Monday, February 23, 2026

****భగవాన్ రామణ మహర్షి బోధన: అంద చందము

 146. రక్తమాంసమయమైనదియు. కేవలము నాశనమే ధర్మముగా కలిగినదియు అగు ఈ శరీరము యొక్క బాహ్య అంతరములు పరిశీలించిన (పురుష శరీరమైనా, స్త్రీ శరీరమైనా) యిందు రమ్యత్వమేమి కలదు. కేవలము దహనము కొరకే యోగ్యమైనట్టి ఈ శరీరాన్ని చిరకాలము వుత్తమ పదార్థములతో పోషించిననూ, అమృతంలో నానబెట్టినా అప్రయత్నముగానే కృశించి పోవుచున్నది. పశువుల యందు, యితర ప్రాణుల యందు, ఏరక్త, మాంస, అస్థి, మల, మూత్రాదులన్నవో అవియే ఈ స్త్రీ, పురుష శరీరము లందున్నవి. స్త్రీ, పురుషుల శరీరాలలో వుండే మాంసమే కేవలము చర్మముచే కప్పబడి యుండుటచే మనస్సు భ్రాంతికి లోనై అంద చందములను వూహించును. బంధువులు సంసార బంధనమే. భోగములు రోగములు. తృష్ణలు మృగతృష్ణలే (ఎండమావులే) అగును. విచారణ చేసినచో ఈ భ్రాంతి తొలగిపోవును. చిత్తము స్వరూపము వైపునకు మరలును. విచారణ చేయనిచో చిత్తము ప్రపంచము వైపునకు మరలును. కనుక సాధకుడు సర్వత్ర అన్ని వేళలందు ఆత్మ విచారము చేయవలెను. మనసును సర్వత్రా బ్రహ్మమునందు నిలుపుటయే, బ్రహ్మ స్వరూప విచారణయే (ఆత్మ విచారణయే) బ్రహ్మచర్యము.

147. కల్పనామాత్రమగు క్రీడలతో బాల్యము గడువగా, యవ్వనమున కామాసక్తితో మనసు ఛిద్రమైపోగా, వార్థక్యము చేత శరీరము క్షీణత్వమునొంద, ఇక పరమ పురుషార్ధమగు మోక్షమునకు ప్రయత్నమెపుడు చేస్తాము. మృత్యువు ఏదశయందైనా, ఏక్షణమైనా రావచ్చును. కనుక మోక్షమునకు చేయు ప్రయత్నమందు ఉదాసీనత తగదు. అల్పశ్రవణాభ్యాసము వలన జనులకు కొద్దిగా జ్ఞానము కలుగవచ్చును. కాని విషయముల యందు వైరాగ్యము మాత్రము తీవ్రప్రయత్నము చేతనే సాధ్యము.



Source: captured from book Bhagavan Bhoda






No comments:

Post a Comment