Tuesday, January 6, 2026

 "మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః" 

----------
'సరిగ్గా' తిరుప్‌పావై 
   16
-------------------

మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!

(తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని‌ అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.  

ఆళ్ష్వార్‌ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది.‌‌ పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు. పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి.‌ పాసురమ్ అనడమే సరైంది‌.)

పాసురమ్ 16 

ఆణ్డాళ్, గోపకన్యల్ని నిద్రలేపాక ఆ గోపకన్యలతో కలిసి కృష్ణుడి ఇంటికి వెళ్లి తలుపు తియ్యమంటూ ఈ పదహాఱో పాసురాన్ని సంధించింది. మనం పాసురమ్‌తో పాటు అనుసంధానం ఔదాం రండి... 

మూలం 

నాయగనాయ్ నిన్ఱ నన్దగోబనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱున్ తోరణ
వాయిల్ కాప్పానే! మణిక్కదవమ్ తాళ్‌తిఱవాయ్;
ఆయర్ సిఱుమియరోముక్కు అఱైబఱై
మాయన్, మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్‌న్దాన్
తూయోమాయ్ వన్దోమ్ తుయిలెళ్షప్ పాడువాన్
వాయాల్ మున్నమున్నమ్ మాఱ్ట్రాదే అమ్మా; నీ
నేయ నిలైక్కదవమ్ నీక్కేలోరెమ్‌పావాయ్!


తెలుగులో 

నాథుడై నెలకొన్న నందగోపుడి
కోవెల కావలివాడా! ధ్వజాలు, తోరణాలు కట్టిన
వాకిళ్ల కావలివాడా! రతనాల తలుపు గొళ్లెం తియ్యి;
గోపకన్యలమైన మాకు మోగే తప్పెటను ఇస్తానని
నల్లనివాడు, రత్నవర్ణుడు నిన్ననే మాటిచ్చాడు;
శుచిగా వచ్చాం మేలుకొలుపు పాడడానికి
తొందఱపడి నోటితో కాదనకుమా; నువ్వు
మూసి ఉన్న తలుపు తియ్యి; ఓలాల నా చెలీ!


అవగాహన 

తమ నాథుడైన నందగోపుడు లేదా కృష్ణుడి ఇంటికెళ్లి "శుచిగా వచ్చాం, మేలుకొలుపు పాడడానికి" అంటూ అక్కడి కావలివాడికి చెబుతూ  మూసి ఉన్న తలుపును తియ్యమంటోంది గోపికలతో వచ్చి‌న ఆణ్డాళ్. అంతే కాదు "గోపకన్యలమైన మాకు మోగే తప్పెటను ఇస్తానని నల్లనివాడు, రత్నవర్ణుడు నిన్ననే మాటిచ్చాడు" అని తెలియజేస్తోంది. "కాదనకుమా" అంటూ అడ్డుపడద్దని కావలివాడికి చెబుతోంది. 

నోము చేసుకునేప్పుడు ఆ నోములో భాగంగా తప్పెటను వాయిస్తారు. ఆ తప్పెటను కృష్ణుడే తమకు ఇస్తానని మాటిచ్చాడు అని చెబుతోంది‌. తప్పెట అన్నది అనుగ్రహానికి ప్రతీక.‌ 

"మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః" 

అని కృష్ణుడు భగవద్గీత(అధ్యాయం 9 శ్లోకం 34)లో చెప్పాడు. అంటే నా మనస్కుడివిగా ఉండు. నా భక్తుడివిగా, నా యజ్ఞాలు(పూజలు) చేసేవాడివిగా ఉండు. నన్ను నమస్కరించు. ఈ విధంగా అనుసంధానితుడవై నన్ను పరంగా తీ(చే)సుకుంటే నీలో నన్ను తప్పకుండా పొందగలవు అని అర్థం. ఇక్కడ కృష్ణుడు, తనను కోరుకుని, నమస్కరించి చెంతకు వచ్చినవాళ్లు తనను లేదా తన అనుగ్రహాన్ని పొందగలరని మాట ఇచ్చాడు. ఆ భావాన్నే "తప్పెటను ఇస్తానని నల్లనివాడు, రత్నవర్ణుడు నిన్ననే మాటిచ్చాడు" అని ఆణ్డాళ్ చెబుతోంది. 

దైవం చెంతకు శుచిగా వెళ్లాలి; అందుకే తాము శుచిగా వచ్చిన సంగతిని తెలియజేసింది అణ్డాళ్.


రోచిష్మాన్
9444012279

ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన  తమిళ్ష్ పాసురమ్ 16

https://youtu.be/5VyfD08p5jI?si=qPW3lKgNfTSbN6iF

No comments:

Post a Comment