివాడు అరుణాచల రమణుడు; సృష్టిలో ఏ ఒక్కరినీ ఎక్కువగానూ తక్కువగానూ పరిగణించిన వాడు కాదు. జీవితాంతం అలాగే బ్రతికాడు. పండితుడని కానీ పామరుడని కానీ తేడా చేయలేదు. విదేశీయుడు స్వదేశీయుడు, హిందూ మతస్థుడు, ఇస్లాం మతస్థుడు అనే భేదాలు పాటించేవాడు కాదు. ఆయనకు కులభేదం, లింగ భేదం కూడా కనిపించేది కాదు.

 ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన కేవలం మానవుడు, భేద భావమెరుగని మనిషి. సృష్టిలోని జీవరాశిలో ఎవరికి 
ఏ బాధ కల్గినా ఓర్వగలిగేవాడు కాదు. ఒకనాడు కొండ మీది నుండి దిగివస్తూ, ఏదో ఒక ఉడతను ఓ కుక్క తరిమి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు గమనించి, ఆ ఉడుత ప్రాణం రక్షించడానికి తన చేతి కర్రను విసిరేశాడు. కుక్క ప్రయత్నం విఫలమయింది. ఉడుత తన ప్రాణాన్ని రక్షించుకుని వెళ్ళిపోయింది. కానీ రమణుడు, కర్ర సహాయం లేని కారణం చేత పక్కకు ఒరిగి కిందపడి మెడ వద్ద ఎముక విరగ్గొట్టుకున్నాడు.

పూజార్థమే అయినప్పటికీ, ఒక చెట్టు మొక్కనున్న పూవులన్నిటినీ కోసి, చెట్టున ఒక్క పువ్వు కూడా మిగల్చకుండా పూలసెజ్జలో పోగేసుకుంటున్న ఒక ఆశ్రమ భక్తురాలిని వారిస్తూ, “ఈ పూలన్నీ పెట్టి పూజిస్తే కానీ దేవుడు ఒప్పుకోనన్నాడా?” అని సున్నితంగా వేళాకోళం చేసి, చెట్టును ఎప్పుడూ అలా దిగదుడిచినట్లు ఉన్న పూలన్నీ కోసి అంద వికారంగా చేయవద్దన్నాడు. సున్నితత్వం లోపించిన దైవ పూజైనా ఆయనకు సమ్మతం కాదు. దేవుడూ, ఆ దేవుడు సృష్టించిన పుష్పమూ రెండూ కూడా రమణుడి దృష్టిలో సమానమే. అంటే ఆ మహాశక్తిని అన్ని చోట్లా దర్శిస్తుండే వాడన్న మాట.

ఒకసారి ఆశ్రమంలో భోజన సమయం సమీపించింది. రమణుణ్ణి రమ్మనమని కబురు పంపించి, మిగతా వారంతా భోజనానికి ఆసీనులయారు. మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న రమణుడికి బయలు దేరడం కాస్త ఆలస్యమయింది. తీరా రమణుడు తలుపు దాటి భోజనశాలలోకి వెళ్ళేలోగా, వీపు మీద కంబళీ వేసుకున్న పాలవాడు ఒకడు అటు వచ్చాడు. రమణుడు ఓ క్షణమాగి, “చిన్నప్పయ్య కదూ?” అని గుర్తుపట్టాడు. “అవును స్వామీ, నేనే" అని సగౌరవంగా పలికాడు ఆ వ్యక్తి. “బాగున్నావా చిన్నప్పయ్యా? నన్ను చూడడానికి వచ్చావా? మంచిపని చేశావు. ఏమిటా కుండలో చిన్నప్పయ్యా? గంజి ఏమన్నా తెచ్చావా?” అని అడిగాడు రమణుడు ఆప్యాయంగా.

