Friday, February 20, 2026

 తిరుమల తిరుపతి విశేషాలు 

*బంగారు బావి* 

తిరుమల శ్రీ వారి మందిరం విమాన ప్రదక్షిణంలో స్వామి వారి పోటు (ప్రసాదాలు చేసే వంట శాల) సమీపంలో ఉన్న బావిని బంగారు బావి అంటారు.  ఇందులోని నీరు స్వామి వారి ప్రసాదాల తయారీకి మరియు కొన్ని కైంకర్యాలకు వినియోగిస్తారు. 

ఈ బావిని స్వామి వారి అంకిత భక్తుడు రంగదాసు నిర్మాణం కావించినట్లు,   ఈ రంగదాసు తరువాతి కాలం లో ఆ ప్రాంతాన్ని పాలించిన తొండమానుడు గా జన్మించాడని,   స్వామి వారి ఆదేశం మేరకు మరలా ఆ బావికి రాతి నిర్మాణం కావించాడని ఇతిహాసం.  

**
స్వామి వారి  అభిషేకానికి   నీరు అర్చకులు ఆకాశ గంగ నుండి మడితో తెస్తారు.  తొలుత,  ప్రధమ ఆచార్య పురుషుడు తిరుమలనంబి  పాపనాశం తీర్ధం నుండి నీరు తీసుకు వచ్చేవారు.   ఒకసారి తిరుమల నంబి వారు పాపనాశం నుండి నీరు తీసుకు వస్తుండగా,  స్వామి వారు బోయ బాలుని   రూపం లో కనుపించి తిరుమలనంబిని తాగడానికి నీరు అడిగారని, తిరుమలనంబి వారు అందుకు నిరాకరించగా, ఆ బాలుడు వెనుకనుండి నీటి కుండకు చిల్లు పెట్టి నీరు తాగివేశారని, తిరుమలనంబి,   స్వామి వారి సేవకు నీరు లేనందుకు విచారించగా, ఆ బాలుడు సమీపం లో ఆకాశ గంగను చూపించి అంతర్ధానమయ్యడని గాధ.  అప్పటినుండి తిరుమలనంబి వారు ఆకాశ గంగ నుండి నీరు తెచ్చేవారు.  

ఓక సారి కుంభ వృష్టి గా వాన కురుస్తుండగా ఆకాశ గంగ తీర్ధం తీసుకురావడం కష్టమైనది. అప్పుడు ఆయన గురువు యము నాచార్యుల వారు ఈ బంగారు బావికి లో ని నీరు  లక్ష్మీ దేవి  చేత సృష్టి చేయబడినది;  అన్ని తీర్ధముల కంటే పవిత్రమైనది కనుక స్వామి వారి అభిషేకానికి ఈ జలాన్ని వినియోగించడానికి అనుమతి కోసం లక్ష్మి దేవినే ప్రార్ధించారట.  తరువాతి కాలం లో తిరుమల విజయం చేసిన రామనుజా చార్యుల వారు  ఇలాటి ఇబ్బందులు అధిగమించడానికి    బంగారు బావిలో నీరు  పాప నాశనం, ఆకాశ గంగ తీర్ధంల  నీరు  సమానమైనవని  కట్టడి చేసి స్వామి వారి కైంకర్యానికి ఆటంకం లేకుండా చేశారు.  

ఆనంద నిలయం బంగారు తాపడం చేసినప్పుడు ఈ బావికి కూడా బంగారు తాపడం చేయడం జరిగినది.  స్వామి వారి ఆనంద నిలయం బంగారు తాపడం పలుమార్లు జరిగినది. తొలి సారి  ఈ బావికి  బంగారు తాపడం ఎప్పుడు జరిగినది  కచ్చితమైన తేదీ తెలియదు. 1950-58 మధ్య ప్రాంతం లో టి టి డి వారు ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం చేయించినపుడు,  ఈ బావికి కూడా బంగారు తాపడం చేయించడం చేయించి నట్లు  రికార్డులు  ఉన్నాయి.  ఆ సందర్భం లో,  బంగారు బావి తాపడానికి కావలసిన బంగారం -  రామనాథ్ షిండే అనే పూణే భక్తుడు సమర్పించాడు.   ఈ కార్యక్రమం చొక్కలింగాచారి స్థపతి (మదురై) మరియు ఆర్ గోపాలస్వామి రాజు (తిరుచునాపల్లి) – వీరి పర్యవేక్షణ లో జరిగినది.  

 ఆనంద నిలయంతో పాటు ఈ బావికి బంగారు తాపడం చేయించడం, ఈ బావి యొక్క ప్రాముఖ్యం తెలుస్తున్నది.  బంగారు బావి గా ప్రసిద్ధి పొందినది.  తొండమానుడే బంగారు తాపడం చేయించాడని స్థల పురాణం. ఈ బావి అసలు పేరు శ్రీ తీర్ధం.  శ్రీ  మహాలక్ష్మి చే పవిత్ర పరచబడినది కనుక ఈ బావికి శ్రీ తీర్ధము అని పేరు వచ్చింది. లక్ష్మీ తీర్ధం అనికూడా పిలుస్తారు.  సుందర స్వామి బావి అనే మరో పేరు ఉన్నది.   వేంకటేశ్వర స్వామి వారిని సుందర స్వామి అని సంబోధించడం కద్దు పూర్వ కాలం లో.  

**
##
ఈ బావి నుండి నీరు పోటుకు ఒక రాతి నిర్మాణం ద్వారా ప్రవహించే ఏర్పాటు ఉండేదట.  ఇది హంపి లోని నీటి పారుదల నిర్మాణాన్ని పోలి ఉండేదని పరిశోధకుల అభిప్రాయం.  ఎందుకునో ఆ నిర్మాణం ఇప్పుడు లేదు.  నీరు చేదలతో తొడుకునే వారు.   ప్రస్తుతం ఈ బావి నుండి నీరు తోడటానికి ఎలెక్ట్రిక్ పంపు వాడుతున్నారు.  
ఆధునిక కాలం లో కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి.   వేసవి కాలం లో ఈ బావి లో నీరు ఎండిపోసాగింది.  మరియు ఆలయం చుట్టు డ్రైనేజ్ సౌకర్యం లేని ఇళ్ల వల్ల ఈ బావి లో నీరు కలుషితం అవసాగింది.  అందుచేత,  ఈ బావి లోనికి నీరు ఊరకుండా అడుగున  చప్టా  నిర్మాణం కావించారు.  ఈ బావి లోనికి పాపనాశం నుండి నీరు తీసుకు వచ్చి బావి లోనికి పంపింగ్ చేస్తారు.  శ్రీ పి వి ఆర్ కె ప్రసాద్ గారు టి టి డి కార్య నిర్వహణాధికారిగా పనిచేసినప్పుడు తిరుమల లో నాలుగు మాడా వీధులను విశాల పరచి, డ్రైనేజ్ లేని ఇళ్లను, అక్రమ నిర్మాణాలను  తొలగించడం జరిగినది. పి వి ఆర్ కె ప్రసాద్ గారు  చేసిన సేవలు, ఆయన అనుభవాలు ఒక ఉద్గ్రంధం. 

ఓం నమో వేంకటేశాయ! 

## Source:  తిరుమల చరితామృతం.  రచన: శ్రీ పి వి ఆర్ కె ప్రసాద్ గారు: ఎమెస్కో ప్రచురణ 

- MA MURTY

No comments:

Post a Comment