Thursday, September 28, 2023

బ్రహ్మసూత్రాలు - తెలిపేవీ, నడిపేవీ

 -------------
బ్రహ్మసూత్రాలు - తెలిపేవీ, నడిపేవీ 
-----------------------

 
బ్రహ్మ లేదా బ్రహ్మన్ అంటే నిరాకారమైన పరమాత్మ. అన్నిటికీ మించిన అంతటా పనిచేస్తూ ఉన్న సర్వాంతర్యామి బ్రహ్మ(న్). ఇక్కడ బ్రహ్మ ఆంటే నాలుగు తలల పౌరాణిక బ్రహ్మ కాదు. మహానిర్వాణ తంత్రం దేవతల్ని పూజిస్తే ఆ పూజ బ్రహ్మన్ చేత స్వీకరించబడుతుందని తెలియజేస్తోంది. బ్రహ్మన్ అన్ని శక్తులకు ఆది శక్తి. సూత్రం అంటే తెలియజేసే సూచిక (Clue లేదా Hint). బ్రహ్మ సూత్రాలు బ్రహ్మన్ గురించి తెలియజేసే సూచికలు లేదా బ్రహ్మన్ ను తెలుసుకునేందుకై మనకు ఇవ్వబడ్డ సూచికలు. ఋషి బాదరాయణుడు ఈ బ్రహ్మ సూత్ర రచన చేశారు. ఇవి మొత్తం 555. వైదికంగా (హిందు మత పరంగా అనడం సరికాదు) లేదా సనాతన ధర్మం పరంగా ప్రస్థానత్రయంలో ఉపనిషత్తుల తరువాతి స్థానం ఈ బ్రహ్మ సూత్రాలది. ఆది శంకరాచార్యులు ఈ బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాసిన తరువాత ప్రపంచానికి ఇవి మరింత చేరువయాయి.
 
మొట్టమొదటి బ్రహ్మ సూత్రం “అథాతో బ్రహ్మ జిజ్ఞాస”. బ్రహ్మ జిజ్ఞాస అన్నది ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానంగానూ, “ఇదుగో ఇందుకే బ్రహ్మ జిజ్ఞాస” అన్నదాన్ని తెలియజేస్తూనూ తొలి బ్రహ్మ సూత్రం మనల్ని ముందుకు తీసుకువెళుతోంది. సంస్కృతంలో ఏ రచననైనా అథ శబ్దంతో మొదలు పెట్టడం సంప్రదాయం. “అథ” అంటే శుభం అని అర్థం. శుభం(అథ) కనుక(అత:) బ్రహ్మ జిజ్ఞాస అని తొలి బ్రహ్మ సూత్రానికి తాత్పర్యం. మరొకటి కాదు. ఏ జిజ్ఞాస వల్ల శుభం కలుగుతుందో అది బ్రహ్మ జిజ్ఞాస. మరి ఏది బ్రహ్మ? మరో సూత్రం దానికి సమాధానం చెబుతోంది. “జన్మాదస్య యత:” అని. ఉత్పత్తి లేదా సృష్టికి ఆది ఎక్కడినుంచో అది బ్రహ్మ. మరోలా చెప్పుకోవాలంటే ఈ విశ్వానికి ఏది ఆదో అది బ్రహ్మ అని చెప్పుకోవాలి. బ్రహ్మన్ ఎలా తెలిసొస్తుంది? అన్న ప్రశ్నకు సమాధానం మరో సూత్రం చెబుతోంది ”తత్తు సమన్వయాత్” అని. ఇక్కడ “తత్” అంటే బ్రహ్మ. తత్, తు, సమన్వయాత్. బ్రహ్మన్ సమన్వయం చేత మాత్రమే. ఇక్కడ సమన్వయం అంటే కలయిక (సింతసిస్. కోఆర్డినేషన్ కాదు). ఆలోచిస్తే ఈ కలయిక అనేదే లేకపోతే మనకు మైత్రి, ప్రేమ, బంధం, అనురాగం వంటివి ఉండవు కదా? ఈ సమన్వయాన్ని మనం రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి యోగులలో చూడచ్చు. యోగం అన్న పదం కూడా ‘యుజ్’ అంటే ‘కలయిక’ నుంచి వచ్చిందే. “బ్రహ్మన్ అనేది చూడబడేది కాదు. అది శబ్దం కాదు” ‘ఈక్షతేర్న అశబ్దం’ అని మరో సూత్రం చెబుతోంది. బ్రహ్మన్ ది  “రహస్య రూపం అని నిశ్చయంగా గానించబడుతోంది” అని ‘మాంత్ర వర్ణిక మేవచ గీయతే’ అన్న మరో సూత్రం చెబుతోంది. ఇక్కడ మాంత్ర అంటే రహస్యమైన అనీ, వర్ణిక అంటే రూపం కల అని అర్థాలు. ఆ బ్రహ్మన్ కు చిహ్నం, లేదా గుర్తు లేదా సంకేతం ఏదైనా ఉందా? “ఆకాశం దానికి లింగం” అని ‘ఆకాశ స్తల్లింగాత్’ అన్న మరో సూత్రం చెబుతోంది. బ్రహ్మన్ పై ఎలా అవగాహన వస్తుందని అన్న ప్రశ్నకు సమాధానాలుగా  “తలుచుకోవడం వల్లా” అని ‘స్మృతేశ్చ’ అన్న సూత్రమూ, “అర్థం చేసుకోవడం అనే పరిణామం లేదా క్రియ వల్లా” అని ‘ఆత్మ కృతేః పరిణామాత్’ అన్న సూత్రమూ చెబుతున్నాయి. ఇక్కడ ఆత్మ శబ్దానికి అర్థం అని తాత్పర్యం. బ్రహ్మన్ ఎలాంటిది?  ‘జగద్వాచిత్వాత్’ అంటే “కదిలేది అని చెప్పబడినందువల్ల” అని మరో సూత్రం తెలియజేస్తోంది. ఇక్కడ జగత్ అన్న పదం లోకం అన్న అర్థంలో కాకుండా కదలిక అన్న అర్థం లో వాడబడింది. బ్రహ్మన్ మనకు ఎలా లభిస్తుంది? “భావం లో మాత్రమే లభిస్తుంది” అని ‘భావేచో ప లబ్దేః’ అన్న సూత్రం తేటతెల్లం చేస్తోంది.
 
