శ్రీ నారాయణ తీర్థులు (1650-1745)
వ్యాసకర్త - *శ్రీ* *తనికెళ్ళ* *భరణి*
శ్రీ నారాయణతీర్థుల జయంతి సందర్భంగా
నా చిన్నతనంలో *సంక్రాంతి* పండుగని చాలా అద్భుతంగా జరుపుకునేది ఊరు. ఊరంతా....పొద్దున్నే కుంకుడు కాయలు కొట్టి తలంటు స్నానం....కొత్త బట్టలు...వాకిట్లో పట్టు పరికిణీలు కట్టుకుని కన్నెపిల్లల ముగ్గులు...గంగిరెద్దు మేళం...హరిదాసులూ...
ఆ రోజుల్లో ఓ హరిదాసు వచ్చేవాడు...
చక్కగా ఊర్వ్థపుండ్రాలూ...వొంటి నిండా! నెత్తిమీద ఎర్రగా మెరిసిపోతున్న రాగిచెంబూ...దాని వెనకనుంచి మోకాళ్ళ దాక ఓ గుడ్డ...ఓ చేతిలో తంబూర...మరో చేతిలో చిడతలూ...కాళ్ళకి గజ్జెలు...మొలకి చిత్రంగా చీర....కట్టేవాడు
విశేషం ఏమిటంటే...ప్రతి గుమ్మం ముందు ఆగి...కాసేపు చిందేస్తూ..
కృష్ణంకలయ సఖీ సుందరం
బాలకృష్ణం కలయ సఖీ సుందరం
కృష్ణం గత విషయ తృష్ణం....
అంటూ అత్యంత మనోహరంగా పాడేవాడు...
ఎన్నడూ ’భవతీ భిక్షాం దేహి’ అని అడిగి ఎరగడు...
పిల్లల మందరం...ఆయన పాట పాడ్తోంటే చాలా దూరం వెంటపడే వాళ్ళం.. ఆ తర్వాత తెలిసింది...వాటిని కృష్ణలీలా తరంగాలు అంటారనీ, అవి రాసినాయన నారాయణతీర్థులు అనీ....
నిజంగా ఆ పాటలు వింటోంటే...ఆనాటి నుంచీ ఈ నాటివరకు హృదయం పన్నీటి తరంగాల్లో స్నానం చేసినట్టే ఉంటుంది....
నారాయణతీర్థుల కాలం గురించీ...ఆయన జన్మస్థలం గురించీ రకరకాల వాదనలున్నాయ్... మహా మహోపాధ్యాయులు ఎంతో మంది చాలా కాలం పరిశోధించి...అనేక రకాలుగా తేల్చారు. కానీ ఆయన ఆంధ్రదేశంలోని గుంటూరు జిల్లా ‘కాజ’ అనే గ్రామంలో పుట్టారనీ...ఉత్తరోత్తరా - దక్షిణ ప్రాంతానికి వలస వెళ్ళారనీ అంటే తెలుగువాళ్ళమైన మనకో తృప్తి...
ఈయన తండ్రి పేరు తల్లావఝల నీలకంఠశాస్త్రి... ఈయన పేరు తల్లావఝల_గోవిందశాస్త్రి.
అతి చిన్న వయసులోనే సంగీతము, సంస్కృతము, శాస్త్రాలు అభ్యసించారు. చిన్నవయసులోనే వివాహము జరిగింది. చిన్నతనము నుండే పూజలు, భగవన్నామస్మరణం చేస్తుండేవారు. సంగీత, సాహిత్యములందు కడు ఆసక్తి కలిగి భాగవతము మొదలగు గ్రంథములను పాడుచుండెడివారు. స్వామి శివానందతీర్థ పరిచయ భాగ్యముతో సంగీత సంస్కృత భాషా పరిజ్ఞానానికి శివానందతీర్థ మెరుగులు దిద్దారు.
