*భట్టివిక్రమార్క కథలు-24*
(శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రం)
135/374
*యోగీశ్వరుడి కథ*
పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి భేతాళుడిని తాళ్ళతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు.
అప్పుడు శవంలోంచి భేతాళుడు, "విక్రమార్కమహారాజా! నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను. విను. అంటూ ఇలా ప్రారంభించాడు.
పుష్కరం అనే పట్నానికి కొంచెం దూరంలో ఉన్న మఠంలో తపస్సంపన్నుడైన ఒక యోగి నివసించేవాడు.
ఒకనాడు అటుపోతున్న బ్రాహ్మణుడొకడు ఎండవేడికి తాళలేక శోషవల్ల పడిపోయాడు.
యోగి అది చూసి అతని మూర్తపోయేలా నీళ్ళు ముఖంమీద జల్లాడు. అతనడగగా కమండలంతో నీరు తెచ్చి తాగించాడు.
యోగి అడగగా “ఇక్కడికి రెండామడల దూరంలోని గ్రామవాసుడిని. పుష్కరంలో పనిపడి పోతున్నాను. చాగా దరిద్రుడిని. తిండి తిని మూడు రోజులయింది. ఆకలి వల్లా, నడక వల్లా, దాహం వల్లా
పడిపోయాను. మీరు దేవుడిలా రక్షించారు. ఇక మెల్లగా పోతాను.” అని నమస్కరించాడు.
ఆ యోగి అతని మీద జాలిపడి "కొంచెం సేపాగు. నీకు మంచి భోజనం దొరుకుతుంది." అంటూ తన మహిమతో చక్కని భోజనం సృష్టించి పెట్టాడు.
అంతే కాక.. అతను "బ్రాహ్మణోత్తమా! నీ దైన్యస్థితికి జాలేస్తుంది. లోకంలో దరిద్రాన్ని మించిన కష్టం మరొకటి లేదు.
నేనొక మంత్రం ఉపదేశిస్తాను. ఏకాగ్రతతో నీటిలో ములిగిలేస్తూ దానిని వెయ్యిసార్లు జపించు. మంత్రం సిద్ధిస్తుంది. తరవాత నువ్వు కోరినప్పుడల్లా సకల పదార్థాలూ లభిస్తాయి." అని మంత్రం చెప్పి పొమ్మన్నాడు.
ఆ బ్రాహ్మణుడు సంతోషంతో జపం చేయడానికి జలాశయంకి -వెళ్ళి, యోగిని మెచ్చుకుంటూ, తనకి తన కుటుంబానికే దరిద్రం తీరబోతుంది కదా అని ఆనందిస్తూ వెయ్యి మార్లు మంత్రం జపిస్తూ నీటిలో ములిగిలేచాడు.
జపం చేశాక యింటికెళ్ళి మంత్రం పఠించాడు. కాని పదార్థాలేవీ లభింపలేదు. దానితో అతను, అయ్యో! నా ఆశలన్నీ
నిరాశలయ్యాయే.' అని కుమిలిపోయాడు. '
విక్రమార్కా! యోగి ఎంతో ప్రేమగానూ మనస్ఫూర్తిగానూ, ఉపదేశించిన మంత్రం ఆ బ్రాహ్మణుడి కెందుకు ఫలించలేదు?" అని ప్రశ్నించాడు భేతాళుడికి-
"భేతాళా! యోగి మంత్రం ఉపదేశించినప్పుడు ఏకాగ్రత తోనూ స్థిరచిత్తంతోనూ జపించవలసిందిగా చెప్పాడు. కాని..
విప్రుడది మరచి -తనకి కలిగేలాభాన్నీ, తానూ తన కుటుంబమూ పొందే లాభాన్నీ తలుచుకుంటూ జపించాడు.
ఎవరైనా నిశ్చలమైన బుద్ధితో జపిస్తేనే మంత్ర సిద్ధి ఔతుంది." అని బదులిచ్చాడు విక్రమార్కుడు.
విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే భేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టుకొమ్మకి తలకిందులుగా వ్రేలాడసాగాడు.
విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.
*వైశ్యపుతిక్ర కథ*
పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి భేతాళుడిని తాళ్ళతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు.
అప్పుడు శవంలోంచి భేతాళుడు, “విక్రమార్కమహారాజా! నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను. విను. అంటూ ఇలా ప్రారంభించాడు.
ఒక పట్నంలో మహా ధనవంతుడైన వ్యాపారికి సుగంధి అనే ఏకైక పుత్రిక ఉండేది. యౌవనవతి అయినా తగినవరుడు దొరకక ఆమె వివాహం చేయక తల్లితండ్రులు తాత్సారం చేయసాగారు.
ఆ చిన్నదానికి ఎలాగో ఒక బ్రాహ్మణ కుమారుడితో సంబంధం కలిగింది. సమయం చిక్కితే వాళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకుని కామవాంఛ తీర్చుకునేకారు.
కొన్నాళ్ళకు ఒక వైశ్యపుత్రుడు తన ధన, గుణ, మర్యాదలతో సుగంధి తల్లితండ్రులను సంతృప్తి పరచగా వారు సుగంధినతని కిచ్చి వివాహం చేశారు. అల్లుడు మామగారింట్లోనే ఉండిపోయాడు.
ఎప్పుడూ మగడు ఏమరపాటుగా ఉండక సుంగంధికి తన ప్రియుడ్ని కలుసుకుందు కవకాశం లభింపలేదు. దానితో ఆమె ప్రియుడి మీద ప్రేమతో కృశించిపోయి చనిపోయింది.
ప్రియురాలితో కలుసుకోలేక తపిస్తున్న బ్రాహ్మణ యువకుడి కామె మరణంతో భరింపలేని దుఃఖం
కలిగి తానూ మరణించాడు.
తన భార్య చనిపోయిన విచారం తట్టుకోలేక వైశ్యపుత్రుడు కూడా మరణించాడు.
భేతాళుడు. ఈ ముగ్గిరిలో ఎవరి మరణం ప్రత్యేకమైనది?" అడిగాడు
“చాలా కాలం నుంచి సంబంధం కలిగి ఒకరిమీదొకరు అనురాగం పెంచుకున్న ప్రేయసీ ప్రియులు మరణించడం మామూలు విషయమే.
కాని.. తన భార్య తన మీదే ప్రేమ కలిగి ఉందని భావించి.. స్వల్పకాల అనుబంధానికే అసువులు బాయడం అతి ప్రత్యేకమే.” అని చెప్పాడు విక్రమార్కుడు.
విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే భేతాళుడు
కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టుకొమ్మకి తలకిందులుగా వ్రేలాడసాగాడు.
విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.
(సశేషం)
No comments:
Post a Comment