Thursday, August 27, 2026

 *🧘‍♂️రామాయణ దర్శనంలో "ఆర్తి"🧘‍♀️*
🔥🧘‍♂️🧘‍♀️🔥
            రామాయణం ఒక దర్శనం. సాక్షాత్తూ నారాయణుడు మానవ మాత్రునిగా అవతరించి ఆదర్శ మానవ జీవితం ఎలా ఉండాలో ఆచరణలో చూపిన మహత్తర గ్రంథం. తాత్విక దృష్టితో రామాయణాన్ని పరిశీలిస్తే...


 శ్రీరాముడు అవతరించి జీవితాన్ని గడిపిన ప్రధాన రంగభూమి అయోధ్య. దశేంద్రియాలను ఆవరించిన మనోరథానికి ప్రతీక దశరథుడు. మూడు గుణాలకు ప్రతీకలైన ముగ్గురు భార్యలు ఉన్నా తనకు సంతానం లేదు. పురుషప్రయత్నం ఫలించలేదు.. దశరథునిలో ఆర్తి వెలుగుచూసింది. దైవానుగ్రహం కొరకై, సమాహిత సంకల్పంతో పుత్రకామేష్టిని సంకల్పించాడు.


 దశరథుని యాగ సంకల్పంలో రెండు ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. మొదటిది తనకు సంతానం కలగడం.. తద్వారా ఇక్ష్వాకు వంశాన్ని నిలుపడం. రెండవది అయోధ్యానగరానికి ధర్మాత్ముడైన పాలకుని అందించడం. మొదటిది స్వార్థం కాగా రెండవది ప్రజాహితం. ఉత్తమ పాలకుని పొందాలనే ఆర్తి ప్రజలలో ఉన్నది..


 యజ్ఞముఖంగా ఇరువురి ఆర్తినీ హవిస్సులతో భగవంతునికి అందించాడు. దాని ప్రాజాపత్య పురుషుడు ప్రత్యక్షమై యజ్ఞప్రసాదంగా పాయసాన్ని అందించాడు. బలీయమైన ఆర్తి ప్రకటితమైతేనే భగవంతుడు భూమిపై అవతరిస్తాడు. వ్యక్తిగత ప్రయోజనం ప్రజాహితంతో కలిసినప్పుడు దైవానుగ్రహం సిద్ధిస్తుంది.


            నిజానికి ఈ ఆర్తి దశరథునిది, అక్కడి ప్రజలదేనా? అంటే కాదనే చెప్పాలి. రావణుని రాక్షస కృత్యాలు దేవలోకాన్నీ ఆవరించడం వల్ల దేవతలలోనూ ఆర్తి ప్రబలంగా ఉన్నది. వారంతా చతుర్ముఖ బ్రహ్మను ముందుంచుకొని నారాయణుని శరణువేడడం నారాయణుడు అభయం ఇవ్వడం వల్ల దేవతల ఆర్తీ రామావతారానికి నాంది పలికింది. నారాయణుడు రామునిగా అవతరించాడు.


 ఆ అవతరానికి రెండు ప్రబలమైన కారణాలు కనిపిస్తాయి. ఒకటి దైవకార్యం.. రెండవది దశరథుని కార్యం. దశరథునికి నలుగురు కుమారులు. రాముడు ధర్మానికి, భరతుడు భక్తికి, లక్ష్మణుడు శ్రద్ధకు, శత్రుఘ్నుడు శక్తికి ప్రతీకలు. దైవకార్య నిర్వహణకు ధర్మంకావాలి.. ధర్మానికి శ్రద్ధ తోడుగా నిలవాలి. అందుకే రామునికి లక్ష్మణుడు అండగా నిలిచాడు.


            ఆర్తి దశరథునికీ, దేవతలకేనా అంటే కాదనే సమాధానం. ఉత్తర రామాయణం లాంటి గ్రంథాలను పరిశీలిస్తే సంసార మగ్నుడైన జీవునిలాగా సమద్రగర్భంలో ఉన్న లంకానగరానికి పాలకునిగా రావణుడు కనిపిస్తాడు. రావణుడు దశగ్రీవుడు. గ్రీవము భోగాశకు ప్రతీక.  మెడ తలకూ శరీరానికీ అనుసంధానమైనట్లే, గ్రీవమనేది కోరికలను కార్యరూపంలోకి తెచ్చే ఆచరణకు ప్రతీకగా భావించవచ్చును. 


