-------
ఎ.ఆర్. రహ్మాన్ పాట
---------------
"పుదు వెళ్ళై మళ్షై ఇఙ్‌గు పొళ్షిగిన్ఱదు..."
("పరువం వానగా ఇట కురిసేనులే...")
1992లో రోజా తమిళ్ష్ సినిమాలో ఎ.ఆర్. రహ్మాన్ పాట చేసిన అంతర్జాతీయ స్థాయి పాట "పుదు వెళ్ళై మళ్షై ఇఙ్‌గు పొళ్షిగిన్ఱదు..."
ఎ.ఆర్. రహ్మాన్ పుట్టిన రోజు ఇవాళ.
ఎ.ఆర్. రహ్మాన్... అంతర్జాతీయ స్థాయి భారతదేశ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహ్మాన్!
మనదేశ సినిమా సంగీతాన్ని అత్యంతంగా ప్రభావితం చేసిన సంగీత దర్శకుల్లో మొదటివారు శంకర్-జైకిషన్; రెండో వారు ఎ.ఆర్. రహ్మాన్. ఒక దశలో దేశ సంగీతంలో పెనువిప్లవం శంకర్-జైకిషన్ ఆ తరువాతి పెనువిప్లవం ఎ.ఆర్. రహ్మాన్. పాట బాణి, వాద్యసంగీతం, సౌండింగ్, రికడింగ్ (రికార్డింగ్) ప్రమాణాలు, పాట color, tone, timbre ఈ అన్నింటా శంకర్-జైకిషన్, ఎ.ఆర్. రహ్మాన్ ఇద్దరూ దేశం పాటను అతి తీవ్రంగా ప్రభావితం చేశారు.
మనదేశం పాట తొలుత అంతర్జాతీయమైంది శంకర్-జైకిషన్ వల్ల. ఎ.ఆర్. రహ్మాన్ అంతర్జాతీయంగా ప్రఖ్యాతమైన మనదేశ సంగీత దర్శకుడు. ఆస్కర్ పొందిన తొలి భారతీయ సంగీత దర్శకుడు, ఒకే ఏడాది 2 ఆస్కర్ అవార్డులను పొందిన తొలి ఆసియా దేశస్థుడు, గ్రామి అకాడమి అవార్డ్ అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడు రహ్మాన్. రహ్మాన్ వల్ల మనదేశ సినిమా సంగీతం అంతర్జాతీయ స్థాయిని అందుకోగలిగింది
ఎ.ఆర్. రహ్మాన్ ఒక దార్శనిక (visionary) సంగీతదర్శకుడు. ఎంతో మంది సంగీత దర్శకుల్లో కొందఱు మాత్రమే గొప్ప సంగీత దర్శకులుంటారు. ఆ స్థాయివారిలో కొందఱు ట్రెండ్ సెట్టింగ్ సంగీత దర్శకులు (ఇళైయరాజా, సలిల్ చౌధరీ, ఓ.పీ. నయ్యర్ వంటివారు)
కొందఱు విషనరి సంగీత దర్శకులు ఉంటారు. శంకర్-జైకిషన్, ఆర్. డి. బర్మన్, ఎమ్.ఎస్. విశ్వనాద(థ)న్ విషనరి సంగీత దర్శకులు. ఆ కోవలో ఎ.ఆర్. రహ్మాన్ ఒక విషనరీ సంగీత దర్శకుడు. శంకర్-జైకిషన్, ఎ.ఆర్. రహ్మాన్ ఇద్దరూ విషనరీ + ట్రెండ్ సెట్టింగ్ సంగీత దర్శకులు.
