*అదృష్టవంతులు మాత్రమే
ఈ భాగం చదవగలరు👇
260223c0736. 270223-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀283.
శ్రీ మహాభారతం
➖➖➖✍️
283 వ భాగం
శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:
#విశ్వదించతగిన_వారు:
ధర్మరాజు… “పితామహా ! ఎవరిని నమ్మితే మనశ్శాంతి కలుగుతుంది. ఎవరిని నమ్మితే కష్టాలపాలౌతాము. అందరినీ నమ్మతగునా ! లేక ఎవరినీ నమ్మ తగదా !” అని అడిగాడు.
భీష్ముడు… “ధర్మనందనా ! పూర్వము బ్రహ్మదత్తుడు అనే రాజు ఒక చిలుకను పెంచి దానితో స్నేహంగా ఉండ సాగాడు. ఆ చిలుకకు ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్లతో రాజ కుమారుడు ఆడుకుంటూ ఉండే వాడు. ఆ చిలుక కూడా తన పిల్లతో సమానంగా రాజకుమారుడిని చూడసాగింది. ఒక రోజు చిలుక బయటకు వెళ్ళిన సమయంలో రాజకుమారుడు ఆ చిలుక పిల్లను చంపేసాడు. తిరిగి వచ్చిన చిలుక ఏడుస్తూ ‘ప్రతి రోజూ పండ్లు ఫలాలు తెచ్చి తన బిడ్డతో సమానంగా చూసినందుకు రాజకుమారుడు నిర్ధాక్షిణ్యంగా చంపేసాడు. రాజ బిడ్డలకు జాలి దయా ఉండవేమో నాకు మాత్రం జాలి ఎందుకు ఉండాలి?’ అని రాజకుమారుడి కళ్ళని తన వాడి అయిన గోళ్ళతో పొడిచి గుడ్డి వాడిని చేసి రాజు ముందు నిలిచి… ‘రాజా నీ బిడ్డ నిర్ధాక్షిణ్యంగా నా బిడ్డను చంపి పాపం చేసి ఫలితం అనుభవిస్తున్నాడు. కనుక ఇక నేను ఇక్కడ ఉండడం తగదు కనుక నేను వెళ్ళి పోతున్నాను’ అని పలికింది.
ఆ రాజు… ‘చిలుకా ! నీవు ఏ పాపం చేయ లేదు కనుక నీకు పాపం అంటదు. నీవు వెళ్ళకు! మనం ఎప్పటిలా స్నేహంగా ఉందాము’ అన్నాడు.
చిలుక… ‘రాజా నేను నీ కుమారుడి కళ్ళొ పొడిచినందుకు నీకు నా మీద అంతర్లీనంగా కోపం ఉండకపోదు. కనుక నీతో స్నేహం నాకు ఆపత్కరం. కనుక మన స్నేహం అసంభవం’ అని చెప్పింది.
రాజు… ‘చిలుకా ! నీ పిల్లను నా కొడుకు చంపినందుకు ప్రతిగా నీవు నా కుమారుడి కళ్ళు పొడిచావు కనుక ఆ విషయం అంతటితో తీరింది. నేను నీ వంటి మంచి స్నేహం వదల లేను’ అన్నాడు. చిలుక… ‘రాజా ! ఒక సారి స్నేహం చెడి పోయిన తరువాత తీయని మాటలతో ఆ పగ మరచినా చివరకు కీడు రాక మానదు. రాజా ! పగ అయిదు రకాలుగా ఉంటుంది… పరుల భూములు ఆక్రమించుకోవడం వలన కాని, దాయాదుల మధ్య ఆస్తి తగాదా వలన కాని, ఆడవాళ్ళు మాటా మాటా అనుకోవడం వలన కాని, మరొకరికి తీవ్రమైన ఆపద కలగడం వలన కాని, పగ పుడుతుంది. ఒక సారి పుట్టిన పగ నివురు కప్పిన నిప్పులా అలాగే రగులుతూ ఉంటుంది కాని చల్లారదు. పగ కనిపించలేదని పగవాడిని నమ్మితే వినాశనం తప్పదు. ఒక సారి పగపుట్టిన తరువాత తల్లి తండ్రులైనా, అన్నదమ్ములైనా, కన్నబిడ్డలైనా, ప్రాణ స్నేహితులైనా నమ్మరాదు. కనుక మీ తియ్యటి స్నేహం నమ్మి నేను నీతో స్నేహం కొనసాగించ లేను’ అని పలికింది.
