ది.10/07/2025 గురువారం, ఆషాఢ పూర్ణిమ, గురు పౌర్ణమి మహోత్సవం.... అసలు గురువు అంటే ఎవరు?
గురుః బ్రహ్మాః గురుః విష్ణుః గురుర్దేవో మహేశ్వరః అని గురువు కి త్రిమూర్తుల తో సరిసమానమైన స్ధానాన్ని ఇచ్చిన సంస్కృతి మనది....మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లి తండ్రుల తర్వాత ఆ బాధ్యత గురువుకు పంచిన సంప్రదాయం మనది....కాని నేడు మారుతున్న జీవన విధానం, సామాజిక పరిస్థితులు గురు స్ధానాన్ని పలుచన చేస్తున్నాయి....
సినిమాలో అయితే గురువు కమెడియన్లుగా, బఫూన్లు గా చివరికి బ్రోకర్లుగా కూడా చూపిస్తున్నారు....పవిత్రమైన గురు శబ్దాన్ని 'హలో గురూ' అంటూ అపరిచితులను పిలిచే సంభోదనా పదంగా మార్చి వేసారు.....
’గు’ కారో అంధకారస్య, ’రు ’ కారో తన్నిరోధకః !!
అంటే అర్థం, గు అంటే అజ్ఞానం...రు అంటే తొలగించువాడు అని....
అసలు గురు పౌర్ణమి సంప్రదాయం మన వాతావరణ, జీవన విధానం అనుసరించి ఏర్పడినది.. ఆషాఢ మాసంలో వర్షాలు, వ్యవసాయపు పనులు ఆరంభమై, అందరూ ఇంటిపట్టునుండడం, గురువులు చాతుర్మాస దీక్షవహించి ఉండడం విద్యాభోదనకు, అధ్యయనము నకు అనుకూలమై కాలం ... పూర్వం గురుకుల సాంప్రదాయం కావున గురువు ను తగురీతిగ సత్కరించి, పూజించి వారి పిల్లలను గురువు సంరక్షణలో వదిలి వెళ్ళేవారు.... అదే కాలక్రమంలో గురు పౌర్ణమి, గురు పూజోత్సవంగా రూపాంతరం చెందినది...
వ్యాసం వశిష్టనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్! పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్!!
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే!!
విష్ణువు 21 అవతారాలలో 17 వ అవతారమైన కృష్ణద్వైపాయనుడు వేద విభజన చేసి వేదవ్యాసుడైనాడు....ఆయన పేరుతో ఏర్పడిన వ్యాస పూర్ణిమ తరువాత గురుపూర్ణిమై అసలుమూల రూపాన్ని, ఔన్నత్యాన్ని కోల్పోయింది...నేడు అసలు వ్యాస మహర్షి ని తలచే వారే లేరు...
బ్రతుకు తెరువుకు నాలుగు గారడివిద్య లు, కనికట్టు నేర్చిన ఫకీర్లని, బాబాలని దేవుళ్ళని చేసాం....నలుగురు శిష్యులను వెనకేసుకుని, రంగు రంగు బట్టలు, విచిత్ర వేషధారణ వేసే అమ్మలు, భగవాన్ లు, స్వామీజీ లను గురువు లని, దైవాలని చేసి ఏమాత్రం జ్ఞానాన్ని, మోక్షాన్ని కలుగ చేయని వ్యక్తి పూజలో విలువైన కాలం వ్యర్థం చేసుకుంటున్నాం....
బోయ నుండి మహర్షి గా ఎదిగి, రామాయణ మహాకావ్య రచన చేసిన ఆది కవి వాల్మీకి మనకి గురువు.....
అష్టాదశ పురాణాలు , పంచమ వేదం మహాభారతం రచించిన సాక్షాత్తు విష్ణు స్వరూపుడు వేదవ్యాసుడు మనకి గురువు.....
వైష్ణవ ఆగమాలలో విశిష్టమైన శ్రీ వైఖానస ఆగమాన్ని రచన చేసిన విఖనసాచార్యుల వారు మన గురువు..వీరి ఆగమానుసారం కలియుగ వైకుంఠం తిరుమల లో స్వామి వారి నిత్యార్చనాది బ్రహ్మోత్సవ పర్యంతం సేవలు జరుతున్నాయి...బృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షులు విఖనస మునీంద్రుల శిష్యాగ్రగణ్యులు....
32 సం!!ల అతి పిన్న వయసు లోనే ఆసేతు హిమాచలం పర్యటించి, అష్టాదశ శక్తి పీఠాలను ప్రతిష్టించి, వందలాది అవైదిక మతాలను ఖండించి హైందవ ధర్మానికి పునర్జీవం పోసి, శివతత్వం చాటిన ఆదిశంకరులు మన గురువు... నేడు మనకు లభ్యమవుతున్న అనేక దేవి దేవతల స్తోత్రాలు, పూజా విధానాలు వంటి ధార్మిక సాహిత్యం ఆదిశంకరులు అందించినది...
సమాజంలోని ఛాందస భావనలు రూపుమాపి, అష్టాక్షరి మహామంత్రమైన ఓం నమో నారాయణాయ మంత్రాన్ని అన్ని వర్ణాల కు అందించి వైష్ణవ తత్వాన్నితెలియ చేసిన భగవాన్ రామానుజులు మన గురువు.....
ఇంత విశిష్ట గురు పరంపర మనకుండగా, మఖ లో పుట్టి పుబ్బ లో మాయమయ్యే చిల్లర గురువులు మనకేల???
No comments:
Post a Comment