Tuesday, January 6, 2026

 🔱 *ప్రభాత గుళిక* 🔱

# *భ్రమరకీట న్యాయం...*

భగవంతుణ్ని చేరుకోవడానికి భక్తి ప్రధాన సాధనమని మనమంతా అనుకుంటాం. అదే కాదు, రాగద్వేషాలు శత్రుత్వాలు... అన్నీ సాధనాలేనని భాగవతం చెబుతోంది. చివరకు భయంతో కూడా సాయుజ్యం సాధ్యమేనంది. శిశుపాలుడి ఆత్మజ్యోతి శ్రీకృష్ణుడిలో లీనమైపోవడం ధర్మరాజుకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన నారదమహర్షి దగ్గర విస్మయాన్ని ప్రకటిస్తూ "స్వామీ! బుద్ధెరిగిన నాటి నుంచీ ఈ శిశుపాలుడు ఆ గోపాలుడి పట్ల కోపంతోనే పెరిగాడు. దుర్భుద్ధిమంతుడు దంతవక్తుడూ అంతే! శ్రీమహావిష్ణువును అన్నిసార్లు తిడుతున్నా వారికేమీ కాలేదు. అంధలోకాలకు పోలేదు. పైపెచ్చు ఆయనలోనే లీనమైపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. జోరుగాలి దీపజ్వాలను కలవరపెట్టినట్లుగా ఈ సందేహం నా మనసును కలత పెడుతోంది" అని అడిగాడు. 

🍁నారదుడు నవ్వాడు "ఏ రకంగానైనా ఆ సర్వాంతర్యామితో యోగం సాధించడం ముఖ్యం. నిజానికి వైరంతో సాధించినంత 'తన్మయత'ను మనిషి భక్తితో సాధించలేడని నా నిశ్చితాభిప్రాయ అన్నాడా మహర్షి.

🍁"కోరికతో గోపికలు, భయంతో కంసుడు, ద్వేషం కారణంగా శిశుపాలుడు, బాంధవ్యం మూలంగా యాదవులు, స్నేహం పేరు చెప్పి మీరూ, భక్తి ద్వారా నా వంటివారు ఆయనను పొందగలుగుతున్నాం" అని వివరించాడు. నవవిధ భక్తిమార్గాలను చెప్పిన నారదుడే ఈ మాటలూ చెప్పడం విశేషం. ఆయన మాటల్లో "తన్మయత" అనేది చాలా కీలకమైంది. దాన్ని పట్టుకోవాలి మనం. "ధ్యానిస్తావో... పూజిస్తావో.. ద్వేషిస్తావో. కోపిస్తావో.. భయంతో వణికి చస్తావో.. నీ ఇష్టం- వాటి సాయంతో తన్మయతను సాధిస్తేనే సాయుజ్యం దక్కుతుంది" అని నారదమహర్షి స్పష్టంగా చెబుతున్నాడు.

🍁సాధారణ పురుగొకటి తాను తుమ్మెదను కాగలనన్న గాఢమైన భావనతో తుమ్మెద వెంట తిరిగి, అది చేసే శబ్దాన్ని అనుకరిస్తూ - తుదకు తుమ్మెదగా మారిపోతుందట. ఆ భావతీవ్రతను, నిరంతర ధ్యాసను సూచించేదే- భ్రమరకీట న్యాయం.

🍁కీటకానికి- తుమ్మెదగా రూపొందడమే అంతిమ లక్ష్యం. ఆ క్రమంలో అది ఒకానొక తన్మయస్థితిని పొందుతుంది. భగవంతుడితో మనిషికి ఆ తరహా స్థితి లభిస్తే, సాయుజ్యం తప్పక సిద్ధిస్తుందని నారదముని ఆంతర్యం. భక్తిలో కన్నా ద్వేషంలో తన్మయత తీవ్రంగా ఉంటుంది. ఇది నిత్యజీవితంలో మనందరకూ అనుభవమయ్యే విషయమే. ఏ మనిషి పైనో బాగా పగ పెంచుకొన్నామంటే- ఇక ఆలోచనలన్నీ ఆ మనిషి చుట్టూనే తిరగాడుతూ ఉంటాయి. చివరకు నిద్రలో సైతం ఆ మనిషి గుర్తుకొస్తూనే ఉంటాడు. అతని చర్యలను, మాటలను, వాటి అంతరార్థాలను పదేపదే తలచుకొంటూ, వాటిపట్ల మన అభిప్రాయాలను పేర్చుకుంటూ తిరిగి వాటిని సమీక్షించుకొంటూనే ఉంటున్నామంటే ఏమిటన్న మాట? అది ఒక్క
మాటలో చెప్పాలంటే, మనం- ఆ మనిషై పోతున్నామని అర్థం. అదే భ్రమరకీట న్యాయమనే మాటకు నిర్వచనం. అదేదో భగవంతుడితో జరిగితే- దాని పేరే సాయుజ్యం!🙏

✍️- ఎర్రాప్రగడ రామకృష్ణ గారు 

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment