Monday, January 9, 2023

🌻బుద్ధునిపై బండరాయి తోసి బుద్ధుణ్ణి చంపాలని ప్రయత్నించిన దేవదత్తుడు

 *🌻బుద్ధునిపై బండరాయి తోసి బుద్ధుణ్ణి చంపాలని ప్రయత్నించిన దేవదత్తుడు*


*🌸దేవదత్తుడు బుద్ధుడు నెలకొల్పిన బౌద్ధ భిక్షువుల సంఘాన్ని చీల్చడానికి ప్రయత్నాలు చేశాడు. దేవదత్తుడు భిక్షువుగా మారినప్పటికీ తనలోని మాలిన్యాలను వదులుకోలేదు. నిరంతరం అసూయ, ఆధిపత్యంతో ఉండేవాడు. బుద్ధుడు నెలకొల్పిన భిక్షువుల సంఘానికి తనను నాయకునిగా నియమించాలని బుద్ధునిపై ఒత్తిడి తెచ్చేవాడు.బౌద్ధ ధమ్మంలో అలాంటివేమీ లేవు.పైగా భిక్షువుల సంఘానికి మార్గదర్శనం వహించే భిక్షువులు ఉంటారు కానీ పెత్తనం చేసే ధోరణి గల వాళ్ళు,అధికారం దర్పం చూపించే  భిక్షువులు ఉండరు.అందుకే బుద్ధుడు తన సంఘానికి ఎలాంటి వారసులు ఉండరు అని చెప్పారు.బుద్ధుడు కూడా మార్గదాతగానే ఉన్నారు.*

*👉ఇంతకీ ఈ దేవదత్తుడు స్వయానా బుద్ధునికి వరసకు సోదరుడు అవుతాడు.దేవదత్తుడు మూడుసార్లు బుద్ధుణ్ణి చంపాలని ప్రయత్నాలు చేశాడు.ఒకరోజున బుద్ధుడు గిరిధర కూటం పర్వతాన్ని దాటుకొని వెళుతున్నప్పుడు దేవదత్తుడు ఒక పెద్ద బండను బుద్ధుని మీదకు దొర్లించి చంపేయాలని ప్రయత్నం చేసాడు.అయితే ఆ బండరాయి దొర్లుతూ దొర్లుతూ మధ్యలోనే నిలిచిపోయింది.ఆ బండరాయి ఒక ముక్క విరిగి పడి బుద్ధుని కాలికి తగిలింది.బుద్ధుని పాదానికి ఆ విరిగిన బండరాయి ముక్క తగలడంతో రక్తం కారింది.బుద్ధుని పాదానికి తగిలిన దెబ్బకు.జీవకుడు అనే వైద్యుడు బుద్ధునికి వైద్యం చేసాడు.*

*🪷నేటి మన సమాజంలో కూడా ఇంకా ఆధిపత్యం, అహంకారం, స్వార్థం గల మనుషులు ఉన్నారు. ఇది మన దౌర్భాగ్యం కొలదీ సామాజిక పరివర్తన కొరకు పనిచేసే మిషనరీ మరియు సంఘాలలో ఎక్కువగా కనబడుతున్నారు. ఏవేవో స్వార్థ ప్రయోజనాల కోసం చిల్లర మనస్తత్వం, దుర్భుద్ధితో కొందరు ఉంటున్నారు.ఇలాంటి వాళ్ళకి మానసిక ఎదుగుదల కొరవడుతుంది.*

*🌺మనతో సఖ్యతగా ఉంటూనే ,ప్రేమగా నటిస్తున్న వారు ఉన్నారు. పైకి ప్లాస్టిక్ నవ్వులు నవ్వుతూ,అసూయ, ఓర్వలేని తనంతో మనం లేనప్పుడు మన వెనకాల మన గురించి చెడుగా చెబుతుంటారు.ఇలాంటప్పుడు మనం ఓరిమితో, సహనంతో వ్యవహరించడం అలవరుచుకోవాలి.దగుల్భాజీలు, దుర్మార్గులు మన గురించి చెడుగా ఎంతగానో ప్రచారం చేస్తుంటారు. మనం మాత్రం పట్టించుకోవడం మానేయాలి.మనం ఏమిటి అనేది మన మనసుకు తెలుసు.కపటులు పట్ల కూడా మైత్రితో మెలగాలని బుద్ధుడు అంటారు.అయితే  ఈరోజుల్లో ఇది కష్టమే.. అలాంటి వారితో మనం అనవసర గొడవలు జోలికి పోరాదు.దీనివల్ల పగ, శత్రుత్వం పెరగటానికి అవకాశం ఉంటుంది.ఎరుక కలిగి మనం ఇలాంటి వారితో జాగ్రత్తగా నడుచుకోవాలి. తప్పుడు పద్ధతిలో నడుచుకునే వాళ్ళకి తమ తప్పులు గుర్తెరిగేలా చేయడం కోసమైనా వారితో మనం  ప్రేమ, దయను కలిగి ఉండాలి. తప్పుడు మార్గంలో ఉన్నవారిని మనం ద్వేషించకుండా వారిని మన మైత్రీ భావనతో మార్చుకోవాలి.*

No comments:

Post a Comment