గోవిందశాస్త్రికి యవ్వనంలోనే ’పరిణామశూల’ (అంటే బహూశ కడుపులో గడ్డవంటిది) వచ్చి విపరీతంగా బాధపడ్తుంటే...ఎవరి సలహా మేరకో సింగరాయ కొండలోని నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ...ఈ తరంగాలు రచించాడనీ - వాటినే అద్దంకి ప్రాంతంలోని 60 గ్రామాలకీ తనే స్వయంగా నేర్పాడనీ ప్రతీతి... "ఒక కావ్యానికి కావలిసిన మూడు ప్రధానాంశాలు పద్యము, గద్యము, వచనము కావ్యములో అతి చక్కగా చిత్రీకరించారు. దీనిలో ప్రారంభమున మంగళాచరణము, తరువాత శ్లోకములు, ఇష్టదేవతా ప్రార్థనలు, తరంగములు ఉండును. ఈ తరంగములు పల్లవి అనుపల్లవి చరణములతో స్వనామ ముద్రను కలిగియుండును. కొన్ని తరంగములలో జతులు కూడా ఉండును.
సరే...గోవిందశాస్త్రికి పెళ్ళైంది...అత్తారి ఊరు కృష్ణ అవలి ఒడ్డున ఉన్న వేదాద్రి!. ఓసారి అత్తవారింటికి వెళ్ళాలనీ...కృష్ణ ఈదుకుంటూ పోతున్నాడు...తీరా క్రిష్ణమ్మ పోంగింది!! గోవిందశాస్త్రికి పట్టు తప్పింది...కాళ్ళుచేతులు కొడ్తున్నా...ఈడ్చుకు పోతోంది కృష్ణమ్మ! తేలిపోతున్నాడు.. నీళ్ళు మింగేశాడు....ఉక్కిరి బిక్కిరై పోతున్నాడు....
పాదాలు ఒకసారి అడుగు తాకీ పైకొచ్చాయ్...
తెలిసిపోయింది...ప్రాణం పోబోతుందని...
ఈ సమయంలో ‘అపత్సన్యాసం’ తీసుకుంటే....?
(సన్యాస దీక్ష తీసుకుని మరణిస్తే ముక్తి అన్న ఒక నమ్మకం)
వెంటనే మనసులోనే సన్యసించాడు. కృఘ్ణడికో దణ్ణం పెట్టుకునీ...’శరణం భవకరుణాలయ - గురు దీన దయాళో’ అనుకున్నాడు. పరమాత్మ పరమ భాగవవోత్తముణ్ణీ.....అంత తొందరగా పోనిస్తాడూ...అక్కడో దుంగ దొరికింది...! దాని సాయంతో వొడ్డుకొచ్చాడు. ప్రాణం నిలిచింది. ఇంటికెళ్ళి..భార్యకి జరిగిందంతా చెప్పి ‘మరి అపత్సవ్యాసం స్వీకరించాను...! అనుజ్ఞ ఇస్తే’ అన్నాడు...అర్థోక్తిగా...ఆవిడ దు:ఖాన్ని గుండెల్లో దిగమింగుకునీ మౌనంగ సన్యాసాన్ని అంగీకరిస్తూ ‘వీక్షే కదా దేవ దేవం’......అనుకుంది.,వెంటనే గోవిందశాస్త్రి తన గురువుగారైన శివ పరమానంద తీర్థుల ఆజ్ఞ మేరకు ఆయన ఆధ్వర్యంలో యథావిధిగ సన్యాసాశ్రమం స్వీకరించి నారాయణ తీర్థులయ్యాడు...
మరో విశేషం ఏమిటంటే....నారాయణ తీర్థులవారికి సిద్ధయ్య అనే శిఘ్యడుండేవాడనీ...అతనే తర్వాత సిద్ధేంద్రయోగి అయ్యాడనీ... *కూచిపూడి* నృత్యానికి మూల పురుషుడై.....కూచిపూడి నృత్యానికి ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిపెట్టారు.
