Thursday, July 10, 2025

 🚩కాటుకకంటినీరు...చనుకట్టుపయింబడ నేల ఏడ్చెదో?
🌺
కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల ఏడ్చెదో!
కైటభదైత్యమర్దనుని గాదిలికోడల ఓ మదంబ ఓ
హాటకగర్భురాణి నినునాకటికై గొనిపోయి యల్ల క
ర్ణాటకిరాటకీచకుల కమ్మ ద్రిశుద్ధిగ, నమ్ము భారతీ!
👏👏👏👏
ఈ పద్యమే చాలాసేపటినుండి హృదయంలో మాటిమాటికీ కదలాడుతోంది. 
నేను పోతనంత మహానుభావణ్ణి కాను కనక, ఆ శారదా స్వరూపం నాకు సాక్షాత్కరించలేదు. కాని మనసులో ఆ మూర్తి మరీమరీ మెదులుతూనే ఉంది. 
నా కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు కర్ణాటకిరాట కీచకులు లేరు. అసలు రాచరికమే లేదు. 
🌺
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
- పోతన చాటువు👏👏👏👏
గున్నమామిడి చెట్టుకు పూసిన లేత చివుళ్ళలా కోమలమైనట్టి, కావ్యం అనే కన్యను అమ్ముకుని; అట్టి నీచపు తిండి తినడం కంటే; నిజమైన కవి, తన భార్యాపిల్లల ఉదరపోషణ కోసం నాగలి పట్టిన వ్యవసాయదారు డైనప్పటికి తప్పులేదు; అడవీ ప్రాంతాలలో కంద దుంపలు, పుట్టతేనెలుతో జీవించువా రైనప్పటికి తప్పులేదు.
ఆకలికోసం "బాలరసాలసాల నవపల్లవ కోమలమైన" కావ్యకన్యకని మనుజేశ్వరాధములకిచ్చే అవస్థ తప్పిపోయింది. అయినా ఆ తల్లి కాటుకకంటినుండి కన్నీరింకా ధారగా ప్రవహిస్తూనే ఉంది. ఎందుకమ్మా అలా ఏడుస్తావని మనసార ఓదార్చే, మనసావాచాకర్మణా నీకు కష్టం కలిగించనమ్మా అని భరోసా ఇచ్చే పోతనలాంటి బిడ్డలు ఆమెకిప్పుడు కఱవయ్యారు. ఈర్ష్య, అసూయ, స్వార్థం,ద్వేషాలతో తమలోతాము కాట్లాడుకుంటూ ఆమె బతుకుని కుక్కలు చింపిన విస్తరి చేసే బిడ్డలు పుట్టుకొచ్చారు. ఛీ, ఇదేం జాతి!
గుండె మండిపోతోంది. తెలుగు వార్తాపత్రికల్లో సాహిత్యపుటలు చదవడం మానేసి ఏడాదిపైగా అవుతోంది, చదవలేక. ఇవాళ ఒక అంతర్జాలపు లంకె ద్వారా వెళ్ళి ఒక పత్రికలోని వ్యాసం చదివాను, దురదృష్టవశాత్తు. దాని ఫలితమే యీ ప్రేలాపన.
నాకు పోతనంత ఆర్ద్రతా లేదు, సరస్వతిని ఓదార్చే శక్తీ లేదు, అంత ఆర్ద్రంగా పద్యము రాయనూ లేను. ఏదోలా నా మనోభావాన్ని వ్యక్తం చేయబూనితే వచ్చిన వెఱ్ఱికేక యిది:
కుక్కలరీతి నొండొరులు కొట్టుకుజచ్చుచు నీ సుశీలమున్
పీక్కు తినంగ గెంతులిడు బిడ్డలపై మమకారమేల? నీ
వాక్కును నాల్కలన్ జెఱపివైచి మమున్నొక మూగజాతిగా
గ్రక్కున మార్చివేయగదె గాదిలి చూపక తల్లి భారతీ!
🌹👏🌹👏🌹👏🌹👏🌹👏🌹

No comments:

Post a Comment