1992లో 'రోజా' సినిమాతో రహ్మాన్ భారతదేశం సినిమా సంగీతంలో పెనువిప్లవాన్ని తీసుకొచ్చారు. బాణి (tune), వాద్య సంగీతం (orchestration) శబ్దీకరణం (sounding)లలో ఒక అపూర్వమైన ప్రత్యేకతను తీసుకొచ్చారు ఎ.ఆర్. రహ్మాన్. 'రోజా' సినిమాతో అంతర్జాతీయస్థాయి సంగీతాన్ని భారతదేశంలో ధ్వనింపజేశారు రహ్మాన్. 'రోజా' సినిమాలోని ప్రతిపాటా ఓ కొత్తఛాయతో ఉంటుంది. "పుదు వెళ్ళై మళ్షై ఇఙ్‌గు పొళ్షిగిన్ఱదు..." ("పరువం వానగా ఇట కురిసేనులే...")
పాట మొత్తం భారతదేశంలోనే ఒక అపూర్వమైన పాట; ఒక సరికొత్త ధోరణిలో రూపొందిన కడుగొప్పపాట; ఒక దార్శనికమైన పాట; A land mark songగా స్థిరపడ్డ పాట; ఒక అంతర్జాతీయ గీతం.
'రోజా' సినిమాలోని "చిన్ని చిన్ని ఆశ..." పాట విపరీతంగా ప్రబలమైన పాట. జపాన్ వంటి విదేశాల్లోనూ ఈ పాట ఎంతో జనరంజకమైపోయింది. 'రోజా' సినిమా పాటలు హిందీలోకి డబ్ అయి దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ధ్వనించాయి. 'రోజా' సినిమా సంగీతాన్ని ప్రపంచపు 10 ఉత్తమ సంగీత కూర్పులలో ఒకటిగా టైమ్స్ ప్రకటించింది.
11 ఏళ్ల వయసులో ఇళైయరాజా దగ్గఱ కీ బోడ్ వాద్య వాదకునిగా దిలీప్ కుమార్ అన్న అబ్బాయి పనిచెయ్యడం మొదలుపెట్టాడు. ఆ అబ్బాయి 25ఏళ్ల ప్రాయంలో ఎ.అర్. రహ్మాన్ అయ్యాడు. ఆయన తండ్రి శేఖర్ కూడా ఒక చలనచిత్ర సంగీత దర్శకుడే. కొన్ని మలయాళ సినిమాలకు సంగీతదర్శకుడిగా చేశారు. 9వ ఏట తండ్రిని కోల్పోయిన రహ్మాన్ 11వ ఏట సంగీత ప్రపంచంలోకి వచ్చారు. వ్యాపార ప్రకటనల లఘు చిత్రాలకు సంగీతం ఇవ్వడంతో మొదలుపెట్టి ఇవాళ అంతర్జాతీయ సంగీత దర్శకుడిగా విలసిల్లుతున్నారు.
శంకర్-జైకిషన్‌లా contrasting phrases and melodies రహ్మాన్ పాటల్లో ఉంటాయి. అవి జనాల్ని ఆపి, పట్టుకుని పాటను వినేలా చేస్తాయి. స్వరాల కాలప్రమాణం విషయంలో కూడా శంకర్-జైకిషన్ ధోరణి రహ్మాన్‌లో ఉంటుంది. శంకర్-జైకిషన్ బాణిల్లోలాగా రహ్మాన్ బాణిల్లోనూ స్వరాలు దగ్గఱ దగ్గఱగా ఉంటాయి. శంకర్-జైకిషన్ పాటలలా రహ్మాన్ పాటలూ outlandish and outstanding గా ఉంటాయి.
రహ్మాన్ jazz , blues వంటి సంగీత పోకడలను ఆకళింపుచేసుకుని మన కర్ణాటక, హిందూస్తానీ సంగీతాన్ని అర్థం చేసుకుని ఆపై ఆరబీ సంగీతాన్ని, కవ్వాలీ ఛాయల్నీ సొంతం చేసుకుని పరిపుష్టమైన సృజనాత్మకతతో ఉన్నతమైన సంగీతాన్ని ఇచ్చారు.
