Tuesday, January 6, 2026

 🔱 *ప్రభాత గుళిక* 🔱

# *జీవనగీత...*

🍁భగవంతుడే అవతార రూపాలుగా దిగివచ్చి మనకు అందించిన అనుగ్రహ ప్రసాదాలు శ్రీమద్ రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం. రామాయణాన్ని అనుసరిస్తే భగవంతుడు భక్తుడి వశం అయిపోతాడు. భగవద్గీతను అనుసరిస్తే... భక్తుడు 'విజయుడ'వుతాడు. భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం కాదు, మన జీవనగీత. జీవితాల్లో ఎదురయ్యే అనేక సవాళ్లకు, కష్టాలకు, నష్టాలకు అది పరిష్కారం చూపుతుంది. పాత్ర వచ్చేటప్పుడు ఖాలీగా వస్తుంది. వెళ్లేటప్పుడు 'కర్మ'లను నింపుకొని వెళ్తుంది. అలా కర్మలకు భగవంతుడు భగవద్గీత ద్వారా ఇచ్చిన పరిష్కారాలు... మనుషులు ఇవ్వలేరు.

🍁రెండు పక్షులు చెట్టుకొమ్మమీద విశ్రాంతి తీసుకుంటూండగా కింద ఒక వేటగాడు విల్లు ఎక్కుపెట్టాడు. తప్పించుకుని పైకెగిరిపోదామంటే పై కొమ్మ మీద ఒక డేగ వీటి కోసం కాచుకుని ఉంది. చావు తప్పదనుకున్న పక్షుల జంట.. దేవుడి మీదే భారం వేసి కళ్లు మూసుకుని దైవస్మరణ చేస్తోంది. సరిగ్గా వేటగాడు బాణంతో గురిచూసే సమయాని అతని కాలిని పాము కాటేసింది. బాణం గురి తప్ప డేగకి తగిలింది. శరాఘాతంతో డేగ, పాము కాటుతో వేటగాడి ప్రాణాలు పోయాయి. పక్షుల్ని కాపాడాల్సిన బాధ్యత భగవంతునిదైంది. శరణాగతి సర్పాన్ని పంపేలా చేసింది.

🍁యుద్ధంలో సాయం చేయమని అర్థించడానికి అర్జునుడు, దుర్యోధనుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చారు. 'పదివేల మంది యోధానుయోధులు ఒకవైపు, నేనొక్కడినే ఒకవైపు ఉంటాను.. కోరుకోండి' అన్నాడు శ్రీకృష్ణుడు. 'నువ్వు ఒక్కడివి ఉంటే ఎం లేకపోతే ఎంత? పదివేల మంది యోధానుయోధులుంటే నా చెంత' అన్నాడు మదగర్వి దుర్యోధనుడు. 'నువ్వే వుంటే వారెంత?' అన్నాడు దైవబలం ఎరిగిన కిరీటి.

🍁 భగవంతుణ్ని శరణాగతి కోరితే అంతా ఆయనే చూసుకుంటాడని నిరూపించింది భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత అర్జునునికి మాత్రమే కాదు, అందరికీ వర్తిస్తుంది. 'నీ ధర్మం నువ్వు నిర్వర్తించు.. ఫలితం నాకు వదిలెయ్' అంటాడు శ్రీకృష్ణుడు.

🍁'పాపభారం తగ్గించాలి, యుద్ధం అనివార్యం' అని కృష్ణుడు అన్నప్పుడు- అది నిజమే అయినా, ఎదురుగా ఉన్నవి బంధాలు.. యుద్ధం చేయలేనంటాడు అర్జునుడు. 'నువ్వెవరు చేయడానికి..? చేసేది, చేయించేది నేనే' అంటాడు శ్రీకృష్ణుడు. కౌరవ ప్రముఖులలో.. భీష్మ ద్రోణులు, సైంధవుడు, కర్ణుడు మొదలైన వీరాధివీరులను నేనెప్పుడో హతం చేశాను. మరణించిన వారిని నువ్వు జయించడమే మిగిలిందంటాడా పాండవహితుడు. మన చేతి మీదుగా జరిగేవన్నీ మనం చేసినవి కావని గమనించమంటాడు. శిష్ట
వికాసానికి, దుష్ట వినాశానికి తానే కారణమంటాడు.

🍁దేహం, మనసు, బుద్ధిని దాటిన జ్ఞానాన్ని, తత్వాన్ని ప్రసాదించేదే భగవద్గీత. 'బ్రహ్మలోకంతో సహా ఎన్ని లోకాలకు వెళ్లినా తిరిగి మానవలోకానికి రావాల్సిందే.
కానీ నన్ను చేరిన వారికి మాత్రం మోక్షమే అన్నాడు పరమాత్ముడు గీత ద్వారా. ఇంతకన్నా జీవుడికి కావాల్సిందేముంది?🙏

✍️-గూగులమ్మ సౌజన్యంతో 

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment