.
రేపటి జ్ఞాపకాలు ...
జీవితంలో "నీకు ఉన్నదాన్ని ప్రేమించు... విలువగా చూసుకో.... అవి ఆత్మీయ అనుబంధాలు కావొచ్చు, మానవ సంబంధాలు కావొచ్చు, మధురమైన జ్ఞాపకాలు కావొచ్చు"....
ఎందుకంటే...
ఈ ప్రపంచంలో ఏది ఎప్పుడు చివరిసారి అవుతుందో ఎవరికీ తెలియదు.ఏ ఆలింగనం చివరిదో...
ఏ సాధారణ సంభాషణ చివరి మాటలుగా మిగిలిపోతుందో...
ఏ "శుభరాత్రి" ఇక మళ్లీ చెప్పే అవకాశం రాదో...మనకు ముందుగా తెలిసే అవకాశం లేదు.
ఏదో ఒక రోజు...
ప్రతి రోజు వినిపించే ఓ పరిచయమైన స్వరం...అకస్మాత్తుగా నిశ్శబ్దమైపోతుంది.ప్రతి ఉదయం కనిపించే ఆ చిరునవ్వు...ఫోటోల్లో మాత్రమే చిరునవ్వు అవుతుంది.
ఎప్పుడూ సందడిగా ఉండే ఇంట్లో...ఒక కుర్చీ శాశ్వతంగా ఖాళీగా మిగిలిపోతుంది.
అదే జీవితం...
అది ఎలాంటి హెచ్చరిక ఇవ్వదు.
"ఇదే చివరి రోజు" అని చెప్పదు.
మనకు తెలియకుండానే
నిశ్శబ్దంగా...మరో పేజీని తిప్పేస్తుంది.
మనకు అర్థమయ్యేలోపే...మన ప్రపంచమంతా మారిపోతుంది.
అందుకే...నీ జీవితంలో ఇంకా సమయం ఉన్నప్పుడే...
కొంచెం ఎక్కువగా నవ్వుతూ ఆనందంగా ఉండు.
కొంచెం త్వరగా క్షమించు.
కొంచెం ఎక్కువగా ప్రేమించు.
నువ్వు ప్రేమించే వారిని ఇంకొంచెం గట్టిగా హత్తుకో. వాళ్లు నీ జీవితంలో ఎంత విలువైనవారో...వాళ్లు వినగలిగేంత వరకు చెప్పు.
ముఖ్యంగా ...రేపు అనే మాట మన చేతిలో ఉన్న వాగ్దానం కాదు.
చివరికి మనతో వచ్చేవి...
మన సంపదలు కావు...
మన హోదాలు కావు...
మన విజయాలు కూడా కావు...
మనం పంచిన ప్రేమ...మన వల్ల ఎవరి కళ్లలోనైనా మెరిసిన ఆనందం...
మన కోసం ఎవరి హృదయంలోనైనా మిగిలిపోయిన మధుర జ్ఞాపకాలే.
ఈ జ్ఞాపకాలే మన జీవితంలో అత్యంత విలువైన సంపదగా మిగిలిపోతాయి.
కాబట్టి... ఈ రోజును ప్రేమించు.
నీ మనుషులను ప్రేమించు.
నీకు ఉన్నదాన్ని విలువగా చూసుకో.
గుర్తుంచుకో...ఈ రోజు నీ దగ్గర ఉన్నది...
రేపటికి ఒక అందమైన జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోవచ్చు.
❤️
No comments:
Post a Comment