250223c2605. 260223-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
శ్రీ మహాభారతం
➖➖➖✍️
282 వ భాగం
శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:
#ఉన్నత_పదవులు:
ధర్మరాజు… “పితామహా ! నా రాజ్యంలో ఉన్నత పదవులలో నియమించుటకు తగిన జనం లభించని ఎడల నేను ఏమి చేయాలి?” అని అడిగాడు.
భీష్ముడు… “ధర్మనందనా ! నీకు ఒక కథ చెప్తాను… పూర్వం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడు. అతడి ఆశ్రమంలో సాధు జంతువులు క్రూరజంతువులు సఖ్యతగా ఉండసాగాయి. ఆ మునితో ఎప్పుడూ ఒక కుక్క ఉండేది. అది చూసి సహించలేని ఒక పులి దాని మీద పంజా విసరబోయింది. ఆ కుక్క ముని వెనుక దాగింది. అది చూసి ముని ఆ కుక్కను పులిగా మార్చాడు. అది చూసి అసలు పులి పారిపోయింది. ఇంకొక సారి ఒక ఏనుగు దాని మీద దాడి చేసింది. ముని కుక్కను ఏనుగుగా మార్చి కాపాడాడు. ఇలా ఏ జంతువు దాడి చేస్తే ఆ జంతువుగా మార్చి దానిని రక్షించసాగాడు. అది చూసిన కుక్క నా మీద జాలితో ఈ ముని ఈ విధంగా నన్ను మార్చుతున్నాడు కదా ! ఇలా ఇంకొక జంతువు మీద జాలి పడి దానిని మార్చి నా మీద వదిలితే నా గతి ఏమి కావాలి ? కనుక ఎలాగైనా ఈ మునిని చంపాలి అని అనుకుంది. అది తన దివ్యచక్షువులతో గమనించిన ముని ‘ఎంతైనా ఈ కుక్క తన నీచప్రవర్తన వదలలేదు’ అనుకుని దానిని మామూలు కుక్కగా మార్చాడు. అది వివిధ జంతువులుగా మారే శక్తినికోల్పోయింది. కనుక ధర్మనందనా ! దుష్టులకు ఉన్నత పదవులు ఇవ్వరాదు. వారి వారి యోగ్యతను బట్టి ఉన్నత, మధ్య, హీన పదవులను ఇచ్చి గౌరవించాలి. శౌర్యమూ, పరాక్రమమూ, సత్యమూ, భక్తి, సత్కార్యములు చేయు బుద్ధి, గంభీర్యము కల వాడు హీన కులజుడైనా ఉన్నత పదవులకు అర్హుడు. అతడికి కులంతో పనిలేదు. సింహం ఎప్పుడూ తోటి సింహాలతో చేరి పని చేస్తుంది కాని కుక్కలతో చేరి పని చెయ్యదు. పరిజనమునకు కులమూ నేర్పరితనం రెండూ ఉండాలి. నేర్పు, భక్తి కలిగిన సేవకులున్న రాజు ఏ కార్యమైనా. రాజు కూడా పరాక్రమం కలిగి ఉండాలి కాని పిరికితనం పనికి రాదు. రాజు తన పరిజనంతో కలిసి గూఢచర్యం నడపాలి. అంతఃపురంలో చారులను నియమించి ఎప్పటికప్పుడు అంతఃపుర రహస్యములను తెలుసుకోవాలి” అని చెప్పాడు.