‘వైషమ్య నైర్ఘృణ్యేవ సాపేక్షత్త్వాత్త థాహి దర్శయతి’ ఆన్న సూత్రం  “అన్వయంతో కూడుకున్నదవడంవల్ల (బ్రహ్మన్ కు) వైషమ్యం, నిర్దయలు లేవు అని నిశ్చయంగా కనిపిస్తోంది” అనీ, ‘నిత్యమేవచ భావాత్’ అన్న సూత్రం బ్రహ్మన్  “భావం అవడం వల్ల నిత్యమైనదీ అనీ, ‘కరణవచ్చే న్న భోగాదిభ్య:’ అన్న సూత్రం “ బ్రహ్మన్ ను పొందడం “పని వంటిది కాదు, అనుభవం నుంచి పొందబడుతుంది” అనీ, ‘అస్తితు’ అన్న సూత్రం బ్రహ్మన్ “ఉంది” అనీ, ‘గౌణ్య సంభవాత్’ అన్న సూత్రం బ్రహ్మన్ ను “అర్థాలంకారాలతో చెప్పడం అసంభవం” అనీ, ‘జ్ఞాsత ఏవ’ అన్న సూత్రం బ్రహ్మన్ “చైతన్యం” అనీ ‘ఉత్ క్రాంతి గత్యా గతీనాం’ అన్న సూత్రం బ్రహ్మన్ “గతి, గతి రాహిత్యాలకు అతీతమైనది” అనీ, ‘ప్రదేశాదితి చే న్నాంతర్భావాత్’ అన్న సూత్రం బ్రహ్మన్ “ అంతర్భావం అవడం వల్ల నిర్ణయం కాదు” అనీ, ‘శ్రేష్ఠశ్చ’ అన్న సూత్రం బ్రహ్మన్ “శ్రేష్ఠమైనది” అనీ చెబుతున్నాయి. ఆ శ్రేష్ఠమైన బ్రహ్మన్ భావంలోనే లభిస్తుంది.  
 
ఆలోచిస్తే మనిషికి జీవితం భావం లోనే లభిస్తుంది. భావంలోనే మనిషి జీవితాన్ని అవలోకించాలి. మనల్ని మనం అవలోకనం చేద్దాం. మనం బ్రహ్మ సూత్ర అవలోకనం చేద్దాం. మనం బ్రహ్మన్ ను అవలోకనం చేద్దాం.
 
 
- రోచిష్మాన్
9444012279

4/1/2019 న ఆంధ్రజ్యోతిలో అచ్చయింది.

No comments:

Post a Comment