Sunday, September 3, 2023

నదీ సముద్ర న్యాయము

 *నదీ సముద్ర న్యాయము*
***************
*నదులన్నీ  సముద్రంలోనే కలుస్తాయి.*
*"నదీనాం సాగరో గతిః" అన్నట్లు.అంటే నదులన్నింటికీ సముద్రమే చివరి గమ్యస్థానం అనే అర్థంతో ఈ నదీ సముద్ర న్యాయమును ఉదాహరణగా చెప్పవచ్చు.*

*నది,సముద్రము వేర్వేరు. వాటి రుచులు కూడా వేరే.అయితే నదులు సముద్రంలో కలిసి తమ రూపాలను కోల్పోయి సముద్ర రూపం పొందుతాయి.అయినా అవి బాధ పడవు. వాటి చివరి గమ్యస్థానం సముద్రమే కాబట్టి. సముద్రంలో కలిసే చివరి క్షణం వరకూ పరోపకారార్ధమే పరమావధిగా భావిస్థాయి.*

*ఇలా ఎక్కడెక్కడో పుట్టిన నదులు  వివిధ రకాల పేర్లతో పిలవబడటం మనందరికీ తెలిసిందే. ఒక్కో నది ఒక్కో రకంగా ప్రయాణిస్తూ ఉంటుంది.వరదలా ఉప్పొంగుతూ పరుగులు తీయడం, గంభీరమైన గమనం సాగించడం.,వంకర టింకర ఇరుకు దారుల్లోంచి ప్రవహించడం ఇలా ఎన్ని రకాలుగా ప్రయాణం సాగించినా చివరకు కలిసేది సముద్రంలోనే. అంటే సాగర సంగమమే నది యొక్క పరమార్థం.*

*దీనినే మన జీవితానికి  అన్వయించుకుందాం.మనిషి జీవితం నదిలాంటిది.పుట్టుక నుండి మరణం దాకా కాలంతో పాటు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది.* 

*నది  అతి చిన్న  బిందువుగా ఎలా మొదలవుతుందో.మనిషి పుట్టుక కూడా అలాగే అతి చిన్న రూపం నుండి మొదలవుతుంది.*

*నదితో అనేక ఉపనదులు ఎలా కలుస్తాయో,వానలు, వరదలు ఎలా ముంచెత్తుతాయో, ఆ విధంగానే మనిషి జీవితంలో కూడా  అనేక సమస్యలు,ఆటంకాలు ఎదురౌతాయి, రకరకాల మనుషులు, బంధాలు అనుబంధాల కలయిక లు,విడివడటాలు ఉంటాయి.అయినా నది గమ్యాన్ని చేరేంత వరకు ఆపకుండా తన ప్రయాణం ఎలా సాగిస్తుందో,ఆ ప్రవహించే సమయంలో పరిసరాలను సస్యశ్యామలం చేస్తూ వెళుతుందో, మనిషి కూడా తన గమ్యాన్ని చేరేంత వరకు ఆ విధంగా సాగిపోతూ ఉండాలి.* 

*ఆగని ఆ ప్రయాణంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా లక్ష్యాన్ని వీడకుండా, ఆదర్శవంతంగా ప్రవహిస్తూ,పయనించి నంత మేరా విలువల పచ్చదనంతో  వెలుగుతూ,ఆ వెలుగుల్ని సమాజానికి పంచుతూ అనంత విశ్వ సాగరంలో విలీనం అయిపోవాలి.అదండీ నదిలాంటి జీవితం అంటే.*

*అప్పుడే జీవితం సార్ధకం అవుతుంది.అనంత విశ్వంలో కలిసినా  చేసిన మంచి పని ఈ పుడమిలో  పచ్చని చెట్టులా పల్లవిస్తూనే ఉంటుంది.*

No comments:

Post a Comment