#దండనీతి:
ధర్మరాజుతో భీష్ముడు దండనీతిని గురించి ఇలా చెప్పసాగాడు… “ధర్మనందనా ! ఈ దండనీతి గురించి చెప్తాను విను… ఈ దండనీతిని సజ్జనులను రక్షించుటకు దుర్జనులను శిక్షించుటకు ఉద్దేశించబడింది. సాక్షాత్తు విష్ణుమూర్తి దండనీతి రూపంలో ఉంటాడు. దండనీతిలో విష్ణువు ఉన్నప్పుడు ధర్మపాలుడనీ, ధర్ముడనీ, విజయుడనీ, రక్షించేవాడని, శిక్షించేవాడనీ రకరకాల పేర్లతో పిలుస్తారు. దండనీతిని సక్రమంగా పాటించకపోతే అధర్మము, అవినీతి, పిరికితనం, దుఃఖం, నష్టము కలుగుతాయి. దండనీతిని సక్రమంగా పాటిస్తే ధర్మం, సుఖం, నీతి, లాభములు, బలము, రక్షణ కలుగుతాయి.”
#దండ నీతి ఉత్పన్నం:
“ధర్మనందనా ! దండనీతి ఉద్భవించిన తీరు వివరిస్తాను విను… ‘పూర్వం అంగదేశరాజు వసుహోముడు భార్యాసమేతంగా హిమాలయ పర్వతానికి వెళ్ళి అక్కడ మునిజనాలను సేవిస్తూ కాలం గడుపుతున్నాడు. ఒక రోజు మంధా అనే మహారాజు అతడి వద్దకు వచ్చి తనకు దండనీతిని గురించి చెప్పమని అడిగాడు… వసుహోముడు… ‘ఒక సారి బ్రహ్మదేవుడు యాగం చెయ్య తలపెట్టాడు. అందు కొరకు ఒక మంచి ఋత్విక్కు కొరకు వెతికి ఎక్కడా దొరకక తన తుమ్ము నుండి ఒక ఋత్విక్కును పుట్టించాడు. అతడి పేరు క్షతుడు, క్షతుడిని ఋత్విక్కుగా పెట్టుకుని బ్రహ్మదేవుడు యజ్ఞం చెయ్యసాగాడు. తరువాత బ్రహ్మ విష్ణువును తీసుకుని ఈశ్వరుడి వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఈశ్వరుడు దండనీతిని సృష్టించి దానిని ముందు తానే అధ్యయనం చేసాడు. నాలుగు వేదములు, ఆరు వేదాంగములు, పురాణములు, ధర్మశాస్త్రములు, న్యాయశాస్త్రము, మీమాంస, వైద్యము, ధనుర్వేదము, గాంధర్వము, అర్ధశాస్త్రము అను పద్దెనిమిది విద్యలను లోక ప్రయోజనం కొరకు సృజించి వాటిని విష్ణుమూర్తికి అప్పగించాడు. వాటిని బ్రహ్మ తుమ్ము నుండి పుట్టిన క్షతుడి ద్వారా ప్రపంచంలో వ్యాప్తి చేసాడు. తరువాత విష్ణువు తన ఆధీనములో ఉన్న దండ నీతిని అంగీరసుడికి, అంగీరసుడు ఇంద్రుడికి, ఇంద్రుడు మరీచికి, మరీచి భృగువుకు, భృగువు అనేక మంది మునులకు చెప్పి అధ్యయనం చేయించాడు. దండనీతి ఆ విధంగా లోకంలో విస్తరిఉంచింది. దండనీతిని సమర్ధవంతమైన పనులు చేసిన రాజు ఇహపర సుఖములను పొందుతాడు” అని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు.
#ధర్మం కామం అర్ధం:
ధర్మరాజు… “పితామహా ! ధర్మము, అర్ధము, కామము గురించి వివరించండి.” అన్నాడు.
భీష్ముడు… “ధర్మరాజా! ఇదివరకు కామందుడు అనే ముని ఆంగరిష్టుడను రాజుకు చెప్పిన విషయములు నీకు చెప్తాను విను… ‘ఎల్లపుడూ కామము కొరకు దాని వలన వచ్చు సుఖముల కొరకు పాకులాడే వాడికి ధర్మము, అర్ధము ఆచరణ సాధ్యములు కావు. అలాంటి వాడు కష్టముల పాలు ఔతాడు. అతడి వద్దకు స్నేహితులు చేరరు. చివరకు మృత్యువు కబళిస్తుంది. ధర్మాచరణకు అర్ధము అవసరం కాని రాజు ధనసంపాదనలో ధర్మం తప్పరాదు. కామ సంబంధిత కోరికలు విడిచి తక్కిన కోరికలు అనుభవించు రాజు మహోన్నతుడౌతాడు. కనుక ధర్మరాజా ! ధర్మము అర్ధము గొప్పవి”అని భీష్ముడు చెప్పాడు.
