వానకారుకు ఓ విడాకరి వ్రాసిన కమ్మ !!
ప్రియమైన నీకు,
విడిపోయిన మనకు..
ఈ లేఖను నీకు రాస్తున్నానని అనుకోకు. నాలో ఇంకా నీ పేరును ఉచ్చరించే ఋతువుకు రాస్తున్నాను.
విడిపోయిన మనుషుల గురించి నాకు ఇప్పుడు ఒక కొత్త విషయం తెలుసు. వాళ్లు ఒకరినొకరు మర్చిపోరు. గుర్తు చేసుకోవడం మానేస్తారు.అంతే.
ఈ సాయంత్రం వాన కిటికీని తట్టినప్పుడు, తలుపు తీయాలా వద్దా అని కాసేపు ఆలోచించాను. ఎందుకంటే కొన్ని ఋతువులు అతిథులు కావు.
ఈ సాయంత్రమూ అలాగే వాన మొదలైనప్పుడు కిటికీ మూయాలని లేచాను. అప్పుడే గుర్తొచ్చింది. ఒకప్పుడు నువ్వు వాన పడుతుంటే కిటికీలు ఎప్పుడూ మూయనివ్వలేదు.
"ఇల్లు కొంచెం తడిస్తే ఏం అవుతుంది?" అనేవాడివి.
మనిద్దరం మాత్రం ఒకరినొకరు తడవనివ్వలేదు. ఇప్పుడు ఆ ఒక్క వాక్యం నా జీవితమంతా వెంటాడుతోంది. ఇల్లు తడవడాన్ని భయపడని మనం, మన హృదయాలను తడపడానికి ఎందుకు అంత భయపడ్డాం?
విడాకుల రోజు జడ్జి మన పేర్లు చదివాడు. మనిద్దరం "అవును" అన్నాం. ఆ రోజు నాకు ఒక్కసారిగా అర్థమైంది. ప్రేమ చనిపోయినప్పుడు మనుషులు ఏడవరు. తమలో ఇంకా బతికే ప్రేమను ఎక్కడ పెట్టాలో తెలియక ఏడుస్తారు.
మన ప్రేమ విఫలమైందని చాలామంది అన్నారు. నాకు మాత్రం మనం ఒక భాషను కోల్పోయినట్టే అనిపించింది.ఒకప్పుడు ఒక చూపుతో అర్థమైన మనుషులు, చివరికి ఒక వాక్యాన్ని కూడా ఒకరి దగ్గరకు ఇంకొకరు చేర్చలేకపోయారు.అన్ని విడాకులూ కోర్టులో జరగవు. కొన్ని భోజనాల మధ్యలో జరుగుతాయి.కొన్ని నిద్రపోయిన మంచం రెండు అంచుల మధ్య జరుగుతాయి. కొన్ని "పర్లేదు" అనే ఒక్క మాటలో శాశ్వతంగా స్థిరపడిపోతాయి.
నువ్వు వెళ్లిపోయిన తర్వాత నీ బట్టల వాసన కంటే,
నువు లేని నిశ్శబ్దమే ఇంట్లో ఎక్కువ రోజులు ఉంది. నిశ్శబ్దానికీ ఒక బరువు ఉంటుందని, ఒక ఖాళీ కుర్చీ కూడా మనిషిని విచారంలోకి నెట్టగలదని నేర్చుకున్నాను.
నువ్వు వెళ్లిపోయాక ఇంట్లో చాలా వస్తువులు మారిపోయాయి. సోఫా చోటు మారింది. పుస్తకాల వరుస మారింది. కప్పుల రంగులు మారాయి. నేను కూడా మారిపోయానని అందరూ అంటున్నారు. కానీ వాన మాత్రం ఇప్పటికీ కిటికీ దగ్గరే నిలబడి నిన్ను అడుగుతోంది.
“అతన్ని నువు మరిచి పోలేదు కదూ"
నిన్ను నేను క్షమించానా? అని చాలామంది అడిగారు. విచిత్రంగా అనిపించింది. మనం ఒకరినొకరం చంపుకోలేదు. మనం ఒకరినొకరం నెమ్మదిగా వినడం మానేశాం. దానికి క్షమాపణలు ఉండవు. దానికి ప్రతిధ్వనులు మాత్రమే ఉంటాయి.
ఈ రోజు వానలో ఒక చిన్న అబ్బాయి తన నాన్న చేతిని గట్టిగా పట్టుకుని రోడ్డు దాటుతున్నాడు. ఎందుకో, నేను కళ్లను తిప్పుకున్నాను. కొన్ని దృశ్యాలు అసూయను కలిగించవు. అవి ఒకప్పుడు మనం కోల్పోయిన భవిష్యత్తును గుర్తు చేస్తాయి.
ఈ రోజు వానలో బయటికి నడిచాను. గొడుగు తీసుకెళ్లలేదు. తడవాలని కాదు. ఇంకా వర్షం నా మీద పడితే నేను ఇంకా ఏవేవి గుర్తుపడతానో తెలుసుకోవాలని. ఒక చినుకు చెంపను తాకింది. అది నీ స్పర్శ కాదు. కానీ నా శరీరం దాన్ని గుర్తు చేసుకుంది.శరీరాలకు చట్టాలు తెలియవు. వాటికి ఋతువులే తెలుసు.
ఈ లేఖను నీకు పంపకపోవచ్చు.ఎందుకంటే ఇది నీ సమాధానం కోసం రాసింది కాదు.ఎప్పుడో ఒకప్పుడు "మనం" అనే పదాన్ని మోసిన నా చేతులు,ఇప్పుడు "నేను" అనే పదాన్ని ఎలా రాయడం నేర్చుకున్నాయో చెప్పడానికి.
నీకు తెలుసా? మనం విడిపోయిన రోజు నేను నిన్ను కోల్పోలేదు. నాతో కలిసి ముసలితనం చేరాల్సిన ఒక మనిషిని కోల్పోయాను.ఆ దుఃఖానికి పేరు ఉండదు. అది ప్రతి వర్షాకాలంలో కొత్తగా పుడుతుంది.
అయినా...
ఈ లేఖకు జవాబు రాయకు. ఒకవేళ ఎప్పుడైనా అర్ధరాత్రి వానలో మెలకువ వచ్చి, ఏ కారణం లేకుండా ఒక దీర్ఘనిశ్వాసం విడిస్తే, దాన్ని వయసు అనుకోకు. తాకలేని మనుషులు కూడా.. ఒకే చలిని పంచుకోగలరని వానకు మాత్రమే తెలుసు. కొన్ని ప్రేమలు శరీరాన్ని వదిలి వెళ్లిపోతాయి. కొన్ని ప్రేమలు శరీరమే అయిపోతాయి.వాటిని కోర్టులు విడదీయలేవు. వర్షాలు మాత్రం ప్రతి ఏడాది గుర్తు చేస్తూనే ఉంటాయి.
ఈ రాత్రి నీ కిటికీ దగ్గర కూడా వాన ఆగి ఉంటే, ఒక్కసారి అద్దంపై చేయి పెట్టు. నేనూ ఇక్కడ అదే చేస్తాను.
ఇట్లు
– ఒకప్పుడు నీతో కలిసి
ఒకే వర్షాకాలాన్ని పంచుకున్న నేను (మెర్సీ మార్గరెట్)
No comments:
Post a Comment