*🪷బుద్ధ ధర్మమే ప్రపంచానికి రక్ష🌸*
*🌼సాటి మనుషులతో మంచి అనుబంధాన్ని కలిగి వుండటానికి, అతడికి ఆరోగ్యవంతమైన శరీరం వుండాలి. అదేవిధంగా శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి అతడి ప్రజ్ఞ కూడా వికాసం చెంది వుండాలి. లేకపోతే మానవ జీవితం ఎంతమాత్రమూ వికాసం చెందలేదు.*
*🌺ఎందువల్ల మనిషి యొక్క శరీరం, మేధ జబ్బు పడివుంటున్నాయి? అతడి శరీరం జబ్బుపడి వుండటం ఒక కారణం, అతడి మేధకు ఎటువంటి ఆసక్తి లేకపోవడం. ఇవే కారణాలు, ఆసక్తి గానీ, ఉత్సాహం గానీ లేని మేధ వల్ల మనిషికి ఎటువంటి ప్రగతి వుండదు. మరి యిటువంటి ఆసక్తి గానీ, వుత్సాహం గానీ అతడికి ఎందుకు వుండటం లేదు? దానికి ముఖ్య కారణం ఏమిటంటే, అతడు ఆ విధమైన ఆసక్తి, వుత్సాహమూ లేని స్థితిలోనే వుంచబడటం, అలాగే వుండిపోయేలా చేసే పరిస్థితే తప్ప దానినుండి బయటపడే ఎటువంటి అవకాశమూ అతడికి లేకపోవడం, లేకుంటే అతడిలో అటువంటి ఆశే చచ్చిపోయి వుండటం... యివే కారణాలు. అలాంటి పరిస్థితుల్లో అతడు ఉత్సాహవంతుడిగా ఎలా వుండగలడు? అతడు అలాగే జబ్బు పడిన స్థితిలోనే వుండిపోతాడు.*
*🌺ఏ మనిషి అయితే తాను చేసిన వనుల యొక్క ఫలితాన్ని అనుభవించగలుగుతాడో, అతడికి మరింత ఆసక్తి, ఉత్సాహమూ పుడతాయి. అలా గాకుండా, ఒక ఉపాధ్యాయుడు, ఫస్టుక్లాసు తెచ్చుకున్న ఒక మహరు కుర్రవాడ్ని చూసి, చిరాకుగా, ద్వేషంగా, ఎహె, ఎవడ్రా వీడు? వీడు మహర్ కులం వాడు, యిటువంటి నీచకులస్థుడు ఫస్టు క్లాసు తెచ్చుకోవడమా? ఫస్ట్ క్లాస్ ఎందుకితడికి? ఇతడు వుండవలసింది ధర్డు క్లాసులో మాత్రమే.. ఫస్టు క్లాసు తెచ్చుకోవలసింది బ్రాహ్మణుల కుర్రాడు. మాత్రమే' అనేటటువంటి పరిస్థితులల్లో ఎటువంటి ఆసక్తి, ఉత్సాహాలను ఆ నిస్సహాయ కుర్రాడు పొందగలడు? అతడేవిధంగా అభివృద్ధి చెందగలడు?*
*🌹"ఎవడికైతే సృజనాత్మక శక్తి అతడి మేధలో వుంటుందో, ఎవడికైతే దేహమూ, మనసూ ఆరోగ్యవంతంగా, బలంగా వుంటాయో, ఎవడైతే ధైర్యసాహసాలు కలిగి వుంటాడో.. ఎవరికైతే అన్ని వ్యతిరేక పరిస్థితులు తట్టుకుని నిలబడగల ఆత్మవిశ్వాసం పుష్కలంగా వుంటుందో అతడిలో మాత్రమే ఆసక్తి, వుత్సాహాలు పుడతాయి, అటువంటివాడు మాత్రమే వికాసం చెందుతాడు", అనేటటువంటి దారుణమైన తాత్విక చింతన హిందూమతంలో ప్రవేశపెట్టబడి వుండటంతో, అసలు హిందూమతంలోనే అటువంటి ఆసక్తి, వుత్సాహమూ చచ్చిపోయాయి.*
*🌸మనిషిని నిరుత్సాహంలో ముంచే పరిస్థితులు వేల సంవత్సరాలుగా యీ దేశంలో ఆవరించబడివుండటంతో యించుమించు దేశీయులు అందరూ పొట్ట నింపుకోవడం కోసం గుమస్తా ఉద్యోగాలు మాత్రమే పొందగలుగుతున్నారు. అంతకంటే యింకేం జరుగుతుంది? ఈ గుమాస్తాలనందర్నీ రక్షించడానికి మరో పెద్ద గుమస్తా అవతరిస్తాడు. అంతే.*
*🌻ఆసక్తి, ఉత్సాహం, సృజనాత్మకతలు అనే వాటి వెనుక మనిషి ప్రజ్ఞ వుంటుంది అనేదానికి కారణం ఏమిటి? మీకు తెలుసు, మిల్లు ఓనర్లు ఎలా వుంటారో. వాళ్ళు తమ మిల్లుల్లో పనులు తాపీగా జరిగిపోవడానికి మేనేజర్లని నియమించుకుంటారు. వారిచేత వారికి కావలసిన మిల్లు పనులన్నీ పూర్తయ్యేలా చేసుకుంటారు. వాళ్ళు మాత్రం వేరే దురలవాట్లలో మునిగి వుంటారు. వారింకేం మానసికంగా నాగరీకులుగా, సంస్కారులుగా అభివృద్ధి చెందుతారు?*
*🌷ఎప్పుడైతే మనం మన మనసులో వుత్సాహాన్నీ, ఆసక్తినీ నింపుకుంటామో, దాంతో మనలో చదవాలన్న, యింకా తెలుసుకోవాలన్న బుద్ధి పుడుతుంది. నేను అత్యంత సాదాసీదా బట్టలతో నా చదువు మొదలు పెట్టాను. స్కూల్లో నాకు కనీసం మంచినీళ్ళు కూడా దొరికేవి కావు. స్కూలులో ఎన్నో రోజుల పాటు దాహంతోనే వుండిపోవలసివచ్చేది. బొంబాయిలో పేరు పొందిన ఎలిఫిస్టన్ కాలేజీలో కూడా యిదే పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో ఎటువంటి గొప్ప విషయాలు పుడతాయి? కేవలం గుమస్తాలు మాత్రమే యిటువంటి కాలేజీల నుంచి పుడతారు.*
*📘సౌజన్యం : దుక్ఖ విముక్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఏ మార్గంలో?*
*బుద్ధ ధర్మమే ప్రపంచానికి రక్ష*
*రచన : ✍️బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్*
*అనువాదం : ✍️డి. నటరాజ్*
*👉ఇంకా ఉంది*
No comments:
Post a Comment