Thursday, July 10, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
           *తప్పులకు చోటివ్వక*

*తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేశామంటే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లే. అందుకే భగవంతుడు మనం చేసే తప్పులను ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో తెలియజేస్తూనే ఉంటాడు. జ్ఞానులైనవారు ఆ సూచనలను అర్ధం చేసుకుని పశ్చాత్తాపపడి మళ్లీ ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడుతుంటారు. అవివేకులు అజ్ఞానంతో భగవంతుడి హెచ్చరికలను గమనించకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ దైవాగ్రహానికి గురవుతారు.*

*అపారమైన జ్ఞానం కలిగిన వారైనప్పటికీ ఆర్ధిక బలంతోనో, శారీరక బలంతోనో, అంగబలంతోనో, జ్ఞానినన్న అహంకారంతోనో, అణచుకోలేని మనోవాంఛలతోనో తప్పులు చేస్తుంటారు కొంతమంది. మహాజ్ఞాని, సకలశాస్త్ర ప్రవీణుడు, గొప్ప శివభక్తుడైన లంకాధిపతి కూడా యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి, ధర్మాన్ని తప్పి సీతమ్మ* *వారిని అపహరించి తీసుకెళ్లాడు. ఆమెను విడిపించేందుకు ప్రాణాలను లెక్క చేయకుండా జటాయువు పోరాడినప్పుడైనా, తమ్ముడు విభీషణుడు హితవు చెప్పినప్పుడైనా, రాబోయే అనర్థం గురించి భార్య మండోదరి హెచ్చరించినప్పుడైనా రావణుడికి జ్ఞానోదయం కాలేదు. చివరికి శ్రీరాముడి చేతిలో హతుడయ్యాడు. భగవంతుడు జటాయువు, విభీషణుడు, మండోదరి ద్వారా రావణుడికి తను చేస్తున్న తప్పు గురించి పరోక్షంగా తెలియజేశాడు. కానీ, అంధకారం నిండిన రావణుడి మనసు అతణ్ని తప్పుదోవలో నడిపించి పతనానికి కారణమైంది. చెడు వ్యసనాలకు లోనైన పుండరీకుడి ఉదంతమూ అటువంటిదే.*

*అసలు తప్పులు ఎందుకు చేస్తున్నాం, ధర్మాన్ని ఎందుకు తప్పుతున్నాం... అని మనకి మనం ప్రశ్నించుకుంటే దానికి మూల కారణం మన మనసని తెలుస్తుంది. ఎవరి మనసైతే సత్త్వగుణ స్థితిని కాకుండా రజోగుణ స్థితికి లేదా తమోగుణ స్థితికి లోనవుతుందో అప్పుడు అది చంచలం అవుతుంది. అటువంటి స్థిరంలేని మనసులోకి స్వార్థం, అహంకారం, ఈర్ష్య, మోహం, కోపం అనే దుర్గుణాలు ప్రవేశిస్తాయి. ఫలితంగా విచక్షణను కోల్పోయిన మనసు పంచేంద్రియాలతో చెడ్డ పనులను చేయిస్తుంది. తప్పులు చెయ్యకుండా ఉండాలంటే, ముందు మనసును నిబ్బరంగా ఉంచుకోవాలి. అందుకు ప్రధానంగా కావాల్సింది తనమీద తనకి నమ్మకం. అది ఉన్నప్పుడు చెయ్యాల్సిన పనులమీద, చేయకూడని వాటిమీద అవగాహన ఏర్పడుతుంది. ఒక పని చేసేముందు ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు ఆలోచిస్తారు, ఆ పనుల పర్య వసానాలను అర్థం చేసుకుంటారు. పెద్దల సత్సంగం, సద్గురువుల సాంగత్యం, సన్నిహితుల సలహాలు, యథార్థ జ్ఞానాభ్యాసంతో తనని తాను తెలుసుకోవాలి. మనసును ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ, శరణాగతి కోరుతూ భగవంతుడి సేవకుడిగా ధర్మాన్ని అనుసరించాలి. ఎప్పుడైతే భౌతిక దేహం మీద వ్యామోహం పోయి అంతటా భగవంతుడే, అన్నీ భగవంతుడి ప్రతిరూపాలే, నేను కేవలం ఆయన సేవకుణ్ని మాత్రమే అన్న భావనతో మనసు నిండిపోతుందో అప్పుడిక మనసులో కోరికలకు చోటెక్కడుంటుంది? వాంఛలకు తావులేని మనసు ఆ అంతర్యామిపై సంపూర్ణంగా దృష్టి పెట్టి సాధనలో లీనమవుతుంది.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

No comments:

Post a Comment