రహ్మాన్ చేసిన సంగీతానికి ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆసియా నుంచీ, అదీ భారతదేశం నుంచీ రహ్మాన్ ద్వారా అంతర్జాతీయస్థాయి సంగీతం వస్తుందని ఊహించలేదని కొందఱు విశ్వ సంగీత పరిశోధకులూ, విశ్లేషకులూ ప్రశంసించారు. ఎన్నో విదేశాల music bands వెతుక్కుంటూ వచ్చి రహ్మాన్ తో పనిచేశాయి. నిజానికి ఇలా విదేశాల music bands రహ్మాన్‌తో పనిచెయ్యడం చాల గొప్ప విషయం.
రహ్మాన్ తన తొలి హిందీ సినిమా 'రంగీలా'లో చేసిన "హాయ్ రామ యే క్యాహువా..." పాట విశేషమైన కల్పనా చాతుర్యానికి ఒక మచ్చుతునక. గొప్ప పాట అది. రహ్మాన్ చేసిన హిందీ సినిమా 'లగాన్' సంగీతం ప్రపంచపు 100 ఉత్తమ సంగీత కూర్పుల్లో ఒకటిగా నిలిచింది. రహ్మాన్ ఒక special flair and flavor తో 'తాల్' సినిమా సంగీతం చేశారు.
'దిల్ సే' సినిమాలో రహ్మాన్ చేసిన "దిల్ సేరే..." పాట ఆయన్ను ఇంగ్లిష్ సినిమా దర్శకుల దృష్టికి తీసుకెళ్లి ఇంగ్లిష్ చిత్రాలకు సంగీత దర్శకత్వం చేయించింది. జపనీస్, చైనీస్ సంగీత మూలాల మేళవింపుతో రహ్మాన్ 'Warriors of Heaven' కోసం ప్రత్యేకమైన సంగీతాన్ని సృష్టించారు.
మనదేశ సినిమాల్లో మొదటి శబ్దీకరణ విప్లవం (sounding evolution) శంకర్-జైకిషన్ వల్ల వచ్చింది. అటు తరువాత ఆర్.డీ. బర్మన్ సౌండ్ ప్రత్యేకంగా ఉంటుంది.1980లో 'కుర్బానీ' సినిమాలోని "ఆప్ జైసా కోఈ..." పాటతో sounding లో పెనుమార్పును తెచ్చారు బిద్దు అప్పయ్య. అటు తరువాత ఎ.ఆర్. రహ్మాన్ 'రోజా'తో మనదేశ సినిమాల్లోకి అత్యవసరమైన శబ్దీకరణ విప్లవాన్ని తెచ్చారు. ఎ.ఆర్. రహ్మాన్ రాకపోయి ఉన్నట్టయితే మనదేశ సినిమా సంగీతం సాంకేతికంగా ఇంకా వెనకబడే ఉండేదేమో?
పాశ్చాత్య పోకడలే కాదు కర్ణాటక, హిందూస్థానీ సంగీతం ఆధారంగా రహ్మాన్ గొప్ప పాటలు చేశారు. 'జీన్స్' సినిమాలో "కన్నుల్లో..." డ్యూయట్ సినిమాలో "అంజలీ, అంజలీ..." వంటి పాటలూ, హిందీ 'జోదాఅక్బర్' సినిమాలో చేసిన పాటలూ అలాంటి వాటికి మచ్చుతునకలు. 'బొంబాయి' సినిమాలో చేసిన "కన్నానులే...." పాట కవ్వాలీ పోకడలను రంగరించి చేసిన గొప్ప పాట. 'బర్సాత్ కీ రాత్' సినిమాలో రోషన్ చేసిన కవ్వాలీలు గొప్ప సినిమా కవ్వాలీలుగా చెబుతారు. చాలయేళ్ల విరామం తరువాత ఎ.ఆర్. రహ్మాన్ 'ఫిజా' సినిమాలో "పియా హాజీ అలీ..." అన్న గొప్ప కవ్వాలీ చేశారు.