రాజు… ‘చిలుకా ! కాలవశం వలన మంచి చెడు కలుగుతాయి. వాటిని నియంత్రించ లేము కనుక నీ వంటి స్నేహితుడిని నేను వదల లేను’ అన్నాడు.
చిలుక… ‘రాజా ! నువ్వు నాతో ఎంతో సౌమ్యంగా మాట్లాడుతున్నా ఆ మాటల వెనుక నాకు పగద్వేషం కనపడుతున్నాయి. కనుక నేను నీతో స్నేహం చేయలేను’ అని చెప్పి చిలుక ఎగిరిపోయింది.
కనుక ధర్మరాజా ! రాజు తన వారిని కాని మిత్రులను కాని ప్రజలను కాని నమ్మ రాదు.”
#కణిక శత్రుంజయులు:
భీష్ముడు… “ధర్మనందనా ! ఈ సందర్భంలో కణికుడు శత్రుంజయుడు అనే రాజుకు చెప్పిన విషయం వివరిస్తాను విను… ”రాజు బయటకు తియ్యగా మాట్లాడుతూనే లోపల కరుగ్గా ఉండాలి. అందరినీ నమ్మినట్లే ఉండాలి కానీ ఎవరినీ నమ్మరాదు. దాయాదుల సాయంతో రాజ్యాన్ని జయించి తరువాత వారికి తగిన పారితోషికం ఇవ్వాలి. అంతే కాని వారిని నమ్మి దగ్గరగా ఉంచుకోకూడదు. అవసరానికి రాజు శత్రువును తలకెక్కించుకుని అవసరంతీరగానే కుండలా నేలకేసి కొట్టాలి. మధ్యపానము, జూదము, వేట, స్త్రీ లోలత్వం రాజులకు వినోద సాధనము. కాని మితిమీరక ఉండాలి. రాజు ఒక కార్యం తలపెట్టిన అది పూర్తయ్యే వరకు ఎవరికీ తెలియనివ్వ రాదు. ఒక వేళ తెలిసినా తెలియనట్లు, చూడనట్లు, విననట్లు ఉండాలి. రాజుకు ఇష్టం లేని పనిని అదుగో చేస్తాను, ఇదుగో చేస్తాను అని కాలయాపన చేయాలి. తరువాత ఎలాగైనా చేయక విడువాలి. అత్యంత గర్వంతో విర్రవీగే వాడిని, కార్యా కార్య విచక్షణ లేని వాడిని, మంచీ చెడు తెలియని వాడిని, చెడుమార్గంలో నడిచేవారిని గురువైనా వదలక దండించాలి. తీరని అప్పు, ఆరని నిప్పు, పూర్తిగా తీరని పగ ఎప్పటికైన కీడు చేస్తాయి. మృదుత్వంతో ఏదైనా సాధించ వచ్చు. సామరస్యంతో శత్రువునైనా నాశనం చేయవచ్చు. కనుక మృధు స్వభావులు ఉత్తములు అది ఉత్తమ గుణం.” అన్నాడు.
#కరువులో ద్విజులు:
ధర్మరాజు… “పితామహా ! ధర్మభ్రష్టత్వం కలిగినప్పుడు కరువు కాటకాలు సంభవిస్తాయి. అప్పుడు ద్విజులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఎలా బ్రతకాలి?” అని భీష్ముడిని అడిగాడు.
భీష్ముడు… “ధర్మనందనా ! త్రేతాయుగము ద్వాపర యుగసంధిలో పన్నెండు సంవత్సరాల కాలం తీవ్రమైన కరువు సంభవించింది. నదులు, చెరువులు, పచ్చిక బయళ్ళు చివరకు అడవులు కూడా ఎండి పోయాయి. ఆహారం దొరకక జంతువులు చచ్చిపోసాగాయి. రాజులు ప్రజల వద్ద ఉన్న ధాన్యాలను పన్నుల రూపంలో దోచుకున్నారు. బలవంతులు బలహీనులను దోచుకోసాగారు. బ్రాహ్మణులు ధర్మం తప్పి ప్రవర్తించ సాగారు. యజ్ఞ యాగాదులు ఆగి పోయాయి. ఆకలికి తాళలేని జనం చనిపోసాగారు. ఆ సమయంలో విశ్వామిత్రుడనే మహర్షి ఆకలికి తట్టుకోలేక ఆహారం కొరకు వెదకుతూ సాయం సమయానికి ఒక పల్లెను చేరుకున్నాడు. విశ్వామిత్రుడు క్షుద్భాధతో సొమ్మసిల్లి పడి పోయాడు.
