Thursday, July 10, 2025

 [7/8, 21:02] +91 79819 72004: ఒకప్పుడు బెజవాడ గాంధీనగరంలోని 'గాయక సార్వభౌమ' పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి స్వగృహం 'సరస్వతీ నిలయం' గా భాసిల్లింది. త్యాగరాజ సంగీత వారసత్వం, పంతులుగారికి తమ గురువులైన సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రిగారి ద్వారా సంక్రమించింది. కులమతాలకు అతీతంగా ఆ గురుకులం నడిచింది.
         ఆ రోజుల్లో,1944 ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను.పంతులుగారి వద్ద సంగీతం నేర్పించేందుకు ఒక విద్యార్థిని అతని తండ్రి సుదూరగ్రామం నుండి   తీసుకువచ్చాడు.వారు అగ్రకులానికి చెందినప్పటికీ ఆర్థికంగా వెనుకబడినవారు  కావటంచేత,పంతులుగారు ఆ కుర్రవాడికి తన ఇంటిలో,స్థానికేతర విద్యార్థులకోసం కేటాయించిన గదిలో బస ఏర్పాటుచేశారు.ఆ గదిలో అన్నికులాలకు చెందినవారూ అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉండేవారు.ఆ కుర్రవాడికి భోజనానికి మిగతావారికి చేసినట్లే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంటిలో వారాలు కూడా పంతులుగారు కుదిర్చారు.
         కొన్నిరోజులు గడిచాయి.ఒకరోజు,కొత్తగా వచ్చిన కుర్రవాడు తనతోటి నాదస్వర విద్యార్థి సోదరులిరువుర్ని బాల్యచాపల్యం చేత కులంపేరుతో హేళనచేసి,అవమానించాడు.వారి మధ్య వాగ్వివాదం జరిగింది.
           మరునాడు పంతులుగారికి ఈ విషయం తెలిసింది. ఆగ్రహోదగ్రులయ్యారు...కొత్తగా చేరిన కుర్రవాడి కోసం అతని గదికి వెళ్ళగా, అతను భోజనానికి వెళ్ళాడని తెలిసింది. తాను భోజనం మాని, మండుటెండలో కుర్రవాడికోసంమేడ మెట్లమీద నుంచొని నిరీక్షించారు.సాయంత్రానికి ఆలస్యంగా వచ్చాడు అతను.రావడంతోనే..'ఏరా! సంగీతం నేర్చుకోమని నీ తల్లిదండ్రులు పంపితే..కులాల పేరుతో తోటి పిల్లల్ని అవహేళన చేస్తావా? కులం కాదురా..గుణం ముఖ్యం..మళ్ళీ నీ ముఖం నాకు చూపకు' అంటూ అతని సామానులు వీధిలోకి గిరవాటువేసి, అతనిని బయటకు పంపి, తలుపు వేశారు.జరిగినది చూసి ఆ నాదస్వర సోదరులతో పాటు మిగతా విద్యార్థులూ అవాక్కయ్యారు.
       గురువుగారిని అంత కోపంతో వారు ఏనాడూ చూడలేదు.వారికి గురువుగారి ఆంతర్యం అర్థమైంది.
        రెండురోజులు గడిచాక, తప్పుచేసిన పిల్లవాడిని తీసుకొని అతని తండ్రి వచ్చి,పంతులుగారి పాదాలు పట్టుకొని, క్షమించమని వేడుకున్నాడు.తిరిగి అటువంటి పని తన కొడుకు ఏనాడూ చేయడని ప్రాధేయపడ్డాడు. ఆ కుర్రవాడు కన్నీరుమున్నీరై నాదస్వర సోదరులను  క్షమాపణ కోరాడు.
    పంతులుగారు మెత్తబడి, ప్రమాణం చేయించుకొని, తన శిష్యునిగా ఆ కుర్రవాణ్ణి తిరిగి తీసుకున్నారు.
       పంతులుగారి గురుకులంలో దాలిపర్తి పిచ్చిహరి సోదరులు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు,  అన్నవరపు రామస్వామి గారు, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు, దత్తాడ పాండురంగరాజు గారు, వంకదారు వేంకట సుబ్బయ్య గుప్త గారు,తిరుపతి పొన్నారావు గారు, గద్దే వేంకట రామకుమారి గారు మొదలైన,వివిధ కులాలకు చెందిన ఆణిముత్యాలవంటి సంగీత విద్వాంసులు రూపుదిద్దుకున్నారు.
       కులవ్యవస్థ బలీయంగా ఉన్న ఆరోజుల్లో కులమతాల కతీతంగా,గురుకుల పద్ధతిలో,సంగీతవిద్యను బోధించిన పారుపల్లి వారి పేరిట బెజవాడలో ఒక్క వీధికూడా లేకపోవడం శోచనీయం.