#శీలం:
ధర్మరాజు… “పితామహా ! మనిషికి శీలం ముఖ్యం కదా ! శీలం గురించి దానిస్వరూప స్వభావాలను వివరించండి” అని అడిగాడు.
భీష్ముడు… “ధర్మనందనా! నువ్వు నీ తమ్ములు ఇంద్రప్రస్థంలో సుఖంగా ఉన్న రోజులలో సుయోధనుడు అసూయతో రగిలి పోయాడు. నీవు చేసిన రాజసూయ యాగమును, నీకున్న మయసభను చూసి ఓర్వ లేక పోయాడు. నీకు పట్టిన అదృష్టముకు అసూయపడి తన తండ్రి దృతరాష్ట్రుడి వద్ద చెప్పుకుని దుఃఖించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు సుయోధనుడితో… ‘కుమారా ! నీకున్న ఐశ్వర్యంలో ధర్మరాజుకు ఉన్న ఐశ్వర్యం తక్కువే. కాని ధర్మరాజుకు మంచి శీలం ఉంది. నీకు అది లేనిది. ధర్మరాజు ధర్మసంపన్నుడు. కనుక నీకు సంపన్నుడిలా కనపడుతున్నాడు. నీవు మంచిప్రవర్తన అలవరచు కుంటే నీకున్న సంపద గుర్తించగలవు. నీ పూర్వీకులైన మాంధాత, నాభాగుడు మొదలైన చక్రవర్తులు తమ శీలసంపద చేత గౌరవాభిమానాలు పొందారు.” అని చెప్పాడు.
#ప్రహ్లాదుని శీలం:
భీష్ముడు శీలం గురించి చెప్తూ… “ధర్మనందనా ! పూర్వం ప్రహ్లాదుడు తన శీలసంపదతో ఇంద్రుడిని జయించాడు. ముల్లోకాలను ధర్మబద్ధంగా స్వాధీనపరచు కున్నాడు. అప్పుడు ఇంద్రుడు బృహస్పతి వద్దకు పోయి తిరిగి తన రాజ్యమును సంపాదించుకునే ఉపాయం చెప్పమని అడిగాడు. అప్పుడు బృహస్పతి ఇంద్రుడిని శుక్రాచార్యుడి వద్దకు పంపాడు. ఇంద్రుడు శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళి తనకు మేలు కలిగే ఉపాయం చెప్పమని వేడుకున్నాడు. శుక్రాచార్యుడు ఇంద్రుడిని ప్రహ్లాదుడి వద్దకు పంపాడు. ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో ప్రహ్లాదుడి వద్దకు వెళ్ళి శిష్యరికం చేయసాగాడు. అతడి భక్తిశ్రద్ధలకు మెచ్చి ప్రహ్లాదుడు ఏమి కావాలని అడిగాడు. ఇంద్రుడు ‘ప్రహ్లాదా నీవు ఇంద్రుడిని ఎలా గెలిచావు?’ అని అడిగాడు. ప్రహ్లాదుడు… ‘విప్రోత్తమా ! నేను రాజును అనే గర్వంతో ఎవరినీ అగౌరవపరచ పరచను. అందరికీ దాన ధర్మములు చేస్తుంటాను. బ్రాహ్మణులను ఆదరిస్తుంటాను. నా శీలమే నన్ను గొప్ప వాడిని చేసి నాకు విజయము చేకూర్చింది.’ అని చెప్పాడు.
ఇంద్రుడు… ‘ప్రహ్లాదా ! నాకు నీ శీలం దానంగా ప్రసాదించు!’ అని అడిగాడు.