అతడి పక్కన ఒక కుక్క శరీరం పడి ఉంది దాని చర్మం వలిచి మిగిలిన శరీరం అక్కడ ఎండ పెట్టారు. ప్రాణం పోయే సమయంలో కుక్క మాంసభక్షణం చేయడం పాపం కాదని కుక్కమాసం దొంగలించ బోయాడు. అక్కడ ఉన్న ఒక చంఢాలుడు అది చూసి… ‘అయ్యా! నీ వెవరు ఈ పనికి ఎందుకు పూనుకున్నావు?’ అని అడిగాడు. విశ్వామిత్రుడు… ‘అయ్యా! నా పేరు విశ్వామిత్రుడు. ఆకలితో ఉన్నాను, చాలా రోజులుగా ఆహార పానీయాలు లేకుండా ఉన్నాను. ప్రాణాలు నిలుపు కోవడానికి కుక్క మాంసం తిన్నా తప్పు లేదనుకుని ఈ కుక్క మాంసం తీసుకుంటున్నాను. అగ్ని పవిత్రుడు అయినా సర్వభక్షకుడు కదా అలాగే నేనూ’ అని చెప్పాడు.
‘మహాత్మా ! అన్ని మాంసాలలోకి కుక్క మాంసం నీచమైనది. దానిని మీ వంటి తాపసులు తీసుకోవడం దోషం కాదా!’అని అడిగాడు.
‘బ్రహ్మ అండగా ఉన్న నాకు ఏ పాపం అంటదు. ముందు ప్రాణాలు నిలుపుకోవడం ముఖ్యం. బ్రతికి ఉంటే యజ్ఞ యాగాదులు చేసి పాపపరిహారం చేయవచ్చు. నాకు జీవనాధరం అయిన కుక్కమాంసం వదలను’ అన్నాడు.
‘మహాత్మా! కుక్క మాంసం తినడం అధమాధమం. మీ వంటి తాపసులు అలాంటి పని చేయ వచ్చా !’ అని అడిగాడు.
విశ్వామిత్రుడు… ‘అయ్యా ! అగస్త్యమహాముని రాక్షస మాంసం తిన్నా అతడి ప్రతిష్ట తగ్గలేదు కదా!’ అని అన్నాడు.
చంఢాలుడు… ‘అగస్త్యుడు రాక్షస బారి నుండి మానవాళిని రక్షించడానికి రాక్షస మాంసం మేకమాంస రూపంలో తిన్నాడు. మీరు మీ ఆకలి మాత్రం తీర్చుకోవడానికి కుక్క మాంసం తినాలని అనుకుంటున్నారు. మీరూ అగస్త్యుడు ఒకటి ఎలా ఔతారు?’ అని అడిగాడు.
విశ్వామిత్రుడు… ‘ఓయీ ! బ్రహ్మజ్ఞానానికి ఆలవాలమైన ఈ దేహం కోసం ఏమి చేసినా పాపం కాదు. అడ్డులే’ అన్నాడు.
చంఢాలుడు… ‘మహాత్మా! దొరికిన ఆహారం వదల లేక ఇలా అంటున్నావు కాని దీని వలన మీ తేజసు క్షీణించదా !’ అన్నాడు.
విశ్వామిత్రుడు… ‘అయ్యా! నేను బ్రతకాలని అనుకుంటున్నాను. నాకు ఈ మాంసం ఇవ్వు. నేను నిన్ను అడిగి తీసుకుంటున్నాను కనుక నాకు దొంగతనం చేసిన పాపం అంటదు’ అని అన్నాడు.
చంఢాలుడు… ‘మహానుభావా! ఎంతో పుణ్యాత్ములైన మీరు అధముడినైన నా వద్ద దానం పుచ్చుకొనుట ధర్మమా ! నేను ఇంతకంటే కాఠిన్యం వహించలేను. ఇదుగో కుక్క మాంసం మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి’ అన్నాడు.
విశ్వా మిత్రుడు కుక్క మాంసం తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఆ తరువాత వానలు కురిసాయి చెట్లు చిగురించాయి, పంటలు పండాయి కరువు దూరమైంది. విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్న పాపపరిహారం చేసుకున్నాడు. కనుక ధర్మనందనా! ఆపత్కాలంలో ఏ తప్పు చేసినా దోషం లేదు” అన్నాడు.