                                   -Modumudi Sudhakar
[7/8, 21:02] +91 79819 72004: డాక్టర్ కొచ్చర్లకోట జగదీష్ గారి రచన 

అలారాలు మోగితే ఆదరాబాదరాగా లేచే అలవాటు అనెస్తటిస్టులకి సహజమే! ఇప్పుడంటే నా జీవితనౌక ఒక పద్ధతిలో పయనిస్తోంది కానీ ఓ పదిపన్నెండేళ్లకు పూర్వం హైదరాబాదులో పడవలా ఉండేది. 

అప్పట్లో ముహూర్తం కేసులకి ఎక్కువ వెళుతుండేవాణ్ణి. ఏ అయిదింటికో అయితే ఫరవాలేదు. కొంతమంది తీవ్రవాదులు తెల్లవారుజామున రెండూనలభై మూడుకి పురుడవ్వాలంటూ చిలిపి కోరిక కోరేవారు. మనకి రాత్రి పన్నెండింటికి తేదీ మారిందోలేదో చూస్తే తప్ప నిద్రపట్టదు. పోనీ రెండున్నరదాకా మెలకువగా ఉండిపోదామా అంటే ఇక కేసదీ చేసొచ్చేసరికి ఏ నాలుగున్నరో అవుతుంది. అప్పుడు ప్రకృతిని చూస్తే ఈ పురుషుడికి పరవశం కలుగుతుంది.

కాసేపలా ఏ అయ్యకోనేటి గట్టునో కూర్చుని రావాలనిపించడం.. (ఖర్మ! వెధవాలోచనలు మానండి. నేవెళ్లేది అందుక్కాదు. సరస్సుతో సరసాలాడేందుకు) 

పచ్చని పచ్చికల మధ్య విచ్చినకన్నులతో వేచివుండి, కొండలమాటునుంచి వచ్చేవాణ్ణి చూడాలనిపించడం..

ఇలాంటి యవ్వారాలు చాలా చేశాను. ఇంటావిడకీ తెలుసు. ఇక వీడింతే అని వదిలేసింది. 

అప్పుడంతా వెస్పా మీదే తిరిగేవాణ్ణి. రెండుంపావుకి అలారం పెట్టుకుని ఒంటిగంటకి పడుకునేవాణ్ణి. 

‘ఒరేయ్, ఇంకో గంటంపావులోనే ఇది మోగుతుంది. ఫరవాలేదా?’ అని ఫోన్‌లో చూడగానే ఏడుపొచ్చేది. అయినాసరే నిద్రపోదామని కళ్లుమూసుకుని పడుకుంటే పావుతక్కువ రెండుకి గాఢనిద్ర పట్టేది. అరగంటలో అమానుషంగా లేపేసే అలారాన్ని చూస్తే అసహనంగాను, ఆదమరచి నిద్రపోతున్న ఆలుబిడ్డలని చూస్తే అసూయగాను అనిపించేది. 

మళ్లీ దుప్పటి ముసుగేసి, ‘వెధవ రూపాయలు, సంపాయించకపోతేనేం, కాసేపలా కమ్మటి కలలుకంటూ నిద్రపోకుండా?’ అని మరింత గాఢంగా పడుకునేవాణ్ణి.

‘ఈమాత్రం దానికి అలారాలు, స్నూజులూ ఎందుకుటా? నేనింకో మూడుమార్లు లేపుతాను. లేచావా సరేసరి. లేకపోతే నీ ఖర్మ!’ అని మొబైల్ మొండికేసేది.