ప్రహ్లాదుడు కాదనక తన శీలమును ఇంద్రుడికి దానంగా ఇచ్చాడు. ఇంద్రుడు శీల సంపన్నుడై వెళ్ళి పోయాడు.
అప్పుడు ప్రహ్లాదుడి నుండి ఒక తేజో రూపము బయటకు వచ్చింది. అది ప్రహ్లాదుడి ప్రశ్నకు బదులిస్తూ… ‘నేను నీ శీలాన్ని. నిన్ను నన్ను నీవు ఇంద్రుడికి దానంగా ఇచ్చావు కనుక నేను నిన్ను విడిచి అతడి వెంట పోతున్నాను.’ అని బదులిచ్చింది. అతడి వెంట ధర్మము, సత్యము, మంచి ప్రవర్తన, బలము మొదలైన మంచి లక్షణములు తేజో రూపములతో ప్రహ్లాదుడిని విడిచి ఇంద్రుడి వెంట వెళ్ళారు. చివరకు ఒక స్త్రీ ఆకారం బయటకు వచ్చింది ఆమెను చూసి ప్రహ్లాదుడు నీవు ఎవరని అడిగాడు. అందుకు ఆమె నేను సిరిని. బలము ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉంటాను. అని చెప్పి వెళ్ళసాగింది. ప్రహ్లాదుడు ‘అమ్మా ! కొంచెం ఆగు! నా వద్ద నాశీలం దానంగా స్వీకరించింది ఎవరు?’ అని అడిగాడు.
ఆమె… ‘ప్రహ్లాదా! ఇంద్రుడే నీవద్ద పోగొట్టుకున్న స్వర్గాధిపత్యం తిరిగి సంపాదించే నిమిత్తం నీ వద్ద శిష్యరికం చేసి నీ శీలాన్ని దానంగా పొందాడు. ప్రహ్లాదా ! మనిషికి శీలం ప్రధానమైంది. శీలం వలన ధర్మం , ధర్మం వలన సత్యము, సత్యము వలన, మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన వలన బలం వర్ధిల్లుతాయి. కనుక సమస్త సంపదలకు శీలం మూలము’ అని చెప్పి సిరి ఇంద్రుడి వద్దకు పోయింది.
ఇది విన్న సుయోధనుడు అసలు శీలం అంటే ఏమిటి ? అని తండ్రిని అడిగాడు.
ధృతరాష్ట్రుడు త్రికరణ శుద్ధిగా పరుల ఎడ ద్రోహచింతన లేకుండుట, సమస్త భూతములను సమానంగా చూచుట, సిగ్గుపడవలసిన పనులు చేయకుండుట, పరులకు హాని చేయకుండుట, జనులకు ప్రియమైన కార్యములనే చేయుట ఇటువంటి నడవడిని శీలం అంటారు. శీలం ఉన్న వాడికి అపజయం ఉండదు అని చెప్పాడు.
“ధర్మనందనా ! నీకు శీలం జన్మతః వచ్చింది. నేను శీలం గురించి చెప్పినది విన్నావు కనుక సచ్ఛీలవంతుడవై మెలగుము” అన్నాడు.
#ఆశ దుఃఖం:
ధర్మరాజ… “ఔను పితామహా ! ఆశకు అంతులేదు అది అనంతము. ఆశపడినది అందక పోయిన అమిత దుఃఖంకలుగుతుంది. సుయోధనుడితో సఖ్యతగా ఉండాలని ఎంతో ప్రయత్నించాను. అతడు నా మాట వినక నన్ను యుద్ధం చేయవలసిన పరిస్థితిలో పడవేసాడు. అందుకు నేను చాలా బాధపడు తున్నాను. ఆశలు అణుచుకోవడం అరుదు కదా !” అన్నాడు ధర్మరాజు.