 “అవునయ్యా గంజే” అన్నాడు అతడు, కాస్త సిగ్గుపడుతూ. “అయితే ఇంకేం? ఇట్లా పొయ్యి మరి" అంటూ రమణుడు చేతికర్రను పక్కకు పడేసి, రెండు చేతులతోనూ దోసిలొగ్గి ముందుకు వంగాడు. పాలవాడు దోసెట్లో గంజిపోస్తూ వుండడం, రమణుడు నిస్సంకోచంగా తాగడం, స్వామి తన గంజిని తాగుతున్నాడని చిన్నప్పయ్య ముఖం మీది సంతోషం, అమృతమే తాగుతున్నానన్నట్లుగా స్వామి ముఖం మీది ఆనందం చూచిన ఆశ్రమవాసులకు మాత్రం ఈ వ్యవహారం వింతగానూ విడ్డూరంగానూ కనిపించింది. అక్కడ పంక్తి భోజనానికై ఎదురు చూస్తున్న వారి ఆకలినీ, 
ఒకింత ఆగ్రహాన్ని, పట్టించుకోకుండా స్వామి ఇట్లా చేయడం, ఆయన్ని మళ్ళీ పిలవడానికి వచ్చిన వారికి ఏమాత్రం నచ్చలేదు.

 “అదేమిటి స్వామీ, అక్కడ అందరు ఎదరుచూస్తుంటే, మీరిక్కడ ఈ పాలవాడు పోస్తున్న గంజి తాగుతూ -" అని తమ చిరాకును కొద్దిగా ప్రదర్శించారు. ఓ మాదిరి చిరుకోపం రమణుడు కూడా ప్రదర్శించగలిగేవాడు, : “ఏమి ఎందుకు తాగకూడదు? నేను మీ కోసమే ఉన్నానా? నేనొకప్పుడు కొండ మీద ఉండే రోజుల్లో మీరంతా వచ్చి నన్ను పోషించారా? అప్పుడు నేనెవరికీ అవసరమనిపించలేదే? ఈ గొల్లవాళ్ళే ఆ రోజుల్లో తమ గంజిలో నాకింత పోస్తుండేవారు. ' అంటూ భోజనశాల వద్దకు బయలుదేరాడు.

ఒక విదేశీ వనిత, వయసులో బాగా పెద్దది, స్థూలకాయురాలు కూడాను. ఆవిడ రమణుడి సమక్షంలో కాళ్లు ముందుకు చాపి కూచొని వుంటే, ఆశ్రమంలోని శిష్యులు అవిణ్ణి స్వామివారి ముందు కాళ్లు ముడుచుకు కూచోవాలని సౌంజ్ఞ చేసి వెళ్ళారు. కానీ వారటు వెళ్ళగానే, ఆవిడ తనకుండే బాధ కారణాన మళ్ళీ కాళ్ళు జాపుకున్నది. శిష్యులు ఆవిణ్ణి మళ్లీ హెచ్చరించడానికి ప్రయత్నించబోగా, ఇదంతా గమనిస్తున్న రమణుడు, “ఊరుకోండి 
ఆవిణ్ణి అలాగే కూచోనివ్వండి. పాశ్చాత్యులకు కాళ్లు ముడుచుకోడం ఏమిటో తెలీదు. దానికి తోడు ఆవిడ పెద్దదైపోయింది. కాళ్లెలా వొంగుతై? ఈ లెక్కన మోకాళ్ళ నొప్పి వున్న నేను కూడా కాళ్ళు ముడుచుకు కూచో మంటారా ఏమిటి?” అనేశాడు అక్కడి శిష్యులతో.

ఇట్లా ఎన్నెన్నో సంఘటనలు, కానీ అందర్నీ సమాన దృష్టితో చూచిన ఈ మహానుభావుణ్ణి గురించి ఆయన శిష్యులు ఒకసారి ఎలా పొరబడ్డారో చూడండి. కావ్యకంఠ గణపతి ముని అంటే రమణుడికి ఎంతో ఇష్టం. తాను ఏదైనా రాస్తే అది గణపతి మునికి చూడమని ఇచ్చేవాడు; గణపతి ముని పాండిత్యం, విజ్ఞానం మీద రమణుడికి అంత గురివుండేది. రమణుడి మైత్రీభావం, గణపతిశాస్త్రి యెడల ఆయన కుండే గౌరవాభిమానాలు అటుంచి, స్వతహాగా గణపతి ముని ఆనాటి భారతదేశంలో మహా విద్వాంసుడుగా పరిగణన పొందినవాడు, కావ్యకంఠబిరుదాంకితుడు. రమణుణ్ణి, అతడి ఆప్తమిత్రుడైన గణపతి మునిని కలిపి ఒక ఫోటో తీస్తే బాగుంటుందని ఒక భక్తుడికి గాఢంగా కోరిక కలిగింది.