నారాయణ తీర్థుల వారికీ దృష్టిదోషం ఉండేది... రోజూ రాత్రిళ్ళు భోజనాలయ్యాక....వసారాలో పడుకునీ కళ్ళుమూసుకుని తరంగాలు పాడుకునేవారు.బాలకృఘ్ణడొచ్చి.....తీర్థులవారి బొజ్జమీదెక్కి....తాండవం చేసేవాడు.తాండవ క్రిఘ్ణడి నృత్యం రోజూ చూస్తున్న సిద్దయ్య...ఓ రోజు అడిగాడు. "గురూ గారు రోజూ బాలకృఘ్ణడు మీ బొజ్జమీద తాండవం చేస్తోంటే మీకు పొట్టనొప్పిగా ఉండట్లేదూ?"
"బాలకృఘ్ణడి తాండవమా...ఎప్పుడ్రా..."
"అయ్యో! రాత్రిళ్ళు....మీరు నిద్రపోయే ముందు తరంగాలు అంటారు గదా....అప్పుడు బాలకృఘ్ణడు తాండవం చేస్తాడు...నేను రోజూ చూస్తున్నాగా"!
"ఎంత అదృష్టవంతుడివిరా...గుడ్డిపీనుగుని నాకు కనపడ్డేం!" అని కళ్ళు తుడుచుకునీ
"ఒరే...ఈసారి కృఘ్ణడు కనబడ్తే మనిద్దరికీ జన్మరాహిత్యం ఎప్పుడో కనుక్కో..."
"ఓ......అలాగే"..అన్నాడు సిద్దప్ప...
మర్నాడు రాత్రి బాలకృఘ్ణడు కనపడగానే దణ్ణం పెట్టీ "జగద్గురూ....మా గురూగారికీ, నాకూ మోక్షం ఎప్పుడు?" అన్నాడు.
"నీకు ఈ జన్మలోనే...(నా దర్శనం అయ్యిందిగా.....!)
మీ గురూగారికి మాత్రం మరో జన్ముంది!!" అన్నాడు. మురళి మనోహరంగా మోగింది...అంచేతే సిద్దేంద్రయోగి...యక్షగానంని ఆంధ్రదేశం అంతటా ప్రదర్శించీ...పుణ్యలోకాల కెళ్ళారు. ఆ తర్వాత...వారి గురువు నారాయణతీర్థులు కూడా...
నారాయణ తీర్థ ప్రభావమువల్లే తాను ప్రహ్లాద భక్తి విజయము, నావికా చరితము వ్రాసినట్లు త్యాగరాజు చెప్పుకున్నాడు.కృష్ణలీలా తరంగిణి ముగించిన తరువాత నారాయణ తీర్థులకు రుక్మిణి శ్రీకృష్ణుల దర్శనము కలిగెనని చెప్పుదురు.
నారాయణ తీర్థులు మాఘమాస శుక్ల అష్టమి దినమున తిరువయ్యారుకి 10 కి.మీ. దూరమున తిరుపూడి గ్రామములో జీవసమాధి అయినట్లు నానుడి. వీరి సమాధి వేంకటరమణస్వామి ఆలయమునకు సమీపమునను, వీరి ఛాయా చిత్రము ఆలయములోపలను నేటికిని ఉన్నాయి. వరాహపురిలో ప్రతి కృష్ణాష్టమికి శ్రీ కృష్ణలీలా తరంగిణిలోని తరంగములను గానము చేయుదురు.
జగత్ర్పసిద్ధమైన కృష్ణలీలాతరంగిణిని భాగవత పురాణంలోని దశమ స్కంధం ఆధారంగా ఒక పెద్ద సంస్కృత నాటకం రాసీ....ప్రతీ అంకానికి ‘తరంగం’ అని పేరు పెట్టీ... పన్నెండు తరంగాలు ప్రకటించారు. ఇందులో దాదాపు 156 కీర్తనలు ఉన్నాయి.
నారాయణ తీర్థుల వారి కొన్ని జనారంజకమైన కృష్ణ తరంగాలు...
