* గానం చెయ్యడం ఎందుకు?
* అన్నమయ్య మాట ఏమిటి?
----------
'సరిగ్గా' తిరుప్‌పావై
15
-------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!
పాసురమ్ 15
ఆణ్డాళ్ క్రితం పాసురాల్లో నిద్రలేపేందుకు ప్రయత్నం చెయ్యగా, ఈ పదిహేనో పాసురమ్ గోపకన్య ఆణ్డాళ్ మాటకు బదులు చెబుతూండగా పరస్పర సంభాషణలాగా సాగుతుంది. రండి, మనమూ ఈ పాసురమ్‌తో సాగుదాం...
మూలం
"ఎల్లే ఇళఙ్గిళియే! ఇన్నమ్ ఉఱఙ్గుదియో?"
"సిల్లెన్ఱళ్షైయేన్ మిన్ నఙ్గైమీర్! పోదర్‌గిన్ఱేన్;"
"వల్లైయున్ కట్టురైగళ్ పణ్డే ఉన్ వాయఱిదుమ్"
"వల్లీర్గళ్ నీఙ్గళే నానేదాన్ ఆయిడుగ"
"ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై"
"ఎల్లారుమ్ పోన్దారో?" "పోన్దార్ పోన్‌దెణ్ణిక్కొళ్;
వల్లానై కొన్ఱానై మాఱ్ట్రారై మాఱ్ట్రళ్షిక్క
వల్లానై మాయనైప్ పాడేలోరెమ్‌పావాయ్!"
తెలుగులో
"ఏమే చిలకకలికి! ఇంకా నిద్రపోతున్నావా?"
"గోలగా పిలవకండమ్మా భామల్లారా! వచ్చేస్తున్నాను"
"బావుంది నీ మాట, నువ్వు మాటకారివని ముందే తెలుసు"
"మీరు గొప్పవాళ్లే, నన్నిలా ఉండనివ్వండి"
"తొందఱగా బయటకురా, నీకు మాత్రం వేఱే పనేముంది?"
"అందఱూ వచ్చేశారా?" "ఆఁ వచ్చేశారు, వచ్చి లెక్కపెట్టుకో;
బలవంతుణ్ణి చంపినవాణ్ణి, శత్రువుల్ని ఎదుర్కొని చంపగలిగే
శక్తిమంతుణ్ణి, నల్లనివాణ్ణి గానం చెయ్యడానికి రా ఓలాల నా చెలీ!"
అవగాహన
యవ్వనంలో ఉన్న చిలకలాంటి అందమైన ఆ గోపకన్యను "చిలకకలికి" అని అంటూ ఇంకా నిద్రపోతున్నావా అని అడిగితే "గోలగా పిలవకండమ్మా...ఇదిగో వచ్చేస్తున్నాను" అని ఆ చిలకకలికి సమాధానంతో మొదలుపెట్టి అటుపైన పరస్పర సంభాషణగా ఈ పాసురాన్ని చక్కగా నడిపింది ఆణ్డాళ్.
"బలవంతుణ్ణి చంపినవాణ్ణి, శత్రువుల్ని ఎదుర్కొని చంపగలిగే శక్తిమంతుణ్ణి, నల్లనివాణ్ణి" అంటూ కంసుణ్ణి చంపిన, ఇతర శత్రవుల్ని చంపగలిగే కృష్ణుణ్ణి తెలియజేస్తోంది ఆణ్డాళ్.
కృష్ణుణ్ణి లేదా దైవాన్ని "గానం చెయ్యడానికి రా" అని పిలుపునిస్తోంది ఆణ్డాళ్. ఆ పిలుపు ఆ గోపకన్యకే కాదు మనలో ప్రతి ఒక్కరికీ కూడా.
"గాయనాత్ (లేదా గాయన్తమ్) త్రాయతే ఇతి గాయత్రీ" అంటే గాయనం లేదా గానం వల్ల రక్షించేది గాయత్రీ అని గాయత్రీ మంత్రం విషయంలో చెబుతారు. గాయత్రీ మాత్రమే కాదు, మనం చేస్తే దైవనామగానం కూడా మనల్ని రక్షిస్తూనే ఉంటుంది.
"నీ నామమే మాకు నిధియు నిధానము
నీ నామమే ఆత్మ నిధానాంజనము"
అని ఒక సంకీర్తనలో అన్న అన్నయ్య మఱో సంకీర్తనలో దైవ నామం గుఱించి ఇదిగో ఇలా అంటున్నారు:
"హరినామము కడు నానందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా
నలినాక్షుని శ్రీ నామము
కలి దోష హరము కైవల్యము
ఫలసారము బహుబంధ మోచనము
తలఁచవో తలఁచవో తలఁచవో మనసా
నగధరు నామము నరక హరణము
జగదేక హితము సమ్మతము
సగుణ నిర్గుణము సాక్షాత్కారము
పొగడవో పొగడవో పొగడవో మనసా
కడఁగి శ్రీ వేంకటపతి నామము
బడిబడినే సంపత్కరము
అడియాలంబిల నతి సుఖ మూలము
తడవవో తడవవో తడవవో మనసా"
గానం చెయ్యడానికి రా అన్న ఆండాళ్ పిలుపును
అందుకుందాం ఆపై దైవన్ని గానం చేస్తూ ఉందాం.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 15
https://youtu.be/_vJPeFTjYMQ?si=Bae0mKcTfjPZe04y
No comments:
Post a Comment