మూడో గంట కొట్టేలోపలే హాస్పిటల్ నుంచి ఫోనొచ్చేది. ‘సార్, బయల్దేరారా?’ అంటూ కుర్రాడొకడు చేసేవాడు.

నాకేమో చిన్నప్పటి నుంచి ఒక దుర్గుణం. 

మనకు వేకువ ఎలా ఉండాలంటే ‘అల నీల గగనమ్ము అరుణారుణమ్మాయె...!’ అంటూ బాలు పాడుతోంటే ఓ గుడిగంట మృదువుగా వినబడాలి. ఆ వెంటనే గది కిటికీ దగ్గర రెండు పిచుకలు నన్ను చూసి వాటి బుజ్జిబుజ్జి మెడలిలా వంచి ‘మేంచూడు, అప్పుడే గింజలకోసం వీధినపడ్డాం. మరి నువ్వుకూడా లే!’ అని మేలుకొలపాలి. ఈలోగా ఇంటావిడ ‘లేచావా? మొహం కడుక్కురా, మంచి కాఫీ ఇస్తా!’ అంటూ ప్రత్యేక అతిథి పాత్రలో ప్రవేశించాలి.

కానీ నా ఉదయాలేవీ హృదయాన్ని తాకేవి కాకుండా గడిచిపోవడానికి ఈ దుర్ముహూర్తాలు.. సారీ ముహూర్తాలొక కారణమని చెప్పాలి. 

సరే, ఫోనంటూ వచ్చాక ఇక తప్పదుకదా!

నేనేమో క్షణక్షణంలో శ్రీదేవిలా ఫోన్ తిరగేసి పట్టుకుని, మూసిన దుప్పట్లోనే చెవిదగ్గరెట్టుకుని ‘పేషెంట్ సన్నగా ఉందా లావుగా ఉందా?’ అనడిగేవాణ్ణి.

‘మన మంగ ఉంది కద్సార్, అంత వలం ఉంటాది! తొరగా వచ్చీండి సార్! స్పైనల్ కష్టమవుతాదనిపిస్తంది. మళ్లీ ముహూర్తం దాటిపోతే ప్రోబ్లమవుతాది!’ అని నాలో వేగాన్ని ఉద్వేగంలా మార్చేవాడు.

లేచి సెన్సోడైన్లు, పెప్సొడెంట్లతో కాసేపు కిచకిచలాడి, పసుపు చందనాల మేలికలయికతో మొహాన్ని వెలిగించి, నుదుటిమీదకు పడిపోతున్న కురుల్ని రౌండ్ కూంబ్ తో వెనక్కునెట్టి, కాస్త పెద్దరికాన్ని ఒంటిమీదకి తెచ్చుకునేవాణ్ణి. 

లేకపోతే మనం వేసుకునే గళ్లబుష్కోటు, జీను పంట్లాం చూసి ఆపరేషన్ గది బయట కూర్చున్న పేషెంటు బంధువులెవరూ నన్ను డాక్టరనుకోరు. నమస్కారం చెయ్యకపోతే పోయారు, కనీసం సగం లేచినా చాలు. అదీ లేవరు. నేనలా ఒక తలుపు తొయ్యగానే ‘ఇతను మత్తు డాక్టరనుకుంటా!’ అని వినబడుతుంది వాళ్ల మధ్యలోంచి.

ఇటువంటి సందర్భాల్లో మనల్ని మనం గౌరవించుకోవాలంటే ఒక ప్రోటోకాల్ ఉంది. నల్ల పాంటులోకి తెల్లచొక్కాని దోపేసి, మిలమిల మెరిసే బెల్టు, తళతళలాడే బూట్లూ వేసుకుని రావాలి. ఆయాసమొస్తున్నా నవ్వుతూ మెట్లెక్కాలి. ఆపరేషన్ గది దగ్గరయ్యేకొద్దీ బూట్ల టకటక పెరగాలి. అప్పుడు మొత్తం జనమందరూ లేచి నిలబడ్డమే కాదు, వందనాలు వందనాలు పాటకూడా పాడతారు. వాళ్లకి మనమీద గౌరవం, నమ్మకం, ఇంకా ‘అదేదో’ కలుగుతుంది.

