* కృష్ణుడి భార్య 'నప్పిన్నై' ... ఎలా?
* తిరుప్‌పావై జీయర్ ఎవరు?
----------
'సరిగ్గా' తిరుప్‌పావై
18
-------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!
(తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.
ఆళ్ష్వార్ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది. పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు. పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి. పాసురమ్ అనడమే సరైంది.)
పాసురమ్ 18
ఆణ్డాళ్, కృష్ణుడి ఇంటికి వెళ్లి నందగోపాలుణ్ణీ, యశోదనూ, కృష్ణ , బలరాముల్నీ మేలుకోమని అన్నాక కృష్ణుడి భార్య 'నప్పిన్నై' ను తలుపు తియ్యమంటూ ఇదిగో ఈ పద్దెనిమిదో పాసురానికి పలుకును ఇచ్చింది ఇలా...
మూలం
ఉన్దు మదకళిఱ్ట్రన్ ఓడాద తోళ్ వలియన్
నన్దగోబాలన్ మరుమగళే నప్పిన్నాయ్!
గన్దమ్ కమళ్షుమ్ కుళ్షలి కడై తిఱవాయ్;
వన్దెఙ్గుమ్ కోళ్షి అళ్షైత్తన కాణ్; మాదవిప్
పన్దల్ మేల్ పల్‌కాల్ కుయిలినఙ్గళ్ కూవిన కాణ్;
పన్దార్ విరలియున్ మైత్తునన్ పేర్‌పాడచ్
చెన్దామరైక్ కైయాల్ సీరార్ వళైయొలిప్ప
వన్దు తిఱవాయ్ మగిళ్ష్‌న్దేలోరెమ్‌పావాయ్!
తెలుగులో
మదపుటేనుగులున్న వాడు, మడమతిప్పని వాడు, బలమైన భుజాల వాడైన
నందగోపాలుడి కోడలా ఓ నప్పిన్నై!
పరిమళిస్తున్న కేశాలదానా! తలుపు తియ్యి;
కోళ్లు వచ్చి పిలుస్తున్నాయి చూడు; మల్లె
పందిరిపైన కోయిలలు కూస్తున్నాయి చూడు;
బంతి ఆడేదానా! నీ మొగుడి నామగానం చేస్తుండగా,
ఎఱ్ఱతామరల్లాంటి నీ చేతులకున్న అందమైన గాజులు చప్పుడు చేస్తూండగా
వచ్చి సంతోషంగా తలుపు తియ్యి; ఓలాల నా చెలీ!
అవగాహన
అతిబలవంతుడైన నందగోపుడి కోడలా అంటూ కృష్ణుడి భార్య నప్పిన్నైను తలుపు తియ్యమని
పొలుపుగా పిలుస్తోంది ఆణ్డాళ్.
నప్పిన్నై కృష్ణుడి భార్యా? ఈ నప్పిన్నై మనకు భాగవతం, ఇతర కృష్ణోదంతాలలో లేదు. సంస్కృత భక్తి సాహిత్యంలో లేదు. చాల పాత తమిళ్ష్ సాహిత్యంలో నప్పిన్నైను కృష్ణుడి భార్యగా చెప్పారు. ఆళ్ష్వారులకన్నా ముందున్న తమిళ్ష్ భక్తి సాహిత్యంలో ఈ నప్పిన్నై ప్రస్తావన ఉంది. విష్ణువు భార్యల్లో ఒకరు నీళాదేవి. ఆ నీళాదేవి అవతారమే నప్పిన్నైగా తమిళ్ష్ భక్తిసాహిత్యంలో చెప్పారు. మహాబలిపురంలోని ఒక గుహాలయంలో నప్పిన్నై శిల్పం ఉంది. దక్షిణ తమిళ్ష్‌నాడులోని కొన్ని వైష్ణవాలయాల్లో నీళాదేవి శిల్పాలు కనిపిస్తాయి.
పూలు పెట్టుకోవడంవల్ల కేశాలు పరిమళిస్తాయి కాబట్టి "పరిమళిస్తున్న కేశాలదానా" అని చెప్పబడ్డది. "కోళ్లు వచ్చి పిలుస్తున్నాయి చూడు; మల్లె పందిరిపైన కోయిలలు కూస్తున్నాయి చూడు" అన్న మాటలతో అక్కడి సన్నివేశానికి చిత్రణ జరిగింది. ఒక చక్కటి చిత్రం మన కళ్లముందు కదలాడింది.
సూర్యోదయానికి రెండున్నర గంటల ముందు బ్రహ్మ ముహుర్తంలో కోడి కూస్తుంది. అదే సమయంలో కోయిలా కూస్తుంది. ఆణ్డాళ్ ఆ విషయాన్నే చెబుతోంది ఇక్కడ. వైష్ణవ సాంప్రదాయిక సాహిత్యంలో "కుయిల్ కూవి తుయిల్ ఎళ్షుప్ప" అని అనడం ఉంది. అంటే కోయిల కూసి నిద్రలేపగా అని అర్థం.
ఆడవాళ్లు బంతి ఆట ఆడుకోవడం మనకు తెలిసిందే. రామాయణంలో సీత బంతి ఆట అడడం మనం చదివిందే. "బంతి ఆడేదానా, నీ మొగుడి నామగానం చేస్తుండగా, ఎఱ్ఱతామరల్లాంటి నీ చేతులకున్న అందమైన గాజులు చప్పుడు చేస్తూండగా వచ్చి సంతోషంగా తలుపు తియ్యి" అని అంది ఆణ్డాళ్. నామగానానికి గాజుల చప్పుడు తోడవడం అన్న భావన చాల గొప్పగా ఉంది. తన మొగుణ్ణి భక్తులు స్తుతిస్తూంటే దానికి తన చేతి గాజుల చప్పుడు తోడవడం భార్యకు సంతోషకరమే. గొప్పతనం విప్పారేట్టు చెప్పింది ఆణ్డాళ్.
రామానుజాచార్యులు ఈ పాసుర పఠనం చేస్తున్న సందర్భంలో "ఎఱ్ఱతామరల్లాంటి నీ చేతులకున్న అందమైన గాజులు చప్పుడు చేస్తూండగా
వచ్చి సంతోషంగా తలుపు తియ్యి" అన్న పంక్తుల్ని పలికాక వారికి తలుపు కొట్టిన శబ్దం వినవచ్చింది. లేచి వెళ్లి తలుపు తెఱిచిన రామానుజులవారికి ఎదురుగ్గా ఒక చిన్నపిల్ల కనిపించింది. ఆ పిల్ల రామానుజుల గురువు పెరియనంబి కూతురు.
ఆణ్డాళ్ ఆ పిల్ల రూపంలో వచ్చింది అని భావించి పారవశ్యంలో ఆ పిల్ల కాళ్ల మీద పడ్డారు రామానుజులవారు. ఈ సంఘటన తరువాత రామానుజులవారు తిరుప్‌పావై జీయర్ అని కూడా పిలవబడ్డారు.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 18
https://youtu.be/ACq5eJNEKDU?si=TJQ0U3bfGHVRiI6z
No comments:
Post a Comment