*అనుబంధం ఏర్పడేది ఎప్పుడు....‘ఉమ్మనీట బిడ్డ ఉన్ననాడె!* అన్నారు కవులు.
‘తెలుగుభాష....మా జీవనాడి. అది పేగు ముడి. భాషతో మాది భావోద్వేగ పయనం’ అని ముక్తకంఠంతో ప్రకటించారు.
తమ తరతరాలకు తెలుగు వెలుగులను పంచుతూనే ఉంటామని శపథం చేశారు.
నిజానికి ఆ శపథం జైత్రయాత్రను కొనసాగిస్తూన్న తెలుగురథానిది! జయహో తెలుగు!
‘అమ్మ భాషతో?’ అనే ప్రశ్నకు
శిశువులకు శ్వాస, భాష- అమ్మలనుంచే సంక్రమిస్తుంది. వల అలికిడికి ఉలిక్కిపడే చేపపిల్లల వెన్ను నిమురుతూ నది పాడే నిశ్శబ్దగీతం లాంటిది- ఆ ప్రక్రియ.
అదితి కొడుకు వామనుడు. పసిబిడ్డను లాలిస్తూ ఆమె ‘నన్ను కన్న తండ్రీ! నాపాలి దైవమా’ అంటూ వెన్ను నిమురుతుంది. కన్నకొడుకును- ‘కన్నతండ్రీ’ అని పిలవడం- మమకారపు నుడికారం.
అది తెలుగుభాషకు పోతన అందించిన వరం. అమ్మ స్వరంలోని లాలనను శిశువు గ్రహిస్తాడు. దాన్ని గుర్తించిన తల్లులందరూ ‘కన్నా’ అన్న పిలుపును భాషకు జోడిస్తారు.
‘చందమామ రావె! జాబిల్లిరావె’ పాటను ఎన్నో తరాలుగా ఆలపిస్తూ తెలుగుభాషకు అమ్మలు ఇక్షురసాభిషేకం చేస్తూనే ఉన్నారు.
అది తెలుగుభాష అని తెలియకపోయినా శిశువులు- ఆ చెరకు తీపిదనాన్ని జుర్రుకుంటూనే ఉన్నారు. ఇది తరతరాల రసప్రవాహం. ఎన్నిసార్లు గుటకేసినా- తీరని దాహం!
‘ఏకః స్వాదు న భుంజీత!’ రుచికరమైనదాన్ని ఒక్కడే కూర్చుని తినరాదంది వేదం. కాబట్టి ఆ తీపిదనాన్ని జనానికి పంచుతూ, పెంచుతూ వచ్చారు కవులు.
‘తెలుగువారల తేటమాటలు, తెలుగువారల తేనెపాటలు, తెలుగువారల మధుర గీతం తెలియ చెప్పర తెలుగుబిడ్డా!’ అన్న త్రిపురనేని సూచనతో అమ్మభాషలోని కమ్మదనాన్ని విరివిగా చవిచూపిస్తూ వచ్చారు.
‘ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్డు విన్పించుభాష’ అంటూ విశ్వనాథ వినిపించిన అమ్మభాషలోని సంగీతలయను తమ వాక్యాల్లో పొందుపరుస్తూ వచ్చారు.
దాంతో కలాల్ని ఆకుపచ్చని సిరాలో అద్దిరాస్తే- అక్షరాలు లేలేత గరిక పరకలై పాఠకుల హృదయాలను హరిత వనాలు చేశాయి.
నల్లసిరాలో ముంచి రాస్తే- నీలి కలువలై గుండెల్ని బరువెక్కించాయి. ఎర్రసిరాను ఇష్టపడే కలాలు- మంకెన పూలను పూశాయి. ‘రుద్రాలిక నయన జ్వాలికలై కలకత్తా కాళిక నాలుకలై’ ఆ అగ్నిపూలు కళ్లను ఎరుపెక్కించాయి.
ఈ విభిన్న సుగంధాలను ఆస్వాదించే రసజ్ఞులు- కందుకూరి రామభద్రకవిలా ‘ఎంత చక్కనిదోయి ఈ తెనుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’ అంటూ మురిసిపోతూ వచ్చారు.
ఆ సృజన వైభవాన్ని, ఆ సౌందర్య విభావరిని పోతనకలంలో దర్శించిన కరుణశ్రీ ‘ముద్దులుగార భాగవతమున్ రచియించుచు పంచదారలో అద్దితివేమొ! గంటమును’ అని ఆశ్చర్యపోయారు.
‘అక్షరాల సత్తా ఎంతటిదో నిఘంటువులు చెప్పలేవు, అది ఉపాసకులకే తెలుస్తుంది’ అని తేల్చారు సామవేదం వారు.
తెలుగుభాష సొగసుకు ముగ్ధుడైన తమిళ మహాకవి సుబ్రహ్మణ్యభారతి- ‘వెన్నెలవేళ పడవ ప్రయాణం చేస్తూ సుందర తెలుంగు గీతాన్ని ఆస్వాదిద్దాం’ అని భావుక శ్రేణులకు పిలుపిచ్చారు.
పలు భాషలు తెలిసిన కవులు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ప్రశంసలు కురిపించారు. ‘అమ్మ భాషే మనకు బలం.
దాంతోనే లోకాన్ని గెలువగలం’ అన్న గట్టి భరోసాను ఇచ్చారు. తరాలు గడిచిపోతున్నా తల్లిభాషతో ముడిపడిన పేగుబంధం ఎప్పటికీ అంటిపెట్టుకునే ఉంటుందని ఎన్నో తరాల కిందటే బర్మా(మయన్మార్)కు తరలిపోయిన తెలుగువారి వారసులు- ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘విశ్వసంఘ్‌శిబిర్’లో నిరూపించారు.
No comments:
Post a Comment