అలా నల్లపాంటు, తెల్లచొక్కాలతో సువార్త చెప్పడానికో, న్యాయస్థానంలో వాదించడానికో వెళుతున్న ఫీలింగ్ కలిగినా ఒక్కోసారి తప్పదు మరి. 

‘వచ్చేసారా? మీరొకసారి చూసేస్తే మావాళ్లు రెడీ చేసేస్తారు!’ అంటూ డాక్టరమ్మ గుడ్ మార్నింగ్ తో కలిపి చెప్పేది. ఈ గైనకాలజిస్టుల్ని చూస్తే నాకు జాలేస్తుంది. ఎంతసేపూ ఆరాటమూ, పోరాటమే తప్ప జీవితం మీద ఆకర్షణ ఉండదా అని!

ఎన్ని ఉదయాలు మేలుకుంటారు! బయట రావిచెట్టు మీద పక్షులన్నీ సూర్యోదయాలకోసం కువకువలాడుతూ పరుగులెడుతోంటే వీళ్లిక్కడ ఆక్సిటోసిన్లు, ఆక్సిజన్లంటూ పేషెంట్ల కాళ్ల మధ్య శిరసోదయం కోసం బల్లేసుకు కూర్చునుంటారు. 

సుప్రభాతాలు, సుబ్బలక్ష్ములు, సుమధుర సంగీతాలు, సుమబాలలు, సుగంధపు అగరొత్తుల తెల్లవారుజాములన్నీ సింటోసినాన్లు, సిజేరియన్లు, సివియర్ పీపీహెచ్చులతో నింపుకుంటారు.

మీరెప్పుడైనా ఏ తెల్లారగట్టో కెజిహెచ్చో, ఉస్మానియానో ఏదో ఒక లేబర్ రూముకి వెళ్లారనుకోండి.. చీరకొంగు పైకి దోపుకుని, చేతులు తుడుచుకుంటూ, అటూయిటూ తిరిగే డాక్టరమ్మలు కనబడతారు. ముఖవర్చస్సునిబట్టి చాలా తెలివైనవాళ్లని తెలిసిపోతుంది. అలసటలో బొట్టదీ కరిగిపోయినా, విద్యాగంధం అలదిన నుదుటి బొట్టుతో ప్రకాశిస్తూ ఉంటారు. 

సరే, వచ్చినపని మానేసి ఇలా అందర్నీ పరిచయం చేస్తూ కూర్చుంటే ముహూర్తం దాటిపోదూ? 

ఇక ప్రకృతికి పులకరించడాలవీ తగ్గించి పేషెంటుని పలకరించడం, మందూమాకుల్ని సిద్ధంచేసుకోవడం ప్రధానమని ఎంచి కదనానికి కుతూహలం చూపడం మొదలెట్టాను.

ఈ పేషెంట్లకి మందులకన్నా మాటలే ఎక్కువ పనిచేస్తాయన్న మర్మమెరిగిన మత్తువైద్యుల్లో నేనొకణ్ణి. 

కబుర్లు చెప్తాను. వివరాలడుగుతాను. ‘మీవాణ్ణే!’ అనిపిస్తాను. ఇదంతా అనాలోచితంగా చేస్తానేతప్ప అనుకుని చెయ్యను. ఆపొద్దు ఏ ఆనందాన్నీ ఆపొద్దంటూ ఆపరేషన్ గదిలో సంగీతాన్నీ వినిపిస్తాను. 

పుట్టబోయే పసివాళ్లు బాలుని, అన్నమయ్యని, సుశీలని, మహదేవన్నీ, ఇంకా ఇళయరాజానీ వింటే ఈలోకమంతా సునాదవినోదమనిపిస్తుందని నా భావన!

ఇరవైమూడేళ్లుగా ఇదే అలవరస. 
నిరంతరమూ వసంతమే!

మత్తు నా రక్తంలోనే ఉందేమో?

ఇవాళ ప్రపంచ అనస్తీషియా దినోత్సవం.

......జగదీశ్ కొచ్చెర్లకోట

No comments:

Post a Comment