Friday, July 11, 2025

 *@ పాపం... నాన్న @ 24
    తేది: 01/07/2025
""""""""""""""""""""""""""""""""""""

'మీకు మేరు పర్వతం తెలుసా
'పుస్తకాల్లో చదివిందే..!
'అక్షయపాత్ర గురించి విన్నారా కనీసం కామధేనువు
ఏమేం ఇస్తుందో ఐడియా ఉందా?
'చిన్నప్పుడు విన్నట్లు గుర్తు అంతే.
అవన్నీ ఒక్క చోట మూర్తీభవించిన మనిషే నాన్న! మేరు నగమంతటి వ్యక్తిత్వం ఆయనది ఎంత చిన్న వృత్తిలో
ఉన్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా నాన్నంటే కల్పవృక్షం,
డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా అంటుంటారు కదా ! ఏమో,
డబ్బులు కాసే చెట్లను చూడలేదుగానీ,అడిగింది కాదనని
నాన్న చొక్కా జేబులైతే గుర్తున్నాయి కదా! అదేమిటో నాన్న
దగ్గర అన్నీ దొరుకుతూనే ఉంటాయి ఆయన మనసు
అనురాగ చెలమ ఎంత
తవ్వుకున్నా ఊరుతూనే
ఉంటుంది. కళ్లముందే
ఎవరెస్టంత నాన్న
ఉండగా, మేరుపర్వతాన్ని
చూడలేదన్న బాదేందుకు?
ఈ మధ్యే ఫాదర్స్ డే
పేరిట ఓ దినోత్సవమూ
జరిగిపోయింది. వాట్సాప్ లో కొటేషన్లు పంచుకుని,మూకుమ్మడి
వందనాలు సమర్పించేశాం. నాన్నంటే
అంతేనా! ఒక్క రోజు బలవంతంగా గుర్తుకుతెచ్చుకుని, మరుసటిరోజే మరచిపోయే
శిథిల జ్ఞాపకం మాత్రమేనా! నిజంగా నాన్న విలువను గుర్తిస్తున్నామా? మరైతే, మనకు రెక్కలు
బలపడగానే నాన్న ఎందుకు అక్కర్లేని లెక్కల్లో కలిసిపోతున్నాడు! ఇల్లు చూసుకోవడానికో, పిల్లల్ని పెంచడానికో, వండిపెట్టడానికి పనికొస్తుందని అమ్మనైతే ఎంచుకొంటున్నారు
చాలామంది. నాన్న మాత్రం 'ఎవరికీ అక్కరకురాని చుట్టమైపోతున్నాడు. పని మానేసిన నాన్న పనికిరానివాడై
పోతున్నాడెందుకో..?
ముడతలు పడిన మొరటు ముసలి
చర్మాన్ని నాన్నంటూ పరిచయం చెయ్యాల్సి వస్తుందన్న
నామోషీ ఎందుకు..?
తన గడపతొక్కిన ఏ ఒక్కరినీ వదలకుండా భుక్తాయాసంతో తిప్పి పంపిన చరిత్ర నాన్నది.
అంతటి మనిషిని నాలుగు ముద్దలకే మొహం వాచేలా
చేస్తున్న ఘనత మనది. చిన్నప్పుడెలాగూ అడిగినవన్నీ
కావాలంటూ అలిగి, ఏడ్చి నాన్నను ఏడిపించేశాం కదా! ఏరోజూ ఏదీ కాదనకుండా, లేదనకుండా ఆయన తెచ్చివ్వలేదు అప్పుడేమో తినకుండా ఏడిపించి, ఇప్పుడేమో తిండి
పెట్టకుండా ఏడిపించి...
ఎప్పుడూ నాన్నే ఏడవాలా?
నాన్నంటే ధైర్యం కష్టపడి పనిచేస్తే, ఫలితం ఉంటుందంటూ భుజంతట్టిన చెయ్యి ఆయనది. గీతాసారాన్ని ఒక్కముక్కలో చెప్పిన జ్ఞానసముద్రమది
నాన్న అనుభవసారం
కన్నా గొప్ప స్ఫూర్తి ఎక్కడ దొరుకుతుంది అందరికీ అన్నీ
ఇచ్చిన ఆ చేయి తిరిగి అడిగిందేమీ లేదు. ఆశిస్తున్నదల్లా
ఆఖరి అంకంలో కాసింత ఆప్యాయతే కదా..! ఆ మాత్రం
సాయం చేయలేమా..?
సాయం కాకపోతే దానం దానం
అనుకుంటే పుణ్యం,పుణ్యానికే పుణ్యం ప్లస్,అవుతుందనే
ఆశతోనైనా నాన్నను బతుకనిద్దాం బతికిద్దాం!
గుండెల్లో ఆకాశమంత ప్రేమను దాచుకున్న నాన్న, ఒక్క
సారైనా దాన్ని బయటికి చెప్పినట్లు గుర్తుందా..? చెప్పలేదు,
చెప్పలేడు కూడా..! ఎందుకంటే, ప్రపంచంలో భాషకు అందని
భావం ఏదైనా ఉందంటే..
అది నాన్న ప్రేమే...*

No comments:

Post a Comment