భీష్ముడు… “ధర్మనందనా ! ఈ సందర్భంలో ఒక కథ చెప్తాను… ‘హైహయ దేశపు రాజు సుమిత్రుడు ఒక రోజు వేటకు వెళ్ళి ఒక మృగమును కొట్టాడు. దెబ్బ తిన్న ఆ మృగం పారి పోయింది. సుమిత్రుడు మృగం వెంట పరిగెత్తి అలిసి పోయి ఒక ముని ఆశ్రమం చేరుకున్నాడు. ముని కుమారుడు అతడికి త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు. రాజు సేద తీరగానే ఆ ముని… “రాజా ! ఏపని మీద వచ్చావు ? ఎందుకు దిగులుగా ఉన్నావు?” అని అడిగాడు.
రాజ… “మునీశ్వరా ! నేను వేట నిమిత్తమై ఈ అడవికి వచ్చి ఒక జింకను వేటాడాను అది తప్పించుకు పారి పోయింది. దానిని తరుముతూ వచ్చి చిక్కక నిరాశతో అలసటతో ఇక్కడకు వచ్చాను” అని చెప్పాడు.
ఆముని… “రాజా ! నేను ఒక సారి తీర్ధయాత్రల నిమిత్తం బదరికాశ్రమం వెళ్ళాను. నేను అక్కడ కృశించిన శరీరం కలిగిన తనుడు అనే మునిని చూశాను.
భక్తితో నమస్కరించిన నాకు అతడు అతిథిసత్కారాలు చేసాడు. అంతలో అక్కడకు ఒక రాజు వచ్చాడు. ఆ ముని, రాజు రాకకు కారణం అడుగగా అతడు నాకు ఒక గుణవంతుడైన కుమారుడు ఉన్నాడు. అతడు ఒక సారి వేటకువెళ్ళి తిరిగి రాలేదు. అతడిని వెతుక్కుంటూ ఆశగా ఇక్కడకు వచ్చాను. నా ఆశతీరేలా లేదు, నా మనసు ఎలా తట్టుకోగలదు మునీంద్ర” అన్నాడు.
మున… “రాజా స్థిరచిత్తంతో చేసే కార్యము విజయవంతం ఔతుంది. ధనం కొరకు యాచించిచో అవమానం ఎదుర్కొనకుండా పొంద లేరు. ఆశ పడడంలో తప్పు లేదు కానీ అది నెరవేరక పోతే దుఃఖించ కూడదు. కర్తవ్యం చేయాలి కానీ ఫలితం గురించి దుఃఖించ కూడదు. నీ కుమారుడిని నేను ఇస్తానని లోపలకు వెళ్ళి తన తపోమహిమతో రాజ కుమారుడిని తెచ్చి ఇచ్చాడు” అని చెప్ప… “రాజా! వేటకు వెళ్ళడం తప్పుకాదు కాని దాని వెంట పరుగెత్తి నిరాశపడి దుఃఖించడం సరికాదు. కనుక మదిలోమృగాన్ని వదిలి రాజధానికి వెళ్ళు! ఇక అనవసరంగా వేటకు వెళ్ళకు” అని చెప్పాడు.
కనుక ధర్మనందనా ! ఆశ పడటం తప్పు కాదు కానీ ఆశ నెరవేరక పోయినచో నిరాశతో అక్రమాలు చేయకూడదు. మనిషికి రాజుకు ధనం అవసరమే కానీ అది ధర్మబద్ధంగా సంపాదించినప్పుడే శాంతి లభిస్తుంది. ధన సంపాదనకు అకృత్యాలు చేయక ప్రజల నుండి సానుకూలంగా ధనం రాబట్టాలి. రాజు తాను అందరి కంటే ధనవంతుడు కావాలని తన శక్తికి మించి ధనార్జన చేస్తే అది అనర్ధాలకు దారి తీస్తుంది. అది అసలుకు ముప్పు తెచ్చి ప్రాణాలను హరించగలదు. అలాగని ధనం ఆర్జించక ఊరకున్న లోకులు గౌరవించరు. దొంగలను, దోపిడీదారులను సైన్యంలోకి తీసుకుంటే అవస్థలు రావడమే కాకుండా అధర్మపరులున్న రాజు విజయాన్ని సాధించ లేడు.”
