ఉపదేశ సారం-8
ఉత్తమం ..మానసిక జపం
ఉత్తమస్తవా దుచ్ఛ మందతః
చిత్తజం జప ధ్యానముత్తమం
భగవంతుని గుణ , మహిమల గురించి స్తోత్రం చేయడం మంచిదే . దాని కన్నా బిగ్గరగా చేసే జపం ఉత్తమైనది. దాని కన్నా మంద జపం (తక్కువ శబ్దంతో చేసే జపం ) ఉత్తమం. దాని కన్నా శ్రేష్టమైనది మానసిక జపం అని దీని అర్ధం . రమణ మహర్షి విరచిత 30 శ్లోకాల "ఉపదేశ సారం " లోని ఆరో శ్లోకమిది . భక్తిని పెంపొందిచుకోవడానికి చేసే సాధనాల్లో పూజ గురించి ఐదో శ్లోకంలో చెప్పిన రమణులు . వాక్కు ద్వారా చేసే జపం గురించి ఇందులో చెప్పారు.
జపం మూడు రకాలుగా చేయవచ్చు .
మొదటిది ఉచ్చ జపం . దీన్నే వాచక జపం అంటారు . "ఓం నమో నారాయణాయ " ," ఓం నమో భగవతే వాసుదేవాయ ", "ఓం నమశ్శివాయ " . ఇలా ఏదైనా ఒక మంత్రాన్ని పెద్దగా , పక్కన ఉన్నవారికి కూడా వినిపించేటట్లుగా పదేపదే ఉచ్చరించడమే వాచక జపం .
రెండోది మందజపం. దీన్నే "ఉపాంశు " అని కూడా అంటారు. ఇందులో పెదవులు కదిలీకదలనట్లుగా కదులుతాయి . నాలుక కూడా కదులుతుంది . శబ్దం సన్నగా వస్తుంది . కానీ , పక్కనున్నవారికి కూడా వినిపించదు. మనకు మాత్రమే వినిపిస్తుంది .
మూడోది ...చిత్తజం జపం . దీన్నే మానసిక జపం అని కూడా అంటారు . ఇందులో శబ్దం అసలు రాదు . పెదవులు కదలవు . నాలుక కదలదు. కేవలం మనసులో మాత్రం మంత్రం దొర్లి పోతుంటుంది . వాక్కుతో చేసే ఉత్తమం స్ధవం (స్తోత్రం ) కన్నా జపం. జపంలోనూ ఈ మూడు రకాలూ క్రమంగా ఒకదాని కన్నా ఒకటి ఉత్తమమైనవని మహర్షి చెప్పారు . మానసిక జపం అన్నిటికన్నా కష్టసాధ్యమైనది. కానీ, ఏకాగ్ర చిత్తంతో ఆ జపసాధన కొనసాగిస్తే మనసు పవిత్రమవుతుంది . మాంస మయమైన శరీరం మంత్రమయమవుతుంది . ఇలా పవిత్రత , ఏకాగ్రత కలిగిస్తుంది కనుకనే మానసిక జపం ఎంతో శ్రేష్ఠమైనది. ఏడు సంవత్సరాలుగా జపం చేస్తున్న ఒక సాధకుడు ఒక మహాత్ముని సందర్శించి , " స్వామీ , ఏడేళ్లుగా జపం చేస్తున్న నాకు జపసిద్ధి కలగట్లేదు " అని చెప్పాడు .
దానికా స్వామి , "నాయనా , జపం చేసేటప్పుడు నీ ద్రుష్టి అంతా భగవంతుని మీదే ఉంటోందా?" అని అడిగాడు . దానికి సాధకుడు ," స్వామీ మాల తిప్పుతూ జపం చేసేటప్పుడు మేరుపూస (108 పూసలు ఉండే జపమాలలో ప్రధాన పూస. దాన్నే "గురు పూస " అని కూడా అంటారు ) ను దాటుతానేమోనన్న భయంతో ఎల్లప్పుడూ ద్రుష్టి మేరుపూస మీదే ఉంటోంది " అని వివరించాడు . ఆయనకు జపం సిద్దించకపోవడానికి కారణం అదే. కనుక జపం చేసేటప్పుడు మన ద్రుష్టి మేరుపూస మీద కాక భగవంతుని మీద నిలవాలి . అప్పుడే జపం గొప్ప భక్తి సాధనమవుతుంది . జపం ధ్యానంగా మారుతుంది . ధ్యానించగా ధ్యానించగా మంత్రం అదృశ్యమై మనస్సు లక్ష్యంలో నిలిచిపోతుంది .
- by sri దేవిశెట్టి చలపతిరావు,
Sekarana from andhrajyoti .dt.7-1-2020
No comments:
Post a Comment