*ఆత్మ ప్రబోధం*
‘స్వామీ! నేను కష్టపడి పనిచేస్తాను. నిత్యం గుడికి వెళ్తాను. కానీ భగవంతుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు’ అని రామకృష్ణ పరమహంసను అడిగాడు ఒక భక్తుడు. దానికి ఆయన ‘బాబూ... నువ్వు దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తావు. దేవుణ్ని ఏవేవో కోరికలు కోరతావు. కానీ భగవంతుడు మనకు చేయాల్సిన మేలు ఇప్పటికే చేసేశాడు. మంచి జన్మనిచ్చాడు. అన్నీ సక్రమంగా ఉన్న శరీరాన్ని ఇచ్చాడు. మంచి బుద్ధితో ఈ లోకంలో బతకమని పంపించాడు. అందుకు కృతజ్ఞత తెలపడానికి మనం దేవాలయానికి వెళ్లాలి. కానీ నువ్వేం చేస్తున్నావ్? ‘‘నాకే ఈ బాధలెందుకు?’’ అని ప్రశ్నిస్తున్నావు. అంటే నీ సమస్యను ఇతరులతో పోల్చి చూస్తున్నావు. అలా చూసేటప్పుడు నీకన్నా సుఖంగా ఉన్నవాణ్ని చూస్తున్నావు కానీ నీకన్నా ఎక్కువ కష్టాల్లో ఉన్నవాళ్లను చూడటం లేదు. అందుకే నీకు మనశ్శాంతి, సంతృప్తి కరవయ్యాయి. నీ సమస్యలు నీకు మాత్రమే సంబంధించినవి. వాటిని నువ్వే ఓర్పుతో పరిష్కరించుకోవాలి. పరిష్కరించుకోగలవు. ఇతరుల సంతోషంతో, సంపదతో పోల్చిచూడకు. అప్పుడే నీకు ప్రశాంతత లభిస్తుంది’ అని చెప్పారు.
మనిషికి దేహం, మనసు, ఆత్మ... ఈ మూడూ భగవద్దత్తంగా లభిస్తాయి. అయితే అతడు మొదటి రెండింటిమీదే దృష్టిపెడతాడు. దేహాన్నీ, దాని అందచందాలనూ ప్రేమిస్తాడు. దాన్ని సుఖపెట్టడానికి అవసరమైన శ్రద్ధ వహిస్తాడు. అందుకు మనసు తగిన ప్రోత్సాహాన్నిస్తుంది. ఇతరులతో పోల్చి చూపిస్తుంది. దాంతో అందంతోపాటు అలంకరణలు, ఆడంబరాలు, వాటికోసం మరింత సంపాదన... ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తుంది మనసు. ఫలితంగా హృదయంలోకి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ప్రవేశిస్తాయి. ఎలాగైనా సంపాదించాలనే కోరికకు మనసు బానిసవుతుంది. శరీరానికీ మనసుకూ అంతటి విడదీయరాని సంబంధముంది కనుకనే దేహానికి అవసరమైన సుఖాలను సమకూర్చడానికి మనసు సక్రమ, అక్రమ ఆలోచనలన్నీ చేస్తుంది. వాటిని ఆచరణలోనూ పెట్టిస్తుంది. దేహంతోపాటు చివరికి మనసు కూడా నశిస్తుంది. కానీ ఈ జీవన పోరాటంలో అతి తక్కువమంది మాత్రమే మూడోదైన ‘అంతరాత్మ’ను గుర్తిస్తారు. గీతాచార్యుడు చెప్పినట్లు ఆత్మకు మోహావేశాలు అంటవు. అది సత్యమార్గాన్నే చూపిస్తుంది. కానీ మోహావేశాలకు లోనైన మనసు అంతరాత్మ చెప్పేది వినదు. ‘నువ్వు చేసేది తప్పు, నేరం, సరైన మార్గం కాదు’ అని అంతరాత్మ ఘోషిస్తున్నా మనసు పట్టించుకోకపోవడం వల్లనే లోకంలో ఇన్ని అరాచకాలు, అనర్థాలు జరుగుతున్నాయి.
సచ్ఛీలురు, సర్వసంగ పరిత్యాగులు, భగవంతుణ్ని మనసా వాచా కర్మణా నిష్కామకర్మతో ఆరాధించేవారు- అంతరాత్మకే ప్రాధాన్యమిస్తారు. ఆత్మప్రబోధమైన కార్యాచరణే చేస్తారు. వారే పరిపూర్ణ మానవులు. దుష్టచింతన వారి దరికి కూడా చేరదు. రామకృష్ణ పరమహంస, వివేకానందులు, రమణమహర్షి లాంటి మహనీయులు మనోదేహాల కన్నా ‘ఆత్మ’కు మాత్రమే బద్ధులయ్యారు. అలా అశాశ్వతమైన మనశ్శరీరాలకన్నా శాశ్వతమైన ఆత్మే ముఖ్యమని అర్థం చేసుకున్నవారే స్థితప్రజ్ఞులు. ఆ స్థితప్రజ్ఞత సాధించినప్పుడే మనిషి జన్మ సార్థకమవుతుంది.
సేకరణ
No comments:
Post a Comment