#వేటగాడి ధర్మం:
పూర్వము పారియాత్ర పర్వతము మీద ఒక వేటగాడు ఉండేవాడు. అతడి పేరు కాపవ్యుడు. అతడి వృత్తి వేటాడటమే అయినా న్యాయాన్ని, ధర్మాన్ని చక్కగా ఆచరించే వాడు. తల్లి తండ్రులను పూజించే వాడు. మున్యాశ్రమాలలోని మునులకు కంద మూలాలను సమర్పించే వాడు. అక్కడ ఉన్న వేటగాళ్ళందరూ అతడిని తన నాయకుడిగా ఎన్ను కోవాలనుకొని
“నీవు అత్యంత బలవంతుడివి, ధర్మాత్ముడివి కనుక నీవు మా అందరికి నాయకుడివిగా ఉండాలి. మేము నీ ఆజ్ఞాను వర్తులం కావాలని అనుకుంటున్నాము” అని అడిగారు.
అందుకు కాపవ్యుడు నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. స్త్రీలను, పిల్లలను చంపకూడదు, వారికి హాని చేయకూడదు. ఆడ జంతువులను వేటాడకూడదు. గోబ్రాహ్మణులను రక్షించాలే కాని వారికి హాని చేయ కూడదు. పంట పొలాలను నాశనం చేయ కూడదు. ప్రజలను బాధించి మనం బాగు పడకూడదు. మీరు ఇలా నడుచుకుంటానని నాకు మాట ఇస్తే నేను మీ నాయకుడిగా ఉంటాను” అని చెప్పాడు. అందుకు వారు సంతోషించారు అలాగే మాట ఇచ్చి అతడిని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అలా కాపవ్యుడు దొంగతనంతో వేటతో జీవిస్తున్న వారిని సజ్జనులను చేసాడు.
#మూడు చేపల కథ:
భీష్ముడు ధర్మరాజుకు తరువాత మూడు చేపల కథ చెప్పాడు… “ధర్మనందనా ! ఒక మడుగులో మూడు చేపలు ఉన్నాయి. వాటి పేర్లు దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘ సూత్రుడు. ఇంతలో వేసవి కాలం వచ్చింది. ఎండకు ఆ చెరువులో నీళ్ళు ఇంకి పోసాగాయి. అది చూసిన దీర్ఘదర్శి… ‘మిత్రులారా ! మనం ఉన్న చెరువులో నీళ్ళు ఇంకి పోతున్నాయి. ఇప్పుడే నీరు బాగా సమృద్ధిగా ఉన్న వేరు చెరువులోకి పోదాము’ అని చెప్పింది.
అందుకు ప్రాప్త కాలజ్ఞుడు ‘నీతో నేను ఏకభవించను. చెరువు ఎండి పోయినప్పుడు ఆలోచించాలి కాని ఇప్పటి నుండే ఎందుకు దిగులు పడాలి. దీర్ఘ సూత్రుడు చెరువులో నీళ్ళు సమృద్ధిగా ఉన్నప్పుడే ఇలాంటి ఆలోచన ఎందుకు. ఎండి పోయినప్పుడు చూడచ్చులే’ అన్నది. దీర్గ దర్శి తన ప్రయత్నం తాను చేసుకుని వేరు చెరువుకు పోయింది. వేసవి తీవ్రమై ఎండ తీవ్రతకు చెరువులోని నీరు పూర్తిగా ఎండి పోయాయి. జాలర్లు చేపలు పట్టడానికి చెరువుకు వచ్చారు. అప్పుడు ప్రాప్త కాలజ్ఞుడు ఆలోచించి ఒక జాలరి వలలో చచ్చిన చేపలా పడి ఉన్నాడు. ఆ జాలరి ఆ చేపలను గట్టు మీద పెట్టాడు. ప్రాప్తకాలజ్ఞుడు ఎగిరి పక్కనే ఉన్న బురద గుంటలోకి గెంతి దాక్కున్నాడు. దీర్ఘ సూత్రి మాత్రం ఏ ఉపాయం లేకుండా జాలరి వలలో పడి చనిపోయాడు. రాబోయే ఆపదను ముందుగా పసి కట్టి తప్పించుకున్నాడు. నీతి మంతుడైన దీర్ఘదర్శి తప్పించుకున్నాడు. అప్పటికప్పుడు ఉపాయం ఆలోచించి సందేహ ప్రాణి అయిన ప్రాప్తకాలజ్ఞుడు తప్పించుకున్నాడు. ముందు చూపు కాని ఉపాయం కానీ లేని దీర్ఘసూత్రుడు వలలో చిక్కి ప్రాణాలు వదిలాడు అని చెప్పాడు” భీష్ముడు.
