Friday, July 11, 2025

 సోషల్ మీడియా మయసభ@27
       తేది: 07/07/2025
""""''"""""'''""'""""""""""""""""""""""""""""""
సోషల్ మీడియా ఇప్పుడు మన రొటీన్లో భాగమైంది.
బంధుమిత్రులతో కనెక్ట్ అవ్వడానికి మంచి వేదికైంది.
అనుభవాలను, అలవాట్లను, ఆలోచనలను పంచుకునే చోటు.
ఇది కొంతమేర బాగానే ఉన్నా ఎదుటివారి
'సోషల్.బతుకు'లను చూస్తూ కుంగుబాటుకు లోనవుతున్నవారి సంఖ్య
పెరుగుతోంది. ఇతరుల విహారాలు, వినోదాలు, విలాసాలను
చూస్తూ.. తమని తాము తక్కువ చేసుకుంటున్నారు
చాలామంది. మరి సోషల్ మీడియాలో మనం చూసే ప్రతిదీ
నిజమేనా అంటే...'కాదు' అనే చెప్పాల్సి వస్తుంది.
'ఫ్యామిలీ ఓవర్
ఎవ్రీథింగ్' అంటూ ఫొటోను
స్టేటస్ గా పెట్టుకునేవారు
పట్టుమని పది నిమిషాలు
కూడా ఫ్యామిలీతో
గడపకపోవచ్చు. 'ఫ్రెండ్స్
'ఫర్ లైఫ్' అనేవారికి అసలు
స్నేహితులే లేకపోవచ్చు.
'ఆరోగ్యమే మహాభాగ్యం'
అంటూ అర్ధరాత్రి పూట
పోస్టులు పెడుతుండవచ్చు.
'అమ్మే దైవం' అని
ఎమోషనల్ క్యాప్షన్స్ పెట్టేవారంతా అమ్మకు పనుల్లో సాయం
చేస్తారన్నది అపోహే. పొద్దున నిద్ర లేవగానే దేవుడి
వీడియోలను స్టేటస్ గా పెట్టుకున్నవారు మంచి మనుషులనీ
ఏ తప్పూ చేయనివారనీ అనుకుంటే పొరపాటే. పిల్లికి బిచ్చం
వేయనివారే 'సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి
తోడుపడవోయ్' అంటూ పోజులు కొట్టవచ్చు. నువ్వు లేనిదే
నేను లేనంటూ ఇన్ బాక్సుల్లో ప్రేమపాఠాలు వల్లె వేసేవారు...
ఆ మాటే మరొకరికి చెప్పరని గ్యారంటీ లేదు.
ఖరీదైన కారు ముందో, విలాసవంతమైన భవనం ముందో
నిలబడి ఫొటోలు పెడితే వాళ్ల వైభోగాన్ని చూసి అసూయ
కలుగుతుంది. కానీ అవి వాళ్ల సొంతమేనా కాదా, ఒకవేళ
సొంతమే అయితే వాళ్లకు ఆ తాహతుందా, లేక ఆర్భాటాలకు
పోయి ఆనక అప్పులతో ఇబ్బందులు పడుతున్నారా...అవేవీ
మనకు తెలియదు. ఫొటోల కోసం ఎవరికో ఏదో సాయం
చేస్తున్నట్లు నటించేవారు పెరుగుతున్నారని వారి సోషల్
మీడియా పోస్టులే చెబుతుంటాయి ఇనిస్టా లోనో,
స్నాప్ చాట్ లోనో అందమైన అమ్మాయిల ఫొటోలు చూసి
ఆత్మన్యూనతకు లోనయ్యేవారూ, తామూ అలా కనపడాలని
రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్నవారూ లేకపోలేదు.
ఫొటోలకు ఫిల్టర్లు ఉంటాయనీ ఎలాంటి వారైనా అందంగా
కనిపించవచ్చనీ ఆ క్షణం స్ఫురించదు.
తెరలమీద కనిపించేవన్నీ రకరకాల ఫిల్టర్లేసిన
'సోషల్ బతుకులు'
నిజజీవితాలు కాదు. నిజాయతీగా ఉన్నదున్నట్లు
చూపించుకునేవారూ ఉంటారు. కాకపోతే వారిది
ప్రదర్శనలా ఉండదు, ఎవరికీ ఇబ్బంది కలిగించదు. లేనిది
ఉన్నట్లూ ఉన్నది లేనట్లు చూపించుకోవడానికి సోషల్
మీడియాను మయసభలా వాడుకునేవారితోనే సమస్యంతా.
వాళ్లను చూస్తూ 'తోటి వాడు తొడ కోసుకున్నాడు... నేను
మెడ కోసుకుంటా' అంటే జీవితంలో మిగిలేది అసంతృప్తి
మాత్రమే! చిన్నప్పుడు మార్కుల విషయంలో అమ్మ
మనల్ని అన్నతోనో చెల్లితోనో పోలిస్తేనే కోపం వచ్చేసేది
కదా! మరిప్పుడు ముక్కూమొహం తెలియని వారితో
ఎందుకు పోల్చుకోవాలి? సామాజిక మాధ్యమాలను
చేతనైతే మన అవసరాలకు వాడుకోవాలి. లేకపోతే వాటికి
దూరంగా ఉండాలి. అంతేకానీ వాటికి మనం
వినియోగదారులుగా మారకూడదు.

No comments:

Post a Comment