Saturday, August 8, 2026

 సినిమా పాటల్లో ఇంత స్థాయిలో కవిత్యమా ఇంత లోతుగా సాహిత్య విలువలా.... ఆ పాట ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయినా కూడా అంత పెద్ద ఎత్తున సూపర్ హిట్టై విపరీతమైన జనాదరణ గౌరవాన్ని పొందడం..
ఇది సిరివెన్నెల సినిమాలో జరిగిన అద్భుత స్వర అక్షర గాన విశ్వనాధుడి విన్యాసం. 
మరో విషయం ఆ సినిమా అసలు సీతారామశాస్త్రిగారిని గేయరచయితగా పరిచయం చెయ్యడం కోసమే వచ్చిందేమో...!!!  
- గౌతమ్ కశ్యప్
.
విధాత తలపున ప్రభవించినది........

చిత్రం : సిరివెన్నెల (1986)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : సిరివెన్నెల

నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

విధాత తలపున ప్రభవించినది... అనాది జీవన వేదం... ఓం...

ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం... ఓం...

కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వ రూప విన్యాసం

ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం... 

ఆ...

సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది

సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది

నే పాడిన జీవన గీతం... ఈ గీతం...

విరించినై విరచించితిని ఈ కవనం

విపంచినై వినిపించితిని ఈ గీతం...

చరణం 1 :

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన

జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన

జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన

పలికిన కిలకిల స్వనముల... స్వరజతి జగతికి శ్రీకారము కాగా

విశ్వకావ్యమునకిది భాష్యముగా... 

విరించినై విరచించితిని ఈ కవనం

విపంచినై వినిపించితిని ఈ గీతం...

చరణం 2 :

జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం

చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం

జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం

చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం

అనాది రాగం.. ఆదితాళమున.. అనంత జీవన వాహినిగా

సాగిన సృష్టి విలాసమునే..

విరించినై విరచించితిని ఈ కవనం

విపంచినై వినిపించితిని ఈ గీతం...

నా ఉచ్ఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం

నా ఉఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం

సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది

నే పాడిన జీవన గీతం... ఈ గీతం...
.
.
నాకు తెలిసిన ప్రతి పదార్థం ఇది తప్పులు ఉంటే దయచేసి తెలియచెయ్యండి తప్పనిసరిగా సరిచేస్తాను. - గౌతమ్ కశ్యప్

విధాత = సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని యొక్క

తలపున = ఆలోచనలో

ప్రభవించినది = పుట్టినది

అనాది = మొదలు అనేది లేనిది (శాశ్వతమైనది)

జీవన వేదం = బతుకు మార్గమును చూపే పవిత్ర గ్రంథం / శాస్త్రం

ఓం = ప్రణవ నాదం (సృష్టికి మూలమైన శబ్దం)

ప్రాణనాడులకు = దేహంలోని ప్రాణ నరాలకు

స్పందననొసగిన = కదలికను / జీవాన్ని ఇచ్చిన

ఆది ప్రణవనాదం = సృష్టి ప్రారంభంలో పుట్టిన ఓంకార శబ్దం

కనుల కొలనులో = కళ్ళు అనే నీటి కొలనులో

ప్రతిబింబించిన = ప్రతిఫలించిన (కనిపించిన)

విశ్వ రూప విన్యాసం = ఈ సృష్టి యొక్క అద్భుతమైన నృత్యం / రూపం

ఎద కనుమలలో = గుండె అనే కొండల లోయలలో

ప్రతిధ్వనించిన = మార్మోగిన

విరించి = బ్రహ్మదేవుని యొక్క

విపంచి గానం = వీణా గానం

సరసస్వర = అందమైన / శ్రావ్యమైన స్వరాలనే

సురఝరీ గమనమౌ = ఆకాశగంగ ప్రవాహంలా సాగే (సురఝరీ = దేవతల గంగ)

సామవేద సారమిది = సంగీతానికి మూలమైన సామవేదం యొక్క సారాంశం ఇది

నే పాడిన = నేను పాడుతున్న

జీవన గీతం = బతుకు పాట

విరించినై = నేనే సృష్టికర్తనై (బ్రహ్మనై)

విరచించితిని = రాశాను

ఈ కవనం = ఈ కవిత్వాన్ని

విపంచినై = నేనే వీణను అయి

వినిపించితిని = పలికించాను

ఈ గీతం = ఈ పాటను

చరణం 1:

ప్రాగ్దిశ = తూర్పు దిక్కు అనే

వీణియపైన = వీణ మీద

దినకర = సూర్యుని యొక్క

మయూఖ = కిరణాలు అనే

తంత్రులపైన = తీగల మీద

జాగృత = నిద్రలేచిన

విహంగ తతులే = పక్షుల సమూహాలే

వినీల = ముదురు నీలపు రంగులో ఉన్న

గగనపు వేదికపైన = ఆకాశం అనే వేదిక మీద

పలికిన = చేసిన

కిలకిల స్వనముల = కిలకిల శబ్దాల యొక్క

స్వరజతి = స్వరాల కలయిక

జగతికి = ఈ లోకానికి

శ్రీకారము కాగా = శుభారంభం అవ్వగా

విశ్వకావ్యమునకిది = ఈ సృష్టి అనే గొప్ప కావ్యానికి ఇదే

భాష్యముగా = వివరణగా (వ్యాఖ్యానంగా)

చరణం 2:

జనించు = పుట్టే

ప్రతి శిశుగళమున = ప్రతి బిడ్డ గొంతులో

పలికిన = వినిపించిన

జీవన నాద తరంగం = ప్రాణంతో కూడిన శబ్దపు అల

చేతన పొందిన = ప్రాణం పోసుకున్న

స్పందన = కదలికతో

ధ్వనించు = మోగే

హృదయ మృదంగధ్వానం = గుండె అనే మృదంగం యొక్క శబ్దం

అనాది రాగం = మొదలు లేని రాగంతో

ఆదితాళమున = సృష్టి ఆదిలో పుట్టిన తాళంతో

అనంత = అంతులేని

జీవన వాహినిగా = బతుకు ప్రవాహంగా

సాగిన = ముందుకు వెళ్తున్న

సృష్టి విలాసమునే = ఈ సృష్టి యొక్క లీలనే (నేను పాడుతున్నాను)

నా ఉచ్ఛ్వాసం = నేను లోపలికి పీల్చే గాలి

కవనం = కవిత్వం

నా నిశ్వాసం = నేను బయటకు వదిలే గాలి

గానం = పాట

1989 నుంచీ నాకు సిరివెన్నెల ( చేంబోలు) సీతారామ శాస్త్రిగారు నాకు పరిచయం అప్పట్లో సన్నగా ఇలాగే వుండేవారు. కళ్ళు మాత్రం చింత నిప్పులు కురుస్తున్నట్టు తీక్షణంగా వుండేవి. అప్పట్లో చాలా ఆవేశంగా మాట్లాడేవారు. - గౌతమ్ కశ్యప్

No comments:

Post a Comment