#ఫలితుడు రోజశుల స్నేహం:
ఎలుక సహాయముతో వేటగాడి బారినుంచి తప్పించుకుని పారిపోతున్న పిల్లి…
ధర్మరాజు భీష్ముడితో… “పితామహా! తన శత్రువుల చేతిలో చిక్కి బలం కోల్పోయిన రాజు తన కష్టముల నుండి ఎలా గట్టెక్కుతాడో వివరించండి” అని అడిగాడు.
భీష్ముడు… “ధర్మరాజా ! ఈ సందర్భంలో ఒక కథ చెప్తాను విను. ఒక అడవిలో ఒక మర్రి చెట్టు ఉంది. దాని మొదట్లో ఫలితుడు అనే ఒక ఎలుక నివసిస్తుంది. ఆ చెట్టుమీదే రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తుంది. ఒక బోయ వాడు ప్రతి రోజూ రాత్రి ఆ చెట్టు సమీపంలో ఒక వల పెట్టే వాడు. ఉదయం వచ్చి దానిలో పడిన పక్షులను పట్టుకుపోయే వాడు. ఆ వలలో ఒక రోజు చెట్టు మీది పిల్లి అను కోకుండా చిక్కు కుంది.
పిల్లి వలలో పడడంతో ఎలుక నిర్భయంగా బయటకు వచ్చి ఆహారం కొరకు వెదుకుతూ ఉండగా అది ఒక ముంగిసను, గుడ్లగూబను చూసింది. ఎలుకకు పైప్రాణాలు పైనే పోయాయి. వెంటనే ఒక ఉపాయం స్పురించి వలలో ఉన్న పిల్లిని సమీపించి దాని పక్కనే కూర్చుని… ‘ఓ మార్జాలమా ! నేను నీ వల కొరికి నిన్ను రక్షిస్తాను, నువ్వు నన్ను గుడ్లగూబ, ముంగిసల బారి నుండి రక్షించు.’ అంది.
పిల్లి… ‘మూషికమా! నీకు పరులకు ఉపకారం చేసే గుణం ఉండడం నాకు ఆనందం కలిగిస్తుంది. నేను నిన్ను రక్షిస్తాను నన్ను చూస్తే ముంగిస, గుడ్లగూబ భయ పడతాయి. కనుక నన్ను విడిపించు’ అని చెప్పింది.
ఎలుక పిల్లి పక్కన చేరింది. అది చూసి ముంగిస గుడ్లగూబ పారి పోయాయి. పిల్లి ‘ఇక తాళ్ళు కొరికి నన్ను విడిపించు’ అన్నది.
ఎలుక ‘ఉండు తొందరపడకు’ అని వెళ్ళి దూరంగా కూర్చుంది.
పిల్లి ‘మూషికమా! నేను నీప్రాణాలు కాపాడాను కదా నీవు ఇలా ఉపేక్షించ తగునా!’ అన్నది.