Airtel కు రహ్మాన్ చేసిన signature music ప్రపంచంలో ఎక్కువగా డౌన్ లోడ్ చేసుకోబడ్డ సంగీతం.
రహ్మాన్ మంచి గాయకుడు కూడా. 'బొంబాయి' సినిమాలో "అది అరబి కడలందం..." పాట హిందీ, తెలుగుల్లో పాడిన గాయకులకన్నా తమిళ్లో ఆయన పాడిందే గొప్పగా ఉంటుంది. ఇంకా కొన్ని పాటలు చాల బాగా పాడారు రహ్మాన్. రహ్మాన్ స్క్రిప్ట్ రచయిత కూడా. ఆయన రచనలో 99 సాంగ్స్ అనే హిందీ సినిమా రూపొందింది.
మంచి లేదా గొప్ప (idiomised English) ఇంగ్లిష్ మాట్లాడతారు రహ్మాన్. ప్రపంచంలోని చాల విషయాలపై ఆయనకు మంచి అవగాహన ఉంది. సంఘసేవకుడు రహ్మాన్. తన ట్రస్ట్‌ద్వారా అవసరమయ్యే వాళ్లకు కావాల్సిన వైద్య, విద్య సహాయాలు చేస్తూ వస్తున్నారు. ఉత్తమ ప్రవర్తన కలిగిన మనిషి రహ్మాన్. సంగీతంలో తాను చేరిన ఎత్తులకు గాను పద్మభూషణ్ అయ్యారు రహ్మాన్.
"సంగీతం కన్నా ముందు ఇంగితం కావాలి" అంటారు రహ్మాన్. ఇదొక్కటి చాలు ఆయన ఎలాంటి వ్యక్తో తెలుసుకోవడానికి. "నేను తెల్ల కాగితాన్ని, భగవంతుడు రాస్తున్నాడు అంతే" అన్నారు రహ్మాన్. ఇది ఆయన ఒక పరిణతి చెందిన కళాకారుడు అన్నదాన్ని తెలియజేస్తోంది.
సంగీత దర్శకుడిగా 6 జాతీయ అవార్డ్స్‌నూ, 31 ఫిలిం ఫేర్ అవార్డ్స్‌నూ అందుకున్నారు రహ్మాన్. కెనడా దేశంలో Ontario లో ఒక వీధికి ఎ.ఆర్. రహ్మాన్ పేరు పెట్టారు.
రహ్మాన్ విశ్వస్థాయి సంగీతాన్ని ఆవిష్కరించారు. ఒక విశ్వస్థాయి సంగీత ఆవిష్కరణగా నిలిచారు రహ్మాన్. అందుకు ఈ "పుదు వెళ్ళై మళ్షై ఇఙ్‌గు పొళ్షిగిన్ఱదు..."
("పరువం వానగా ఇట కురిసేనులే...") తొలి అడుగు.
పెండ్యాల-ఘంటసాల పాటలాగా బావుండడం, భావంతో ఉండడం, సొంపుగా ఉండడం మామూలు విషయాలు. మామూలుగా ఉండం అన్నదానికి పైన కళ పరిధి ఎంతో ఉంటుంది; ఆ పరిధిలో ఎన్నో విశిష్టతలు ఉంటాయి. నీళ్లు తాగడం నుంచి విశిష్టమైన పానీయాలు తాగడంలోకి వెళ్లేందుకే మనిషి జీవితం ఉంది. నీళ్ల కన్నా విశిష్టమైన పానీయాలు మన ముందే ఉంటాయి. మనం మధ్యతరగతి మాంద్యాన్ని తొలగించుకుని విశిష్టతను అందుకోవాలి. ఇదిగో ఒక అంతర్జాతీయ గీత వైశిష్ట్యం.
వినండి
https://youtu.be/N1d349JBDjY?si=Kfv6HR210mfFEIY5
రోచిష్మాన్
9444012279
No comments:
Post a Comment