*🥀 మన సాహిత్య మకరందం 🥀*
మకరమొకటి రవి జొచ్చెను
మకరము మఱియొకటి ధనదు మాటున డాగెన్
మకరాలయమున దిరిగెడు
మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్
భావం: మేరు పర్వతంలా ఉన్న మొసలి తలను విష్ణువు సుదర్శన చక్రంతో ఖండించాడు. ఆ దృశ్యాన్ని చూసి... ఆ భయానకమైన సుదర్శన చక్రం తన పైకి వస్తుందేమోనని భయపడి రాశులలో ఒకటయిన మకరం సూర్యుని వెనుక చేరింది. నిధులలో ఒక రకమయిన మకరం కుబేరుని శరణు కోరి, ఆయన వెనుక దాక్కుంది. సముద్రంలో ఉన్న మొసళ్లన్నీ ఆదికూర్మం అయిన తాబేలు కిందకు దూరిపోయాయి.
మకరము + ఒకటి అంటే పన్నెండు రాశులలో ఒకటి అయిన మకరం. రవిజొచ్చెన్ అంటే సూర్యుని దగ్గరకు చేరింది. మకరము మరియొకటి అంటే మరొక మకరం (కుబేరుని ధనరాశులలో ఒకటి అయిన మకరం). ధనదు మాటున అంటే కుబేరుని చాటున. డాగెన్ అంటే దాక్కుంది. మకరాలయమున అంటే మొసళ్లకు నెలవు అయిన సముద్రంలో. తిరిగెడు అంటే తిరుగుతున్నటువంటి. మకరంబులు అంటే మొసళ్లన్నీ. కూర్మరాజు మరువునకు అంటే ఆదికూర్మం అయిన తాబేలు కిందకు. అరిగెన్ అంటే చేరాయి.
*గజేంద్ర మోక్షం* లోని ఈ పద్యం చాలా చమత్కారంగా ఉంటుంది. మకరం అనే పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఆ పదాలను ఉపయోగించి సాగుతుంది ఈ పద్యం. నక్షత్రమండలంలో మనకున్న పన్నెండు రాశులలో మకరం అనేది ఒక రాశి పేరు. ధనదుడు అంటే ధనాన్ని ఇచ్చేవాడు. ఆ ధనాన్ని ఇచ్చే కుబేరుని దగ్గర ఉన్న అపారమైన నిధులు ఉన్నాయి. వాటిలో ఒకదాని పేరు మకరం. మామూలుగా మకరం అంటే మొసలి అని అర్థం. ఈ మూడిటినీ తీసుకుని ఒకే పద్యంలో నానార్థాలు వచ్చేలా ఎంతో అందంగా రచించాడు పోతన.
*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
No comments:
Post a Comment