ఎలుక… ‘మార్జాలమా ! రేపు బోయవాడు కనిపించిన తరువాత త్వరగా వల తాళ్ళను కొరికి నిన్ను విడిపిస్తాను. ఇప్పుడు విడిపిస్తే నన్ను నీవు భక్షించవచ్చు. బలవంతులతో స్నేహం చేసేటప్పుడు తగు జాగర్తలో ఉండడం మంచిది’ అన్నది. తెల్లవారిన పిదప బోయవాడిని అల్లంత దూరంలో చూసిన ఎలుక గబగబా వల తాళ్ళను కొరికింది. బోయవాడికి భయపడి పిల్లి చెట్టెక్కింది. ఎలుక కలుగులో దూరి తల కొంచెం బయట పెట్టి జరిగేది చూస్తూ ఉంది.
బోయ వాడు వల చూసి నిరాశతో వెళ్ళి పోయాడు. పిల్లి కిందకు వచ్చి ఎలుకతో… ‘మిత్రమా ! నేను నిన్ను కాపాడాను కాని నువ్వు నన్ను నమ్మ లేదు. మనమిరువురం స్నేహం చేద్దాము’ అన్నది.
ఎలుక... ‘మార్జాలమా ! నీవు చెప్పింది నిజమే అయినా మిత్రువు శత్రువుగా మార వచ్చు. శత్రువు అవసరాన్ని బట్టి మిత్రుడవచ్చు. కనుక ఎవరు ఎప్పుడు మిత్రుడౌతాడో ఎప్పుడు శత్రువు ఔతాడో తెలుసుకోవడం కష్టం. నువ్వు నాకు చేసిన సాయం నేను నీకు సాయం చేసి తీర్చుకున్నాను. అంతటితో చెల్లి పోయింది. బలంతులతో అవసరార్ధం స్నేహం చేసినా కార్యం ముగిసిన పిదప వదిలి వేయకున్న ఆపదలు ఎదురు ఔతాయి. కనుక మనం ఎవరి దారి వాళ్ళము చూసుకుందాము. అవసరమైనప్పుడు ఒకరికి ఒకరం సహాయం చేసుకుందాము. భగవంతుడు నన్ను నీకు ఆహారంగా సృష్టించాడు కనుక నీవు ఎప్పుడో ఒక సారి నన్ను చంపక మానవు. ఒక వేళ నీవు విడిచినా నీ కుమారులు, బంధువులు నీ మనసు మార్చవచ్చు. రాత్రంతా ఆకలిగా ఉన్న నీ సమక్షానికి వస్తే నీవు నన్ను తినేస్తావు నేను నీ వద్దకు రాలేను’ అన్నది.
పిల్లి… ‘ఎలుకా నా ప్రాణ రక్షణ చేసిన నిన్ను నేను ఎలా చంపగలను.’ అన్నది.
ఎలుక… ‘నీవు నన్ను రక్షించావు నేను నిన్ను రక్షించాను అది చాలు నేను నీ దగ్గరకు రాతగదు. మార్జాలమా! శుక్ర నీతి ఇలా ఉంది. బలవంతుడైన శత్రువుతో అవసరార్ధం చేసే స్నేహాన్ని వెంటనే విడువకున్న ఎప్పటికైనా శత్రువు వలన ఆపద కలుగ వచ్చు కనుక సాయం చేసాడని శత్రువును గుడ్డిగా నమ్మ కూడదు. నమ్మ కూడని వారిని నమ్మక ఉండడమే కాక నమ్మ తగిన వారిని మితంగా నమ్మాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మడం తగదు. ఎంతటి మిత్రులనైనా నమ్మినట్లు నటిస్తూనే నమ్మక ఉండడమే రాజ నీతి’ అన్నది.
“కనుక ధర్మనందనా ! బలవంతుడైన శత్రువును బలహీనుడైన ఇంకొక రాజుతో తాత్కాలిక స్నేహం చేసి ఎదిరించాలి. అంతే కాని శత్రువుతో స్నేహం మాత్రం పొడిగించ రాదు” అని చెప్పాడు.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
No comments:
Post a Comment