ఒక్కొక్కరి జీవిత విశేషాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి, వాటి నుండి మనం ఎంత నేర్చుకున్నాం అనేది మన జీవన గమనాన్ని మలుపు తిప్పుతుంది
ఒక్కో సున్నా కరిగిపోతే...
చివరకు మిగిలేది సున్నమే
సుశీల్ బన్ గయా కరోడ్ పతి..!
ఫిర్ బన్ గయా భిక్షపతి..!!
ఇది ఓ చిన్న కథ. ఒళ్లు పులకించిపోయే మంచి స్ఫూర్తిదాయకమయిన విజయగాథ. బీహార్ గ్రామీణ ప్రాంతం యువకుడు సుశీల్ కుమార్ అమితాబచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతిలో అన్ని రౌండ్లు దాటి అక్షరాలా అయిదు కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. మరుక్షణం పెద్ద సెలెబ్రిటీ అయిపోయాడు. న్యూస్ పేపర్లు, టీ వీ ల్లో వార్తలు. ఎక్కడికెళ్లినా జనం ఆటోగ్రాఫ్ లు అడిగేవారు, సెల్ఫీలు తీసుకునేవారు. ఆదాయపు పన్నుకు ముప్పయ్ శాతం పోగా మూడున్నర కోట్లు బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంది. కాలచక్రం గిర్రున తొమ్మిదేళ్లు తిరిగింది. మూడున్నర కోట్ల సుశీల్ కుమార్ ఇప్పుడు నెలకు 18 వేల జీతమిచ్చే టీచర్ కొలువుతో బతుకుతున్నాడు.
ఇదో విఫలగాథ. కారణాలు షరా మామూలు. బ్యాంకులో పడ్డ కోట్లు సుశీల్ ను నిలువనివ్వలేదు. సరదాకు సిగరెట్టు చేతి వేళ్ల మధ్య పొగలుగక్కింది. రాత్రి అయితే మద్యం గ్లాసు చేతిలో తూలింది. ఎక్కితే దిగితే విమానమే. జల్సా జీవితం అలవాటయ్యింది. రారమ్మని బాంబే కన్ను గీటింది. తనే ఒక కథగా నిలవగాలేనిది- సినిమాలకు కథలు రాయలేనా అనుకుని సిగరెట్లు, లిక్కర్ సాక్షిగా కలం పట్టి కథలు రాయడం మొదలు పెట్టాడు. పెద్దగా వర్కవుట్ కాలేదు. తనే ఒక నిజ జీవిత హీరోగా నిలవగాలేనిది- తను ఒక సినిమా తీయలేడా అనుకున్నాడు. ఆ ప్రయత్నమూ వికటించింది. కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. పెట్టిన సొమ్ము గాలిలో కలిసిపోయింది. చివరకు సిగరెట్ల బూడిద, ఖాళీ బాటిల్స్ మిగిలాయి. మూడున్నర కోట్లలో ఒక్కొక్క సున్నా తగ్గుతూ చివరికి గుండు సున్నానే మిగిలింది. భార్యతో గొడవలు. విడాకుల దాకా వెళ్లి మూడు ముళ్ల బంధం గట్టిగా ఉండి నిలబడింది. బాంబేను శాశ్వతంగా వదిలి బీహార్లో తను పుట్టిన ఊళ్లో టీచర్ గా కొత్త జీవితం ప్రారంభించాడు.
అనుభవ పాఠమిది. చాలా సింపుల్. సుశీల్ ఇప్పుడు మారిన మనిషి. నిర్వేదంగా జీవన వేదాన్ని వేదాంతం జోడించి చెబుతున్నాడు. సుశీల్ చెబుతున్న పాఠాల్లో ప్రధానమయిన రెండు పాయింట్లు ఇవి.
1. డబ్బుతోపాటు దురలవాట్లు చాలా వస్తాయి. వాటిని నియంత్రించడం చాలా కష్టం.
2. సెలెబ్రెటీగా ఉండడం కంటే- మామూలు మనిషిగా ఉండడమే గొప్ప.
కనీసం సుశీల్ కు మూడున్నర కోట్లు పోగొట్టుకున్నతరువాత, తొమ్మిదేళ్ల తరువాత అయినా జ్ఞానోదయం అయ్యింది. అతడి టైమ్ బాగుంటే మరో సారి కౌన్ బనేగాలో కోట్లు గెలవవచ్చు. మూడున్నర కోట్ల డబ్బు జాతీయం చేయని ఏ జాతీయ బ్యాంకులో వేసినా…వారిచ్చే కనీస ఆరు శాతం వడ్డీ మీదే ఆధారపడ్డా సుశీల్ కు నెలకు అక్షరాలా లక్షా డెబ్బయ్ అయిదు వేల రూపాయలు వచ్చేది.
జీవితం అంటే లెక్కలు కాదు. అనుభవాలు- అంతే.
సుశీల్ ది మూడున్నర కోట్ల రూపాయల విలువయిన అనుభవం- అంతే!
నడమంత్రపు సిరి, నడ మధ్యన పరస్పర అవసరార్ధం చేసే స్నేహాలు నిలబడవు గాక నిలబడవు మిత్రమా, ఆకాశంలో మేఘాలను చూసి కుండలో నీళ్లు నేల పాలు చేసుకోకు నేస్తమా 🙏
No comments:
Post a Comment