"నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిరస్సిద్ధ మధ్యాపయన్తీ
స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుఙ్క్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః"
----------
'సరిగ్గా' తిరుప్‌పావై
19
-------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!
(తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.
ఆళ్ష్వార్ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది. పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు. పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి. పాసురమ్ అనడమే సరైంది.)
పాసురమ్ 19
ఆణ్డాళ్, నప్పిన్నైను తలుపు తియ్యమని అడిగాక కృష్ణుడితో మాటగా ఈ పందొమ్మిదో పాసురాన్ని ప్రయోగించింది; అందుకుందాం రండి...
మూలం
కుత్తువిళక్కెరియక్ కోట్టుక్కాల్ కట్టిల్ మేల్
మెత్తెన్ఱ పఞ్‌జసయనత్తిన్ మేలేఱిక్
కొత్తలర్ పూఙ్‌కుళ్షల్ నప్పిన్నై కొఙ్‌గైమేల్
వైత్తుక్ కిడన్ద మలర్‌మార్బా! వాయ్ తిఱవాయ్;
మైత్తడఙ్ కణ్ణినాయ్! నీయున్ మణాళనై
ఎత్తనై పోదుమ్ తుయిలెళ్ష వొట్టాయ్ కాణ్;
ఎత్తనైయేలుమ్ పిరివాఱ్ట్ర కిల్లాయాల్
తత్తువమన్ఱు తగవేలోరెమ్‌పావాయ్!
తెలుగులో
దీపాలు వెలుగుతూండగా దంతపు కోళ్ల మంచంలో
మెత్తటి దూదిపరుపుపైన చేరి,
విరుల గుత్తుల జడతో ఉన్న నప్పిన్నై చనుకట్టుపై
నిద్రిస్తూ ఉన్న పద్మహారా! నోరు తెఱువు;
కాటుక కళ్లదానా! నువ్వు నీ మొగుణ్ణి
ఏ జామైనా నిద్రలేవనివ్వవు;
కాసేపైనా వియోగాన్ని తట్టుకోలేవా?
ఇదేం బాలేదు, నీకిది తగదు; ఓలాల నా చెలీ!
అవగాహన
మేం వచ్చాం మాతో మాట్లాడు అని కృష్ణుణ్ణి అడుగుతూ, అక్కడి సన్నివేశాన్ని చిత్రణ చేస్తూ "దీపాలు వెలుగుతూండగా దంతపు కోళ్ల మంచంలో మెత్తటి దూదిపరుపుపైన చేరి విరుల గుత్తుల జడతో ఉన్న నప్పిన్నై చనుకట్టుపై నిద్రిస్తూ ఉన్న పద్మహారా నోరు తెఱువు" అని అంటోంది ఆణ్డాళ్. ఇక్కడ నప్పిన్నై చనుకట్టుపై నిద్రిస్తున్న కష్ణుడు అని ఆణ్డాళ్ అన్నదాన్ని తీసుకునే పరాశరభట్టార్యులు గోదాదేవిని నమస్కరిస్తూ ఇలా అన్నారు:
"నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిరస్సిద్ధ మధ్యాపయన్తీ
స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుఙ్క్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః"
(నీళాదేవి ఎత్తైన స్తనగిరి స్థలంలో నిద్రిస్తున్న కృష్ణుణ్ణి లేపి
వందలాది వేదాంత వాక్యాలు చెప్పినట్టు నేను నీ కోసమే అన్న
ఉత్తమ భావాన్ని చెబుతూ వేసుకుని విడిచిన మాలలతో బంధించి బలాత్కారంతో ఆస్వాదిస్తున్న
గోదాదేవికి మాటిమాటికీ నమస్కారాలు అందు గాక)
పరాశరభట్టార్యులు కూడా నప్పిన్నైను నీళాదేవి అనే పరిగణించారు.
కృష్ణుడు, ఱొమ్ముపై ఉండేట్టు పద్మాల మాలను ధరించిన వాడు కనుక "మలర్‌మార్బా" (వక్షంపై పుష్పాన్ని ధరించిన వాడా) అని అంది ఆణ్డాళ్. అదే ఇక్కడ పద్మహారా అయింది. పద్మహారః అని కృష్ణుడికి ఒక నామం ఉంది.
"కాటుక కళ్లదానా నువ్వు నీ మొగుణ్ణి
ఏ జామైనా నిద్రలేవనివ్వవు;
కాసేపైనా వియోగాన్ని తట్టుకోలేవా?
ఇదేం బాలేదు, నీకిది తగదు" అంటూ నప్పిన్నైను భక్తివల్ల వచ్చే చనువుతో అంటోంది ఆణ్డాళ్.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 19
https://youtu.be/O2yxfq4-IbE?si=P3t5-igwVZEDmVcP
No comments:
Post a Comment