*నమః శివాయ🙏💖*
*పరమశివునికి ఉన్న అనేక అవతారాల్లో ఒకానొక పూర్ణావతారం భైరవావతారం. ఈ అవతారం ప్రధానంగా జీవుని అహాన్ని నిర్మూలించడానికి వచ్చిన అవతారం. అహంకారం కారణంగానే జీవుడు కర్మబంధాల్లో చిక్కుకొని అనేక జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అట్టి అహంకార నిర్మూలన అంటే మరలా జన్మ లేకుండా అంటే ఇదే ఆఖరు జన్మగా చేసే అవతారం భైరవావతారం.*
ఒకే జన్మలో జీవునికి శాశ్వత మోక్షాన్ని ఇచ్చే అట్టి భైరవ స్వరూపం ఆవిర్భవించిన ఈ మార్గశీర్ష కృష్ణ పక్ష అష్టమి రోజున తమ తమ శక్తి కొలది స్వామి వారి ఆరాధన చేయడం ఎంతో శ్రేయస్కరం.
అందరూ సహజంగా ఒక మాట అంటుంటారు, "దేనికైనా కాలం కలిసిరావాలి" అని. అంటే, కాలం ముందు ఎవరైనా తల వంచక తప్పదు అనే కదా! ఆ కాలమే ఒక వ్యక్తికి తన తలరాత రూపంలోనో, తన ప్రారబ్ధ రూపంలోనో వెంటాడుతూ ఉంటుంది. అట్టి కాలాన్ని దాటడం చాలా కష్టం అని పూర్వీకులు అంటుంటారు. నిజమే, ఐతే గమనించాల్సింది ఏంటంటే వారు కష్టం అన్నారు గానీ అసాధ్యం అనలేదు.
అందుకే, అట్టి భయంకరమైన ప్రారబ్ధాన్ని కలగచేసే కాలాన్ని జయించాలంటే దానికి ఒక్కటే మార్గం అదేంటంటే, ఆ కాలాన్ని నడిపే వాడు, శాసించేవాడైన పరమశివుని పూర్ణావతారమైన కాలభైరవుణ్ణి ఆశ్రయించడం. ఐతే, అట్టి పరబ్రహ్మమును నేరుగా పట్టుకోవడం అంత సులభం కాదు కాబట్టి ముందుగా జీవుడు ఒక సద్గురువును ఆశ్రయించాలి. అప్పుడు ఆయనే వారిని ఆ కాలకాలుడైన పరమశివుని వద్దకు చేరుస్తారు.
అలాగే, గ్రహాల్లో కాల స్వరూపానికి ప్రతీకగా చెప్పాల్సి వస్తే "శనైశ్చరుడిని" చెప్తారు. ఇక ఆ శనైశ్చర స్వామి వారు ఇచ్చే కర్మఫలాలను తట్టుకోవడం ఎంతటి వారికైనా కష్టమే. ఐతే, అట్టి శనైశ్చరుడు కూడా ఎవరి శాసనాన్ని తప్పక పాటిస్తారంటే అది "కాలభైరవ" ఆజ్ఞని. ఎందుకంటే, గురువాజ్ఞను ధిక్కరించే సాహసం ఏ శిష్యుడు చేయలేడు గనుక. (శనైశ్చరుని గురువు కాలభైరవుడు)
ఒక్క శనైశ్చరాది నవగ్రహ పీడలే కాక సమస్త గ్రహాముల పీడలను తొలిగించే స్వరూపం కాలభైరవ స్వరూపం. అందులోనూ కాలభైరవునికి మరలా ఎన్నో అవతారాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 64 ఇంకా అందులోనూ బాగా ముఖ్యమైనవి 8. వారినే కపాల, భీషణ, అసితాంగ, రురు, చండ, క్రోధ, ఉన్మత్త, సంహార భైరవ అనే అష్ట భైరవులు అని అంటారు. ఇలా అనేక అవతారాలు ఉన్నాయి.
అట్టి కాలభైరావ స్వామి అనుగ్రహం కోసం ఈ రోజు కనీసం స్వామి వారి కథను, లేదా ఏదైనా స్తోత్రాన్ని పారాయణ చేయడం శ్రేష్టం.
శివాయ నమః🙏
సర్వం శివార్పణమస్తు💖.
No comments:
Post a Comment