ఐహిక భోగాలను దశేంద్రియాలతో అనుభవించాలనే ఆరాటం రావణుడిది. అహంకారం ప్రేరణగా ముల్లోకాలనూ జయించిన రావణుడు ప్రకృతిని జయించలేకపోయాడు. పంచభూత ప్రకృతిని తపింప చేయగలిగిన రాక్షస తపస్సును చేసాడు. అమితమైన వరాలనూ పొందాడు. సాంప్రదాయిక తాత్విక వ్యాఖ్యల ననుసరించి అంతర్గతంగా తన జీవన గమ్యం ఏమిటో తెలిసిన రావణుడు నారాయణుడిని చేరేందుకు ప్రకృతి స్వరూపమైన సీతను తపింపచేసాడు.. ఆమెలో ఆర్తిని సృజించాడు.


            దేవతల ఆర్తి నారాయణుని అవతారానికి నాంది పలికింది. దశరథుని ఆర్తి భగవంతుడిని భూమిపైకి దింపింది. రావణుని ఆర్తి తనకు ముక్తిని కోరుతుంది. అయితే దేవతలు తమ ఆర్తిని నారాయణుని శరణువేడడం ద్వారా ప్రకటించుకున్నారు. దశరథుడు పుత్రకామేష్టిని నిర్వహించడం ద్వారా ప్రకటించాడు. రావణుడు అహంకారి కావడం వల్ల తన ఆర్తిని స్వయంగా ప్రకటించడు. దేవతల ద్వారా మరియు సీత ద్వారా ప్రకటించాడు. ముఖ్యంగా సీతను చెరబట్టడం వల్ల రాముడు లంకకు వస్తాడని, తనను ఉద్ధరిస్తాడని రావణుని  భావన. అతనిది వైరభక్తి. తనకు సీతాదేవి వశమైతే తాను ప్రకృతిని జయించిన వాడవుతాడు.. అలాకాని నాడు రాముడే ఆమెను రక్షించుకుంటాడు.. ఆమె ద్వారా తనకు పరమాత్మ సాన్నిధ్యం లభిస్తుంది.
          

  రామాయణ దర్శనం తాత్వికంగా మనకొక సత్యాన్ని అవగతం చేస్తున్నది. ఆర్తి భక్తితో మిళితమైతే అనుగ్రహమౌతుంది, భగవంతుడు రక్షిస్తాడు.. అహంకారంతో మిళితమైతే సంహారమౌతుంది, భగవంతుడు శిక్షిస్తాడు. శిక్షించడం అంటే అహంకారానికి ఆధారభూతమైన శరీరాన్ని కూల్చివేయడం. మారీచుడు చెప్పినట్లుగా మరణం అనివార్యమైన వేళ అది భగవంతుని చేతిలో జరిగితే ఉత్తమలోకాలను చేరగలుగుతాము. ఇక్కడ భక్తితో మిళితమైన సీతాదేవి ఆర్తి ఆమెను రక్షించేందుకు ఉపకరించింది. రావణుని అహంకార పూరితమైన ఆర్తి రావణ సంహారానికి ప్రాతిపదిక అయింది.


 వైరభక్తిలో శిక్షయే వరంగా మారుతుందని రావణుని ఆర్తి మనకు తెలియచేస్తుంది. అందుకే రామావతార ప్రయోజనం ధర్మస్థాపన మాత్రమే కాకుండా భక్తుని ఆర్తిని ఆలకించడం, 
వైరభక్తునికి విముక్తిని ప్రసాదించడం, జగత్తుకు శ్రేయస్సును అందించడంగా భావించవచ్చును.
 *ఆధ్యాత్మిక కుటుంబం*                      

No comments:

Post a Comment