* కంటిని కొద్దిగా తెఱిస్తే ఆ తెఱవడం ఎలా ఉంటుంది?
* జాబిల్లీ, సూర్యుడూ లేచినట్టుగా...
----------
'సరిగ్గా' తిరుప్‌పావై
22
-------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!
(తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.
ఆళ్ష్వార్ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది. పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు. పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి. పాసురమ్ అనడమే సరైంది.)
పాసురమ్ 22
కృష్ణుడితో మేం వచ్చాం కనుక కళ్లు తెఱిచి మమ్మల్ని చూడు అంటూ ఆణ్డాళ్ ఇరవైరెండో పాసురమ్‌తో
కొనసాగుతోంది; ఇదిగో ఇలా...
మూలం
అఙ్గణ్మా ఞాలత్తరసర్ అబిమాన
బఙ్గమాయ్ వన్దునిన్ పళ్ళిక్కట్టిఱ్ కీళ్షే
సఙ్గమ్ ఇరుప్పార్‌పోల్ వన్దు తలైప్‌పెయ్‌దోమ్;
కిఙ్గిణి వాయ్‌చ్ చెయ్‌ద తామరై పూప్పోల
సెఙ్‌కణ్ సిఱుచ్చిఱిదే ఎమ్మేల్ విళ్షియావో?
తిఙ్గళుమ్, ఆదిత్‌తియనుమ్ ఎళ్షున్దాఱ్‌పోల్
అఙ్‌కణ్ ఇరణ్డుఙ్గొణ్డెఙ్గళ్‌మేల్ నోక్కుదియేల్
ఎఙ్గళ్‌మేల్ సాబమ్ ఇళ్షిన్దేలోరెమ్‌పావాయ్!
తెలుగులో
సుందర, సువిశాల రాజ్యాల రాజులు గౌరవం
భంగమైనాక వచ్చి నీ మంచం కింద
గుమిగూడినట్టుగా వచ్చి చేరాం;
తెఱుచుకున్న మువ్వనోరులాంటి, కమలాల్లాంటి నీ
ఎఱ్ఱని కళ్లతో కొంచెం కొంచెం మమ్మల్ని చూడవా?
జాబిల్లీ, సూర్యుడూ లేచినట్టుగా
సుందరమైన రెండు కళ్లతోనూ మమ్మల్ని చూస్తే
మాకు తగిలిన శాపాలు లేకుండాపోతాయి; ఓలాల నా చెలీ!
అవగాహన
మేం నీ దగ్గఱికి రావడం, సుందర, సువిశాల రాజ్యాల రాజులు తమ గౌరవం భంగమైనాక నీ మంచం కింద గుమిగూడినట్టుగా వచ్చి చేరడం లాంటిదని ఆణ్డాళ్ కృష్ణుడితో చెబుతోంది. చాల మంది రాజులు కృష్ణుడివల్ల తమ గౌరవాన్ని పోగొట్టుకుని కృష్ణుడికి లొంగిపోయి ఆయన మంచం కింద గుమిగూడారట. గొప్ప గొప్ప రాజులు సైతం తాము అన్న భావం తొలగిపోయాక లేదా తమపై తమకు ఉన్న అభిమానం తొలగిపోయాక దైవం వద్దకు చేరుకున్నారు అన్నదాన్ని చెప్పకుండానే చెబుతోంది ఆణ్డాళ్. సార్వభౌములైనవాళ్ల చేత స్తుతించబడ్డ కృష్ణుడికి సార్వభౌమస్తుతః అనే నామం ఉంది.
మువ్వను గమనిస్తే ఆ మువ్వకు సన్నని పగులు, ఆ పగులులోపల ఒక పూస ఉండడం తెలుస్తుంది. ఆ పగులును తెఱుచుకున్న మువ్వనోరు అని సూచిస్తూ "తెఱుచుకున్న మువ్వనోరులాంటి..." అని అంటోంది ఆణ్డాళ్. కంటిని కొద్దిగా తెఱిస్తే ఆ తెఱవడం మువ్వనోరులా ఉంటుంది. అలా మువ్వనోరులా కన్ను తెఱిచి చూడమని చెప్పడం ఎంతో గొప్పగా ఉంది. కృష్ణుడు చూస్తే శాపాలు లేకుండా పోతాయని అంటోంది ఆణ్డాళ్. ఆ చూడడం "జాబిల్లీ, సూర్యుడూ లేచినట్టుగా" చూడాలట. ఎంతో గొప్పగా చెప్పింది ఆణ్డాళ్.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 22
https://youtu.be/q4J9Xummplc?si=epj3LrkWUniA7o8d
No comments:
Post a Comment