#శరణార్ధులు:
#బోయవాని ఆకలి తీర్చటం కోసం నిప్పులో కాలిపోతున్న పావురాలు:
ధర్మరాజు… “పితామహా ! శరణు జొచ్చిన వారిని, ఆపదలలో ఉన్నవారిని ఆదుకున్న వారికి ఏలాంటి ఫలం దక్కుతుంది.”
భీష్ముడు… “ధర్మనందనా ! ఒక బోయవాడు అడవిలో వేటకు వెళ్ళాడు. కొన్ని పక్షులను చూసాడు. ఇంతలో గాలి వాన ప్రారంభమై భయంకరంగా వాన కురిసింది. అడవి జలమయం అయింది. ఆ బోయవాడు ఒక మర్రి చెట్టు కింద తలదాచుకున్నాడు. ఆ బోయ చలికి గడగడలాడుతూ ఇక మీదట వేటాడనని, జీవహింస చేయనని ఆ చెట్టును వేడుకున్నాడు. ఆ చెట్టు మీద ఒక పావురం గూడుకట్టుకుని భార్యతో నివసిస్తోంది. మగపావురం గూటిలో ఉంది. ఆడ పావురం ఆహారం కొరకు వెళ్ళి గూటికి ఇంకా చేర లేదు. మగ పావురం ఆడ పావురం కొరకు ఎదురు చూస్తూ పరితపిస్తూ ‘అయ్యో ! అయ్యో ఇంత రాత్రయ్యింది నా భార్య గూటికి చేరలేదు. నా భార్య లేని గూడు కళా విహీనంగా ఉంది. నా భార్యకు ఏమైందో తెలియడం లేదు. నా భార్య లేకున్న నా బ్రతుకిక వ్యర్ధం కదా’ అనుకుని ఏడుస్తూ ఉంది.
ఆ ఆడ పావురం బోయవాడి వలలో ఉంది. అది తన భర్త మాటలు విని ‘ఆహా ! నా జన్మ ధన్యమైంది. నా భర్త మాటలను విని నామనసు పులకించి పోయింది. నేను ఎంత పుణ్యాత్మురాలను’ అనుకుని నేను ఇక్కడ ఉన్నాను అని కిచకిచ లాడుతూ చెప్పింది.
అది విన్న మగ పావురంతో… ‘ఆ అరుపులు వినగానే ఆడ పావురం అయ్యా! ఈ వేటగాడు మన అతిథి. ఇతడికి అతిధి సత్కారం చెయ్యి’ అన్నది.
అది విని మగ పావురం బోయవాడి వద్దకు వచ్చి ‘అయ్యా! మీరు నా అతిధి నేను మిమ్ము ఎలా సత్కరించగలనో శెలవియ్యండి’ అని అడిగింది.
బోయవాడు ‘అయ్యా! ప్రస్థుతం నాకు చలి బాధ తీరాలి’ అన్నాడు.
వెంటనే ఆ పావురం చితుకులు ఏరుకుని వచ్చి మంట వేసింది. ఆ మంటలో చలి కాచుకుని బోయ వాడు ‘తనకు ఆకలిగా ఉంది’ అన్నాడు.
మగ పావురం ‘అయ్యా! మేము ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే తింటాము కాని రేపటికి దాచుకోము. మీరు పావురములు ఆహారంగా తింటారు కనుక నన్ను ఆహారంగా స్వీకరించండి’ అని ఆ మంటలలో దూకింది.
అది చూసిన బోయవాడికి జ్ఞానోదయం అయి.. ‘ఛీ నాదీ ఒక బ్రతుకేనా! ఈ పావురానికి ఉన్న జ్ఞానం నాకులేదు కదా!’ అనుకుని వలలోఉన్న పక్షులను వదిలేసాడు.
బోయవాడి వలలో నుండి బయట పడిన ఆడ పావురం ‘తన భర్తలేని బ్రతుకు తనకెందుకని’ అదే మంటలోకి దూకి మరణించింది. అప్పటికే దివ్య విమానంలోకి చేరిన మగ పావురం ఆడపావురం కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇదంతా కళ్ళారా చూసిన బోయ వాడు తన వలను, మిగిలిన సామాను వదిలి విరాగిగా మారి వెళ్ళియాడు. కనుక ధర్మనందనా ! తమ శరణు జొచ్చిన ఆ బోయవాడికి అతిథి సత్కారం చేసిన ఫలితానికి పక్షులకు దివ్యత్వం సిద్ధించింది.” అని చెప్పాడు.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment