Tuesday, January 6, 2026

 *  'వ్యక్తరూపుడు' ఎవరు?
* "తిరువడిగళే స(శ)రణమ్" అంటే?

----------
'సరిగ్గా' తిరుప్‌పావై 
   21
-------------------

మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!

(తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని‌ అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.  

ఆళ్ష్వార్‌ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది.‌‌ పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు. పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి.‌ పాసురమ్ అనడమే సరైంది‌.)

పాసురమ్ 21 

ఆణ్డాళ్, కృష్ణుణ్ణి తమతో స్నానానికి పంపమని నప్పిన్నైను కోరుకున్నాక ఇరవైయొకటో పాసురమ్‌లో కృష్ణుణ్ణి మేలుకొలుపుతోంది; ఇలా... 

మూలం 

ఏఱ్ట్ర కలఙ్గళ్ ఎదిర్‌పొంగి మీదళిప్ప
మాఱ్ట్రాదే పాల్‌ సొరియుమ్ వళ్ళఱ్ పెరుమ్ పసుక్కళ్
ఆఱ్ట్రప్ పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్;
ఊఱ్ట్రముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోఱ్ట్రమాయ్ నిన్ఱ సుడరే! తుయిలెళ్షాయ్;
మాఱ్ట్రార్ ఉనక్కు వలితొలైన్దున్ వాసర్కణ్ 
ఆఱ్ట్రాదు వన్దున్ అడిపణియుమాపోలే
పోఱ్ట్రియామ్ వన్దోమ్ పుగళ్ష్‌న్దేలోరెమ్‌పావాయ్!


తెలుగులో 

కడవల్లోంచి ఎదురు పొంగిపొర్లేట్టుగా
ధారగా పాలు ఇచ్చే మంచి పాడి ఆవులు
సమృద్ధిగా ఉన్నవాడి తనయుడా! మెలకువలోకి రా;
స్థిరమైనవాడా! ఉన్నతమైనవాడా! లోకంలో
వ్యక్తమై నెలకొన్న తేజమా! నిద్రలే;
విరోధులు నీ ముందు బలహీనులై నీ వాకిట్లోకి
గత్యంతరంలేక వచ్చి నీ పాదాలపై పడ్డట్టుగా
స్తుతిస్తూ, కీర్తిస్తూ వచ్చాం; ఓలాల నా చెలీ!


అవగాహన 

"కడవల్లోంచి ఎదురు పొంగిపొర్లేట్టుగా" అనడం బావుంది. కడవలు నిండి బయటకు పొంగి వచ్చేంతగా, ధారగా పాలు ఇచ్చే ఆవులట, అలాంటి ఆవులు సమృద్ధిగా ఉన్నాయట. కృష్ణుడు సంపన్నుడని ఇలా ప్రశస్తంగా చెబుతోంది ఆణ్డాళ్. 

విష్ణువును 'వ్యక్తరూపుడు' అని అంటారు. ఆ భావంతోనే కృష్ణుణ్ణి "వ్యక్తమై నెలకొన్న తేజమా" అని అంటూ గొప్ప వ్యక్తీకరణ చేసింది ఆణ్డాళ్. క్రితం పాసురమ్‌లో "విరోధులకు వేడి పుట్టించే వాడా" అని అన్న తరువాత ఇక్కడ "విరోధులు నీ ముందు బలహీనులై నీ వాకిట్లోకి గత్యంతరం లేక వచ్చి నీ పాదాలపై పడ్డట్టుగా" అని అంటోంది ఆణ్డాళ్. గత్యంతరం లేక పాదాలపై పడడం "తిరువడిగళే స(శ)రణమ్" అంటే 'మేలైన లేదా ఉన్నతమైన పాదాలే శరణం' అన్న భావన. 'అన్యథా శరణం నాస్తి' అన్నది అవగతం అయ్యాక భక్తులు స్తుతిస్తూ, కీర్తిస్తూ దైవం దగ్గఱికి వెళతారు‌‌. ఆ స్థితినే "స్తుతిస్తూ, కీర్తిస్తూ వచ్చాం" అని ఆణ్డాళ్ అంటోంది.

రోచిష్మాన్
9444012279

ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన  తమిళ్ష్ పాసురమ్ 21

https://youtu.be/lJxswkC64W4?si=KnJztAwomcAGw3cA

No comments:

Post a Comment