Tuesday, January 6, 2026

 *చెట్ల కొమ్మల చిగురా!?

*కుటుంబ దీపమా!?

----------
'సరిగ్గా' తిరుప్‌పావై 
   17
-------------------

మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!

(తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని‌ అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.  

ఆళ్ష్వార్‌ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది.‌‌ పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు. పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి.‌ పాసురమ్ అనడమే సరైంది‌.)

పాసురమ్ 17


ఆణ్డాళ్, గోపకన్యలతో కృష్ణుడి ఇంటికెళ్లాక, తలుపు తియ్యమని కావలివాణ్ణి అడిగాక‌ ఇంట్లోని వాళ్లందఱికీ మేలు కొలుపుగా ఈ పదిహేడో పాసురాన్ని పలికింది; ఆలకిద్దాం రండి...


మూలం 

అమ్బరమే, తణ్ణీరే, సోఱే అరఞ్‌సెయ్యుమ్
ఎమ్‌పెరుమాన్ నన్దగోబాలా! ఎళ్షున్దిరాయ్;
కొమ్బనార్‌క్‌కెల్లామ్ కొళ్షున్దే! కులవిళక్కే!
ఎమ్‌పెరుమాట్టి యసోదాయ్! అఱివుఱాయ్;
అమ్బరమ్ ఊడఱుత్తోఙ్గి ఉలగళన్ద
ఉమ్బర్ కోమానే! ఉఱఙ్గాదెళ్షున్దిరాయ్;
సెమ్‌పొర్ కళ్షలడిచ్ చెల్వా బలదేవా!
ఉమ్బియుమ్ నీయుమ్ ఉఱఙ్గేలోరెమ్‌పావాయ్!


తెలుగులో 

వస్త్రాల్నీ , నీరును, ఆహారాన్నీ దానమిచ్చే
మా దేవుడా నందగోపాలా! లే;
చెట్ల కొమ్మల చిగురా! కుటుంబ దీపమా!
మా దేవతా యశోదా! మెలకువలోకి రా;
ఆకాశాన్ని చీల్చుకుని వెళ్లి లోకాన్ని కొలిచిన
దైవనాథుడా! నిద్ర చాలించి లే;
మిసిమి బంగరు కాలి కడియాల భాగ్యవంతుడా బలదేవా!
నీ తమ్ముడూ, నువ్వూ నిద్రలేవండి; ఓలాల నా చెలీ!


అవగాహన 

నందగోపుణ్ణీ, యశోదనూ, బలరాముణ్ణీ, కృష్ణుణ్ణీ నిద్రలేమ్మంటూ ఈ పాసురాన్ని పలికింది ఆణ్డాళ్. 

కావల్సిన బట్టల్నీ, నీళ్లనూ, తిండినీ ఇస్తూ తమకు దేవుడైన నందగోపుణ్ణి లెమ్మన్నాక  "చెట్లకొమ్మల చిగురా" అంటూ తమ దేవత అయిన యశోదను లెమ్మంటోంది ఆణ్డాళ్. చెట్లకొమ్మల చిగురు అని యశోదను అనడం చాల బావుంది. 

ఒక‌ ఇంటికీ, కుటుంబానికీ ఇల్లాలే దీపం. "కుటుంబ దీపమా" అని యశోదను అంటూ ఆ సత్యాన్నే ఆణ్డాళ్ నమోదు చేస్తోంది. కుటుంబం, ఇల్లాలు,‌ కుటుంబానికి ఇల్లాలు దీపం కావడం ఇవి ఆణ్డాళ్ కాలమై‌న ఎనిమిదో శతాబ్దిలోనే లేదా వేలయేళ్ల క్రితమే భారతీయతలో భాగం. ఇక్కడ ఆణ్డాళ్ మాటై మనకు అందిన ఈ భారతీయతా సత్యం వర్తమానంలో మనకు సరిగ్గా అర్థమైతే, సవ్యంగా ఆచరణలో నిలబడితే మన‌ తరువాతి తరాల భవిష్యత్తు భవ్యంగానూ, భద్రంగానూ ఉంటుంది. 

"ఆకాశాన్ని చీల్చుకుని వెళ్లి లోకాన్ని కొలిచిన
దైవనాథుడా" అంటూ వామనుడిగా వచ్చి 

"ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధిపై 
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై 
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై" నటువంటి విష్ణువును ఉద్ఘాటిస్తోంది ఆణ్డాళ్. 

"మిసిమి బంగరు కాలి కడియాల భాగ్యవంతుడా బలదేవా" అని అంటూ బలరాముణ్ణి గొప్పగా సంబోధిస్తోంది ఆణ్డాళ్. 

వెళ్లి దైవాన్నీ, ఆ దైవబంధువుల్నీ కళ్లెత్తి చూడడానికి నిద్రలెమ్మని ఆణ్డాళ్ కోరుకున్నట్టుగా మనమూ‌‌ నిద్రలేచి దైవం దగ్గఱికెళ్లి‌ మనల్ని చూడమని కోరుకుందాం‌.


రోచిష్మాన్
9444012279

ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన  తమిళ్ష్ పాసురమ్ 17

https://youtu.be/7dhs7EC_YOY?si=SOilqqnq2v1kehfL

No comments:

Post a Comment