 రమణుడు అంగీకరించిన అనంతరం, బావి వద్ద ఒక జంపకాణ పరిచారు. రమణుడు ఆసీనుడవడానికి దాని మీద ఒక సోఫా వేశారు. గణపతిశాస్త్రి రమణుడి పాదాల వద్ద కూచున్నాడు. కానీ రమణుడు అందుకు అంగీకరించకుండా, గణపతిశాస్త్రిని సోఫాలో తన సరసన కూచోమన్నాడు, శాస్త్రిని బలవంతంగా సోఫా మీద తన పక్కనే కూచుండ పెట్టుకున్నాడు.

ఫోటో తీసిన అనంతరం ఫోటో కాపీలు కొందరి భక్తులకివ్వడం జరిగింది. ఆశ్రమాధికారులు, ఈ ఫోటో సంగతి తెలిసి మండిపడ్డారు. గురువు సరసనే కూచొని ఆధ్యాత్మికతలో ఆయనకు సమానుణ్ణి అన్నట్లుగా ఎవరైనా ఫోటో తీయించుకోవడం వారికి మహాపరాధంగా కనిపించింది. ఫిల్మ్ నెగెటివ్, ఫోటో ప్రింటులు అన్నీ తమ కిచ్చి వేయమని హుకుం జారీ చేశారు. కానీ ఆ ఫోటో గ్రాఫర్ భక్తుడు అందుకు నిరాకరించాడు.

 అటు తర్వాత ఆ ఫోటో గ్రాఫర్ భక్తుడు బ్రతుకు చెడి, ఆత్మహత్య చేసుకున్నాడని ఆ వ్యాసంలో వ్రాసి ఉన్నది. రమణుడు, శాస్త్రిని తనతో ఎందుకు అట్లా కూచోబెట్టుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదని మరో వాక్యమున్నది. అందరిలో ఉన్న బలహీనతలు వెలికి తీసుకురావడానికే రమణుడు ఆ పని చేసి వుంటాడని మరో అర్థాన్ని వెలికితీశారు. ఆ
ఈ వ్యాఖ్యలన్నీ ఎంత అసందర్భమైనవో పాఠకులు గమనించే వుంటారు. గణపతి శాస్త్రి రమణుడి పాదాల వద్ద కూచున్నప్పటికీ, రమణుడు బలవంతంగా శాస్త్రిని పైకి లేవ దీసి సోఫాలో కూచోబెట్టుకోడం రమణుడి తప్పందామా, లేక శాస్త్రి అలా కూచోడం తప్పు అని తేలుద్దామా? రమణుడి అంగీకారంతో తీసిన ఆ ఫోటో నెగటివ్ తిరిగి ఇవ్వనని, ఆ ఫోటోగ్రాఫర్ భక్తుడంటే, అలా తిరస్కరించినందు వల్లనే అతడు నాశన మయ్యాడని అనడం ఏమి సబబు?

రమణుడు మహనీయుడు. అలాంటి వాడికి గురువూ లేడు, శిష్యుడూ లేడు, పెద్దా లేదు, చిన్నా లేదు. ఉన్నదల్లా మహానుభవమే, భావభక్తే. విశ్వమానవుడిగా ఎదిగిన రమణుడు తన అనుంగు మిత్రుణ్ణి ఎక్కడ కూచోబెట్టుకుంటే మాత్రం అతడి కొచ్చిన కొదవేమిటి? అనాటి ఆశ్రమాధికారుల్లో ఈ అవగాహన లోపమే కనిపిస్తుంది కానీ రమణుడు, గణపతిశాస్త్రి, ఫోటోగ్రాఫర్ భక్తుడూ, ఈ ముగ్గురిలోనూ నాకే దోషమ కనిపించడం లేదు.

*కర్తృత్వ భారం*

రైలు బండిలో ప్రయాణం చేసేవాడు తన నెత్తిమీద బరువు దించుకోకపోతే అది అతని తప్పే అవుతుంది. అతడా బరువు దించి వేసుకోవడం అవసరం. అతనితోపాటు ఆ దించిన సరుకు కూడా తుదకు గమ్యం చేరి తీరుతుంది. అట్లే ఈ జగత్తులో మనం కర్తృత్వ భారం తలనిడుకోరాదు. జగత్ నియంతపై 
ఆ భారం వదిలి కూర్చొనడం మంచిది. 

No comments:

Post a Comment