#ఆలోకయే శ్రీ బాలకృష్ణం
సఖి ఆనంద సుందర తాండవ కృష్ణమ్ ||ఆలోకయే||
చరణ నిక్వణిత నూపుర కృష్ణం
కర సంగత కనక కంకణ కృష్ణమ్ ||ఆలోకయే||
కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణం
లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణమ్ ||ఆలోకయే||
సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం
నంద నందనమ్ అఖండ విభూతి కృష్ణమ్ ||ఆలోకయే||
కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం
కలి కల్మష తిమిర భాస్కర కృష్ణమ్ ||ఆలోకయే||
నవనీత ఖంఠ దధి చోర కృష్ణం
భక్త భవ పాశ బంధ మోచన కృష్ణమ్ ||ఆలోకయే||
నీల మేఘ శ్యామ సుందర కృష్ణం
నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణమ్ ||ఆలోకయే||
వంశీ నాద వినోద సుందర కృష్ణం
పరమహంస కుల శంసిత చరిత కృష్ణమ్ ||ఆలోకయే||
గోవత్స బృంద పాలక కృష్ణం
కృత గోపికా చాల ఖేలన కృష్ణమ్ ||ఆలోకయే||
నంద సునందాది వందిత కృష్ణం
శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణమ్ ||ఆలోకయే||
కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం!!
కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం!!
నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత భృత్యానుకూలమ్ అఖిల సత్యం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం!!
ధీరం భవజలభారం సకలవేదసారం సమస్తయోగిధారం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం!!
శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరికేళ సంగం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం!!
రామేణ జగదభిరామేణ బలభద్రరామేణ సమవాప్త కామేన సహ బాల
కృష్ణం కలయ సఖి సుందరం!!
దామోదరమ్ అఖిల కామాకరంగన శ్యామాకృతిమ్ అసుర భీమం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం!!
రాధారుణాధర సుతాపం సచ్చిదానందరూపం జగత్రయభూపం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం!!
అర్థం శితిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం!!
ఏహి ముదం దేహి - యదుకుల కాంభోజి
కలయ కళ్యాణిని - కేదార గౌళ
కలయ - యశోదే - కేదార గౌళ
క్షేమం కురు సతతం - సావేరి
గోవింద ఘటయ - కాంభోజి
గోవింద మిహ - గోపివే నంద - మధ్యమావతి.
జయ జయ గోకులబాల - కురంజి
నందగేహినీ - ద్విజావంతి
పూరయ మహకామం - బిలహరి
కృష్ణం కలయ సఖి - ముఖారి
బాలగోపాల క్రిష్ణ - మోహన
వీక్షే కద దేవ దేవం - ఆనంద భైరవి
మంగళాయ - కేదార గౌళ
శరణం భవ కరుణాలయ - సౌరాష్ట్రం
శరణం భవ కరుణామయి కురు దీనదయాళో
కరుణారసవరుణాలయ కరిరాజకృపాళో!!
అధునా ఖలు విధినా మయి సుధియా సురభరితం
మధుసూదన మధుసూదన హరమామక దురితమ్!!
౧. వరనూపురధర సుందర కరశోభితవలయ
సురభూసురభయవారక ధరణిధర కృపయా
త్వరయా హర భరమీశ్వర సురవర్యమదీయం
మధుసూదన మధుసూదన హరమామక దురితమ్!!
౨. ఘృణిమండల మణికుండల ఫణిమండలశనయ
అణిమాదిసుగుణభూషణ మణిమంటపసదన
వినతాసుత ఘనవాహన మునిమానస భవన
మధుసూదన మధుసూదన హరమామక దురితమ్!!
౩. అరిభీకర హలిసోదర పరిపూర్ణసుఖాబ్ధే
నరకాంతక నరపాలక పరిపాలితజలధే
హరిసేవక శివనారాయణ తీర్థ పరాత్మన్
మధుసూదన మధుసూదన హరమామక దురితమ్!!